Pages

Tuesday, December 11, 2012

ఆంధ్రప్రదేశ్‌తో ఆటలా?


దీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్‌ను అనిశ్చితిలో ముంచి ప్రజలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పుడు మరింత దారుణమైన దగాకోరు అధ్యాయానికి తెరతీసింది. ఎఫ్‌డిఐ ఓటింగులో కంపించిపోతున్న అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి అదే సమయంలో తెలంగాణా సమస్యపై ఏదో జరగబోతుందన్న భ్రమ కల్పించడానికి డిసెంబరు 28 వ తేదీ అఖిలపక్ష సమావేశ సూచన వదిలింది. అదైనా అధికారికంగా లిఖిల పూర్వకంగా గాక అలకబూనిన టికాంగ్రెస్‌ ఎంపిలను బుజ్జగించే ప్రక్రియలో భాగంగా జరిగిన తతంగం మాత్రమే. తెలంగాణా మనోభావాలు ముఖ్యమంటూనే ఎప్పటికప్పుడు అధికారాన్ని అంతకన్నా ముఖ్యంగా కాపాడుకొస్తున్న సదరు ఎంపిలు చెప్పుకోవడానికైనా ఏదో వుండాలి గనక అఖిలపక్షం పాచిక అక్కరకు వచ్చింది. అయితే అఖిలపక్ష సమావేశం జరపడమే ఘన కార్యమైనట్టు పరిష్కారం వచ్చేసినట్టు ప్రచారం జరిగింది. తెలంగాణా పేరిట ఎఫ్‌డిఐలపై ప్రజా వ్యతిరేక నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయడమే గాక అధినేత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపే ప్రహసనమూ షరామామూలే. అఖిలపక్షం ఎలా జరగాలి, ఎంతమంది హాజరుకావాలి, ఏమి చెప్పాలి వంటి రకరకాల రాజకీయ తర్జనభర్జనలు జరుగుతుండగానే ఆదిలోనే హంసపాదులా గులాం నబీ ఆజాద్‌ భవిష్యద్ధర్శనం చేయించారు. అఖిలపక్ష సమావేశం కొత్తగా వచ్చిన హౌం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అవగాహన కోసం ఏర్పాటు చేసిన రాజకీయ కచేరి వంటిదే తప్ప నిర్ణయాలు తీసుకునేది కాదని తేల్చిపారేశారు! మొత్తం వ్యవహారంపై కొత్తగా పరిశీలన ప్రక్రియ మొదలవుతుందని ప్రవచించారు. ప్రజా ప్రతినిధులు తాత్కాలికం, ప్రభుత్వ చట్రం శాశ్వతం. మంత్రులు మారినప్పుడల్లా ప్రతిదీ మళ్లీ మొదలు పెట్టేట్టయితే ప్రజాస్వామ్య ప్రక్రియకు అర్థమే వుండదు.
నిజానికి గతంలో ఒక అఖిల పక్ష సమావేశం, ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ నివేదిక, తర్వాత మరో అఖిల పక్షం జరిగిపోయాక ఇంకా పార్టీలు కొత్తగా చెప్పవలసింది వినవలసిందీ ఏమీ లేదు. అధికారం వెలగబెడుతూ అనిశ్చితిని సృష్టించిన అధికార పక్షమే చెప్పేదేమీ లేదని పిసిసి అద్యక్షులవారు సెలవిచ్చారు. ముందు కాంగ్రెస్‌ వైఖరి చెప్పాలని తెలుగు దేశం నేతలు సవాలు చేస్తూ తమ వైఖరి దాటేస్తున్నారు. ఈ ఇద్దరినీ దోషులుగా చూపించి తను కూడా అదే చేస్తున్న వాస్తవాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కప్పిపుచ్చుతున్నది. ఈ విధంగా మూడు ప్రధాన పార్టీలూ దాగుడు మూతలు ఆడటం దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. నిజానికి అలాటి
కాంగ్రెస్‌పై అపారమైన విశ్వాసంతో గడువులు ప్రకటించి ఆఖరికి విలీనం అంచుల వరకూ తీసుకెళ్లిన టిఆర్‌ఎస్‌ వంటి పార్టీలకు కూడా ఇది ఇబ్బందికరమైన సన్నివేశమే.అయితే ఆగ్రహావేశ ప్రకటనకు అవకాశమున్నందున ఆ చాటున చాలా మరుగున పడిపోతాయి.మూడు పార్టీలంత సూటిగా కాకున్నా బిజెపి కూడా తనదైన రాజకీయం సాగిస్తున్నట్టే కనిపిస్తుంది. గతంలో అఖిలపక్ష సమావేశాలకు హాజరు కాని ఆ పార్టీ నేత ఇప్పుడు కూడా పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా బిల్లు తీసుకురావాలని మెలిక పెడుతున్నారు. మౌఖిక సూచన తప్ప హౌం శాఖ ఇంత వరకూ అధికారికంగా స్పష్టమైన వివరాలిచ్చింది లేదు. ఆ తేదీనే మార్చాలని ముఖ్యమంత్రి, పిసిసి అద్యక్షులు వత్తిడి చేసినా బొత్తిగా చెల్లుబాటు కాదని సర్దుకున్నారు.అయితే సమావేశానికి ఎంతమందిని పంపించాలనేది ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయించుకోవచ్చని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. సమావేశానికి ఒకరే రావాలా ఇద్దరు రావాలా అన్న మీమాంస కన్నా వచ్చిన వారెందరైనా ఒక్కమాటే చెప్పాలన్నది ముఖ్యసూత్రం.
ఇప్పటికే జరక్కూడనంత నష్టం జరిగిపోయింది.రాకూడనన్ని కష్టాలు రాష్ట్రాన్ని పీడించాయి. రాజకీయ టక్కరి తనం తాండవిస్తోంది. ఇలాటి నేపథ్యంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ కపటవేషాలు సాగించడం క్షంతవ్యం కాదు. కేంద్రం రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలనుకుంటున్నదా విభజన ప్రతిపాదన చేస్తుందా అన్నది సూటిగా నిర్దిష్టంగా ప్రతిపాదిస్తే ఎవరి స్పందన ఎలా వుండేదీ తెలుస్తుంది. అధికారంలో వున్నవారు అన్ని అనర్థాలకు మూలమైన వారు ఆ పనిచేయకుండా రాష్ట్ర ప్రజలను ఇతర పార్టీలను ఇరికించాలనుకోవడం కుదరదు.అలాగే అధికారంలోకి వచ్చినట్టే భావిస్తున్న వారు రావాలిన పెనుగులాడుతున్నవారు కూడా అసలు సమస్య దాటేసి అధికార పార్టీనే అని తమ బాధ్యత లేనట్టు నటించడం కూడా చెల్లుబాటయ్యేది కాదు. ఈ అఖిల పక్షం ఆఖరిదిగా మారి అంతిమ పరిష్కారానికి దారితీయకపోతే అర్థమే లేదు. ఈ లోగా పాలక పక్షీయులే చెరో పక్క నిలబడి ప్రాంతీయ ప్రజ్వలనాలకు ఆజ్యం పోయూలని చూడటం అత్యంత బాధ్యతా రహితం.రేపటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇలా ఎవరికి వారు వీర విన్యాసాలకు పాల్పడితే మాత్రం ప్రజలు అందరికీ పాఠం నేర్పుతారు. ఆదిమధ్యాంత రహితంగా ఈ అఖిలపక్ష ప్రహసనాలు అలా సాగిపోతూనే వున్నాయన్న మాట అక్షరాలా ఆ సందేశమే ఇస్తున్నది!

