Pages

Thursday, March 31, 2011

52 గంటలు... 52.వాయిదాలు 

దాదాపు నెల రోజులకు పైగా జరిగిన శాసనసభ ప్రస్తుత సమావేశంలో చర్చలు 52 గంటలయితే వాయిదాలు 52. ఇంత ఉద్రిక్తంగా సభ జరపడానికి ఉపసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఎంత ఓపిక చూపించి వుంటారో వూహించవలసిందే. ఆఖరున ఆయనపైనా విమర్శలు వచ్చినా ఏదో నెట్టుకొచ్చారనే భావనే మిగిలించారని చెప్పాలి. బాగా ముగిస్తే అంతా బాగేనన్నట్టు ఆఖరు రోజున మంచి మాటలతో భూ కేటాయింపులపై సభా సంఘం గురించి సూత్రరీత్యా అనుకోవడం ఒక్కటే బాగున్న సంగతి. సమావేశాలకు మూలమైన బడ్జెట్‌ మాత్రం చర్చ లేకుండానే ఆమోదం పొందేయడం అన్నిటికన్నా
విడ్డూరం. వివిధ సంస్థలకు 45 వేల ఎకరాలు కేటాయించినట్టు స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఫిర్యాదులున్న చోట నిర్దిష్టంగా మాత్రమే సభా సంఘం పరిశీలన చేయొచ్చన్నట్టు మాట్లాడారు. తమ హయాంలో కేటాయింపులనూ సమీక్షించుకోవచ్చని తెలుగు దేశం అధినేత చెప్పారు. మరో వైపున భూ కేటాయింపులను గురించి మాట్లాడ్డమే వైఎస్‌ రాజశేఖర రెడ్డిపై బురద జల్లడమవుతుందనేది జగన్‌ వర్గంలో చేరిన కాంగ్రెస్‌, పిఆర్‌పి ఎంఎల్‌ఎల వాదన. ఇదంతా మ్యాచ్‌ ఫిక్సింగు అనేది వారి విమర్శ. చంద్రబాబు హయాంలో కేటాయింపులనూ విమర్శించవచ్చు గాని అక్కడే ఆగిపోయి వైఎస్‌ హయాంను తాకవద్దంటే ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవడం కష్టం.

