Pages

Tuesday, May 29, 2012

జగన్‌ అరెస్టు అనంతరం..


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అద్యక్షుడు జగన్మోహన రెడ్డి అరెస్టు అనూహ్యం కాకపోగా అనివార్యమైన పరిణామం. దీన్ని నివారించడానికి రాజకీయంగానూ న్యాయ పరంగానూ చేయగలిగిన వాదనలు ప్రయత్నాలన్ని వారు చేశారని గుర్తుంచుకోవాలి.ఇప్పటికే దీనిపై చాలా చర్చలు జరిగిన దృష్ట్యా కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే పేర్కొంటున్నాను.

1.సోనియాకు అనుకూలంగా వుంటే ఈ కేసు పెట్టేవారా అన్న ప్రశ్న వాస్తవంగా సమస్యను ఆ ఉభయులకు మాత్రమే పరిమితం చేస్తున్నది. సోనియా కోరుకోకపోయినా మన్మోహన్‌ సింగ్‌ సహకరించకపోయినా 2జి స్పెక్ట్రం వంటి అవినీతి వ్యవహారాలు దర్యాప్తునకు వచ్చాయి.కనక ఇది రెండు కాంగ్రెస్‌లకు మాత్రమే సంబంధించినది కాదు.పైగా సోనియా గనక పదవిఇచ్చేందుకు సిద్ధపడి వుంటే వీరు కూడా సర్దుకుని వుండేవారు.
2.అయితే కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ప్రయోజనాలు కూడా స్పష్టం.ఎ1గా వున్న జగన్‌ను ఇంత కాలం ఎందుకు అరెస్టు చేయలేదు? అన్న ప్రశ్న వారితో సహా అందరూ అడుగుతున్నారు. సిబిఐ కోర్టు కూడా అడిగింది. అలాగే సిబిఐ దర్యాప్తు ఆయనకే పరిమితం చేసి అందుకు బాట వేసిన మంత్రులను వదిలేస్తే ఎలా అన్నది మరో పెద్ద ప్రశ్న. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌, పిసిసి అద్యక్షుడు బొత్స కూడా తమ రాజకీయ పాలనా బాధ్యత లేదన్నట్టు మాట్లాడ్డం చెల్లుబాటయ్యేది కాదు. ఈ తప్పుకు బాధ్యత అవిభాజ్యమైంది.అనుభోక్త జగన్‌ అయితే కావచ్చు గాని తక్కిన వారు అమాయకులు కాదు. ఇదే సమయంలో లిక్కర్‌ సిండికేట్లపై ఎసిబి దాడుల పట్ల వ్యవహరించిన తీరు పూర్తి భిన్నంగా కనిపిస్తూనే వుంది.
3.తెలుగు దేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేయొద్దని కేసులు వేయొద్దని
ఎవరూ చెప్పరు. ఇప్పుడు కూడా సుప్రీం కోర్టులో అలాటి పిటిషన్‌ వుంది. కాని కాంగ్రెస్‌, తెలుగు దేశంలను విమర్శించినంత మాత్రాన జగన్‌పై ఆరోపణలు ఎలా మాసిపోతాయన్నది ప్రశ్న
4.కాంగ్రెస్‌కు రాజకీయం వున్న మాట నిజమే. కాని జగన్‌ పార్టీకి కూడా రాజకీయం వుంది కదా? రాజకీయంగా సమర్థించుకోవచ్చు గాని అన్ని అభియోగాలు కేవలం కక్ష సాధింపు అన్న ఒక్క మాటతో కొట్టేస్తే సరిపోతుందా? వ్యాన్‌పిక్‌, ఫార్మాసిటీ వగైరాలన్ని కళ్లముందు కనిపిస్తున్న నిజాలు కదా?

