ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో
29వ రాష్ట్రంగా తెలంగాణా వాస్తవ రూపం దాల్చనుంది. ఇప్పటి వరకూ జరిగిన
వాదోపవాదాలూ, భిన్నాభిప్రాయాలూ ఎలా వున్నా రాజకీయ పరిణామాలను వాస్తవిక
దృక్పథంతో అర్థం చేసుకోవడం అనివార్య అవసరం. దేశంలో తొలి భాషా ప్రయుక్త
రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించడం వెనక చాలా చరిత్ర వుంది.
గుణపాఠాలున్నాయి. భవిష్యత్తుకు పాఠాలున్నాయి. ప్రాంతాల పేరిట వివిధ దశల్లో
జరిగిన ఉద్యమాల వెనక నాయకుల వ్యూహ ప్రతివ్యూహాలు వాటి పర్యవసానాలు కూడా
రకరకాలుగా వున్నాయి. తెలుగు ప్రజల భవిష్యత్తు కొత్త మలుపు తిరుగుతున్న ఈ
సమయంలో వాటిని ఒకసారి తేరిపార చూడటం ఆసక్తికరం.1953లో ఆంధ్ర
రాష్ట్రం,1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాయి. వీటికి కారణమైన పరిస్థితులను
చాలా సార్లు ప్రస్తావనకు వచ్చాయి. తర్వాత కాలంలో పరిణామాలపైన చర్చ జరగడం
తక్కువ. తెలంగాణా వైపున అరవయ్యేళ్ల ఉద్యమం అన్నమాట పదే పదే
వినిపిస్తుంటుంది. ఇందుకు భిన్నంగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల కమ్యూనిస్టేతర
నేతలు ఇవన్నీ బూటకమని కొట్టిపారేస్తుంటారు. నిజానికి చాలా పరిణామాలు అంశాలు
కలగలసిపోయిన జటిలమైన చరిత్ర ఇది.
యాభయ్యవ దశకంలో రెండు
ప్రాంతాల్లోనూ కమ్యూనిస్టులు బలమైన ప్రథమ శక్తిగా వున్నారనేది చాలా సార్లు
చెప్పుకున్న విషయం. ఆంధ్ర, హైదరాబాదు శాసనసభల తెలుగు జిల్లాల వరకూ చూస్తే
వారే ప్రథమ స్థానం. అయితే అప్పటి శాసనసభలు ఉమ్మడి రాష్ట్రాల పరిధిలో
వున్నాయి గనక ఆ సంఖ్యాబలం అధికారంలోకి తీసుకురాలేకపోయింది. 1952లో తెలంగాణా
ప్రాంతంలో పోరాట విరమణకు ముందే ఉద్యమంలో పొడసూపిన కొన్ని అవకాశవాద
ధోరణులు, ఆంధ్ర ప్రాంతంలోనూ ఎన్నికల భ్రమలు పాలక పక్షాల కుట్రలూ కలసి
1955లో కమ్యూనిస్టుపార్టీ దెబ్బతినడం జరిగిన నేపథ్యంలోనే కేంద్రం ఆంధ్ర
ప్రదేశ్ ఏర్పాటుకు సిద్ధమైంది. అప్పటిదాకా అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్
ఉభయ ప్రాంతాల నాయకులూ కలసి ఆదరాబాదరాగా పెద్దమనుషుల ఒప్పందం
కుదుర్చుకున్నారు. నాటి హైదరాబాదు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు
అందుకు సహకరించగా ఆయన వ్యతిరేకులైన మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట
రంగారెడ్డి అభ్యంతరం తెలిపారు. రాయలసీమ కోణంలో మొదట వ్యతిరేకించిన నీలం
సంజీవరెడ్డి తర్వాత సర్దుకుని మొదటి ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే పెద్ద
మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణా ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి
ఇవ్వడానికి సిద్ధపడలేదు. అది ఆరోవేలు అని తీసిపారేశాడు. రాజ్యాంగంలో ఉప
ముఖ్యమంత్రి ఉప ప్రధాని వంటి పదవులు లేవు. అది ముఠాతగాదాల సర్దుబాటుకోసం
తెలుగు వారు సృష్టించినదే. కాని సంజీవరెడ్డి దాన్ని నిరాకరించడంతో వ్యవహారం
ఆదిలోనే హంసపాదులా తయారైంది.
