ఔను. డిజిపి దినేష్ రెడ్డి నియామకం కొట్టి వేస్తూ మొదట క్యాట్ తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు లేవనెత్తుతున్న ప్రశ్న ఇది. ఈ వ్యవహారంలో అయిదు వేల జరిమానా కూడా సర్కారు చెల్లించాల్సి రావడం పరువు తక్కువ కాదా? దినేష్ రెడ్డి వ్యవహారానికి ముందు కూడా ఇలాటి తగాదాలు రెండు మూడు సార్లు వచ్చాయి. రకరకాల ప్రహసనాలకు దారి తీశాయి. వైఎస్ హయాంలోనైతే పదే పదే మార్పులు కూడా జరిగాయి. ఇన్ని అనుభవాల తర్వాత ఈ ప్రభుత్వం ఎందుకు అదే తప్పు పునరావృతం చేసింది? విధేయులు విశ్వసనీయులు వుండాలనుకుంటే ఎవరు మాత్రం అందులో వెనకబడతారు? అసలు పోలీసులు సైన్యం అధికారులెవరైనా చేయాల్సింది రాజ్య రక్షణే కదా! కనక అందులో కొద్దిపాటి వ్యక్తిగత పక్షపాతాలు వివక్షతలకు లోను కావలసిన అవసరం అసలే లేదు. సీనియర్ అధికారుల ప్యానల్ రూపొందించి అందులో ఒకరిని ఎంపిక చేసి కనీసం రెండేళ్లు కొనసాగే అవకాశం ఇవ్వాలన్నది ఇప్పటి వరకూ కమిషన్లు చేసిన ప్రధాన సిఫార్సు. సుప్రీం కోర్టు ఆమోదించిన విధానం.ఆ క్రమంలో ఏవైనా విభేదాలు వస్తే ఏకాభిప్రాయానికి
ప్రయత్నించాలి. అసంతృప్తులను ఇతర విధాలుగా గౌరవించి ఒప్పించాలి. అంతేగాని ఏకపక్షంగా నియమించడం, తర్వాత దానిపై ఎడతెగని వివాదం ఎవరికి గౌరవం? అసలే రాజకీయ అనిశ్చితి పాలనా ప్రతిష్టంభన చాలక పోలీసు యంత్రాంగంలోనూ పోరు పెట్టడం ఎందుకు? ఇలా పదే పదే తొలగింపు ఉత్తర్వులను ఎదుర్కొన్న ఉన్నతాధికారులు అనివార్యంగా అనుగ్రహం కోసం అధినేతలపై ఆధారపడవలసి వస్తుంది. అది ఆ స్థానానికి వుండాల్సిన హుందా తనాన్ని కూడా పోగొడుతుంది. 1977లో పోలీసు సంస్కరణల కమిటీ,1979 కమిటీ, 1998లో వినీత్ నారాయణ్ కేసు, 2006లో ప్రకాశ్ సింగ్ కేసు వంటి వాటిలో అత్యున్నత న్యాయస్థానం అభిశంసనలు ఆదేశాల తర్వాత కూడా ఈ ప్రభుత్వాలు పద్ధతి మార్చుకోవడం లేదు. నిజానికి సూపరెండెంటు స్థాయి గల పోలీసు అధికారులందరి నియామకాలు బదిలీలు పారదర్శకంగానూ పటిష్టంగానూ వుండాలని సుప్రీం ఆదేశం. జరిగేది మాత్రం అందుకు భిన్నం. అసంతృప్తితగౌతం కుమార్ నిష్క్రమించారు గనక సాంకేతికంగా ప్రస్తుత డిజిపినే కొనసాగే అవకాశం వుండొచ్చు గాని అది ప్రధాన సమస్య కాదు. ఈ చర్చ కేవలం వ్యక్తిగతంగా దినేష్ రెడ్డికి సంబంధించిందీ కాదు. భద్రత, పోలీసుల సమర్థత,హక్కుల కల్పన వంటి అనేక కోణాలతో ముడిపడి వుంది. ఇటీవల ప్రత్యేక పోలీసుల భార్యలు ఒక్కసారిగా తిరగబడిన తీరు కూడ చాలా పాఠాలు నేర్పిందని గుర్తించాలి.
దినేష్ రెడ్డి మాత్రమె కాదు గతంలో ఆంజనేయ రెడ్డికి కూడా మొట్టికాయలు పడ్డాయి. మానవుల హక్కుల సంఘం PSR ఆంజనేయులు పై అభిశంసన చేసినా పట్టించుకొనే నాథుడే లేదు. స్టీఫెన్ రవీంద్ర పైన కూడా తీవ్రమయిన అభియోగాలు ఉన్నాయి. నరహింసన్ గా ముద్ర పడిన వ్యక్తి ప్రధమ పౌరుడి హోదాలో ఉన్నారు. పైగా మీడియాలో వీరికి వీరాభిమానులు ఉన్నారు.
ReplyDeleteపోలీసులు ప్రజలకు రక్షణ కలిపించాలి కానీ వినాయకులకు కొమ్ము కాయకూడదు. They should remember they are "public servants", not just "Govt. officers".