Pages

Sunday, April 24, 2011

అరుణసీమవైపు అందరి చూపు

రాజకీయ ఆసక్తి వున్న వాళ్లెవరైనా, ఏ రాజకీయాలకు చెందిన వారైనా ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే- బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు ఏమవుతాయి? కమ్యూనిస్టు అభిమానులు తమ కంచుకోట దెబ్బ తింటుందా అన్న ఆందోళనతో అడిగితే కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎనిమిదవ సారైనా తమ కల నెరవేరుతుందా అన్న ఆశతో అడుగుతున్నట్టు స్పష్టమవుతుంది. మీడియా ప్రత్యేకించి బెంగాల్‌లో బడా మీడియా, జాతీయంగా టీవీ మీడియా వామపక్ష ఫ్రంట్‌కు చెల్లుచీటి రాసి మమతను మహారాణిగా చూపించేందుకు అహౌరాత్రాలు పని చేస్తున్నాయి. వాటి సర్వేల నుంచి ఎన్నికల కథనాల వరకూ ప్రతిదీ ఆ కోణంలోనే నడుస్తున్నాయి. ఉన్నంతలో వాస్తవికంగానూ సంయమనంతో సమాచార విశ్లేషణ చేసే పత్రికలు ఛానళ్లు అందుకు భిన్నంగా బెంగాల్‌లో హౌరాహౌరీ సమరం సాగుతున్న స్తితిని నివేదిస్తున్నాయి. ఇన్నిటి మధ్యనా ఒక్క వాస్తవం మాత్రం కొట్టవచ్చినట్టు
కనిపిస్తున్నది. బెంగాల్‌ ఎన్నికలు ఏకపక్షంగా జరగబోవడం లేదు.

