166 మందిని అమానుషంగా కాల్చి చంపిన ముంబాయి దాడిలో...... పట్టుబడిన పాకిస్తానీ టెర్రరిస్టు అజ్మల్ కసబ్‌కు కింది కోర్టు విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు ఖరారు చేయడం అనివార్య పరిణామం. అరుదైన వాటిలో అరుదైన జాబితా తీసుకుంటే ఇంతకంటే తీవ్రమైన కేసు వుండదు. ప్రపంచంలో సజీవంగా ప్రత్యక్ష రంగంలో పట్టుబడిన టెర్రరిస్టు కసబ్ ఒక్కడే అంటున్నారు. అతనికి మరణశిక్ష విధించడంపై పాకిస్తాన్ పట్టనట్టు వ్యవహరించడం వ్యూహాత్మకమే. పైగా అలాటి దుశ్చర్యలు ఆగింది కూడా లేదు.అయితే కసబ్‌కు ఉరిశిక్ష పడటం పెద్ద విజయమైనట్టు భావించాల్సిన అవసరం లేదు. అతన్ని బహిరంగంగా వురి తీయాలని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.అప్పుడు నరహంతక టెర్రరిస్టులకు మనకూ తేడా వుండదు. కసబ్ విషయంలో పద్ధతి ప్రకారం వ్యవహరించడం భారత దేశ న్యాయ ప్రమాణాలకు నిదర్శనంగా వుంటుంది. అయితే ఆయనను వురి తీయడానికి ముందు 300 మందికి పైగా వున్నారు గనక ఇది ఎప్పుడు అమలవుతుంది, క్షమాభిక్ష అభ్యర్థన వగైరాలు ఎలా నడుస్తాయి చూడాలి.ఎందుకంటే ఆగ్రహం అసహనం ఎంత వున్నప్పటికీ రాజ్యాంగ ప్రక్రియను కాదనడానికి లేదు.
కసబ్‌తో పాటు శిక్షలు పడిన ఇద్దరు ముస్లింలను నిర్దోషులుగా సుప్రీం కోర్టు విడుదల చేయడం కూడా ప్రాధాన్యత గల విషయం.. గతంలో పార్లమెంటుపై దాడి సందర్భంలోనూ ఇలాటిదే జరిగింది. ముష్కర శక్తులకు మతం లేదని అర్థం చేసుకోవడానికి బదులు టెర్రరిజాన్ని ఏదో ఒక మతానికి అంటకట్టే దుర్నీతిని అమెరికా వ్యాపింప చేస్తే మన దేశంలోనూ మత తత్వ శక్తులు అందిపుచ్చుకున్నాయి.అయితే అమెరికాలో గురుద్వారాపై జరిగిన దారుణ కాల్పుల వుదంతం వారికి మత భేదం ఏమీ లేదని తేటతెల్లం చేసింది. కనక ముంబాయి టెర్రరిస్టు దాడుల సందర్భంలో నిఘా వైఫల్యం వంటి వాటిని సవరించుకోవడం ముఖ్యం. అంతేగాని మతాల వారిగా ఆలోచించడం వల్ల దేశానికి మేలు జరగదు. ముంబాయి దాడిలో కసబ్ గనక ప్రాణాలతో పట్టుబడి వుండకపోతే భారతీయ ముస్లిములను అనవసరంగా అనుమానించే అవకాశంవుండిందని కోర్టు చేసిన వ్యాఖ్య కూడా అందుకే ప్రాధాన్యత సంతరించుకుంటున్నది.
No comments:
Post a Comment