5.సిబిఐ కేంద్ర హొం శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందనేది ఎప్పుడైనా వుంది. అయితే ఇక్కడ దానికి ఫైలు అప్పగించింది ఉన్నత న్యాయస్థానమన్నది కూడా గుర్తుంచుకోవాలి. ఈ క్షణం వరకూ ప్రతి విషయంలో వారు కోర్టును ఆశ్రయిస్తూనే వున్నారు.

6.నా బిడ్డ చేసిన తప్పేమిటి అంటున్న విజయమ్మ ఇన్ని అభియోగ పత్రాలను కూడా పట్టించుకోవడం లేదా?. అనేక ప్రాథమిక ఆధారాలు కనిపిస్తుండగా గజం మిథ్య పలాయనం మిథ్య అంటే సరిపోదు. పైగా పెట్టుబడులు రాలేదని జగన్‌ ఇంత వరకూ చెప్పలేదు. విదేశాల నుంచి వచ్చిన వాటిలో అనేక అపసవ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగ ప్రవేశం మరింత తీవ్రమైన విషయం. సరళీకరణ విధానాల వల్ల కలగిన విశృంఖల పోకడలకు ఒక పెద్ద ఉదాహరణ జగన్‌ వ్యవహారమైతే దాంట్లో అతి కీలకమైన భాగం విదేశాల ద్వారా నిధులు వచ్చిన తీరు.దీనిపై గనక ఇడి కేంద్రీకరిస్తే దిగ్బంధం మరింత తీవ్రమవుతుంది.

7. జగన్‌కు జనం మద్దతు వుందని, రేపు ఉప ఎన్నికలలో కూడా విజయం సాధిస్తారని అంచనాలు వున్నాయి. అలాగే జరగొచ్చు కూడా. అయితే దానికి దర్యాప్తులు విచారణలకు ఏ మాత్రం సంబంధం లేదు. ఆయన అరెస్టు తర్వాత పరిణామాలపై అభద్రత సృష్టించేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా అవేవీ నిజం కాలేదు.ప్రజలు సంయమనం పాటించారు. ఇది మంచి పరిణామం. దేశంలో జయలలిత,లాలూ యాదవ్‌, యెడ్యూరప్ప వంటి ముఖ్యమంత్రులతో సహా ఎందరో కీలక నేతలను ఎన్నికల్లో గెలిచినా అరెస్టు చేశారు. ఈ కేసులోనూ ఇప్పటికీ నలుగురు అరెస్టయ్యారు.అప్పుడంతా లేని తప్పు ఇప్పుడేం వచ్చింది? వాటిపై కోర్టులో పోరాడిన వారు ఇప్పుడు మరో విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఒక పార్టీ అద్యక్షుడికి ప్రత్యేక అధికారాలేమీ సంక్రమించవు. ఎన్నికల ప్రచారం చేసుకోవడం అనేది వారి స్వంత అవసరం తప్ప దేశం అవసరం కాదు. మానవీయ కోణాలైన అనారోగ్యం, మరణం వంటి కారణాల వల్లనే మినహాయింపునకు అవకాశం వుంటుంది తప్ప ఎన్నికల ప్రచారానికి వ్యాపారావసరాలకు కోర్టులు మినహాయింపు నివ్వడం జరగదు. ఇప్పుడు రెండవ కేసు కూడా మొదలు కాబోతుందని గనక, ఇడి వేచి చూస్తున్నది గనక ఈ వ్యవహారం దీర్ఘకాలమే పట్టొచ్చు.
8.విజయమ్మ ధర్నాతో మొదలు పెట్టి వైఎస్‌ఆర్‌ పార్టీ ఎన్నికల ప్రచారానికి కేంద్ర బిందువు కాబోతున్నారు గనక సానుభూతి వ్యూహం మరింత ఉధృతం కావచ్చు. ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆ బాటలోనే వున్నారు. అయితే సానుభూతి ఒక్కసారి వ్యవహారం తప్ప శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్‌కు, రాజీవ్‌ గాంధీకి వారి వారి సానుభూతులు 1984-85లో అచ్చి వచ్చినా 1989లో కనిపించనేలేదు.కనక ఉప ఎన్నికల వరకే సానుభూతి పనిచేస్తుందని ఆపైన వాస్తవంగా ఆ పార్టీ తీరును బట్టి జనం స్పందిస్తారని చెప్పొచ్చు.
9.కాంగ్రెస్‌, తెలుగు దేశంల నుంచి వలసల విషయానికి వస్తే ఉప ఎన్నికల ఫలితాల తర్వాత దాన్ని అంచనా వేయాల్సి వుంటుంది.అయితే ప్రభుత్వం కొనసాగుతుంటే మాత్రం సామూహికంగా వెళ్లిపోవడం జరక్కపోవచ్చు. ఇప్పటికి ప్రతిపక్షంగా వున్న తెలుగు దేశం గురించి చూస్తే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటున్నదని భావించి భవిష్యత్తు ముడివేసుకునే వారు వెళ్లవచ్చు.
10.జగన్‌ అరెస్టుతో విచారణ పర్వం మొదలైంది. ఇక మిగిలిన సంగతి కోర్టులకు వదిలేసి విధానపరమైన అంశాలపై దృష్టి సారించడం మంచిది. ఎవరు కారకులైనా ఈ వ్యవహారాలలో రైతుల నుంచి లాక్కొన్న నామకార్థపు ధరకు కొనుక్కున్న భూమిని వారికే అప్పగించడం తక్షణం జరగాలి. అనుమానాస్పద అవినీతిభరిత ప్రాజెక్టులన్నిటినీ నిలిపేయాలి.అది అన్నిటికన్నా కీలకం.