3 comments:

  1. ప్రజలు అందరికీ పాఠం నేర్పుతారు.... చెల్లుబాటవుతుందా?????

    ReplyDelete
  2. మీరు చెప్పిన విషయాలు చాల బాగూనై కానీ తెలంగాణా సమస్య
    రాజకీయము నుండి వేరు చెయాలి,దాన్ని పలనా సమస్య గా చూడాలి
    కావాలి అంటే ప్రతి జిల్లా ను ఒక రాష్ట్రం గా చేసుకొవచు

    ReplyDelete
  3. రవి గారు,

    గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్సు ఎదురుదాడి ద్వారా ముఖ్య విషయాలను ప్రక్కదోవ పట్టిస్తోంది.
    కొంతమంది బుద్ధి జీవులు కూడా కాంగ్రెస్సుకు బాసటగా ఇదే అనుసరిస్తున్నారు.
    ఇందులో వీరు తరచూ రాజ్యాంగం, దాన్ని గౌరవించడం ప్రస్తావిస్తున్నారు.

    ఐతే నాకు ఎప్పుడూ ఒక సందేహం వస్తుంది. నిజంగా రాజ్యాంగం అంత గొప్పదా?
    నాకు తెలిసి అది ఆక్స్ఫర్డ్ లో చదివిన కొందరు పెద్దలు ఆచరణ సాధ్యానికి కష్టమైన కొన్ని ఆదర్శాలతో వ్రాసారు.
    ఉదాహరణకు 'మతం' అనే పదానికి అర్ధం చెప్పకుండా 'ధర్మనిరపేక్షత' అమలు చేదామని ప్రయత్నం చేసారు.

    ReplyDelete