Pages

Friday, August 24, 2012

హైటెక్‌ పుకార్లతో కల్లోలం



       సత్యం నోరు విప్పేలోగా అసత్యం విశ్వవిహారం చేసి వస్తుందంటారు.. అభివృద్ధి నిరోధకులు మతోన్మాదులు వికృత మనస్కులు సృష్టించే కట్టుకధలు కార్చిచ్చులా పాకి సమాజ జీవితాన్ని కల్లోల పర్చడం చరిత్ర చూస్తున్న సత్యం. నాజీ ఫాసిస్టుల నుంచి నేటి మతోన్మాదుల వరకూ జాతి దురభిమానుల నుంచి మతిమాలిన కుటిలాత్ములు మూఢ విశ్వాసుల వరకూ అనేకులు అనేక రకాల ఆరంభించే అరాచక అఘాయిత్య వదంతులకు అమాయక జనం ఆహుతవుతున్నారు. ప్రస్తుతం అస్సాం వాసు ల ఆవేదనకు సామూహిక సంచలనాలకు కారణమైన పరిణామాలలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర కూడా చాలా వుంది...

     2012 ఎంసెట్‌ ఫలితాలు వచ్చిన సందర్భం మీకు గుర్తుందా? మొదటి ర్యాంకు వచ్చిన ఫలనా అభ్యర్థి ఫలానా విద్యా సంస్థకు చెందిన వాడు కాదంటూ ఒక ఎస్‌ఎంఎస్‌ వేలమందికి చేరింది. దానిపై ఆశ్చర్య పడేలోగానే అది అసత్య ప్రచారమంటూ మరో ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. ఆ తర్వాత సదరు సంస్థ అధికారికంగా దాన్ని ఖండిస్తూ మీడియా ముందుకొచ్చింది.ఇంతకూ ఆ ఎస్‌ఎంఎస్‌ అందుకున్న వారిలో అత్యధికులకు అది ఎందుకొచ్చిందో తెలియలేదు గాని ఒక క్రమపద్ధతిలో ఎవరో కావాలని పంపించారని మాత్రం అర్థమై పోయింది.
కొద్ది మాసాల కిందట రాజధాని సమీపంలోని సంగారెడ్డిలో మతపరమైన ఉద్రిక్తతలు ప్రబలాయి. ఎవరో దేవుణ్ని అవమానించే చిత్రాన్ని ఇంటర్‌నెట్‌లో వుంచారంటూ ప్రచారం జరిగింది.ఆ చిత్రం ఏమిటో ఎవరు చేశారో తెలియలేదు గాని ఈ లోగానే విపరీతమైన ప్రచారాలు జరిగిపోయి ఉద్రిక్తత పెరిగి కర్ఫ్యూ వరకూ వెళ్లింది. హైదరాబాదులో మామూలుగానే ఫలానా ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేశారని, ఎక్కడో గొడవల్లో చాలామంది చనిపోయారని పుకార్లు వినిపిస్తాయి. ఇలాగే అవమానకరమైన రీతిలో దేవుళ్ల చిత్రాలను చలామణిలో పెట్టడమూ జరుగుతుంది.
ఓ స్త్రీ రేపురా!
ఎవరో తెల్లచీర కట్టుకున్న స్త్రీ అర్థరాత్రి వూళ్లో సంచరిస్తుందని, దగ్గరగా వెళితే మాయమవుతుందని ఎవరో అంటుకోబోతే రక్తం కక్కుకుని చనిపోయారని ఇలాటి కథలు నిరంతరం ఏదో ఒక వూళ్లో ప్రచారమవుతూనే వుంటాయి. ' ఓ స్త్రీ రేపురా' అన్న వాక్యం
ఏదో ఒక చోట కనిపిస్తూనే వుంటుంది.
ఇవే గాక మరో తరహా ప్రచారాలు- వినాయకుడు పాలు తాగాడనీ, సాయిబాబా ఫోటో విభూతి రాలిందని - క్షణాల మీద చలామణిలోకి వచ్చేస్తాయి. వాటి నిజానిజాలు నిర్ధారించుకునేలోగానే వేలమంది బారులు తీరి నిలబడతారు. వూళ్లో ఎవరో జబ్బు చేసి చనిపోతే ఫలానా మహిళలు లేదా ఫలానా కుటుంబం చేతబడి చేస్తున్నందునే పిల్లలు చనిపోతున్నారని ప్రచారాలు మొదలవుతాయి. విచక్షణా రహితమైన విద్వేషంతో వారిని సజీవ దహనం చేసే అమానుషం వరకూ వెళతారు.
ఆకాశంలోంచి స్కైలాబ్‌ పడుతుందనీ, ఫలానా రోజున భూ ప్రళయం సంభవిస్తుందని, ఫలానా రోజున చనిపోతే నేరుగా స్వర్గం చేరతారని ప్రచారాలు జరిగి సామూహిక ఆత్మహత్యలు చేసుకున్న వైపరీత్యాలు కూడా చూస్తుంటాము. రాత్రి నిద్ర పోతే చనిపోతారని కట్టుకథలు విని తెల్లార్జు జాగారం చేసిన వైనం నిన్నమొన్న కూడా ప్రసారమైంది!