బడ్జెట్‌ చివరి రోజున సమర్పించే కాగ్‌ నివేదిక అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణకే అద్దం పట్టింది. భారీ బడ్జెట్‌లో దాదాపు 25 శాతం అమలుకు నోచడం లేదని వెల్లడించింది. జమ పడని రాబడి 1700 కోట్లు. జలయజ్ఞంలో స్పష్టంగా తేలిన దుబారా దాదాపు 1400 కోట్లు. ఫలితం లేకుండా సాగుతున్న ప్రాజెక్టులపై వెచ్చించిన పెట్టుబడులు 36 వేల కోట్లు. ఇలా చెబుతూ పోతే వందల వేల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం కావడం పాలకులకు కళ్లు తెరిపించాల్సిన వాస్తవం. ప్రతిపక్షాలు ఆరోపించితేనో మీడియా ఎత్తిచూపితేనో తేలిగ్గా కొట్టి పారేసే ప్రభుత్వం ఇప్పుడు అత్యున్నత రాజ్యాంగ సంస్థ నివేదించిన ఆధారసహితమైన వాస్తవాలనైనా పట్టించుకుంటుందా అనేది సందేహమే. షరా మామూలుగా ఇది తుది నివేదిక కాదని, సమాధానాలు రాస్తామని ఏదో విధంగా సమర్థించుకునే యత్నమే ఎక్కువగా జరుగుతుంటుంది.ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 38 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం వాస్తవంలో ఏడు లక్షలపైగా మాత్రమే పూర్తిచేయగలిగిందని కాగ్‌ ఆధారాలతో సహా తేల్చిన లెక్క ఏలిన వారి అతిశయాలు ఏ మోతాదున వున్నదీ చెబుతుంది. ఇక విద్యపైన సగటు రాష్ట్రాల కన్నా కూడా మనం తక్కువ ఖర్చు చేస్తున్నామని మదింపు వేయడం కూడాకోతల సర్కారుపై వాత వంటిదే. ప్రభుత్వ పాఠశాలలు సిబ్బంది భవనాలు లేకుండా అఘోరిస్తున్నాయనీ తేలింది. పంచాయితీలను విశాఖ ఉడా వంటి నగరాభివృద్ధి వ్యవస్థలనూ కూడా సక్రమంగా నడిపించడం లేదనీ సోదాహరణంగా నిరూపించింది. భూముల కేటాయింపులోనూ ఉద్దేశిత లక్ష్యాలు నెరవేరడం లేదని అభిశంసన మొదట చెప్పుకున్న చర్చను బలపర్చే అంశం. ఇలా చెప్పుకుంటూ పోతే కాగ్‌ నివేదికలో ప్రతి పరిశీలనా అస్తవ్యస్తంగా సాగుతున్న ఆంధ్ర ప్రదేశ్‌ పాలనా పరిస్తితికి ప్రతిబింబమే. జవాబుదారీ తనం లేని జమానాకు సాక్ష్యమే. ఇన్నిటి తర్వాత కూడా భూ పందేరాలపై దర్యాప్తును వైఎస్‌ వ్యతిరేక చర్యగా మాత్రమే చూపించడం సాధ్యమూ కాదు, సముచితంగానూ వుండదు. సెజ్‌ల కోసం కేటాయించిన భూములలో నిజంగా ఉత్పత్తి ఉపాధి లభిస్తున్నదెంతనే ప్రశ్నకు పసిపిల్లలైనా జవాబు చెప్పగలరు.75 శాతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అవకాశం ఇవ్వడమే గాక చుట్టుపక్కల భూములను కూడా నయానో భయానో కలిపేసుకునే వీలు కల్పించడం వల్ల వ్యవసాయం దెబ్బ తినిపోయి సెజ్‌లు ప్రత్యేక ఆర్థిక మండలాలుగా గాక ఆక్రమణ మండలాలుగా తయారయ్యేయనేది అనుభవం. ఇందుకోసం వాటికి సుంకాలు పన్నుల రాయితీలు, కార్మిక చట్టాల అమలు నుంచి మినహాయింపు, ఈ ఏకపక్ష భూ సంతర్పణలపై సమీక్షలే జరపకపోతే ఇక జవాబుదారీ తనం అన్నమాటకే అర్టం వుండదు. ఇందులో ఎవరి దోషం ఎంత అన్నది తర్వాతి మాట.
సభా సంఘానికి ముందు రోజున మంత్రి వివేకానందరెడ్డి ప్రతిపక్ష సభ్యుల ప్లకార్డులు చించేయడం, చేయి చేసుకోవడం, ఆ పైన వారు కలబడటం వగైరా ఘటనలు మర్చిపోకూడని వికృత అధ్యాయాలు. ప్రజాస్వామ్య ప్రమాణాలకే విఘాతాలు. వైఎస్‌ భూమి వదులుకుంటున్నట్టు ప్రకటించినప్పుడు ఆయనను వినోబాతో పోల్చారు భక్తులు. ఆయన ఒక వివాదం సందర్బంలో మాట్లాడుతూ తమ్డుణ్ని వివేకానంద స్వామి అంటారని అంత సౌమ్యుడని సెలవిచ్చారు. మరి అంత సౌమ్య స్వాములు ఆగ్రహౌదగ్రులై దాడికి దిగారంటే ఎంత బలమైన కారణాలుండాలి? ఆవేశంతో అలా జరిగిందని ఆయన అంటే అంతా అభినయమేనని కొట్టి పారేస్తున్నారు దాయాది సైన్యాధిపతులు. ఇందులో జగన్‌ ప్లస్‌ వివేకాలది మ్యాచ్‌ ఫిక్సింగని తెలుగుదేశం అంటే పాలక ప్రధాన ప్రతిపక్షాలదే మ్యాచ్‌ ఫిక్సింగని జగనీయులంటే సామాన్య జనానికి మాత్రం ఏది నిజమో ఏది కాదో తెలియక జట్టు పీక్కోవలసిన స్తితి. మొత్తంపైన నేటి రాజాకీయల్లో బహుముఖ మ్యాచ్‌ ఫిక్సింగులు అన్నది నిర్వివాదాంశం. అవి వ్యూహాత్మక అవగాహనలంటే మరింత మర్యాదగా వుంటుంది. ఆవేశానికి కారణం ఏమైనా తర్వాత క్షమాపణ చెప్పడం, ముఖ్యమంత్రి కూడా గొంతు కలపడం మంచిదే. ఈ సందర్భంగా అందరికీ అనివార్యంగా సభారంభం నాటి సన్నివేశాలు గుర్తుకువచ్చాయి.
