Pages

Saturday, August 4, 2012

అన్నా రాజకీయం- అంతా అస్పష్టం!



అపర గాంధీ స్థాయిలో ప్రచారం పొందిన అవినీతి వ్యతిరేక ఉద్యమ కారుడు అన్నా హజారే రాజకీయ వేదిక స్థాపిస్తానని చేసిన ప్రకటనపై పెద్ద హర్షాతిరేకం వ్యక్తం చేసిన వారెవరూ లేరు. కాని ఆయన గత వైఖరికీ దీనికి మధ్య వ్యత్యాసం పట్టి చూపినవారు,ఆ వేదిక భవిష్యత్తుపై నిర్లిప్తత వ్యక్తం చేసిన వారు చాలా ఎక్కువ. అత్యధిక ప్రచారం పొంది ప్రభంజనంలా కనిపించిన ఒక వ్యక్తి కేవలం ఒక ఏడాది కాలంలో ఇంత పేలవమైన ప్రతిస్పందనతో మిగిలిపోవడం అరుదే అయినా అసహజం కాదు.వ్యవస్థాగత అంశాలు వదిలిపెట్టి వ్యక్తిగత పోకడల చుట్టూ పరిభ్రమిస్తే కలిగే ఫలితం ఇలాగే వుంటుంది. వ్యక్తులు స్వీయారాధనలో పడిపోయి ఇచ్చానుసారం అన్ని జరిగిపోతాయనుకుంటే పరిస్థితి తలకిందులవుతుంది. అన్నా హజారే ఒకటికి రెండు సార్లు నిరాహారదీక్షలు ప్రకటించడం, విరమించడం,ఆ దీక్షా శిబిరంలో బృంద సభ్యుల మధ్యనే విభేదాలు కనిపించడం ఇవన్నీ మెరుపును తగ్గించేశాయి. వాస్తవానికి మొదటి నుంచి ఆయన ఆందోళనలో వైరుధ్యాలకు లోటు లేదు. బ్లాగులో నేను హజారే దీక్ష హజార్‌ సవాళ్లు అంటూ మొదట్లోనే రాశాను. ఇటీవల కూడా మళ్లీ సందేహాలు వ్యక్తం చేశాను.ఇప్పుడు ఆ క్రమం పూర్తయిందని
భావించవచ్చు.
.ఇప్పటికే రాజకీయ రంగ స్థలంలో ఎన్‌డిఎ యుపిఎ,, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు వుండగా ఈ కొత్త వేదిక అదనంగా చేసేదేమిటన్న ప్రశ్న ఒకటి. అవినీతి వ్యతిరేకత ఒక మంత్ర జపంలాగా చేస్తూ సరళీకరణ విధానాలు, మతతత్వం, సామ్రాజ్యవాదం, సామాజిక అణచివేత వంటి విషయాలు పట్టించుకోకపోతే ఫలితం ఏమిటన్న ప్రశ్న మరొకటి. రాజకీయాల్లోకి రావడం రాజ్యాంగ హక్కు అయినా ఈ ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు తీసుకునే ప్రాతిపదికలను బట్టి అన్నా రాజకీయ భవిష్యత్తు ఆదారపడి వుంటుంది. లౌకిక ప్రజాస్వామిక విధానాలు ప్రజానుకూల ఆర్థిక దృక్పథం. మతతత్వం పట్ల కార్పొరేట్‌ ప్రాబల్యం పట్ల విమర్శనాత్మక వైఖరి ఏ మేరకు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే. కనక అన్నా బృందం రాజకీయాల్లో ఏదో మార్పు సాధిస్తుందని చెప్పడానికి ఇప్పటికి ఎలాటి ఆధారాలు లేవు సరికదా గతాన్ని బట్టి చూస్తే సందేహాలే కలుగుతాయి.

No comments:

Post a Comment