Pages

Sunday, April 10, 2011

బాబా అనారోగ్యం


ఈ వారం రోజులు పుట్టపర్తి సాయిబాబా అనారోగ్యం రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశమైంది.కలియగ దైవంగా కీర్తించబడటంతో పాటు లక్ష కోట్లకు పైగా సంపద గల ట్రస్టుకు అధినేతగా సాయిబాబా ఆరోగ్యం ప్రత్యేకాసక్తి కలిగించింది. గతంలో అనేక సార్లు మహిమలకు సంబంధించి వివాదాలు సవాళ్లు ఎదుర్కొన్న సాయిబాబా గత చాలా కాలంగాధార్మిక కార్యకాపాలపై కేంద్రీకరించారు. అవన్నీ ఎలా వున్నా ఆయన ఆనారోగ్య చికిత్స మాత్రం ఆధునిక వైద్య పద్దతుల్లోనే అనివార్యంగా జరిగింది. ఐసియులో ఆయన స్తితి ఏమిటనే దానిపై ఎడతెగని కథనాలు వూహాగానాలు పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి.ప్రభుత్వ ప్రతిపక్ష ప్రముఖులు ప్రజా ప్రతినిధులు వున్నా సత్యం ఏమిటో సూటిగా వెల్లడి అయ్యే స్తితి రావడానికి చాలా సమయం పట్టింది.ఇన్ని విరుద్ధ కథనాల వెనక ఆర్థిక ఆధిపత్య ఘర్షణలున్నాయనే భావన అందరిలో ఏర్పడింది. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంటున్నా తటపటాయింపులు కప్పదాట్లు ఎక్కువగానే కనిపించాయి. రాజ్యాంగ బద్దంగానూ ప్రజా సమచార దృష్ట్యానూ జరగాల్సిన విషయాల్లో ఎలాటి తటపటాయింపులు వుండాల్సిన అవసరం లేదన్నది ఇక్కడ ప్రధానాంశం. సాయిబాబా సామ్రాజ్యం విస్త్రతి శక్తి తెలిసినవే గనక ఇప్పటికైనా వాటి గురించి పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతివారూ కోరుకుంటారు. బాబా ఆరోగ్యం ప్రస్తుతానికి కుదుటపడిందని అంటున్నా ఆయన సహాయ వ్యవస్థలపై ఆధారపడతున్నట్టు కూడా తెలుస్తూనే వుంది. ఈ దశలోనైనా పుట్టపర్తి ట్రస్టుకు దాని కార్యకలాపాలకు భవిష్యత్తు తీరుకు సంబంధించి స్పష్టత కలిగించవలసిన బాధ్యత ప్రభుత్వంపైన బాబా సహాయకులపైన వుంటుంది. లేకపోతే అకారణ కథనాలు ఆందోళన పెంచడం స్శార్థపరశక్తులకే ఉపయోగపడుతుంది. నిష్కారణమైన నిగూడత సందేహాలు పెంచి పరిస్తితిని సంక్లిష్టం చేస్తుంది.ఇప్పటికే అదనపు బలగాలు ఆంక్షల మధ్య చిక్కుకుపోయిన పుట్టపర్తిలో భక్తులు వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కూడా సమచారం విడుదల చాలా అవసరమవుతుంది.

No comments:

Post a Comment