గవర్నర్‌పై దాడి, దాన్ని తన శైలిలో ఖండిస్తున్న జయప్రకాశ్‌నారాయణ్‌పై దాడి ఇవి అందరి ఖండనలకూ ఆ పైన సస్పెన్షన్లకూ దారి తీశాయి. తెలంగాణా తెలుగుదేశం సభ్యులు తమలో తాము భిన్న స్వరాలు వినిపించడం, చివరి వరకూ సభలో టిఆర్‌ఎస్‌, తెలుగు దేశం తెలంగాణా ప్రాంత సభ్యులు లేకుండా జరిగిపోయాయి. ఇక సభ బయిట విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలు ఉద్రిక్తతను మరింత పెంచాయి. శాసనమండలి ఎన్నికల్లో జగన్‌ వర్గం తీరు వూహించిందైనా టిఆర్‌ఎస్‌ సభ్యులు క్రాస్‌ ఓటింగు ఫలితంగా పార్టీ వేటుకు గురి కావడం మరో విపరీత పరిణామం. శాసనమండలికి పట్టభద్రుల స్తానాల్లో యుటిఎప్‌ ఆధిక్యత నిలపుకున్నా దానికి పెద్ద ప్రాధాన్యత నివ్వలేదు గాని స్తానిక సంస్తల ఎన్నికల్లో పాలక పక్షం సగానికి సగం స్తానాలు కోల్పోవడం ఎదురు దెబ్బ అయింది. ఇదే సమయంలో శ్రీకృష్ణ కమిటీ రహస్యాధ్యాయం రభస మొదలై ంది. మత సంబంధాలు, మావోయిజం వంటి వాటి గురించి చర్చలో వున్న విషయాలనే రహస్యంగా నివేదించడం ఎందుకనేది ఒక ప్రశ్న. అంతకన్నా పార్టీల గురించి, విద్యా సంస్తల గురించి మీడియా గురించి ఆశాస్త్రీయ ధోరణిలో అనుచిత అయాచిత వ్యాఖ్యలు గుప్పించడం విస్మయం కలిగించింది. దీన్ని వెల్లడించే విషయమై తీర్పులోని వ్యాఖ్యల్లోనూ వైపరీత్యాలు చోటు చేసుకున్నాయి. ఇంతకూ కమిటీ నివేదిక అందిన తర్వాత తన అభిప్రాయం చెప్పకుండా కావాలని వివాదాలు ఉద్రేకాలు పెంచుతున్న కేంద్రం ఎత్తుగడ శాసనసభ సమావేశాలను ఆదినుంచి అనిశ్చితిలో ముంచేసిందనేది అసలు వాస్తవం. దాన్ని ఆసరా చేసుకుని ఎవరి ప్రయోజనాల ప్రకారం వారు ప్రవర్తిస్తుంటే ప్రజాసమస్యల చర్చకు గ్రహణం పట్టింది. ప్రతిష్టంభనే నిత్యకృత్యమైంది. అలాటి పరిస్తితి అధికార పక్షానికి ఆనందకరమే అనుకుంటే సభకు సమాంతరంగా బి.వి.రాఘవులు తదితరుల నిరాహారదీక్షల వల్ల దళిత గిరిజన సమస్యల వంటివాటిపై కొంతయినా దృష్టి మరల్చినట్టయింది. ఆ హామీలతోనే ఆగిపోకుండా అవి వాస్తవ రూపం దాల్చేందుకు కృషి కొనసాగుతుందని ఆశించాలి. రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ఈ సమస్యలపై కలసికట్టుగా స్పందించేందుకు ఎలాటి తేడాలు అడ్డం కానక్కర్లేదు. ప్రాంతీయ పరమైన కోర్కెలు ఏవైనా వాటితో సంబంధం లేని దైనందిన జీవిత సమస్యలపై సమిష్టి కృషికి అభ్యంతరాలు అవసరం లేదు.అలాటి పోరాటాలే ఈనాటి అనిశ్చిత వాతావారణానికి విరుగుడు చూపిస్తాయి.అంగన్‌ వాడీల జీతాల పెంపులోనూ,కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాల నిర్ణయంలోనూ ఈ పోరాటాల విజయం మనకు కనిపిస్తుంది. ఇవి గమనించలేని వారికి అంతా శూన్యంగానే తోస్తుంది. అనిశ్చిత వాతావరణంలోనూ ఆరోగ్యకరమైన ఆచరణను ప్రోత్సహించడం ద్వారానే ప్రజాస్వామిక చైతన్యం పెంపొందుతుంది.

(ఆంధ్రజ్యోతి-గమనం శీర్షిక- 31,3,11)

1 comment:

  1. I am agree with you. every one playing their games. no one care about public.... including central and Sri krishna comity also...

    ReplyDelete