ఇదే సమయంలో నిజాం పాలనా కాలంలో
నివాసార్హతకు సంబంధించి రూపొందిన ముల్కీ(స్థానిక) నిబంధనలు
వివాదాస్పదమైనాయి. 1952లో కొంతమంది నాన్‌ముల్కీ గోబ్యాక్ అంటూ అలజడి
సృష్టించారు. 1956,59 మధ్య ఉద్యోగులకు సంబంధించి పలు రకాల ఉత్తర్వులు
వెలువడ్డాయి.1965 నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు నిలిపేయడం యువతలో
అశాంతికి కారణమైంది. 1967లో తెలంగాణా ఎన్‌జివోల సంఘంగా మారిన హైదరాబాద్
ఎన్‌జివోల సంఘం పలు ప్రత్యేక కోర్కెలతో ఒక ప్రకటన విడుదల చేసింది.
నివాసార్హతకు సంబంధించిన ఈ నిబంధనలు 1974 వరకూ చివరి సారిగా పొడగించాలనే
ప్రతిపాదన వచ్చింది. దీన్ని కోర్టులో సవాలు చేసినప్పుడు చెల్లుబాటు కావని
హైకోర్టు 1969 లోతీర్పు నిచ్చింది. ఇవన్నీ అసంతృప్తికి దారి తీశాయి.
దీనికి సమాంతరంగా కాంగ్రెస్ నేతల ముఠా తగాదాలు నడిచాయి. 1964లో నీలం
సంజీవరెడ్డి కేంద్రానికి వెళ్లేప్పుడు తన అనుచరుడైన కాసు
బ్రహ్మానందారెడ్డిని నియమింపచేసుకున్నారు. అయితే అప్పటి ప్రధాని లాల్
బహుదూర్ శాస్త్రి మరణానంతరం ఇందిరాగాంధీ పేరు ప్రతిపాదించడంలో కాసు
స్వతంత్రంగానే వ్యవహరించి పట్టు పెంచుకోవడం ఆయనకు నచ్చలేదు. 1967 ఎన్నికల
తర్వాత ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఎన్నిక కావడంతో కాసు ప్రాబల్యం
మరింత పెరిగింది.తన మంత్రివర్గంలోకి తీసుకున్న మర్రి చెన్నారెడ్డికి కొద్ది
రోజుల్లోనే కేంద్రంలో పదవి ఇప్పించి దూరం పంపించారనే భావం ఏర్పడింది.
