Pages

Sunday, April 17, 2011

కడప రాజకీయ విన్యాసాలు- కాంగ్రెస్‌కు సవాళ్లు



ఎట్టకేలకు కడప, పులి వెందుల ఎన్నికల పర్వంలో ప్రధాన అభ్యర్థుల నామినేషన్ల పర్వం ముగిసింది. కాకపోతే ఈ సందర్భంలోనే రకరకాల రాజకీయ విన్యాసాలు, ఎత్తులూ పై ఎత్తులూ రాష్ట్రం చూస్తున్నది.శిబిరాలు మారిన నేతలు,ధన రాశల చెలగాటాలూ, నిన్నటి మిత్రుల మధ్య నేడు వాగ్యుద్ధాలు అన్ని అసలైన ఆధిపత్య రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. ఇందులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా వాస్తవంలో పెద్ద తేడాలేమీ లేవు. వివేకానందరెడ్డి పులివెందులలో పోటీ చేడయం గాని, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ జగన్‌పై ధ్వజమెత్తడం గాని విద్రోహమని
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతల విమర్శ.అయితే కడపలో జరిగేది రాజకీయ సంగ్రామమే గాని అనుబంధాలు అంత:కరణల ఆలాపన కాదు. ఈ పోరాటంలో ప్రధానమైన మూడు పక్షాలూ తమ సర్వ శక్తులనూ ఒడ్డి పోరాడటం జరిగితీరుతుంది. జగన్‌కు,విజయ లక్ష్మికి సహజ సిద్ధమైన అనుకూలత వుంటుందని అంగీకరిస్తున్నా ఆధిక్యతను దెబ్బ తీయడానికి అధికార పక్షం అన్ని ప్రయత్నాలూ చేస్తుంది.ఇందులో భాగంగా అమాత్యుల సేన అక్కడ మొహరించనుంది. రాష్ట్రంలో మరే ప్రజా సమస్య పరిష్కారంలోనైనా ఈ శ్రద్ధ చూపించి వుంటే ఎంతో బావుండేది.
ే అధిష్టానాన్ని మెప్పించాలన్నా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలన్నా జగన్‌ బలాన్ని బాగా పరిమితం చేయాలని కోత కోయాలని పాలక పక్షం గట్టిగానే భావిస్తున్నదనేది స్పష్టం. జగన్‌కు సంబంధించి ఈ ఎన్నికల ఫలితం మరింత కీలకమైంది. ఏదో విధంగా గెలిచినంత మాత్రాన ఆయనకు వొరిగేది వుండదనీ, గతంలో వచ్చిన పెద్ద ఆధిక్యతను నిలబెట్టుకోవడమే గాక బాగా పెంచుకోవాలని కూడా భావిస్తున్నారంటే అందుకు కారణాలున్నాయి. ఈ ఇద్దరి మధ్య తెలుగు దేశం పాత్ర కొంత పరిమితమైందే గాని విస్మరించదగింది కాదు. ఈ క్రమంలో ఎవరు ఎవరితో ఏ మేరకు ఏ విధంగా వ్యూహాత్మక అవగాహనకు(లేదా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు) వచ్చారనేదానిపై పరస్పర ఆరోపణలు గుప్పుమంటూనే వున్నాయి. అయితే మిగిలిన రెండు పక్షాల కంటే కాంగ్రెస్‌కే ఇది పెద్ద సవాలుగా మారొచ్చు. సర్వ శక్తులూ కేంద్రీకరించిన తర్వాత కూడా తగిన ప్రభావం చూపించలేకపోతే ప్రతికూల వాతావరణం పెరుగుతుంది. శాసనసభ్యురాలు కమలమ్మ వంటి వారిని తమ వైపు తిప్పుకోగలిగిన అధికార పక్షం ఓటర్లను ఏ మేరకు తిప్పుకోగలుగుతుందో ఫలితాలే చెప్పాలి. అధికార దుర్వినియోగం ఆరోపణలు మంత్రుల పటాలాలు మకాం వేయడం రేపు మరింత సంజాయిషీ చెప్పుకోవలసిన స్థితిలోకి నెట్టవచ్చు.
ఇది ఇలా వుంటే జగన్‌ తన అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు వివరాలు ఆయన ఆర్థిక సామ్రాజ్యం అతివేగంగా విస్తరించిన తీరుకు అద్దం పడుతున్నాయి. వాస్తవ ఆస్తులు ఇందుకు అనేక రెట్లు వుంటాయనేది కూడా ఆయనతో పాటు చాలా మందికి వర్తించే సత్యం. ఇప్పటి వరకూ పార్లమెంటులో అతి సంపన్నుడుగా వున్న తెలుగు దేశం నామా నాగేశ్వరరావును మించి పోగల లెక్కలు జగన్‌ సమర్పించారు. ఈ వాస్తవాలన్ని రాష్ట్ర రాజకీయాలలో పెరిగిపోయిన ధన బలం ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ఆరోపణలకు బలం చేకూరుస్తాయి. అయితే దాన్ని బట్టి మాత్రమే ఎన్నికల తీర్పు వెలువడకపోవచ్చు కూడా. గతంలో వైఎస్‌ పనుపున ఆయన చెప్పిన వారిపై ధ్వజమెత్తే పాత్ర పోషించిన ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ తరఫున ఆయన కుమారుడిపై మాటల యుద్ధం సాగిస్తుండడం ఇందులో కొసమెరుపు.
177 పై వెనకడుగు
ప్రభుత్వోద్యుగుల హక్కులపై దాడి చేసే జీవో నెంబర్‌ 177 తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం అనివార్య పరిణామమే. ప్రజాస్వామిక పద్ధతుల్లో ఆందోళనలు చేయడానికి నిరసనలు తెల్పడానికి సహజ సిద్ధంగానే హక్కు వుంటుంది. దాన్ని వమ్ము చేస్తూ తీసుకొచ్చిన ఈ జోవోను కేవలం ప్రాంతీయ కోణం నుంచే కొందరు చిత్రించారు గాని వాస్తవంలో అది కార్మికులు ఉద్యోగుల హక్కులపై జరుగుతున్న సాధారణ దాడిలో భాగమే. గత ఏడాది ఇంతటి ప్రాంతీయ వివాదాల మధ్య కూడా అన్ని ప్రాంతాల ఎన్‌జివోలు టీచర్లు ఒకే జెఎసిగా ఏర్పడి జీత భత్యాలు కోర్కెలు సాధించుకున్న తీరు మర్చిపోరాదు. ఇటీవల అంగన్‌ వాడీలు, ఆశా వర్కర్లు కాంట్రాక్టు లెక్చరర్లు తదితరులు కూడా అన్ని చోట్లా పోరాటాలు చేశారు. ఉద్యోగాల కోత, ఉద్యోగుల హక్కుల కోత అనేది నేటి సరళీకరణ ప్రైవేటీకరణ విధానాల మూల సూత్రం. కనక కేవలం ప్రాంతీయ కోణం తోనే ఆగిపోకుండా మొత్తం ఉద్యోగ శ్రామిక వర్గాల హక్కులపై దాడిగా దాన్ని చూడటం ముఖ్యం.. ప్రతిఘటన వల్ల ప్రస్తుతానికి వెనక్కు తగ్గినా మళ్లీ ప్రభుత్వం ఈ విధమైన ప్రయత్నం చేయకుండా నిరోధించడం ముఖ్యం.

No comments:

Post a Comment