పార్లమెంటు అట్టుడికి పోతున్నా దేశం గగ్గోలు పెడుతున్నా రాజ్యాంగ సంస్థ వేలెత్తి చూపించినా మాననీయ ప్రధాన మంత్రికి మాత్రం మలినం ఎక్కడా కనిపించడం లేదు. పారదర్శకత లేని బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో దేశాన్ని వదిలేసి తాను విదేశాలకు పయనం కట్టారు. పరిస్థితులు సరిగ్గా లేవని గ్రహించిన పట్టపురాణి తానే కత్తి పట్టి కపట యుద్ధం చేస్తున్నారు. ్ల. అయితే మిగిలిన అన్ని ప్రకృతి సంపదలూ చెరబట్టిన అభినవ హిరణ్య కశిపులు ఈ బొగ్గును కూడా బొజ్జల్లో నిక్షిప్తం చేసుకోవడం వల్లనే దేశ రాజకీయం ఆరని కుంపటిగా మారిపోయింది. అది కూడా రాజ్యాంగ బద్దమైన అధికారిక తనిఖీ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఎత్తి చూపిన ఫలితంగా. ఈ వ్యవహారం కూడా ఏదో హఠాత్తుగానో అనుకోకుండానో బయిటకు వచ్చింది కాదు. నలిగీ నలిగీ అనేక మలుపులు తిరిగి ఖరాఖండిగా కాగ్ ప్రకటించిన బొగ్గు భాగోతం విలువ కనీసంగా లక్షా 86 వేల కోట్ల రూపాయలు. కొంతమంది అంటున్నట్టు అనుకుంటున్నట్టు ఇది ఉజ్జాయింపు లెక్క కాదు- శాస్త్రీయంగా గణించిన లెక్క. ఇంకా పెరిగే అవకాశం వున్న లెక్క. ఈ లెక్కను గనక తప్పు పట్టేట్టయితే అప్పుడు అకౌంట్ల తనిఖీ అభిశంసన అన్న మాటలకే అర్థం వుండదు. అయినా ఘనత వహించిన నిష్కళంక ప్రధానికి ఇందులో కాస్తయినా దోషం కనిపించదు. ఎందుకంటే అది అక్షరాలా ఆయన హయాంలోనే ఆయన ఆధ్వర్యంలోనే జరిగిన కేటాయింపు గనక. అనేకానేక సూచనలు ప్రత్యామ్నాయాలను పెడచెవిని పెట్టి ఇష్టానుసారం వ్యవహరించారు గనక. ఇది కళ్లుమూసుకున్న పిల్లి తంతు తప్ప తెలియని తతంగమేమీ కాదు.
భారత దేశాన్ని రత్నగర్భ అంటారు నల్లబంగారమైన బొగ్గుకు మాత్రం ఇది నిజంగానే
పుట్టిల్లు.1973లో బొగ్గు గనుల జాతీయకరణ జరిగిన తర్వాత ఈ సంపద దేశానికి వశమైంది. అయితే ప్రైవేటీకరణ శకం మొదలైన తర్వాత జాతీయకరణ అంటేనే మహాపరాధంగా మారింది.కోల్ ఇండియా బొగ్గును సకాలంలో సమర్థంగా తవ్వడంలో విఫలమవడం వల్లనే దేశం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని బొగ్గు బావులను ప్రైవేటుకిస్తే అంతా అద్భుతంగా మారిపోతుందని ఆర్భాటంగా ప్రచారం జరిగింది. యుపిఎ-హయాంలో బొగ్గును ప్రధానంగా ఉపయోగించే సంస్థలకు కేటాయింపులు చేయాలన్న నిర్ణయం జరిగింది. ఎన్‌టిపిసి వంటి ప్రభుత్వ సంస్థలకు, ఆర్సెనల్-మిట్టల్,టాటా స్టీల్, రిలయన్స్, జిందాల్ వంటి ప్రైవేటు సంస్థలకు తమ అవసరాల నిమిత్తం వాడుకునేందుకు బొగ్గు బ్లాకులు కేటాయించాలని భావించారు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆధ్వర్యంలోని విద్యుత్ సంస్థలకు బొగ్గు కేటాయించకుండా వేలం పేరిట ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడమేమిటని ప్రశ్నించాయి.దాన్ని సాకుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల ప్రక్రియనే బూటకంగా మార్చివేసింది. ఎలాటి పారదర్శకత లేకుండా ఏకపక్షంగా ఇష్టానుసారంగా నచ్చిన వారికి వాటిని ధారాదత్తం చేసేందుకు పాల్పడింది. ఈ క్రమంలో2 జి స్ప్రెక్ట్రం కుంభకోణాన్ని మించి పోయేంత నష్టం కలిగించింది.