అయితే 1968 ఏప్రిల్‌లో ఒక ఎన్నికల పిటిషన్‌లో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా
తీర్పు వచ్చింది. ఈ విషయంలో తనకు కాసు సహాయపడలేదని ఆయన ఆగ్రహించారు. తనకు
పదవి వచ్చే అవకాశం లేకపోవడం, తెలంగాణాకు సంబంధించి వచ్చిన వివాదాలు
ఉపయోగించుకుని మర్రి చెన్నారెడ్డి అప్పటికే ఏర్పడి వున్న ఉద్యమ నాయకత్వం
చేతుల్లోకి తీసుకోగలిగాడు. ముఖ్యమంత్రి కాసు ఇందిరాగాంధీ చెప్పిన
మధ్యేమార్గ పరిష్కారానికి ఒప్పుకోకపోవడంతో సంక్షొభం కొనసాగింది. రాజకీయాలలో
ఉద్దండుడైనప్పటికీ ఆయన తెలంగాణా నాయకులను తనవైపు తిప్పుకోలేకపోయారు. ఆ
మంత్రులంతరూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ప్రాంతీయ ఉద్రేకాలు వెర్రితలలు
వేశాయి. సమస్యల పరిష్కారం తో పాటు కాసును తప్పించడం ఒక ప్రధాన షరతుగా
తయారైంది. ఉద్రిక్తతలు పెరిగాయి. 1971 ఎన్నికలలో ఇందిరాగాంధీ అఖండ విజయం
సాధించి తిరుగులేని నాయకురాలయ్యారు. ముఖ్యమంత్రుల సహాయంపై ఆధారపడే స్తితి
పోయి తానే నియమించే స్తితికి వచ్చారు. అయితే తెలంగాణా ప్రాంతంలో మాత్రం
మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణా ప్రజా సమితి అత్యధిక పార్లమెంటు
స్థానాలు తెచ్చుకోగలిగింది. ఈ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ కాసును తప్పించి తన
విధేయుడైన పి.వి.నరసింహారావును ముఖ్యమంత్రిగా నియమించింది. ఆంధ్ర ప్రదేశ్
ఏర్పడిన తర్వాత 16 ఏళ్లకు తొలి తెలంగాణా ముఖ్యమంత్రి వచ్చారు. మంత్రి
వర్గంలోని 29 మందిలో 14 మంది తెలంగాణా వారుండడమే గాక 13 మంది వెనకబడిన
వర్గాల వారికి స్థానం కల్పించారు. ఇందిరాగాంధీ దళిత బాంధవురాలన్న నాటి
ప్రచారానికి తగు రీతిలో జరిగిన తతంగమిది. కొంతమంది దీన్ని అతిశయోక్తిగా
చిత్రిస్తూ ఆయన భూ సంస్కరణలు అమలు చేయడం వల్లనే దెబ్బ తిన్నారని
చెబుతుంటారు. ఇన్‌సైడర్ పేరిట రాసుకున్న ఆత్మకథలో ఆయన కూడా అదే
భావంకలిగించారు. కాని వాస్తవం ఏమంటే నాటి విధానాలే. పివి వ్యవహార శైలితో
పాటు దేశ వ్యాపితంగా అసంతృప్తి పెరుగుతున్న వాతావరణంలో ఆశించిన స్థిరత్వం
లభించలేదు. పివి ఎంత విధేయుడుగా వున్నా కాసు కూడా ఆశీర్వదించలేదు. ఈ లోగా
సుప్రీం కోర్టు ముల్కీ నిబంధనలు చెల్లుతాయని ఇచ్చిన తీర్పును పివి
సమర్థించడం సమస్యను జటిలం చేసింది. ఈ దఫా ఆంధ్ర ప్రాంత మంత్రులు మూకుమ్మడి
రాజీనామాలు చేశారు. బిజెపి అప్పటి రూపమైన జనసంఫ్‌ు కూడా ఈ ఉద్యమాన్ని
బలపర్చింది. వెంకయ్య నాయుడు అప్పుడే పైకి వచ్చారు. స్వతంత్ర పార్టీ
గౌతులచ్చన్న కూడా చురుగ్గా పాల్గొన్నారు. విద్యాసంస్థలు మూతపడగా ఉద్యోగులు
సమ్మెలతో జీతాలు కోల్పోయారు.