మారణాంతకం
మరో తరహాలో - ఫలానా కులం వారిపై ప్రాంతం వారిపై దాడులు జరిగాయనీ, వెంటాడి చంపేస్తున్నారనీ కథనాలు వస్తాయి. నరమేధానికి పథకం పన్నారు గనక తప్పించుకోవాలంటే అందరూ కలిసి పారిపోవాలన్న ప్రచారం జరుగుతుంది. చివరకు ప్రాణభయంతో అలా వచ్చిన వారిని వేటాడి చంపడం చాలాసార్లు జరిగింది. దేశ విభజన నాటి నుంచి మొన్నటి ఢిల్లీ నిన్నటి గుజరాత్‌ నేడు అస్సాం వరకూ అనేక చోట్ల ఈ విధమైన కట్టుకథలే ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించాయి. దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా కల్లోలాలకు కారణమైనాయి. 1984లో సిక్కులపై మారణహౌమం సమయంలో వారు ఒక మంచి నీటి వనరుల్లో విషం కలిపారన్న వదంతి ప్రచారమైంది.

చెప్పాలంటే పుకార్లు లేదా వదంతులు కూడా బాంబుల కన్నా తీవ్రస్థాయిలో బద్దలవుతాయి. విధ్వంసాలకు విషాదాలకు కారణమవుతాయి. ఉదాహరణకు ఒక సినిమా థియేటర్‌లో బాంబు పేలితే చనిపోయే వారి సంఖ్య కంటే ఆ బాంబు గురించిన ప్రచారాలకు పారిపోబోయి తొక్కిసలాటలో చనిపోయేవారి సంఖ్య చాలా ఎక్కువగా వుంటుంది.
మానవ చరిత్రలో మొదటి నుంచి ఒక సమస్యగా వున్న పుకార్ల వ్యూహానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా ఇంటర్నెట్‌ వెబ్‌సైట్లు, సెల్‌ఫోన్లు వగైరాలు మరింత ప్రమాదకరమైన ఆయుధాలుగా తయారైనాయి. గతం కన్నా వేగంగా భయానకంగా కట్టుకథలు వ్యాపింపచేసే అవకాశం కలిగిస్తున్నాయి. ఇప్పుడు అస్సాం ఇతర ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా శ్రమజీవులు వలస కార్మికులను హతాశులను చేసి హఠాత్తుగా ఇంటి మొహం పట్టేట్టు చేసినవి అలాటి పుకార్లేనని అందరూ అంగీకరించారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొని బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లకు అంటే ఒక్కసారిగా అందరికీ పంపించే వాటికి అవకాశం లేకుండా చేసింది. అయితే ఈ నిషేదంలో ఆలస్యం జరిగిందనీ,ఇదొక్కటే చాలదనీ కూడా అభిప్రాయాలు వచ్చాయి. ఈ పుకార్ల వ్యాప్తికి ప్రధాన కారణం పాకిస్తాన్‌ అని ఇండియా భావిస్తుంటే ఆ దేశం మాత్రం అంగీకరించడం లేదు. గతంలో కన్నా త్వరగానూ అపాయకరంగానూ అసత్యాలు వ్యాపించడానికి నెట్‌ కారణమవుతన్నదనే దానిలో సందేహమేమీ లేదు.

నోటి మాటలతోనే మంటలు
మానవ సమాజంలో మొదటి నుంచి పుకార్ల బెడద వున్నప్పటికీ అచ్చు యంత్రం వచ్చాకే వాటి ఫ్రభావం పెరిగింది.అంతకు ముందు కాలంలో చెవులు కొరుక్కోవడం అనే పేరిట ప్రచారాలు జరిగితే తర్వాత ఆ అవసరం లేకుండా పోయింది. ఏ మేరకు సమాచార సంబంధాలు పెరిగితే ఆ మేరకు అసత్య సమాచార వ్యాప్తికి కూడా అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకునే దుష్ట శక్తులు ఒక పథకం ప్రకారం కట్టుకథలు వ్యాపింపచేస్తారు. తర్వాత తామే వాటి ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టడం, భయోత్పాతానికి గురి చేయడం జరుగుతుంటుంది. ఒక కథ ప్రచారంలో వుంటే సమాచార సాధనాలు కూడా దానితో ఏకీభవించకపోయినా ఇలాటి ప్రచారం వుందనే వార్తను ఇస్తాయి. అలా అలా అది దావానలంలా అలుముకుంటుంది.
కొన్నిసార్లు ఈ నోటిమాట మంచికి కూడా ఉపయోగించవచ్చు. 1789లో మహత్తర ఫ్రెంచి విప్లవానికి దోహదం చేసిన విషయాల్లో వదంతులు కూడా ఒక కారణమంటారు. రాచ ప్రభువులు రైతుల పంటలను తగలబెట్టేస్తున్నారన్న కథలు వ్యాపించడంతో ఒక్కసారిగా ఆగ్రహానలం రగుల్కొన్నది.అలాగే ఉదాహరణకు 1857లో బ్రిటిష్‌ పాలకులు తుపాకి తూటాలలో పందిమాంసం ఉపయోగిస్తున్నారనే కథనం తీవ్రాగ్రహానికి దారి తీసింది. మతపరమైన తేడాలకు అతీతంగా భా రతీయ సైనికులను ఏకం చేసింది. ఆ తర్వాత కొంత కాలం పాటు పుకార్లు లేవదీసే వారిని కూడా రౌడీ షీటర్ల తరహాలో నిర్బంధించడం మొదలెట్టారు. ఆ విధంగా భారతీయుల అశాంతిని అదుపు చేయొచ్చనుకున్నారు గాని సాధ్యం కాలేదు.. స్థానిక పత్రికలు ఇందుకు ఉపయోగపడుతున్నాయనే ఆగ్రహంతో వాటిపైనా ఆంక్షలు విధించారు. (ఇంటర్నెట్‌, ఇంగ్లీషు పత్రికల సమాచారం సహయంతో)

No comments:

Post a Comment