పాతకాల పంకిలం- పరివర్తన పల్లవి

లోక్‌సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, తర్వాత నందిగ్రామ్‌ లాల్‌గడ్‌లలో ప్రతీప శక్తుల కూటమి దాడులు వగైరాలు, ఆ పైన సా ్తనిక ఎన్నికల్లో పరాజయాలు వీటన్నిటితో వామపక్ష సంఘటన కుదేలై పోయిందనీ ఓటమికి వరించడానికి సర్వసిద్దంగా వుందని మీడియా ప్రచారం చేసిన కథలు పూర్తిగా నిజం కాలేదు. . 70 వ దశకం ప్రారంభంలో ఇందిరాగాంధీ అర్థ ఫాసిస్టు దాడి తట్టుకుని ఎర్ర జెండాను సమున్నతంగా నిలబెట్టిన బెంగాల్‌ ప్రజానీకం ఇప్పుడు ముప్పేటలా సాగుతున్న సవాలును తిప్పికొట్టి కష్టజీవుల ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కంకణ ధారులైనారు. రాజకీయ శత్రువులు కుమతులు కుత్సితులు కోరుకున్నట్టు డీలా పడి చేతులు ఎత్తేయలేదు. నిసృహతో దారి తప్పలేదు. గత ఏడు సార్ల వలెనే ఇప్పుడు కూడా ముందస్తు ప్రణాళికతో క్రమబద్ద విధానాలతో వామపక్ష ఫ్రంట్‌ పోరాడుతున్నది. తన ప్రజానుకూల విధానాలను సగర్వంగా చెప్పుకుంటూ, దొర్లిన తప్పులను నమ్రతగా ఒప్పుకుంటూ భవిష్యత్తులో మరింత మంచి విధానాలతో పటిష్టమైన పాలన అందిస్తానని వాగ్దానం చేస్తున్నదే తప్ప కంగారు పడి గొంతు మార్చడం లేదు. ప్రత్యామ్నాయ విధానాలనుంచి వైదొలగడానికీ సిద్దపడలేదు. మొన్నటి వరకూ వామపక్ష ప్రభుత్వంపై విపరీతమైన విషపు దాడి చేసిన మమతా కూటమి ఎన్నికలు మొదలైనాక మార్పు(పరివర్తన్‌) మంత్రంతో ఓట్టు రాబట్టాలని తంటాలు పడుతున్నది. తాజాగా ప్రణబ్‌ ముఖర్జీ తాజాగా సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా ఆ పాటనే పాడారు. ఇంతకూ ఆ మార్పు ఏమిటో మాత్రం చెప్పడం లేదు. అవినీతి కుంభకోణాలు లేకుండా అట్టడుగు ప్రజలకు శ్రమజీవులను అనుకూలమైన విధానాలనుంచి మార్పు అంటే అర్థం ఏమిటన్న ప్రశ్నకు వాటి దగ్గర సమాధానం లేదు వామపక్ష పాలనకు మార్పు అంటే మరింత బాగా వామపక్ష విధానాలు అమలు చేయడమేనని బుద్దదేవ్‌ భట్టాచార్జీ వ్యాఖ్యానించారు కూడా.
రైల్వే మంత్రిగా మమత బెంగాల్‌కు ఏదో ఒరగబెట్టినట్టు చేసుకున్న ప్రచారం కూడా బూటకమని వాస్తవంగా కొన్ని లక్షల రూపాయలకు మించి కేటాయించింది లేదనీ లెక్కలతో సహా బయిటపెట్టారు.రైత్వేలపై ఏనాడూ శ్రద్ధ చూపని ఆమెకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏమవుతుందన్న ప్రశ్న కూడా ప్రచారంలో ప్రముఖంగా వినిపిస్తోంది.. యువతకు తాను ఉద్యోగాలిస్తానని తిప్పించుకుని ఉత్తచేయి చూపించడం కోపాన్ని పెంచింది. ఇందుకు భిన్నంగా వామపక్ష ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత అవసరమని నొక్కి చెబుతున్నది. దేశంలోనే మొదటిసారి నిరుద్యోగ భృతి కల్పించింది కూడా ఆ ప్రభుత్వమేనని అందరికీ తెలుసు. మీడియా ప్రభావం వామపక్షాలపై ఆగ్రహం కొంత వున్నా బెంగాల్‌ యువ ఓటర్లు ఈ వాస్తవ పరిస్తితిని కూడా చూడగలుగుతారని ఆశించవచ్చు.
తగ్గిన దూకుడు- దాగని గుబులు
ఒక విధంగా చెప్పాలంటే రెండేళ్ల కిందట ఏడాదిన్నర కిందట కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ శిబిరంలో కనిపించిన దూకుడు ఇప్పుడు లేదు. ప్రముఖ పత్రికలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. పైగా కాంగ్రెస్‌ తృణమూల్‌ ఎన్నికల పొత్తు లుకలుకలు, పెద్ద సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు, ఎస్‌యుసిఐతోనూ అవగాహన కుదరకపోవడం ఇవన్నీ ఇందుకు తోడైనాయి. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కుమారుడు ఎన్నికల అధికారిపై దౌర్జన్యం చేసి అరెస్టయ్యాడు. తృణమూల్‌ కూటమి తరపున తరలిస్తున్న నల్లడబ్బు విపరీతంగా దొరుకుతున్నది. కేంద్ర మంత్రి పదవికి అనేక సార్లు రాజినామా చేస్తానని బెదిరించిన మమతా బెనర్జీ ఎన్నికల సమయంలో మాత్రం ఆ హౌదాలోనే పాల్గొనడం కూడా పూర్తి విశ్వాసం లేదనే భావాన్నే కలిగిస్తుంది. మావోయిస్టులు తమ విధాన పత్రాలలో కూడా మమతాను బలపర్చాలని చెప్పుకున్నా ఆమె వారితో అనుబంధాన్ని బహిరంగంగా అంగీకరించడానికి వెనుకాడుతున్నారు. పైగా కాంగ్రెస్‌ నేతలు మావోయిస్టులకు పట్టు వున్న ప్రాంతాలలో తమ తరపున మాట్లాడేందుకు సాక్షాత్తూ కేంద్ర మంత్రి చిదంబరంనే రప్పిస్తున్నారు. యుపిఎ భాగస్వామిగా మమతా, హొం మంత్రిగా చిదంబరం మాట్లాడే దానిలో పరస్పర విరుద్దతలు అందరికీ తెలుసు. ఈ తరుణంలో కూడా మమతా మావోయిస్టులు భయోత్పాతం కలిగించేందుకు చేసిన ప్రయత్నాలు తక్కువేమీ కాదు. జంగిల్‌ మహల్‌ వంటి చోట్ల వారి దాడిని వెనక్కు కొట్టగలిగినా నందిగ్రామ్‌ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్తత వుండనే వుంది. అక్కడ దాడికి గురైన 18 పార్టీ కార్యాలయాల్లోనూ 5 మాత్రమే సాధారణ సా ్థయిలో పనిచేస్తున్నాయంటే ఈ దాడుల తీవ్రత తెలుస్తుంది. .బిజెపిని ముందుకు తె చ్చి సిపిఎం దాని సహాయం తీసుకుంటున్నదని మమతా ఆరోపిస్తే వారి ప్రభుత్వంలో మంత్రిగా వున్న మీకు ఈ మాట మాట్లాడే ఆర్హత ఎక్కడదని సిపిఎం నేతలు సవాలు చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వచ్చి మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించడం కూడా ఆమె ప్రచారాల బూటకత్వానికి అద్దం పట్టింది. డార్జిలింగ్‌లోనూ, ఉత్తర బెంగాల్‌లోనూ విచ్చిన్నకర వేర్పాటు వాద సంస్తలతో తృణమూల్‌ బిజెపి ఎన్నికల సందర్భంలో కలసికట్టుగానే వ్యవహరించాయి గతంలో ఘనత వహించిన మాజీ కేంద్ర మంత్రి జస్వంత్‌ సింగ్‌ స్వయానా గూర్ఖా వేర్పాటు వాద సంస్థ జిజెఎంఎం మద్దతుతో పార్లమెంటు సభ్యుదయ్యాడు కూడా.