ఆ సమయంలో అధిష్టానం రాష్ట్ర
కాంగ్రెస్ కమిటీని రద్దు చేసి ఉన్నతాధికార సంఘాన్ని నియమించింది. ఈ సంఘం
ముఖ్యమంత్రి రాజీనామా చేయడం మంచిదని సూచించింది. ఆయన తప్పుకోగానే
రాష్ట్రపతి పాలన విధించారు. పరిస్థితి కాస్త సద్దుమణగ్గానే కాంగ్రెస్
నాయకులు అధికారం కోసం తహతహలాడారు. అన్ని ప్రాంతాల్లోని అన్ని ముఠాలూ
అధిష్టానం చెప్పింది వినడానికి సిద్ధమయ్యారు. సమైక్యతను నొక్కి చెప్పిన
ఇందిరాగాందీ ఆరు సూత్రాల పథకం ప్రకటించారు. కృష్ణాజిల్లాలో పుట్టినా ఖమ్మం
జిల్లా పరిషత్ అద్యక్ష పదవి చేపట్టి పునాది పెంచుకున్న జలగం వెంగళరావును
1973లో ముఖ్యమంత్రిగా నియమించారు. ఇది ఎలా జరిగిందో ఆయన తన ఆత్మకథలో
వివరంగా రాసుకున్నారు. 1975 జూన్‌లో దేశంలో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి
విధించి 1977 వరకూ ఉక్కుపాదంతో పాలించడం ఆయనకు కలసి వచ్చింది. తర్వాత
జరిగిన ఎన్నికల్లో దేశమంతా ఆమె ఓడిపోయినా ఈ రాష్ట్రంలో మాత్రం 41
పార్లమెంటు స్థానాలు వచ్చాయి. ఓడిపోయిన ఇందిరతో విభేదించిన జలగం 1978
ఎన్నికల్లో రెడ్డి కాంగ్రెస్ తరపున రంగంలోకి దిగి ఓడిపోయారు. ఇందిరా
కాంగ్రెస్ తరపున ఒకప్పుడు ఆమెను గట్టిగా వ్యతిరేకించిన మర్రి చెన్నారెడ్డి
ముఖ్యమంత్రి కాగలిగారు. దీర్ఘ కాల నిరీక్షణ తర్వాత కల నెరవేర్చుకున్న
మర్రి తీవ్రమైన అవినీతి ఆరోపణలకు గురయ్యారు. ప్రభుత్వ వైభోగంతో షష్టిపూర్తి
వేడుకలు తులాభారాలు జరిపించుకుని విమర్శలు మూటకట్టుకున్నారు. భూ కబ్జా
అన్న మాట అప్పుడే పుట్టింది. వీటన్నిటి మధ్యనా 1980 చివరలో అఖిలపక్ష ఉద్యమం
మొదలైంది. చివరకు చెన్నారెడ్డి స్థానంలో హైదరాబాదు కార్మిక నాయకుడైన
అంజయ్య పదవి చేపట్టారు. వీరిద్దరి హయాంలో ఏనాడూ తెలంగాణా వాదం గాని ఆ కోణం
గాని ప్రత్యేకంగా ముందుకు రాకపోవడం విశేషం!
ఉద్యమాలతో పాటు
ఎన్నికల్లోనూ కూడా కాంగ్రెస్ పరాజయాలపాలైంది. విజయవాడ కార్పొరేషన్‌లో
కమ్యూనిస్టులు, విశాఖలో బిజెపి విజయం సాధించడమే గాక కొన్ని ఉప ఎన్నికల్లోనూ
ప్రతిపక్షాలు విజయం సాధించాయి. అంజయ్య పట్ల రాజీవ్‌గాంధీ అనుచితంగా
ప్రవర్తించినందుకు గాను సుందరయ్య నాయకత్వంలో మొత్తం ప్రతిపక్షం మౌనం
పాటించిన సన్నివేశం అపూర్వమైంది.ఈ కారణంగా అంజయ్యను హఠాత్తుగా తొలగించి ఆరు
నెలలు భవనం వెంకట్రామ్‌ను, ఆ పిదప చివరగా కోట్ల విజయభాస్కర రెడ్డిని
ఇందిరా గాంధీ నియమించడంతో ముఖ్యమంత్రి స్థానం పలుచనవడమే గాక రాష్ట్ర
ప్రతిష్ట కూడా దెబ్బతిన్నదనే భావన బలపడింది. కాంగ్రెసేతర పార్టీల ఉద్యమాల
నేపథ్యం, అధిష్టానం అవమానకర పోకడల మధ్య ఈ మొత్తం వాతావరణాన్ని ప్రసిద్ధ
కథానాయకుడు నందమూరి తారకరామారావు గొప్పగా ఉపయోగించుకోగలిగారు. ఫలితంగానే
తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగు దేశం నవమాసాలు నిండకుండానే ఘనవిజయం
సాధించింది. చంద్రబాబు నాయుడు నుంచి చంద్రశేఖర రావు(కల్వకుంట్ల) వరకూ ఆ
తానులో ముక్కలుగానే వచ్చారు.
