పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం విషమంగానే వున్నా బాగున్నట్టు బులిటెన్లు విడుదల అవుతున్నాయి. వాటిలో భిన్నమైన కోణాలను మేళవించుతున్నారు. ఈ లోగా కొందరు స్వార్థపరులైన సహాయకుల చేతుల్లో ఆయన అసహాయుడుగా వున్నాడంటూ మీడియాలో కథనాలు విపరీతంగా వెలువడుతున్నాయి. ట్రస్టుపైన భక్తులు కూడా అవిశ్వాసం ప్రకటించి ఆందోళన వెలిబుచ్చుతున్నారు. టిటిడి చైర్మన్‌గా పనిచేసిన మాజీ ఎంపి ఆదికేశవులు నాయుడు స్వయానా ఈ ఆరోపణలు చేయడం సంచలనం కలిగించింది.గతంలో హేతువాదులు జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు బాబా ఆశ్రమంలో అక్రమ శక్తులను గురించి ప్రశ్నించినపుడు పెద్ద అపరాధంగా
చిత్రించిన వారు ఇప్పుడు ఆయనే వాటి చేతుల్లో బందీగా వున్నాడని ఒప్పుకోవడం గమనించదగ్గది. వయో వృద్ధుడైన బాబాకు సరైన రక్షణ కల్పించడంతో పాటు ఆయనచుట్టూ అల్లుకున్న భక్తి సామ్రజ్యంలో చిక్కుకుపోయిన అమాయకులకు కూడా రక్షణ నివ్వాల్సిన అవసరం వుంది. ఇప్పటి వరకూ ఈ విషయంలో మౌన పాత్రకే పరిమితమైన ప్రభుత్వం వెంటనే ఆ దిశలో కదలకపోతే అనుమానాలు ఇంకా పెరుగుతాయి.ఆ ధనం ప్రజలదే గనక ఏ శక్తులూ దాన్ని కబళించకుండా చూడవలసిన బాధ్యత కూడా వుంటుంది. యాగాలైనా బాబాలైనా విచక్షణా రహితంగా నెత్తిన పెట్టుకోవడం గాక విచక్షణతో చైతన్యంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ అనుభవాలు చెబుతున్నాయి. ఇది నాస్తికత్వం కాదని నాగరికతకూ ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమనీ కూడా వీటిపై వచ్చిన వ్యాఖ్యలు విమర్శలే విదితం చేస్తున్నాయి.
No comments:
Post a Comment