Pages

Thursday, April 28, 2011

ఆధ్యాత్మిక ముద్రతో అతీత రాజ్యాలా?




దాదాపు పదిహేను రోజుల పరస్పర విరుద్ధ కథనాల తర్వాత పుట్టపర్తి సాయిబాబా భౌతిక కాయం మహా సమాధి చేరింది. భగవత్‌ స్వరూపుడు ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు భగవంతుడే గనక ఆయనకు మరణం లేదని ఇప్పటికే మరో చోట పుట్టి వుంటాడని నమ్మే వారికి లోటు లేదు. తొంభై ఆరేళ్లు బతుకుతానన్న బాబా పదేళ్లు ముందే పయనం కట్టాడేమిటని అడిగేవారికి తెలుగు నెలల లెక్క సిద్దంగానే వుంది. పరమ పురుషులైనా పాంచభౌతిక కాయం వదలిపెట్టడం తప్పదనే ఓదార్పు మరో వైపు. అయితే అధునాతన వైద్యం ఆఖరు వరకూ ఎందుకు ఇచ్చారంటే అది ఆయన కోసం కాదు, మన కోసం అని మరో వివరణ. ఏమైనేతేనేం, మహత్వాల సంగతి అటుంచి మనిషిగానూ
కోట్ల మందిని మెప్పించి రప్పించుకోగలిగాడు. మహత్యాల కన్నా మహనీయమైంది మానవ సేవ అన్న అవగాహనతో సత్కార్యాలకు సహాయం అందించి సార్థక జీవి అనిపించుకున్నాడు. సాయి కుల్వంత మందిరంలో ఆయన సమాధి భవిష్యత్తులో మరో యాత్రా స్థలి కావడానికి ఇవి సరిపోతాయి. పైగా నిర్వహణ సామర్థ్యం గల పాలక మండలి వుంది. సహకరించే పాలకవర్గాలూ వున్నాయి. కనక ఇక ముందుకూడా పుట్టపర్తి పుట్టలో వేలు పెట్టడం ఎవరి వల్లా కాకపోవచ్చు.