ఎన్టీఆర్ విజయం ప్రజలు
ఇచ్చిన బ్రహ్మాండమైన మద్దతు ఫలితమేననడంలో సందేహం లేదు. అయితే అది కేవలం
ఆయన ఆకర్షణ లేక వ్యూహ చతురత అనుకుంటే అదీ వాస్తవికం కాదు. కాంగ్రెస్‌ను
ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నాక వారికి సుపరిచితుడైన వ్యక్తిగా ఆయనను
ఎంచుకున్నారు. ఆయనకు విధానాలలో ఏ మేరకు స్పష్టత వుందీ లేదు అనేది
పక్కనబెడితే కొన్ని ప్రజానుకూల చర్యలు తీసుకున్నమాటా నిజమే. రిటైర్‌మెంట్
వయస్సు తగ్గింపు వంటి ప్రతికూలాంశాలు మొదట్లోనే రుచిచూపించారు. ఇవన్నీ
గమనించకుండా ఆయనే తెలుగు వల్లభుడు అన్నట్టు అప్పుడూ ఇప్పుడూ తెలుగుదేశం
నేతలు ప్రచారం చేసుకుంటుంటారు. ఆయన రాకముందు తెలుగు వారికి గుర్తింపు
లేకుండా మద్రాసీలుగానే వుండిపోయినట్టు చిత్రిస్తుంటారు. ఇవన్నీ
అతిశయోక్తులు. ఏమైనా తెలుగుదేశం రాకవల్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పోరాటం
రాజకీయ కోణం నుంచి మారి ఒక ప్రాంతీయ గుర్తింపు, వ్యక్తి ఆరాధాన మార్గాలవైపు
మళ్లింది. సామాజిక వర్గాల ప్రస్తావన కూడా పెరిగింది. మళ్లీ ఎన్టీఆర్‌పై
నాదెండ్ల కుట్ర తదితర పరిణామాల వల్ల కొంత మార్పు వచ్చినా తెలుగుదేశం ఈ
ధోరణి మారింది లేదు. ఇప్పటికీ అవకాశం రాగానే తెలుగువారి ఆత్మగౌరవం,
తమిళనాడు తరపున చిదంబరం కుట్ర, ఉత్తరాది వారి ప్రాబల్యం వంటి మాటలు ఆ
పార్టీ పైకి తీస్తుంటుంది. ఎన్టీఆర్ హయాంలో తెలుగుగంగ ప్రకటించినప్పుడు
రాయలసీమకు మిగులు జలాలు గాక నికర జలాలు కేటాయించాలనే ప్రాతిపదికపై
వైఎస్‌రాజశేఖర రెడ్డి, మైసూరా రెడ్డి వంటి వారు ఉద్యమం నడిపినపుడు
ప్రత్యేక రాయలసీమ వాదాలు కూడా ఎక్కువగానే వినిపించినా తర్వాత
సర్దుకున్నాయి. ఎన్టీఆర్ మొదట్లో కాంగ్రెస్ వ్యతిరేక ఐక్యత అనే మాటనే
నొక్కి చెప్పేవారు. అయితే ఆయన జాతీయ రంగంలో ప్రవేశించిన తర్వాత అనివార్యంగా
లౌకిక విధానాల ప్రసక్తి వచ్చింది. అందువల్లనే ఆయన అద్యక్షుడుగా నేషనల్
ఫ్రంట్ బిజెపి లేకుండానే ఏర్పడింది.ఆ ఫ్రంట్ ప్రభుత్వాన్ని వామపక్షాలు
బిజెపి బయిటనుంచే బలపర్చవలసిన స్థితి కలిగింది. అద్వానీ రథయాత్ర తర్వాత
ఎన్టీఆర్ సూటిగా బిజెపితో విడగొట్టుకున్నారు.