2 జి స్ప్రెక్ట్రం విషయంలో పోటీ దారులకు తగినంత సమయం ఇవ్వకుండా ఆఘమేఘాల మీద వేలం ముగించి అయినవాళ్లకు అప్పగించి అవినీతి సొమ్ము దండుకున్నారనేది ఆరోపణ. బొగ్గు విషయంలో ఆ మాత్రం ప్రహసనం కూడా జరిగింది లేదు.2004 జూన్, జూలైలలోనే బొగ్గు శాఖ కార్యదర్శి పోటీ పద్ధతిలో బ్లాకులను వేలం వేద్దామని ప్రతిపాదిస్తే సంబంధిత మంత్రిత్వ శాఖ అంగీకరించింది.అయినా సరే ఆ ప్రక్రియ ఎలా వుండాలనే వివరాలు రూపొందిచండంపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టలేదు. ఈ కాలంలో సదరు శాఖను నేరుగా ప్రధని చూశారు గనక ఆయన వ్యక్తిగతంగా ఇందుకు బాధ్యత వహించవలసి వుంటుంది. అందుకు మారుగా కాగ్‌పై దాడి చేయడం ఆయన స్థాయికి తగని పని. ఒక చిన్న అధికారిక సవరణతో వేలం పాటలను నిర్వహించి కేటాయించవచ్చుననుకున్నారు.2006 లో ఆ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ సిఫార్సులు సిద్దమైనాయి. అయినా సరే 2010 వరకూ ప్రధాని కార్యాలయం అందుకు చర్యలు తీసుకోలేదు. కారణాలు ఏమి చెప్పినా ఈ దశలో ఇష్టానుసారం కేటాయింపులు జరుపుతూనే వచ్చారు. ఫలితం ఏమంటే ఆర్థిక నష్టం అటుంచి దేశంలో బొగ్గు ఉత్పత్తి పెరుగుదల కూడా నిలిచిపోయింది.
నిజానికి గత ఫిబ్రవరిలోనే కాగ్ నివేదికలో ఇలాటి వివరాలు వెల్లడైనాయి. నివేదిక పార్లమెంటకు సమర్పించకముందే లీకేజి అయిందంటూ కేంద్రం ఎదరు దాడికి దిగింది. సమస్యను మౌలికంగా లేదని చెప్పకుండానే కాగ్ లీకేజి తాము చేయలేదన్న మేరకు స్పష్టత ఇచ్చింది. గత నెలలో ఇది మరింత సూటిగా దేశం ముందుకు వచ్చింది కాగ్ అన్నది ఒక విధంగా సుప్రీం కోర్టుకన్నా కీలకమైందని అంబేద్కర్ ఒక సందర్భంలో అన్నారు. రాజ్యాంగంలో 147 నుంచి 151 వరకూ వున్న అధికరణాలు కాగ్ అధికార పరిధిని స్పష్టంగా నిర్వచించాయి. ఆడిటింగ్‌కు చిన్నచిన్న ఆఫీసుల్లోనే ఎనలేని విలువ వుంటుంది గాని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఆ బాధ్యత చూసే సంస్థకు విలువ లేదట! బొగ్గు బ్లాకులు ఏకపక్షంగా కార్పొరేట్లకు కేటాయించడం వల్ల కలిగిన నష్టం 1.86 లక్షల కోట్లు వుంటుందని లెక్క కడితే అది నిరాధారమంటున్నారు. ఉజ్జాయింపు అని తోసిపుచ్చుతున్నారు. ఇలాటి సందర్భాల్లో వూరికే నష్టం వచ్చిందని వదిలేయడం కన్నా వున్న ఆధారాల మేరకు దాన్ని అంచనా కట్టడం ద్వారానే తీవ్రత తెలుస్తుందనేది ఆడిటింగ్ సూత్రం. కోల్ ఇండియా బొగ్గు రేట్లను తీసుకుని అక్కడ లభించే బొగ్గు నిల్వలను అంచనా కట్టి ఖజానాకు ఇంత నష్టం వాటిల్లిందంటే అది ఎలా నిరాధారమవుతుంది?