అమెరికాతో సహా అందరూ ఏకమై...
ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేకులందరూ కట్టగట్టుకుని వ్యవహరిస్తున్నారనేది దాచేస్తే దాగని సత్యంలా రుజువైంది. సామ్రాజ్యవాద అమెరికా మమతాను ప్రోత్సహిస్తున్నట్టు నిరూపించే కేబుళ్లను వికీలీక్స్‌ ఈ తరుణంలోనే బయిటకు తెచ్చింది. 2009లో ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా అమెరికా దౌత్య వేత్త వచ్చి సిపిఎంతో పొత్తు పెట్టుకోవద్దని ప్రభావితం చేయడానికి మంతనాలు జరపడం అందరికీ తెలుసు. దేశంలోనే తమ చొరబాటుకు ఆధిపత్య వ్యూహాలకు సిపిఎం, వామపక్షాలే అవరోధంగా వున్నాయనీ వాటి బలానికి బెంగాల్‌ పునాది గనక అక్కడ ముందు దెబ్బ తీయాలని అమెరికా పాచిక. మమతాను ఎంచుకోవాలని చెబుతూనే ఆమె అరాచక రాజకీయ పోకడలను కూడా అందులో ప్రస్తావించడం గమనార్హం. ఈ సంగతి కాంగ్రెసుకూ తెలుసు. అయినా వామపక్ష ఫ్రంట్‌ను ఎలాగైనా తొలగించాలన్న తాపత్రయంతో అన్యధా శరణం నాస్తి అని ఆమెను ఆశ్రయించారు.