ఎన్టీఆర్
స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత కాలం పాత రాజకీయాలనే
కొనసాగించినా ఆర్థిక విధానాలలో ప్రపంచ బ్యాంకు ఆదేశాల అమలు తీవ్రంగా
జరిగింది. 1998 తర్వాత ఆయన వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వ
ఏర్పాటుకు సహకరించడంతో తొలిసారి రాష్ట్ర రాజకీయాలు మితవాద మతవాద మలుపు
తిరిగాయి. 1997లోనే ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం ఇచ్చిన బిజెపి స్వతహాగా
విభజనకు అనుకూలం. అయితే చంద్రబాబు కారణంగా తాత్కాలికంగా ఆ ఎజెండా పక్కన
పెట్టింది. కెసిఆర్‌తో సహా తెలంగాణా నాయకులంతా ఆయనతో బాగానే కలసి
పనిచేశారు. 1999లో రెండవ సారి ఆయన అధికారం చేపట్టాక ఈ ధోరణి పరాకాష్టకు
చేరింది. తనను తాను సరళీకరణకు అగ్రగామిగా భావించుకున్న చంద్రబాబు చేపట్టిన
ఆర్థిక విధానాలు వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ సంస్థల మూత ప్రైవేటీకరణ
కాంట్రాక్టీకరణలకు బాట వేశాయి. ప్రపంచ ద్రవ్య సంస్థలు, అమెరికా అధినేతలు
నేరుగా వచ్చి వూరేగే పరిస్తితి ఏర్పడింది. ఇజాలు అవసరం లేని టూరిజమే
గొప్పదన్న విచిత్ర వాదనలు వినిపించాడాయన. ఈ పరిస్థితుల్లోనే విద్యుత్ రంగ
ప్రైవేటీకరణ, ఛార్జీల పెంపు తీవ్ర నిరసనకు దారి తీశాయి.2000 బషీర్ బాగ్
ఘటనలు దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా ప్రభావం కలిగించాయి. సిపిఎం వామపక్షాల
నేతృత్వంలో మొదలైన ఆ ఉద్యమంలో వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా
పాల్గొనవలసి వచ్చింది. ఆ విధంగా ప్రపంచీకరణకు ప్రయోగశాలగా మారిన ఈ
రాష్ట్రంలో దానికి వ్యతిరేకంగా ప్రతిఘటన కూడా ఉధృతంగా రావడం తెలుగు నాట
ప్రజాస్వామిక పోరాటాలకు కొత్త వూపు నిచ్చింది. దానికి నాయకత్వం వహించిన
బి.వి.రాఘవులు తదితరులపట్ల గౌరవం పెరిగింది.
అయితే 1981 అఖిలపక్ష
ఉద్యమం తర్వాత తెలుగుదేశం ఆవిర్భవించినట్టే 2000 తర్వాత తెలంగాణా రాష్ట్ర
సమితి ముందుకొచ్చింది. చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరున్నా మంత్రి పదవి
పొందలేకపోయిన కెసిఆర్ ఆ పార్టీ నుంచి బయిటపడటానికి ఆ సందర్భాన్ని
అవకాశంగా తీసుకున్నారు. అయితే కొద్ది రోజుల్లోనే ప్రపంచ బ్యాంకు విధానాలపై
పోరాటాన్ని ప్రాంతాల పోరాటంగా మార్చేసే ఎజెండా చేపట్టారు. ఎందుకంటే అంతకు
ముందే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ప్రత్యేక తెలంగాణా కోసం కృషిచేయాలని
సోనియాగాంధీకి మెమోరాండం సమర్పించిన నేపథ్యం ఆయనకు కలసి వచ్చింది.