మీడియాలో మూడు రోజులూ బాబా ఘన కీర్తనలే పొంగిపొర్లాయి గనక వాటిని ఏకరువు పెట్టాల్సిన అవసరమేమీ లేదు. 70 వ దశకంలో బ్లిట్జ్‌ కరెంట్‌ పత్రికల మధ్య నడిచిన యుద్దంలో సాయిబాబా ఆశ్రమానికి సంబంధించిన సత్యాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అవతార పురుషుడి లీలలపై చాల సార్లు వివాదాలు చెలరేగాయి. అబ్రహాం కోవూర్‌ వంటి హేతువాదుల సవాలును ఏ నాడూ ఆయన స్వీకరించలేదు.. మరో వంక జన విజ్ఞాన వేదిక సామాన్య కార్యకర్తలు కూడా బాబా తరహాలో విబూది సృష్టించి ఇవ ్వడం, నోట్లోంచి లింగాలు తీయడం చేసి చూపించారు. ఇకముందూ చూపిస్తారు.ఇప్పుడు బాబా గురించి గొప్పగా చెప్పే వారు కూడా ఆయన మహిమల కన్నా మానవ సేవనే ఎక్కువగా ప్రస్తావించడానికి కారణం అదే. బాబా ముందు హేతువాదం ఓడిపోయిందని ఎవరు మురిసిపోయినా ఆయన అస్తమయ ఘటనలతో సహా అనేకం విజ్ఞాన శాస్త్ర విశ్లేషణలకు అనుగుణంగానే వున్నాయి.
బాబాను పూజించడం నమ్మడం వారి వారి భావాలకు సంబంధించిన అంశం. కాని ఆయన ఆనారోగ్యానికి ముందు వెనక జరిగిన అనేక ఘటనలు మాత్రం లౌకిక ప్రపంచ సంబంధమైనవి. ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి దీనిపై లేవనెత్తిన ప్రశ్నలూ చిన్నవి కావు. మీడియా సంచలనం కింద వాటిని తోసి పారేయవచ్చు గాని అన్ని కోట్ల మందికి ప్రియతముడైన వ్యక్తి ఆఖరి ఘట్టంపై అనుమానాల నీలినీడలు అలుముకున్న మాట నిజం. బాబాను తమ ఆస్పత్రిలో చేర్చిన నాటి నుంచి మాత్రమే తము బాధ్యత వహిస్తాము తప్ప అంతకు ముందు ఏం జరిగింది, ఏమిచ్చారు అనేది తనకు తెలియదని సత్యసాయి వైద్యసంస్థ అధిపతి, చికిత్స బాధ్యుడు డా.సఫాయి అధికారికంగానే ప్రకటించారు. మామూలు మనుషులు కూడా చిన్న చిన్న చికిత్సల కాగితాలు తీసిపెట్టుకునే ఈ కాలంలో బాబా వైద్య చరిత్ర ఎందుకని అందించలేదు? చివరి నిముషంలో గాని ట్రస్టు ఎందుకుని అధికారిక ప్రకటన చేయలేదు?ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్లిన మంత్రులు రాష్ట్ర ఉన్నతాధికారులు తాము కేవలం పక్కనుంచి పరిశీలించేవాళ్లమే తప్ప నిర్ణేతలం కాదన్నంత నిస్సహాయంగా నిర్బాధ్యతగా ఎందుకు వ్యవహరించారు? మరణించిన తర్వాత ప్రభుత్వ లాంచనాలు ప్రకటించిన వారు అఈ్యవసర చికిత్స సమయంలో ఎందుకు ఆ విధమైన సాధికార పాత్ర పోషించలేదు?
చాలా చర్చలలో ఇలాటి విషయాలు వచ్చినపుడు బాబాకు ఏమీ కాదని లక్షణంగా బతికి వస్తారని చెప్పిన వారున్నారు. ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమేనని నమ్మిన వారున్నారు. వారితో పాటే కొద్దిమందైనా బాబాకు కూడా ఇవన్నీ తప్పలేదేమిటని అలోచించిన వారూ వుండకపోరు. అంతకంటే ఆయన భౌతిక కాయం కూడా మిగిలిన వారిలాగే సాదారణమైన మార్పులకు గురి కావడం గురించి కొందరు ప్రశ్నలు అడిగారని మీడియాలో కథనాలు వచ్చాయి. బాబాను షిర్ది సాయిబాబా అవతారం కొనసాగింపుగా చెబుతామంటే షిర్ది ట్రస్ట వారు ఒప్పుకోలేదు. బాబా అంత్యక్రియల తీరు పైనా కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. ట్రస్టు పేరిట ఆఖరి నిముషంలో వచ్చిన ప్రకటన తప్పిస్తే అందరూ ఒద్దికగా కనిపించింది గాని, ప్రకటించింది గాని శూన్యం. ఇవన్నీ దేన్ని సూచిస్తాయి? 1993లో ఆయనపై హత్యాప్రయత్నం జరిగినట్టు ఆ కాల్పుల్లో కొందరు మరణించినట్టు తొలి వార్తలు వచ్చాయి. తర్వాత వాటి కొనసాగింపు లేనేలేదు. ఇదంతా ఒక అమ్మాయి కోసం జరిగిందని నాటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ తనకు మాలిన ప్రకటన చేశారు.దేశాధినేతలే ఈ విధంగా కితాబులిస్తుంటే పోలీసులు ఆ ప్రాంగంణంలో ప్రవేశించదమనే ప్రసక్తి ఎక్కడిది? ఏతావాతా అదోక సమాంతర సామ్రాజ్యమైంది. ఇండియా టుడే దాన్ని ఆధ్యాత్మిక పరిశ్రమ అని అభివర్ణించింది. జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ణయ్యర్‌ కూడా అలాటి పదమే ఉపయోగించాడు. తెలుగు వారి తెరవేల్పు ఎన్‌టిఆర్‌ కోడలు దిద్దిన కాపురంలో కపట బాబాలను ఎండగట్టాడు. ఒక దశలో సంఘ పరివార్‌పైన కూడా బాబా స్వల్ప విమర్శలు చేయడం, దానిపై వారు విరుచుకుపడటం చూశాం. ఇవన్నీ భక్తి భావాలకు లోటులేని వర్గాల నుంచే జరిగినవి.
మానవ సేవే మాధవ సేవ అన్న వివేకానందుడు స్వాముల చుట్టూ తిరగనవసరం లేదని కూడా నొక్కివక్కాణించాడు.కపట బాబాల గురించి జాగ్రత్త వహించాలని పుట్టపర్తి బాబానే ఒకసారి హెచ్చరించారు. దేశంలో ప్రసిద్ధి గాంచిన స్వాములూ పీఠాధిపతులు పుట్టపర్తి సందర్శించిన దాఖలాలు నామమాత్రం. దాన్ని వారి ఈర్షాఫలితంగా చెప్పేవారూ వున్నారు. అదే నిజమైతే అప్పుడు ఆశ్రమాలు కూడా సాధారణ లక్షణలకు అతీతం కాదని చెప్పాల్సి వస్తుంది. తమిళనాడులో ప్రేమానంద బాబా ఒక నేరంలో శిక్షకు గురైనాడు. మంగమ్మవ్వ జైలు పాలైంది.కల్కి ఆశ్రమంలో నిర్వాకాలపై కథలే వచ్చాయి.కంచి స్వామి జయేంద్ర సరస్వతి హత్య కేసులో బోనెక్కారు. ఇతర మతాలకు చెందిన వారు కూడా ఇలాటి ఉదంతాలలో దొరికి పోయిన ఘటనలున్నాయి. ముమ్మిడివరం బాలయోగి మరణం మూడు రోజుల పాటు వివాద గ్రస్తంగా నడిచింది. వారికీ బాబాకు పోలిక లేదని వాటిని చెప్పడమే అజ్ఞానమని అనేకులు ఆగ్రహిస్తారు. బాబా చేసిన సేవలను ఇచ్చిన విరాళాలను మాత్రమే చూడమని కొందరంటారు. దేశంలో ధార్మిక దృష్టి కలవారందరినీ దేవుళ్లుగా కొలవడం లేదు. ఆస్పత్రులు విద్యా సంస్తలు కట్టించిన దాతలు చాలా వూళ్లలో వున్నారు. ఆ మాటకొస్తే కళంకిత చరిత్రులైన వారు కూడా చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసిన ఉదాహరణలు అనేకం వున్నాయి. ఇప్పుడు పుట్టపర్తి ట్రస్టుకు వున్న లక్ష కోట్ల పైబడిన సంపదతో పోలిస్తే ఆయన అనంతపురం నీటి పథకానికి గాని మరో దానికి గాని ఇచ్చింది శతసహస్రాంశం కూడా కాదు. దానికి దైవత్వానికి సంబంధమేమిటి? బాబా తమను బంగారు అని పిలిచి సాధారణ విషయాలే మాట్లాడినట్టు చాలా మంది ప్రముఖులు వెల్లడిస్తున్నారు. ఆయన దగ్గర బంగారు విగ్రహాలు రథాలు సింహాసనాలు కూడా వున్నాయంటే వేదాంత ధర్మంలో చెప్పే నిరాడంబరత్వం నిష్కామ కర్మ భక్తుల ఒత్తిడి వల్ల మానేశారని అనుకోవాలా?