14 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete
    2. కలి కాలం లో ఇంతే నండీ. ఇవాళ వీళ్ళంతా శ్రీరంగ నీతులు బోధిస్తున్నారు ,పాడు లోకం ఇది . తోట కూర కధలు, వంకాయ కధలు చెప్తూ నీతులు బోధిస్తున్నారు. మనకి వినే ఖర్మ తప్పడం లేదు. తప్పదు అండీ తప్పదు ,పాడు లోకం ఇది

      well said! RK :))

      Delete
  2. చక్కగా విశ్లేషించారు. అంతా దొంగలే, వాటాల్లో తేడాలొచ్చి కొట్టుకు చస్తే ప్రజలకు వచ్చిన నష్టం ఏమీలేదు, కొందరైనా అవినీతిపరులు జైళ్ళలో వుంటారు. కాబట్టి జగన్‌కు రాజకీయ కక్ష్య సాధింపు వున్నా, దాన్ని వ్యతిరేకించడంలో దేశప్రయోజనాలు లేవు. అవినీతిపరులకు అన్యాయం జరుగుతోందని కొందరు బ్లాగర్లు స్వయంప్రకటిత న్యాయదేవతలైపోయి వాపోవడం హాస్యాస్పదం.

    అక్రమాస్థులపై జగన్ నుంచి ఇంతవరకూ కనీసం ఖండన లేదు. "మేము తిన్నా అమాయకులమే, మీరు నమ్మాలి. మీకూ ఆరోగ్యశ్రీ, పావులావడ్డి, ఉచిత విద్యుత్తు లాంటి బొమికలు పడేశాము, కాబట్టి మీరు మాకు ఓటేసి, చట్టానికి అతీతంగా సేవించుకోండి. మేము తప్ప మీకు వేరే దిక్కులేదు" అన్నట్టుంది.