ప్రైవేటీకరణ సిద్ధాంత కర్తలు అంటున్నట్టుగా ఈ కేటాయింపుల వల్ల కలిగిన మేలేమిటి? క్యాప్టివ్ కోటాలో కేటాయింపులు తీసుకున్న సంస్థలు ఆ ప్రకారం బొగ్గు తవ్వితీసుకున్నాయా అంటే లేదు. పైగా దాన్ని మారుబేరం పెట్టాయి. వాటిని తమ సంపద కింద చూపించి అడ్వర్టయిజ్‌మెంట్లు ఇచ్చి గ్రూపు సంస్థల షేర్ల విలువ పెంచుకున్నాయి. అంతర్జాతీయంగా బొగ్గు ధర ఇంకా పెరిగాక తవ్వుకోవడం కోసం అలాగే అట్టిపెట్టాయి. అంటే బొగ్గుతో విద్యుదుత్పత్తి చేసి దేశానికి ఉపయోగిస్తాయన్న మాట కూడా బూటకమై పోయింది. ఆ విధంగా ఈ బొగ్గుల కుంపటి దేశానికి చేసిన నష్టం 2 జి స్ప్రెక్ట్రం కన్నా దారుణమైంది.అక్కడ సెల్‌ఫోన్ ఆపరేటర్లు ఆకర్షణ కోసం పోటీలు పడి ధరలు తగ్గించడమైనా జరిగింది. ఇక్కడ పాటదార్ల పాటవం పెరిగిందే తప్ప బొగ్గు నిక్షేపాలు అక్కరకు రాలేదు. పైగా కార్పొరేట్ల ధాటికి రాష్ట్రాల విద్యుత్ సంస్థలు నిలవలేకపోయాయి.ఆంధ్ర ప్రదేశ్‌లోనే విద్యుచ్చక్తి సంక్షోభం ఎంత తీవ్రంగా వున్నదీ చూస్తున్నాము. కోల్ ఇండియా చైర్మన్ బొగ్గు సరఫరా పెంచుతానంటే గొప్పగా చెప్పుకుంటున్న మనం అక్కడ పాడుకున్న బొగ్గుబ్లాకులపై హాయిగా వ్యాపారం చేసుకుంటున్న కార్పొరేట్ ఘనులను ఏమనాలి? ఇది సరళీకరణ విధానాల దుష్ఫలితమైన ఆశ్రిత పెట్టుబడిదారీ విధానపు విషవృక్ష పలం. ఎన్‌డిఎ హయాంలోనూ ఇదే జరిగింది. కర్ణాటకలో ఇనుప గనులు కుంభకోణం కూడా ఇందుకు భిన్నమైందేమీ కాదు. జిందాల్‌కు బాక్సయిట్ గనులను కట్టబెట్టినా ఇదే తంతు. బిజెపి నేతలు ఇప్పుడేదో హఠాత్తుగా కళ్లుతెరిచినట్టు ప్రభుత్వం రాజీనామా చేయాలన్న రభసతో అసలు చర్చకు ఆస్కారం లేకుండా చేయడం విడ్డూరం.
దీంతోపాటుగానే కాగ్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన ప్రైవేటు భాగస్వామ్య ఒప్పందాన్ని(పిపిపి),అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టెలకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లను కూడా ఎత్తిచూపింది.ఈ ప్రాజెక్టుల కింద బొగ్గు వినియోగానికి మంజూరైన అనుమతులు మొత్తం ప్రక్రియకే విఘాతం కలిగించడంతో పాటు రిలయన్స్ పవర్‌లిమిటెడ్ కంపెనీకి అడ్డగోలుగా లాభాలు కురిపించాయని పేర్కొన్నది. ఇందుకోసం వచ్చిన 16 ప్రతిపాదనలలోనూ 12 రిలయన్స్‌కు సంబంధించినవే! వీటిలో ఒకటి మాత్రమే వాస్తవ రూపం దాల్చింది. ఇక ఢిల్లీ విమానాశ్రయానికి సంబంధించిన పిపిపిలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఎప్పుడు తనకు రావలసిన ఆదాయం గురించి మాట్లాడినా సంబంధిత సంస్థ ప్రైవేటు ఆపరేటర్లకే అనుకూలంగా తీర్పు చెబుతూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తూ వచ్చింది. అని కాగ్ కుండబద్దలు కొట్టి చెప్పింది. కాగ్ ప్రతిపత్తిపైనా సమర్థతపైనా ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఈ ప్రభుత్వ ఆర్థిక శాఖనే 2006లో దాని అడిటింగ్ అధికారాలకు ఎలాటి పరిమితులు లేవని స్పష్టీకరిస్తూ ప్రత్యేక ప్రకటనే విడుదల చేసింది.
కనకనే ఏ విధంగా చూసినా ఈ నాలుగు సందర్భాలలోనూ కేంద్రం తన నిర్ణయాలను తన నిర్థారణలను తానే ఉల్లంఘించింది. కార్పోరేట్ శక్తులకు కుబేర వర్గాలకు కొమ్ము కాస్తున్నది. వాటిని మీడియా ప్రతిపక్షాలు దర్యాప్తు సంస్థలు కోర్టులు ఎత్తి చూపితే ఎదురు దాడి చేసి భంగపడుతున్నది. ఆఖరు వరకూ సమర్థించుకుని ఆ పైన అపహాస్యం పాలవుతున్నది. తరచూ చెప్పుకునే కామన్వెల్త్, ఆదర్శ,2 జి వగైరాలన్ని ఈ జాబితాలో కొన్ని మాత్రమే.ఇప్పుడు వాటిన్నిటికన్నా అనేక రెట్లు పెద్దదైన ఈ బొగ్గుల కుంపటి అంత సులభంగా చల్లారేది కాదు. అడుగు జారి అధోగతి పాలవుతున్న యుపిఎ 2 ను పతనాన్ని వేగిరపర్చేందుకు ఈ వ్యవహారం దారి తీస్తే ఆశ్చర్య పోవలసింది లేదు. సమగ్ర చర్చలకు బదులు సభలను స్తంభింపచేసి పరోక్షంగా సహకరించే బిజెపి వ్యూహం ఒక్కటే ఇక్కడ ప్రభుత్వానికి కలసి వస్తున్న అంశం. అదెలా వున్నా ముందు ఆ బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేయడం తక్షణం జరగాల్సిన పని.
No comments:
Post a Comment