మతతత్వంతో చేతులు కలిపి సరళీకరణకు ప్రతిరూపంగా మారిన చంద్రబాబు
ప్రభుత్వాన్ని గద్దె దించడం ఆ ఎన్నికల్లో ప్రధాన కర్తవ్యంగా వచ్చింది.
అందుకే తొలిసారి సిపిఎం కాంగ్రెస్‌తో పోటీ నివారణకు ప్రయత్నించి తద్వారా
ఓట్ల చీలికను నివారించవలసిన అగత్యం ఏర్పడింది. ఎన్నికల అవసరాలకోసం
కాంగ్రెస్ టిఆర్‌ఎస్‌తోనూ పొత్తు పెట్టుకుంది గాని సిపిఎం దానికి ఏ నాడూ
భాగస్వామి కాదు. అనేక చోట్ల టిఆర్‌ఎస్‌పై పోరాడింది కూడా. ఎన్నికల విజయం
తర్వాత టిఆర్‌ఎస్ మంత్రివర్గంలో చేరి 2008 తర్వాతనే బయిటకు వచ్చింది.
తర్వాతి పరిణామాలు అందరికీ తెలిసినవే.2008లోనే చంద్రబాబు నాయుడు తమ పార్టీ
విధానాన్ని మార్చుకుని ప్రత్యేక రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు.
2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించడమే
అప్పటి అజెండాతప్ప ఉమ్మడి వేదికల్లో ఎక్కడా తెలంగాణా ఏర్పాటు నినాదంగా
రాలేదు. అయితే పొత్తు పెట్టుకున్న ఈ రెండు పార్టీల అవిశ్వాసం అవకాశవాద
పోకడల కారణంగా వైఎస్ బొటాబొటి మెజారిటీతో తిరిగి అధికారంలోకి రాగలిగారు.
తర్వాత ఆరునెలలకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, రాజకీయ అస్థిరత్వం
కెసిఆర్ నిరాహారదీక్ష, చిదంబరం డిసెంబర్9 ప్రకటన వంటివన్నీ బాగా తెలిసిన
విషయాలే. ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే ఈ మొత్తం పరిణామ క్రమంలో పాలక
పక్షాలైన కాంగ్రెస్ తెలుగుదేశం, బిజెపిల రాజకీయావసరాలే రాష్ట్ర విభజన వెనక
ప్రధాన పాత్ర వహించడం కనిపిస్తుంది. ఈ క్రమంలో కెసిఆర్ సందర్భాన్ని
ఉపయోగించుకున్న సంధాన కర్తగానే కనిపిస్తారు. అందుకే విభజన నిర్ణయం జరిగితే
కాంగ్రెస్‌లో విలీనమై పోతానని ఆయన పలు సార్లు ప్రకటించారు. ఇప్పుడు నేరుగా
కలిసినా బయిటనుంచి కలిసినా ఆయన అస్తిత్వం దానితోనే ముడిపడి వుంటుంది. ఇక
మిగిలిన మూడు పార్టీలూ రెండు ప్రాంతాల రాగం ఆలపిస్తూనే చేయవలసింది చేశాయి.
లోక్‌సభలోనూ రెండు ప్రధాన పార్టీలు కలిసే తతంగం నడిపించాయి. ఇక్కడ దేశాన్ని
చిన్న చిన్న రాష్ట్రాలుగా చేయాలన్న ప్రపంచ బ్యాంకు ప్రణాళిక ఒకవైపు,
ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలు చిన్నవైతే కేంద్రంలో తామే చక్రం తిప్పొచ్చన్న
పెద్ద పార్టీల ఆలోచన కనిపిస్తాయి. అంతే తప్ప విభజన చేస్తే లేక సమైక్యంగా
వుంటే వాటికవే సమస్యలు పరిష్కారమైపోవు. విధానాలు మారని విభజనలు విలీనాలు
సాధించేదేమిటనే ప్రశ్న మిగిలే వుంటుంది.