    ReplyDelete
  3. Bank లో దొంగతనం జరిగింది. ఆ దొంగ బంగారంలో కొంత చవగ్గా కొన్న షావుకార్ని పట్టేశాం. అతడికి ఉరిశిక్ష వేయించడానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగి పోతున్నాయి.ప్రజలందరూ నిర్భీతితో పండుగ చేసుకోండి అంటున్నారు. బాగానే ఉంది. కానీ బేంకులో ఎంత బంగారం పోయింది.దాన్ని దోచిన దొంగలు ఎంత ఈ షావుకారుకి అమ్మేరు. మిగిలిన బంగారం అంతా ఎక్కడుంది. అది బాంకులో దాచుకున్న ప్రజలది కాదా? దానిని గురించి పట్టించకోరేం? బంగారం దొంగతనం ఎలాజరిగింది?Bank strong room తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. ఆ బెంకు మానేజరు తర్వాత ఏక్సిడెంటులో చనిపోయినా అతడి నిర్వాకం వల్లే దొంగతనం జరిగినందువల్ల అతడు Complaint చేయలేదనే అనుకున్నా ఆ తర్వాత Prmotion తో ఆ పోస్టులోకి వచ్చిన అసిస్టెటు మానేజరు కాని బాంకు సెక్యురిటీ ఆఫీసర్లుగాని ఆడిట్ ఆపీసర్లుగాని Bank లో ఎంత బంగారం పోయిందనే విషయం మాట్లాడరెందుకు.రెండేళ్ల క్రితం బంగారం పోతే ఢిల్లీలో ఉండే Bank Chairman కి ఆ విషయం తెలిసి ఉండక పోవడం విఢ్డూరంగా లేదా? పోనీ ఇన్నాళ్లూ తెలియలేదనే అనుకుందాం. దొంగ బంగారం గురించి పదినెలల క్రిందటే తెలిసి నప్పటి నుంచి Bank దొంగతనానికి కారకులెవ్వరు.అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఇతర ఆఫీసర్ల పాత్ర ఏమిటి? వారిని ఆ పోస్టులలోనే ఉంచితే దొంగతనం విషయంలో అనేక సాక్ష్యాధారాల్ని తారుమారు చెయ్యరా?.ఈ విషయాల్ని బేంకు వారూ పట్టించుకోక ఊళ్లోని మేధావి వర్గం పట్టించుకోక పోతే జరిగే నష్టం ఏమిటో చెబుతున్నాను. షావుకారు కొన్నది దొంగ బంగారం అని నిరూపించాలంటే బేంకులో దొంగతనం జరిగింది అని ముందు నిరూపించాలి కదా. అలా నిరూపించక పోతే షావుకారుకొన్నది దొంగ బంగారమని నిరూపించడం సాధ్య పడదుకదా?అసలు కేసే తేలిపోతుంది.అది మా కనవసరం ఇప్పటికి షావుకారుని జైల్లో పెట్టడమే మా ద్యేయం ఆనుకుంటే సరే.షావుకారు బయటుంటే సాక్ష్యాలను తారుమారు చేస్తాడంటున్నారు.తారుమారు చేయడానికైతే ఇప్పటికి జరిగిన పది నెలల కాలం సరిపోదా?అదీకాక షావుకారు గారి అన్ని వ్యాపారాలకి సంబంధించిన పుస్తకాలని పదినెలల క్రిందటే జప్రు చేసేరుకదా? ఇంకేమిటి ఆయన మార్చగలిగేది? అదీకాక ఈ కేసులో ముఖ్యమైన బేంకు దొంగతనం విషయంలో అక్కడి అధికార్లూ మానేజర్లూ అదే పోస్టుల్లో అధికారంతో కొనసాగుతుండగా వారు సాక్ష్యాధారాల్ని తారుమారు చేసే అవకాశం లేదనే భావించాలా? వారినెవ్వరినీ అక్కడ్నుంచి తప్పించక పోవడంలోని ఆంతర్యమేమిటి? Bank లో జరిగిన దొంతనం గురించి వారికి చీమ కుట్టినట్టయినా లేదని షావుకారు అరెస్టొక్కటే ధ్యేయమని తేలిపోవడం లేదా? ఈ ప్రశ్నలకి జవాబులిప్పుడైనా అక్కర లేదా? మేధావులు చెబితే సామాన్యజనం తెలుసుకుంటారు.