మేధావులలో పునరాలోచన
వామపక్ష వ్యతిరేకులు ఇంతగా ఒకటవడం సహజంగానే వామపక్షం పట్ల ఏ కాస్త సానుభూతి వున్నవారినైనా ఆలోచనలో పెట్టడం అనివార్యమైంది. 2009లో తృణమూల్‌ ఘనంగా పరివర్తన్‌ ప్రచారం చేసినప్పుడు బలపర్చిన మేధావులు కళాకారుల్లో పలువురు ఇప్పుడు విడగొట్టుకున్నారు. ఈ మేరకు పరివర్తనను బలపరుస్తూ సంయుక్త ప్రకటన వెలువర్చిన వారిలో మహాశ్వేతాదేవి వంటి వారు కొందరు కొనసాగినా ప్రముఖ నటులు అపర్ణా సేన్‌,కౌశిక్‌ సేన్‌ వంటివారు విడగొట్టుకున్నారు. అప్పట్లొ లాల్‌ఘర్‌కు వెళ్లి నిరసన తెల్పి అరెస్టయిన అపర్ణా సేన్‌ వంటివారు ఇప్పుడు దూరం కావడం మారిన పరిస్తితిని సూచిస్తుంది. వారు తిరిగి సిపిఎం వైపు వెళ్లిపోయారు అని మమతాకు గట్టి మద్దతుదారుడైన దేవవ్రత బందోపాధ్యాయ స్వయానా వ్యాఖ్యానించారు.2009 ఎన్నికల తర్వాత కాలంలోనే వారు మమతా వైఖరి పట్ట విసుగు చెందారు. వారిలో పలువురకి రైల్వే శాఖలో సలహాదారులు వగైరా పదవులు ఇవ్వడం ద్వారా కొంత సంతృప్తి పర్చడానికి ఆమె ప్రయత్నించారు కూడా.ఇప్పుడు కూడా ఈ మేధావులను నిలబెట్టుకోవడానికి, అసంతృప్త అనుచరులను ఆశపెట్టడానికి తాను గెలిస్తే విధాన పరిషత్తును పునరుద్ధరిస్తానని ప్రకటించారు!
మరో వైపున వామపక్షాల విషయంలో గతంలో కాస్త విమర్శలు వినిపించిన మేధావులు కూడా వైఖరి మార్చుకుని ఫ్రంట్‌ పాలనను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అశోక్‌ మిత్రా వంటి వారు ఇందుకు ఉదాహరణగా నిలుస్తారు.ఆఖరుకు అవకాశవాదం కారణంగా బహిష్కరణకు గురైన సోమనాథ్‌ చటర్జీ కూడా సానుకూలంగా మాట్టాడటం గమనార్హం. మీడియా విశ్లేషకులు సెవంతి నినాన్‌ బెంగాల్‌ మీడియా తీరుతెన్నులను ఆసక్తి కరంగా విశ్లేషించారు. ఏప్రిల్‌ 23 ఆంధ్రజ్యోతిలో ఆర్‌. ఉమా మహేశ్వరి ఈ మేరకు చాలా చక్కటి వ్యాసం రాశారు. ఆ మరుసటి రోజున ఆ వ్యాసం కొనసాగింపులో వామపక్ష ప్రభుత్వ వైఖరిపై అనేక విమర్శలు చేస్తూనే అది కొనసాగాల్సిన అవసరాన్ని కూడా తెలిపారు. నిజంగానే ఈ పరీక్షా సమయంలో కనీస ప్రగతిశీలత వున్నవారెవరైనా వామపక్ష ఫ్రంట్‌పై దాడికి గొంతు కలపలేరు.. ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్వలు చేయవచ్చు గాని హత్యాకాండకు దిగడం గర్హనీయమని ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ సంపాదకీయంలో రాసింది. మీడియా కమ్యూనిస్టు వ్యతిరేకతను పనిగట్టుకుని పెంచుతోందని కూడా కొందరు సోదాహరణంగా వివరిస్తున్నారు. ఇన్ని ఒడుదుడుకుల మధ్యనా ఫ్రంట్‌లో ఐక్యత దెబ్బ తినకపోవడం కూడా ప్రాధాన్యత గల విషయం.మమతా వికృత దాడులను కాంగ్రెస్‌ అధినాయకులు సమర్థిస్తుంటే తన సహచరుడు అనిల్‌బాసు నోరు జారి చేసిన అనుచిత వ్యాఖ్యలను ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఖండించారు. పోటాపోటీగా దుర్బాషలలో మునిగితేలే మన నాయకులు చాలా మంది దీన్నుంచి గుణపాఠం నేర్చుకుంటే బావుంటుంది.

బెంగాల్‌లో ఎన్నికలు ఎప్పుడూ భీషణమైన వర్గ పోరాటంలా జరుగుతాయి. బడా మీడియా ప్రతి ఎన్నికల్లోనూ వామపక్షాలు ఓడిపోతాయని జోస్యాలు గుమ్మరిస్తున్నా ఏడుసార్లు నిరాశే వాటికి మిగిలింది. ఈ ఏడు పర్యాయాల్లో ఏ సారి కూడా జ్యోతిబాసు లేదా బుద్ధదేవ్‌ ఏకపక్షంగా గెలిచేస్తామని రాజకీయ సమస్యలు లేవని చెప్పలేదు. ఎన్ని స్తానాలు వస్తాయనే అంచనాలూ ఇవ్వలేదు. ప్రజలపై విశ్వాసం వుందని మాత్రమే చెబుతూ వచ్చారు. .ఇప్పుడు కూడా అంతే. సవాళ్లు తీవ్రంగా వున్నా అందుకు తగినట్టే పోరాడతామని అంటున్నారు.2009-10 నాటి పరిస్థితితో పోలిస్తే వామపక్ష ఫ్రంట్‌ నిలదొక్కుకుందని పరిశీలకులు అంగీకరిస్తున్నారు.1967,69,71 ఎన్నికల్లో వామపక్ష ఐక్య సంఘటన ప్రభుత్వాలను కూలదోసినప్పుడు, 1972లో ఎన్నికలనే సైన్యం సహాయంతో రిగ్గింగ్‌ చేసినప్పుడు కూడా సిపిఎం శ్రేణులు అచంచలంగా నిలబడి పోరాడారే గాని వెనకంజ వేయలేదు. 1977 నుంచి విజయ పరంపరలు సాఢిస్తున్నా ఆ అధికారాన్ని ప్రజల కోసం వినియోగిస్తూ రాజకీయ సవాళ్ల పట్ల అప్రమత్తంగా మెలిగారే తప్ప అధికారం శాశ్వతం అని భ్రమ పడలేదు. బూర్జువా ఎన్నికల వ్యవస్థపరిమితులనూ ఏ నాడూ మర్చిపోలేదు. సుదీర్ఘ విజయాల వల్ల చొరబడిన కొన్ని అవలక్షాణాలను అవకతవకలను సమర్థించుకోనూలేదు. వాటివల్ల తగిలిన ఎదురుదెబ్బలకు బెంబేలెత్తిపోలేదు.కనకనే ఈ ఎన్నికలలో పటిష్టమైన వ్యూహంతో అత్యధిక జన బాహుళ్యం మద్దతుతో పకడ్బందీగా పోరాడుతున్నారు. ప్రజల మీద విశ్వాసమే రక్షగా ముందుకు సాగుతున్నారు. ఫలితాలపై వూహాగానాల కన్నా పటిష్టమైన ఈ ప్రజా పునాది ఆదరణ ఆశయనిబద్దత చెక్కుచెదిరేవి కావన్న చారిత్రిక అనుభవాన్ని గుర్తించడం ముఖ్యం. వామపక్ష ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాలను ఎదగనీయకుండా అడ్డుకుంటున్న దేశ విదేశీ అభివృద్ధి నిరోధకుల పన్నాగాలను పటాపంచలు చేయడం కీలకం. ఆ విషయంలో బెంగాల్‌కు ఎప్పుడూ ప్రథమ స్థానమే వుంటుంది.

