Pages

Friday, April 8, 2011

కడప కదన రంగం...


.

కడప ఎన్నికల సమరంపైనే రాష్ట్రమంతటి దృష్టి కేంద్రీకృతమైంది. కనీసం టీవీ చర్చలూ మీడియా కథనాలు దాని చుట్టూనే తిరుగుతున్నాయి. కడప సమరం జగన్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మాత్రమే జీవన్మరణ పోరాటమనీ, కాంగ్రెస్‌కు సాధారణ ఎన్నికలేనని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్య సగమే సత్యం. ఈ ఎన్నిక ప్రస్తుత తరుణంలో జగన్‌కు సహజ సిద్ధమైన అనుకూలతలు కలిగివుంటుందని వ్యక్తిగత సంభాషణల్లో అన్ని పార్టీల వారూ
అంగీకరిస్తున్నారు.
జగన్‌కు సంబంధించినంత వరకూ ఇక్కడ విజయం సాధించడం వల్ల అదనంగా వొరిగేది వుండదు. కాని భారీ ఆధిక్యతతో విజయం సాధించకపోతే- మొన్నటి కౌన్సిల్‌ ఎన్నికల్లో మాదిరి బొటాబొటిగా బయిటపడితే కలిగే నష్టం మాత్రం చాలా వుంటుంది. అందుకే ఆయన శాయశక్తులూ కేంద్రీకరించుతున్నారు.
ఇక కిరణ్‌ సర్కారుకు, కాంగ్రెస్‌ నాయకులకు కూడా ఇది పెద్ద సవాలు కిందనే లెక్క.ఎందుకంటే ఓడించకపోయినా కనీసం ఆధిక్యతనైనా బాగా తగ్గించలేకపోతే అధిష్టానం ఆగ్రహం చవిచూడవలసి వస్తుంది. ప్రజల్లోనూ పార్టీ పలచన అవుతుంది. అయితే అభ్యర్థుల ఎంపిక దశలోనే అయోమయాన్ని బయిటపెట్టుకున్న అధికార పక్షం ఆరంభ లాభం జగన్‌కే ఇచ్చింది. ఇప్పుడు ఇక ఎంత పటిష్టంగా పోరాటం చేస్తారో చూడాలి.
తెలుగు దేశం అభ్యర్థుల ఎంపిక మాత్రం ముందే పూర్తి చేసుకుని కొంత సురక్షిత స్తితిలో వుంది. అయితే జగన్‌కు, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల చీలికలో తము బయిటపెడతామని చెబుతున్నా వాస్తవంలో ప్రధానంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఉధృతిని అడ్డుకోవడంపైనే సహజంగా వారి దృష్టి వుంటుంది. సీనియర్‌ నాయకుడు మైసూరా రెడ్డిని నిలబెట్టడం రాజకీయంగా రక్తి కట్టించే అవకాశం వుంది.
వైఎస్‌ఆర్‌, మైసూరా, వివేకా, రవీంద్రా రెడ్డి వీరంతా కడప రాజకీయాల్లో చాలా కాలంగా ముందు భాగాన నిలబడ్డారు. ఇప్పుడు మిగిలిన ముగ్గురు కూడా రంగంలో వుండటం ఆసక్తి కరమే. కందుల సోదరుల పార్టీ మార్పిడిని బట్టి కడప ఎన్నిక కేవలం పార్టీల మధ్యనే కాదని, ప్రాబల్యాలు పెత్తనాల మధ్య కూడా నని ఇక్కడ వ్యక్తులే ప్రధానమని కూడా అర్థమవుతుంది.
ఇన్నిటి మధ్యనా ఎన్నికలు సజావుగా జరగాలని, ప్రజలు సక్రమంగా ఓటు వేసే అవకాశం వుండాలని కోరుకోవాలి.. ఇందులో ఎవరు వైఎస్‌ వారసులు ఎవరు కాదు అన్న మీమాంస కంటే ఎవరు ఆధిపత్యం నిలబెట్టుకోగలుగుతారు అన్నదే కీలకం.



2 comments:

  1. Off-topic ప్రశ్న అడుగుతున్నందకు ఇంకోలా అనుకోవద్దు. మీరు సంకలనం చేసిన "బాబాల బండారం" పుస్తకం 2006లో కొన్నాను. ఆ కాపీ 2004లో ముద్రితమయ్యింది. మీరు అందులో పేర్కొన్న కాళేశ్వర్ బాబా లాంటి వాళ్ళ మీద 2004 తరువాత కూడా వార్తలు వచ్చాయి. ఆ పుస్తకంలో కొత్త అప్‌డేట్స్ పెట్టగలరేమో చూడగలరా?

    ReplyDelete
  2. మీ ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వండి. నా ఈమెయిల్ అడ్రెస్ mandangi@lycos.com

    ReplyDelete