Pages

Monday, August 6, 2012

అద్వాన్వస్థితిపై అద్వానీ ఒప్పుకోలు!



ఇటీవలి కాలంలో ఈ బ్లాగులో నేను చేస్తున్న వ్యాఖ్యలు అనూహ్యమైనంత వేగంగా నిజమవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా మన రాజకీయ ప్రతిష్టంభనకు రాజకీయ శక్తుల స్తంభనకు ఇదో నిదర్శనమై వుండొచ్చు. అన్నా హజారే దీక్ష, కెసిఆర్‌ సంకేతాలు, ఫీజు రీ ఇంబర్సుమెంటుకు మంగళం వంటి ఏ సమస్య తీసుకున్నా అనుకున్న దానికన్నా ముందే తేలిపోతున్నాయి. ఫలితంగా నాపై వూరికే ధ్వజమెత్తే మిత్రులు కూడా ఒకింత ఆలోచనలో పడుతున్నట్టు కనిపిస్తుంది. బహుశా అలాటి వాటన్నిటికీ పరాకాష్ట బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ 2014 ఎన్నికలలో తమకు అవకాశాలు లేవని ఇంత ముందుగా ఒప్పుకోవడం! ఏదో పత్రికా గోష్టిలో ఎవరో అడిగితే చెప్పడం కాదు, తనకు తానుగా బ్లాగులో రాసిపెట్టారంటే ఆయన ఎంత నిరుత్సాహంలో వున్నారో తెలుస్తుంది.బహుశా పార్టీ వారిని ముందే ఓటమికి సిద్ధం చేయడం అవసరమని ఆయన భావించి వుంటారు.
అద్వానీ ఒక విధంగా భగజీవి. అయోధ్య ఉద్యమంలో మతతత్వ వ్యూహాలను అటుంచితే బిజెపి పెద్ద శక్తిగా ఎదగడానికి ప్రధాన కారణమైంది. దానికి నాయకత్వం వహించిన అద్వానీ ఫలితంగా వచ్చిన ప్రభుత్వానికి మాత్రం నాయకత్వం వహించలేకపోయారు. ఆమోదయోగ్యత కారణంగా మూడు సార్లు వాజ్‌పేయికే కిరీటం దక్కింది.ఉప ప్రధాని పదవి లాంచనంగా రావడానికి కూడా చాలా కాలం పట్టింది. ఆ తర్వాత కూడా వాజ్‌పేయి ఏనాడూ హృదయపూర్వకంగా ఆయనను స్వాగతించింది లేదు.లోV్‌ా పురుష్‌ వికాస్‌ పురుష్‌ అంటూ వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యానంపై వాజ్‌పేయి ఎంతటి దుమారం రేపిందీ మర్చిపోలేము.
2004 ఎన్నికల ఓటమి తర్వాత అద్వానీ పార్టీలోనే ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నది
ఎవరూ మర్చిపోరు. జిన్నాకు మెచ్చుకోలు తర్వాత ఆయనను పదవి నుంచి తొలగించేశారు. మళ్లీ 2009 ఎన్నికల నాటికి ముందుకు తెచ్చినా అవకాశాలు లేవని ముందే స్పష్టమై పోయింది. ప్రతిపక్ష నేత హౌదా కూడా పోయింది. రాబోయే ఎన్నికలకు తానే ప్రధాని అభ్యర్థినని ఆయన తానుగా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎటువైపు నుంచి ఎలాటి మద్దతు రాలేదు.సరికదా మోడీని కొందరు కావాలని ముందుకు తెచ్చారు.(ఈ సంగతి గతంలోనే బ్లాగులో మాట్లాడుకున్నాం) దీనిపై మొదట అలకచూపి ఆ తర్వాత ఆశీర్వాదం అందించిన అద్వానీ తన పరిస్థితిని తాను గ్రహించినట్టున్నారు.వ్యక్తిగత స్థితి మాత్రమే గాక పార్టీ కూడా ఎక్కడా కోలుకున్నది లేకపోగా కర్ణాటక వంటి చోట్ల ఘోరంగా నడుస్తున్నది. బాగా ఆశలు పెట్టుకున్న గుజరాత్‌లోనూ కేశూభారు పటేల్‌ నిష్క్రమణ ఎంతో కొంత నష్టాన్నే మిగల్చబోతున్నది.రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగు కూడా బిజెపికి తలవంపులు తెచ్చింది.నిజానికి బిజెపి నేతల అనైక్యత ఎంత వుందంటే రాని ప్రధాని పదవి కోసం అద్వానీ మోడీ సుష్మా గడ్కరి, అరుణ్‌ జైట్లీ అయిదుగురు ఎదురు చూస్తున్నారని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రెండు వారాల కిందటే రాసింది. అద్వానీలాగే గతంలో ఆగ్రహానికి గురై పార్టీని నానా శాపనార్థాలు పెట్టిన జస్వంత సింగ్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్తిగా తెచ్చుకోవడంలోనే ఆ దయనీయ స్థితి అర్థమవుతుంది.
ప్రతిపక్షంగా ఇంత కాలం వున్న బిజెపి ఎన్‌డిఎలు ఏ నూతనమైన కార్యక్రమంతోనూ దేశ ప్రజల ఆదరణ చూరగొన్నది లేదు. కాంగ్రెస్‌ యుపిఎలు ఎన్ని అవినీతి ఆరోపణల్లో చిక్కినా తాము అంతకంటే మెరుగని నిరూపించుకున్నది లేదు. కనక ఈసారి ఎన్నికల్లో ఆ కూటమి అధికారంలోకి వస్తుందన్న ఆశలు అడుగంటాయి. పైగా టెర్రరిస్టు దాడులు వగైరాలతో కల్లోలితమైన దేశంలో మతతత్వ రాజకీయాలను ఆదరించే పరిస్తితి కూడా లేదని తేలిపోయింది. అయితే బిజెపి ఎ ంత అధ్వాన్న స్థితిలో వున్నా కాంగ్రెస్‌ మళ్లీ గెలిచేంత దృశ్యం కూడా లేదు. కనక అనివార్యంగా ఈ రెండు పార్టీలకు చెందని వ్యక్తి ప్రదాని కావలసిందేనని అద్వానీ భావన. అది ముమ్మాటికి నిజం కూడా. ఇప్పుడున్న సభలో కూడా ఈ రెండు పార్టీల కన్నా ఇతరులకు ఉమ్మడిగా చూస్తే ఎక్కువ స్థానాలువున్నాయి. ఇతర పార్టీల మద్దతు లేకుండా రెండు పెద్ద పార్టీలు అధికారంలోకి వచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. సమాజ్‌ వాది పార్టీ,బిఎస్‌పి, జెడియు,తృణమూల్‌, అన్నా డిఎంకె వంటివి ఇప్పుడు పెద్ద పార్టీలుగా వుండగా జగన్‌ పార్టీ వంటి వాటి సంగతి చూడవలసి వుంది. వామపక్షాలు గత ఎన్నికల తర్వాత దెబ్బ తిన్నా వాటి పునాది వాటికి వుంది గాని అవి ప్రభుత్వ స్థాపనకు పాకులాడే స్థితి వుండదు. అంతేగాక మారిన పరిస్థితిలో మూడో కూటమిని కూడగట్టేందుకు సిపిఎం పెద్దగా హడావుడి పడటం లేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ బిజెపిలకు చెందని ప్రదాని వస్తాడని అద్వానీ జోస్యం చెబుతున్నారు. తథాస్తు.