3 comments:

 1. మేధావి వర్గం మీద ఎందుకో నానాటికి అసహ్యం పెరిగి పోతుంది .వీరి కంటే రాజకీయ నాయకులే మేలనిపిస్తుంది ,ఎన్ని లోపాలున్నా నిర్లజ్జగా అబద్దాలు మాత్రం చెప్పారు .అన్ని రాష్ట్రాల్లో మీడియా చీలి నట్టే బెంగాల్లో కూడా మీడియా పాలక పక్ష అనుకూలంగా ,పాలకపక్ష వెతి రేఖంగా చీలి పోయింది .వామపక్ష వెతిరేఖ మీడియా మమత మహారాణి అంటుంటే వామపక్ష అనుకూల మీడియా మల్లి బుద్ధ దేవ్ కే పట్టాభిశేఖం అంటున్నాయి .కమ్మునిస్ట్ అభిమానులు సిపిఎం ఓడిపోవాలనే కోరుకొంటున్నారు .సిపిఎం వాళ్ళు (వీరిలో ఎవరైనా communist లు ఉన్నారా ?)మాత్రం మల్లి సిపిఎం గెలవాలని కోరుకొంటున్నారు .బెంగాల్ లో ఈ సారి ఎన్నికలు హోరా హోరి అనటం మరీ అన్యాయం .ఎన్నికలు ఎంత ఏక పక్షంగా సాగుతున్నయంటే స్వయంగా ముఖ్య మంత్రి సొంత నియోజక వర్గం లో ఓటమి భయం తో నార్త్ బెంగాల్ ఆరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి పోకుండా తన సొంత నియోజక వర్గం లో పది రోజులు ప్రచారం చేసాడు .మమత సభ లకు జనమే జనం .నిరుపం సేన్ వస్తున్నాడంటే ఒక సభకి వెళ్లి చూసాను .చాల జాలి వేసింది .
  మమత కూటమి మార్పు నినాదం ఇప్పుడు ఎత్తుకొన్నది కాదు గత మూడు సంవత్సరాలుగా ప్రజా బహుల్యం లో విస్తృత ప్రచారం లో ఉన్న నినాదం మార్పు .పెత్తందారి మనస్తత్వం కలిగిన సిపిఎం ను గద్దె దింపడమే అతి పెద్ద మార్పు అని సామాన్య ప్రజానీకం భావిస్తున్నది .మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనిస్తే చాలు అని ,మీ మీటింగ్ లకి రాక పొతే మా ఇల్లులు తగల బెట్టక పొతే చాలు అని ,మా భూములు బలవంతంగా లాగేసుక పొతే చాలని ,మీరు దౌర్జన్యాలు చేసినప్పుడు ప్రశ్నిస్తే మా అమ్మాయిలను రేపులు చెయ్యకుండా మా మగవాళ్ళని కాల్చి చంపకుండా ఉంటె చాలని ,ఈ చిన్న చిన్న మార్పులు మా జీవితానికి చాలని బెంగాల్లో అధిక సంఖ్యాక జనం అభిలశిస్తున్నది .
  "కష్ట జీవుల ప్రభుత్వం"మరీ ఇంత ప్రగల్బాలు పలికితే ఎలా ?
  ఉమా మహేశ్వరీ గారి వ్యాసం మరీ చెత్తగా ఉంది .బెంగాల్ గురించి కనీస అవగాహనా కూడా అందులో లేదు .
  మీ వ్యాసం మొత్తం తప్పుల తడకగా ఉంది .ప్రతి వాఖ్యం కండించ వచ్చు .సమయం లేక పోవటం వాళ్ళ చేయలేక పోతున్నాను .