తెలంగాణాలో బలమైన రాష్ట్ర
కాంక్ష వుండొచ్చు. కోస్తా రాయలసీమల్లో కలసి వుంటే మంచిదన్న భావన అంతే
బలంగా వుండొచ్చు. రాజధాని హైదరాబాదు మరింత తీవ్ర వివాదంగా కొనసాగి
వుండొచ్చు కూడా. వాస్తవానికి ఇవన్నీ విధానాలతో ఆర్థిక నిర్ణయాలతో ముడిపడి
వుండేవే. ఏ మూడు పార్టీలైతే ఇప్పటి వరకూ కేంద్ర రాష్ట్రాలలో పాలన చేశాయో
వాటినుంచే కొత్తగా ఆశించే మార్పు ఏముంటుంది? విధానాల పరంగా వైఎస్సార్
పార్టీ కూడా వీటికంటే భిన్నంగా వుండేది కాదు.కాకపోతే ఆ మూడు పార్టీల వలె
గాక జగన్ పార్టీ.మలిదశలో సమైక్యత అన్న నినాదమే తీసుకుంది. కిరణ్ కుమార్
రెడ్డి కూడా సమైక్యవాదమే అంటున్నారు గాని ఆయన కిరణ్ కుమార్ రెడ్డి
స్థాపిస్తారో లేదో తెలియని పార్టీ కూడా భిన్నమైన వైఖరి తీసుకునే అవకాశం
వుండదు. కాకపోతే విజయావకాశాల వేటలో పదవీ కాంక్షాపరులు పరిభ్రమించే అవకాశాలు
చాలా వుంటాయి. ఎన్నికల సమీకరణలు పొందికలు కూడా పరిస్థితిని బట్టి
పలురకాలుగా వుండొచ్చు. ఈ సమయంలో తెలుగుదేశం బిజెపి పొత్తు, కాంగ్రెస్
టిఆర్‌ఎస్ పొత్తు లేదా విలీనం సూచనలు కనిపిస్తున్నాయి. అందుకోసమే
సీమాంధ్రకోసం తామేదో గొప్పగా సాధించినట్టు చూపించుకోవడానికి బిజెపి
నానాతంటాలు పడుతున్నది.
విభజన లేదా సమైక్యత అన్నవి కేవలం
ఉద్వేగానికి సంబంధించిన అంశాలు కాదు. వాటిని ముందుకు తెచ్చిన నాయకుల వైఖరి
కూడా అన్ని వేళలా ఒకే విధంగా లేదు కూడా. అధికారం కోసం పార్టీల ఆధిపత్యం
కోసం వారంతా అనేక విధాల కలసి వ్యవహరించారు. అందువల్లనే ప్రజలు కూడా ఈ
వాస్తవాలు గ్రహించాల్సి వుంటుంది. ప్రజాస్వామ్య శక్తులు ప్రాంతాల మధ్య
ఏర్పడే రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావం కాపాడటానికి రెండు చోట్లా సమస్యలు
పరిష్కరించుకుని అభివృద్ధి సాదించడానికి కృషి కేంద్రీకరించవలసి వుంటుంది.
ఇన్ని విధాల విన్యాసాలు చేసిన నాయకులు రేపు విభజన తర్వాత కూడా అనేక
వికృతాలకు పాల్పడటం తథ్యం. అలాటి వాటిపట్ల అప్రమత్తత అవసరం. ఈ సందర్భంగా
శాసనసభలోనూ పార్లమెంటులోనూ కానవచ్చిన అవాంఛనీయ పరిణామాలు పునరావృతం కాకుండా
చూసుకోవడం మరింత ముఖ్యం. గతంలో ఉప్పొంగిన ఉద్యమాలను రకరకాల దోవతప్పించిన
శక్తులు ఇప్పుడు తమ పాచికలు పారాయన్న రీతిలో చెలరేగి పోయే అవకాశం వుంటుంది.
అందుకే ప్రజాశక్తి గతంలో శీర్షిక నిచ్చినట్టు ప్రజలకు సంబంధించినంత వరకూ
ఒకటైనా రెండైనా పోరాటం అనివార్యం.