తెలంగాణా పేరిట నాటి నిజాం రాజు నిరంకుశత్వాన్ని ఈనాటి కార్పొరేట్ రాజకీయాన్ని కూడా సమర్థించడం ద్వారా టిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు గతాన్ని వర్తమానాన్ని కూడా గందరగోళ పరచేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాడు ఆయన పోలవరం టెండర్లపై పత్రికాగోష్టిలో చేసిన వ్యాఖ్యలు, అదే రోజు సాయింత్రం ఒక పుస్తకావిష్కరణ సభలో వెలిబుచ్చిన భావాలు ఆ దిశలోనే వున్నాయి.
తెలంగాణా సంసృతి, చరిత్రల గురించి పదే పదే ప్రస్తావించే కెసిఆర్ వంటి వారు ఆ చరిత్రను ఆజరామరం చేసిన వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని గౌరవించేవారైతే ఇలా జరిగేది కాదు. విగ్రహాల విషయం వచ్చినప్పుడు అయిలమ్మ, కొమరయ్యల పేర్లు స్మరించేవారు నిజంగా వారు ఎవరిపై ఎందుకు పోరాడారో తెలియనట్టు నిజాంను కీర్తిస్తున్నారని అనుకోలేము.
ఓ నిజాం పిశాచమా! కానరాడు
నిన్ను పోలిన రాేజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణా కోటి రతనాల వీణ అని దాశరథి నిజాం జైలు గోడలపై బొగ్గుతో రాశాడు! మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని నిప్పులు కక్కాడు.
చుట్టుపట్ట సూర్యాపేట
నట్టనడుమ నల్లగొండ
ఆవాల హైద్రాబాదు
తర్వాత గోలకొండ
గోలకొండ ఖిల్లా కింద -
నీ గోరి కొడతాం కొడకో
నైజాం సర్కరోడా!
ఆనాడు తెలంగాణా పోరాట యోధుడైన ప్రజాకవి యాదగిరి రాసిన గీతం ఆయన తుపాకి గుళ్లకు నేలకొరిగినా ఇప్పటికీ జనాన్ని వుర్రూతలూగిస్తుంది.
నీ గోరికాడకొచ్చి
నేను మొక్త కొడకో అని పాడుకోవలసిన పరిస్థితి కెసిఆర్‌కు ఎందుకు కలిగింది? నాలుగేళ్ల కిందట ఆయన నిజాం వర్ధంతికి హాజరై ప్రశంసలు కురిపించినపుడు నిజమూ నిజామూ పేరిట రాసిన వ్యాసంలో నేను అడిగిన ప్రశ్న