    ReplyDelete
    Replies
    1. Bagaa chepperu, Adigeru. Medhavulu gurtunchukovalsindi okaatundi.. jagan pai vicharananu evaroo vaddanatam ledu. rao gaaru cheppina sandehaale andarikee vastaayi. andarini oke reetina vichaarinchi oke reetina treat cheste ee godavundadu.

      jillalo bhooketaayimpulalo kanipinchina avineeti hyderabad bhooketaayimpulao kanipinchakapovatamlo antaryamemito?

      Delete
    2. ప్చ్.. వూహూఁ ... ఏమీ అర్థం కాలే. ఏ బ్యాంకులో దొంగతనం జరిగింది? ఏ వూర్లో జరిగింది? ఎప్పుడు జరిగింది? ఈ వివరాలు ఇవ్వండి.

      Delete
  4. అర్థం కాని వారందరూ అదృష్టవంతులే. అర్థమైన వారికే ఆన్సర్స్ దొరకని ప్రశ్నలివి.అన్సర్స్ తెలిసిన వారు జవాబులు చెప్పరు.ప్రజల గతి ఇంతే.

    ReplyDelete
  5. అయ్యో రామా..!
    ఒకప్పుడు ఆ బేంక్ కి చైర్మెన్ గా నియమించబడ్డవాడు ఆ షావుకారు తండ్రే.. చైర్మెన్ అయినవాడు సరిగా బాధ్యత నిర్వర్తించకుండా వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుని షావుకారు కొడుకుతో కలిసి కుట్ర పన్నాడు... తనకున్న అధికారాన్ని ఉపయోగించి బోర్డులో తను చెప్పినట్టు వినేవాళ్ళని కొంతమందిని నామినేట్ చేయించాడు, ఎన్నికయ్యేట్టు చేసాడు. ఇంక అదే బేంకులో కీలకమైన పదవుల్లో తను చెప్పినట్టు వినే ఉద్యోగులను పెట్టి తన కుట్రలో భాగస్వాములని చేసాడు. ఇక్కడ కుట్ర పన్నింది ఎవరు? బేంకు చైర్మెన్, అతని షావుకారు కొడుకు. సహకరించింది ఎవరు? డైరక్టర్లు, కీలకమైన పదవిలో ఉన్న ఉద్యోగులు.

    చైర్మెన్ ఇలాంటి కుట్రలకి తావు ఇవ్వకుండా బేంకు పురోగతికి పనిచేసినట్టైతే, అలాంటి డైరక్టర్లు బోర్డులోకి వచ్చేవాళ్ళు కాదు, అలా ఉద్యోగులు బరి తెగించి ప్రవర్తించేవాళ్ళు కాదు.

    ఇప్పుడు సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు... అధికారాన్ని దుర్వినియోగం చేసి కుట్ర పన్నిన వాడు పెద్ద నేరస్తుడా? లేక అతనికి సహకరించిన నామినేటేడ్ డైరెక్టర్లా? కొంతమంది ఉద్యోగస్తులా? ఒకవేళ అలా చైర్మెన్ గా ఎన్నికైన వాడు అలాంటి కుట్ర పన్నకపోతే, ఆ దొంగతనం జరిగేదా?చైర్మెన్ కి షావుకారికి ఉన్న సంభంధం బట్టి, షావుకారికి అసలు ఇందులో పాత్ర లేదు అనగలమా? ఇక్కడ మొత్తానికి ఆ బేంకు వ్యవస్థ దెబ్బతినడానికి కారణం ఎవరు? ఎవరిని ప్రధమ ముద్దాయిగా నిలపాలి?