సాయిబాబా అస్తమించిన ఈ సమయంలోనైనా వీటిని చెప్పుకోకపోతే ఆయన పేరిట రేపు మరిన్ని మర్మకర్మలు సాగే అవకాశముంటుంది.వివిధ రంగాల్లో తారలు ఎందరు చేరినా ప్రేక్షక పాత్ర తప్ప జోక్యం వున్నట్టు కనిపించదు. ప్రభుత్వ ప్రదాన ప్రతిపక్ష నేతలు వాణిజ్య ప్రముఖులు అలా బేజోక్యంగా వుండటానికి చాలా కారణాలు. ట్రస్టును స్వాధీనం చేసుకోవాలా లేదా అనేదానిపై అనేక మీమాంసలు. దీనికి సంబంధించి పొరుగు రాష్ట్రాల కుట్రలను మనం వమ్ము చేయాలని చెప్పే వారు మరికొందరు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి. సాయిబాబా సందేశం ప్రేమ సేవ మాత్రమేననే వారు కూడా నిజంగా ఆ మాటలపై గౌరవం వుంటే సాటి మానవుల సేవకు నడుం కట్టాలి. అంతే గాని అంతు చిక్కని ఆశ్రమాలలో చిక్కుకుపోనవసరం లేదు. ప్రజాస్వామ్యం లౌకిక రాజ్యాంగ సూత్రాలపై నడుస్తున్నది గనక భక్తి పేరుతో గాని మహిమల పేరుతో గాని దేశంలో సమాంతర రాజ్యాల ఏర్పాటును అనుమతించడం హానికరం. అక్రమార్జనలు అభద్రతలూ తాండవిస్తున్న ఈ కాలంలో చట్టానికి ప్రజా తనిఖీకి లోబడని సువర్ణద్వీపాలను కొనసాగనిస్తే స్వార్థ శక్తులు వాటిని దుర్వినియోగ పర్చేప్రమాదం చాలా వుంటుంది.