  ReplyDelete
 2. union garu, time choosukoni marinta vivaranga cheyandi. kakapote naa meeeda kopamto medhavulanu tittakandi.nenu meela medhavini kadani chala sarlu cheppanu. nenu bengal prabhutwam patla sanukula vaikharitone unnanu. untanu kooda.judgementlu mee ishtam.akkada horahori jarugutundane anukuntunnanu. chala karanalu, parinamalu cheppanu. meeru kooda edaina point unte cheppandi. oorike sapanarthalu vaddu. 30 yellu datina prabhutwam left ane oke karanamto tittipoyadamlo namrata mata atunchi kanisa vastavikata kooda kanipinchadu. idanta rigging ani nirupinchadaniki chala praytnam chesi viphalamanaranaedi nijam. any way evari parisilana varidi.tks.

  ReplyDelete
 3. యూనియన్ గారికి

  ఒకే ఏడాదిలో 280 మంది సిపిఎం కార్యకర్తలను, సానుభుతిపరులను (కష్టజీవులను) హాత్య చేసిన వారినేనా మీరు కమ్యునిస్టులు అనేది. ఏ పైశాచిక పెత్తనాన్ని పాదుగోల్పాలని చూస్తున్నారు. మనిషిని ప్రేమించడమే కమ్యునిజం. ఏ ప్రత్యామ్నాయ అభివృద్ధి పంధాను చుపుతున్నారు మీరు. కష్టజీవుల కడగండ్లు తీరి సుఖసౌక్యలతో స్వర్గలోకంలో మాదిరి ఇహలోఖంలో బతికేందుకు దారి చూపేది కమ్యునిజం. 34 ఏళ్లుగా బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నది అక్షర సత్యం. 16 లక్షల ఏకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిండి. ఆహార ఉత్పత్తిలో బెంగాల్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. బెంగాల్‌ రాష్రంలో 25 శాతం మైనార్టీలున్నా ఎలాంటి మత ఘర్షణలూ జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టి, వామపక్ష ప్రభుత్వ సెక్యులరిజాన్ని నిరూపించింది. పశ్చిమ బెంగాల్‌ ప్రజలు ఎంతో పరిణతి చెందినవారు. రాజకీయ చైతన్యం కలవారు. గత మూడు దశాబ్దాలుగా ప్రదర్శించిన ఇదే స్ఫూర్తిని వారు ఈ ఎన్నికల్లో కూడా ప్రదర్శిస్తారు. రెండు నాల్కల ధోరణిని, రాజకీయ అవకాశవాదాన్ని వారు తిప్పికొడతారు. పశ్చిమ బెంగాల్‌కు శాంతి, అభివృద్ధి ముఖ్యమనే విషయాన్ని ఆ ప్రజలు గుర్తించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌-కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే ఇది సాధ్యం కాదు. మీలాంటి వారు ఎన్ని శాపనార్థాలు పెట్టినా బెంగాల్‌ ప్రజలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ వెళ్ళడం చారిత్రక అవసరం. యూనియన్ గారు కసిని రగిలించడంలో చూపుతున్న రంజును గ్య్నానం భోదించడంలో చూపితే ప్రయోజనమని నా నమ్మకం. చాలా మంది కసిని నూరి పోయడంలోనే నిమగ్నమౌతున్నారు మీమల్లె. మంచిని పరిశీలించలేని మీరు త్వరపడి మంచి మీద కువ్యాక్యలు చేస్తున్నారు. మంచి మా అవసరమని (కష్టజీవుల) గుర్తించండి. మార్పును మరింత వేగిరం చేయాలంటే మరింత ఓర్పు అవసరం.

  ReplyDelete