    తర్వాత ఆ చైర్మెన్ కాలం చేసాడు... కొత్త చైర్మెన్ వచ్చాడు... పాత చైర్మెన్ హయాములో జరిగినదంతా గమనించిన అప్పటి బోర్డులో సభ్యుడు కాలేకపోయిన ఒకడు అప్పుడు జరిగిన అవకతవకల గురించి హైకోర్టులో కేసు వేసాడు. కేసు కోర్టు పరిధిలో ఉంది. కేసు దర్యాప్తు సంస్థకి బదిలీ అయింది. కొత్త చైర్మను, పాత డైరక్టర్లు(?!), ఆ కీలక ఉద్యోగస్థులు సహకరిస్తామన్నారు...
    దర్యాప్తు సంస్థ ముందస్తుగా అప్పటి లావాదేవీ పత్రాలని తారు మారు చెయ్యగల అధికారులనే అదుపులోకి తీసుకుంది. దర్యాప్తులో భాగంగానే ఒక డైరక్టరుని అదుపులోకి తీసుకుంది. తను కొన్ని అధారాలు సంపాదించిన తరవాత ప్రధమ ముద్దాయి అనుకున్నవాడిని అదుపులోకి తీసుకుంది...

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పినది అర్థవంతంగా వుంది. 'ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు ' అంటారు. 2-3ఏళ్ళలో దర్యాప్తు సంస్థ ఓ కొలిక్కి తేవడం గొప్పే అవుతుంది. దొరికిన దొంగని వదిలేసి అసలు బేంకుల దోపిడీ అంటే ఏమిటి? దర్యాప్తు సంస్థలు ఎవరెవరిని విచారించాలి? దొంగ తనానికి దొంగకు కల అవసరాలు ఏవి? దొంగనే చెయిర్మన్‌గా ఎందుకు వినియోగించకూడదు. అసలు దేశంలో ఇలాంటి దొంగలెంతమంది? దీనికి పరిష్కారం ఏమిటి? వివిధ దేశాల్లో దొంగల మాటేమిటి? .... ఇలా హాయిగా ఎవరినీ నొప్పించక తానొవ్వక దర్యాప్తు చేసుకుంటే దొంగలకూ మహదానదం, వారి అభిమానులైన అనుచరులకూ కడుపుచల్లగ వుంటుంది కదా?!
      అసలు దొంగల్లో పరివర్తన ఎలా తేవాలి? అనే విషయం పైన దర్యాప్తు సంస్థలు కూలంకషంక్గా దర్యాప్తు చేయాలి అంటాను.

      ఇంతకీ అడగడం మరిచేపోయాను... ఇంతకీ ఏ బ్యాంకులో దొంగతనం జరిగింది?! ఎప్పుడు?!:))

      Delete
  6. ఒకడు దొంగ అని నేరం రూజూవు చెయ్యాలంటే , నిజంగా అతడికి శిక్ష పడేటట్లు చెయ్యాలంటే దొంగతనం జరిగిందని చూపించాలా వద్దా?.అక్కర లేదనే అమాయకత్వం ప్రదర్శిద్దామను కుంటే దొరికిన దొంగ తో పాటు దొరకని దొంగలూ అందరూ తప్పించుకుంటారు.మనకదే కావాలనుకునే వారికి ఎవరూ ఏమీ చెప్పలేరు.