3 comments:

  1. /ఈ బ్లాగులో నేను చేస్తున్న వ్యాఖ్యలు అనూహ్యమైనంత వేగంగా నిజమవడం ఆశ్చర్యం కలిగిస్తుంది/
    :)
    నాకు తెలియక అడుగుతాను, తెరగారు, మీ ఫలించిన జోస్యం ఫలితాలమీద మీకే ఆశ్చర్యం ఎందుకండి?
    హజారే రాజకీయాల్లో పాల్గొంటాడని మీరెప్పుడు చెప్పారు?! బిల్లు పెట్టకుండా దొంగల ముఠాలందరి 'ఏకాభిప్రాయం రావాలి', పార్లమెటులోని ముఠాలే 'సుప్రీం &' అని దొంగాటలాడుతోంటే సరే అక్కడికే వస్తాం అనడం తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిన నిర్ణయం. రానీ ఇందులో గుండెలు బాదుకోనే అవసరం ఎందుకు? హజారే పార్టీ అవినీతి అదుపుచేసేందుకు కఠిన చట్టాలను చేయగలిగితే సంతోషమే, లేదూ తాము అవినీతికి లొంగిపోయినా నష్టమేమీ లేదు, ఎందుకంటే మరో ప్రరాప, వైకాప అనుకుంటాము. వామపక్షాల అవసరంకొద్దీ మిత్రపక్షం కాన్-గ్రాస్ తరపున భయం చూస్తే ... హజారే నిజంగా పవర్లోకి వస్తాడనిపిస్తోందా?! :) నాకైతే కనీసం ఇంకో 10ఏళ్ళ దాకా అలాంటి అజెండాలతో పార్టీలు అధికారంలోకి రాలేవు అనిపిస్తుంది.

    ReplyDelete
  2. అహా, అద్వాని ఓటమి ఒప్పుకోలేదు. విశ్లేషించాక అలాంటి పాజిబిలిటీ వుంటుందని వూహాగానం చేశారు. అదే నిజమైతే వామపక్షాలకు అనుకూలమే కదా? వామపక్షాల భాగస్వామ్యంతో UPA3 ఏర్పడే చాన్స్ వస్తుందేమో. :D :))

    ReplyDelete
  3. అన్నా రాజకీయాల్లోకి వస్తాడని కాదు, అంతా అస్పష్టంగా వుందనీ, అస్సలు రాజకీయ ఉద్దేశాలు లేవని చెప్పలేమనీ రాశాను. దానిపై మీరు అప్పట్లో స్పందించారు కూడా. ఆ అయోమయం మరింత వేగంగా నిజమైంది.అవి జోస్యాలు కాదు, కనిపిస్తున్న దానిపై పరిశీలనలు మాత్రమే.ఆయన అధికారంలోకి రావడం కాదు, ఏవో అతికొద్ది చోట్ల తప్ప గణనీయమైన ప్రభావం చూపించడం కూడా కష్టమే. నేను ఇప్పటికీ ఆయనపై ఎలాటి ముద్రలు వేయాలనుకోవడం లేదు. ఏంచెబుతాడో చూడాలి.
    ..........

    అద్వానీ మాటల్లో అధికారానికి రామన్న ఒప్పుకోలు చాలా స్పష్టం. దాన్ని ఓటమి అంటారో మరొకటో మీరే ఆలోచించండి

    ReplyDelete