7 comments:

  1. బాబా సేవనో/మహిమలనో నమ్మి సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తారని నమ్మి ఇచ్చిన లక్షలకోట్ల రుపాయల విరాళాలను ప్రజాహిత కర్యక్రమాలకు కాకుండా స్థిర ఆస్తులుగా/బంగారంగా మలుచుకొని కూడబెట్టిన దానిలో నామమాత్రపు సొమ్మును ప్రజాహిత కర్యక్రమాలకు వెచ్చించడమే లోకకల్యాణము నెరవేర్చడంగా చిత్రీకరించడం. ట్రస్ట్‌ దగ్గర వున్న సొమ్ము బాబా మహిమలతో సృష్టించినది కాదు ప్రజల డబ్బే. నిజంగా మహిమలుంటే విరాళాలు సేకరించడం దేనికి? మహిమలతో బంగారం సృష్టించేబదులు, పేదప్రజలకు ఆకలనేదే లేకుండా చెయొచ్చుకదా?
    ఇటువంటి నీచపు సామ్రాజ్యాన్ని హిందూ ధార్మికతతో ఎలాముడిపెడుతున్నరో కుహానా హిందూత్వవాదులు చెప్పలి.

    ReplyDelete
  2. భక్తి పేరు చెప్పకపోతే విరాళం ఇవ్వని స్థితిలో ఉండడం సామాజిక దుస్థితి
    ---కాదా?------------------------------------

    అసలు ప్రభుత్వ౦ చెయ్యలేకపోవడ౦, ఎవరో బాబా పేరు తో చెయ్యగలగడ౦ అన్నది ఈ సమాజ౦ ఎదుర్కోవలసిన మొదటి అవమాన౦ బాబాను దేవుడు చేస్తే.

    మరి అ౦త దేశ సేవ చేసి, చివరి రూపాయ వరకు పెట్టి ఊరు నే మలచిన హజారే ఎ౦దుకు కాలేదు దేవుడు. అ౦టే దేవుడూ అనిపి౦చుకోవాల౦టే కనీస డిపాజిట్ ట్రస్ట్ రూప౦ లో చూపాలా?

    మరి ఆ కనీసమొత్త౦ ఎ౦తో చెబితే, హజారే కి ఏర్పాటు కాదా?

    సరే, బాబా అ౦త సమర్ధుడని తెలిసిన రోజునన్నా ప్రభుత్వాన్ని వారి ఆధీనముకు ఇవ్వకు౦డుట అదేమి పద్దతి??? లేదా ప్రభుత్వానికి, ప్రజలకి అక్కడి అభివృద్ది కనిపి౦చీ, చేతగాని వాళ్ళని పి౦చుకోవడానికి సిగ్గుపడట౦ లేదు కాబట్టీ అతను దేవుడా?

    బాబా దేవుడు మరియు ప్రజలు వెధవలు అని చెపితే సరే అనాలన్నమాట

    మొదటి లైను , ప్రవీణ్ శర్మ అభిప్రాయ౦ ను౦డి తీసికోబడ్డది.

    PS: ఆ ట్రస్ట్ వ్యవాహారాలు, ఆ డబ్బులు కట్టకట్టి గోదాట్లో వేసినా ఈ ప్రశ్నలు ఉ౦టాయి. కాబట్టి మీరు ఇవ్వలేదు గా అని తలతిక్క వాదనలు చెయ్యొద్దు.

    ReplyDelete
  3. రవి గారు, ఇందులో మీడియా తప్పు లేదంటారా? చిల్లర బాబాల బండారాలు బయట పెట్టి సాయిబాబాలని వదిలేసే మీడియా స్థాయి బేధాలు పాటిస్తోందని తెలియడం లేదా? మీరు మీడియా ప్రతినిధి కాబట్టి ఈ విషయం ఆలోచించండి. ప్రజాశక్తి కమర్షియల్ పేపర్ కాదు కానీ కమర్షియల్ మీడియా ధోరణులని విమర్శించాల్సిన బాధ్య నాన్-కమర్షియల్ మీడియాకి ఉంది.

    ReplyDelete
  4. @praveen

    you are right. you may add the role of media virtually at the end of every item . But in case of Saibaba media exposed him several times but the rulers shielded the Puttaparti ashram till the last. for it's own interest media plays dual role..

    ReplyDelete
  5. చిల్లర బాబాల దగ్గరకి ఎంత మంది వెళ్తారు? చిల్లర బాబాల బండారాలు బయట పెడితే మూఢ నమ్మకాలు పోవు. ఒక బాబా బండారం బయట పడితే జనం ఇంకో బాబా దగ్గరకి వెళ్ళడం చూస్తూనే ఉన్నాం కదా.

    ReplyDelete