    ReplyDelete
    Replies
    1. దొంగతనం జరిగిందనడానికి బాహాటంగా చూపించుకుంటున్న నడమంత్రపు సిరి, సంపద, నాలుగేళ్ళలో వేయి రెట్లైన టాక్స్ రిటర్న్స్ చాలదా? విదేశాలనుంచి చట్టం కన్నుగప్పి, కళ్ళముందే(లొసుగుల ద్వారా) వచ్చిన దేశవిదేశాలనుంచి వచ్చిన అక్రమ పెట్టుబడులను నిరూపించడానికి సమయం పట్టవచ్చు. ఈలోపల 'ఎన్నడు పాపం చేయని వాడే, ముందుగు రాయి విసరాలి' అనే పాట వీరాభిమానులెత్తుకుని దర్యాప్తును నీరుగారుస్తూ 'ఎవరు నీతి మంతులు?' అన్న దరువేస్తూ బయలుదేరారు మరి. పైగా సెంటిమెంటు రాజకీయాలు. ఈ అడ్డంకులన్నీ అధిగమించి సోకాల్డ్ దొంగకు శిక్ష పడేలా చేయడం కష్టమే. చూద్దాం ఏమవుతుందో. YSRఅధిష్టానానికి చెల్లించిన కప్పం వివరాలు బయటపెడితే... దర్యాప్తు ఆపి రాజీ ప్రయత్నాలు జరుగుతాయి. ఇది వాటాల విషయమై ఓ శక్తివంతమైన ముఠా అంతర్గత పోరాటం. చట్టాన్ని ఒక వర్గం వాడుకుంటున్నా, నెట్ రిజల్ట్ మాత్రమే మనం చూడాలి అని నా అభిప్రాయం. అన్నీ ఇప్పుడే లేవనెత్తి సమస్యను నీరుగార్చడం అంత వివేకమైన పని కాదు.
      Let us see who will win the show titled 'who is the boss?' :)

      Delete
    2. @Bank లో దొంగతనం జరిగింది. ఆ దొంగ బంగారంలో కొంత చవగ్గా కొన్న షావుకార్ని పట్టేశాం.

      చవగ్గా దొంగసొమ్ము కొన్న షావుకార్లు ఈ ప్రాజెక్ట్ లు సంపాదించుకొన్న పారిశ్రామిక వేత్తలు అండీ. మరి అప్పుడు దొంగతనం చేసింది ఎవరు? చేయించింది ఎవరు?

      @ఒకడు దొంగ అని నేరం రూజూవు చెయ్యాలంటే , నిజంగా అతడికి శిక్ష పడేటట్లు చెయ్యాలంటే దొంగతనం జరిగిందని చూపించాలా వద్దా?

      చెయ్యాలి, మరి చవగ్గా కొన్నవాడి కి దొంగ ఎవరో తెలిస్తే మార్గం ఉంది కదా, ఇదొక్కటే ఆధారం కాకపోయినా, మిగిలిన ఆధారాలతో కూడా కలిపితే దొరికిపోతాడు.

      (కేవలం మీ లాజిక్ కి సమాధానమే ఈ వ్యాఖ్య .. జగన్ సమస్య అధిష్టానం తోనే కాని బ్యాంకు, చవగ్గా కొన్న షావుకారు లతో కాదు.)

      Delete
  7. ఇక్కడ చెప్పిన విషయం ఒకదొంగ దొరికాడని భుజాలు చరుచుకుంటే సరిపోతుందా అని మాత్రమే. నేనెవరినో వెనకేసుకొస్తున్నాననే భ్రమ తొలగించుకుని, రాసిన దాన్ని ఎన్ని సార్లు చదివినా మరో అర్థం వచ్చే అవకాశం లేదు.ఆ దొంగకు శిక్ష పడాలన్నా దొంగతనం జరిగిందని, దొరికిన సోత్తు దొంగసొత్తని నిరూపింపబడాలి కదా? అలా జరగక పోతే కేసు నీరు కారి పోతుంది కదా? దొంగకి శిక్ష తప్పించుకునే అవకాశాన్ని చేజేతులా ఇచ్చినవారమౌతాము కదా ? ఆ యత్నాలు జరగకపోవడానికి కారణాలు ఏమిటనే నేను ప్రశ్నించాను.దొరికిన మనిషి కటకటాలవెనుక భద్రంగానే ఉన్నాడు కదా?.ఇంకే దొంగలూ లేరని బేంకులో పోయిన సొమ్ము ఇంకెవ్వరి వద్దా లేదనిఎవరైనా భరోసా ఇస్తే హాయిగా నిద్ర పోదాము.దొరికిన దొంగ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుంది.

    ReplyDelete