Pages

Sunday, August 5, 2012

కె.సి.ఆర్‌ కొత్త సంకేతాలు- పాత సందేహాలుస్వామిగౌడ్‌ సన్మాన కార్యక్రమం తెలంగాణా విభజన వాద వాణికి వేదికగా మారడం వూహించదగిన విషయమే.అయితే అక్కడ వారిలో విభజనలు కూడా వ్యక్తం కావడం మహబూబ్‌నగర్‌, పరకాల వంటి పరిణామాల కొనసాగింపుగా కనిపిస్తుంది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రతినిధుల మాటల్లో తేడాలు స్పష్టంగా కనిపించాయి. నేను 2009లో తెలంగాణా నినాదంతో గెలవలేదని పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించడం సాహసోపేతమైనదే.అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తే పదిహేను రోజుల్లో తెలంగాణా వచ్చేస్తుందని కేశవరావు ఆవేశ పూరితంగా చెప్పిన మాట అపహాస్యానికి మాత్రమే అక్కరకు వస్తుంది కారణమేదైనా జెఎసి చైర్మన్‌ కోదండరాం అక్కడ కనిపించలేదు.ఇవన్నీ ఒక ఎత్తయితే కె.సి.ఆర్‌ ఈ సభలో తన సంకేతాల గురించి చెప్పిన మాటలు ఆలోచించదగినవి. సంకేతాలు నాకు రాకపోతే ఎవరికొస్తాయని మీడియాను ఎద్దేవ చేస్తూ ఆయన అన్న మాటలలో అసహనమే కనిపిస్తుంది. తెలంగాణా ఉద్యమానికి ఆయన అగ్ర నాయకుడు ప్రధాన ప్రతినిధి అనడంలో సందేహం లేదు గాని కేంద్రం గురించిన ఆయన జోస్యాలు అనేక సార్లు విఫలమైనాయి. ఒకవైపున కాంగ్రెస్‌ నాయకులే సంకేతాలు లేవని చెబుతుంటే నాకు సూచనలున్నాయన్నట్టు చెప్పడం తప్పకుండా ప్రశ్నార్థకమే. ప్రశాంతంగా వుంటే పరిశీలిస్తామని ప్రధాని చెప్పినందునే ప్రశాంతంగా వున్నామని ఆయన అంటున్నారు గాని ప్రధాని కాదు కదా కేంద్రంలో ఏ ప్రతినిధి కూడా అలాటి మాట చెప్పింది లేదు. హౌం శాఖ నుంచి ఆర్థిక శాఖకు వెళ్తూ ఆఖరి పత్రికాగోష్టిలో కూడా చిదంబరం అందరూ అంగీకరించాకే అఖిలపక్ష సమావేశం వుంటుందని కుండబద్దలు కొట్టి చెప్పారు.ఉద్యమ నాయకులు నమ్మకం నిలబెట్టడం కోసం ఏదైనా చెప్పాలని ఆ పార్టీ నేతలు సమర్తించుకుంటారు గాని అవాస్తవమైన ఆశలు భ్రమలు కల్పిస్తే తర్వాత వాస్తవాన్ని తట్టుకోలేని వారు అఘాయిత్యాలకు తలపడతారు. కనక ఉద్యమ సారథులు వూహాగానాలు చేసే కంటే ఉన్నమాట చెప్పి జనాన్ని నిలబెట్టుకోవాలి.లేదంటే నిజం చెప్పినా నమ్మని స్థితి రావడానికి ఎంతో కాలం పట్టదు.మరో వైపున ఉద్యోగులు కొందరు బుద్ధి జీవులు రాజకీయ వాస్తవాలతో నిమిత్తం లేకుండా ఉద్వేగాలకు ఉద్రేకాలకు గురి కావడం కూడా వాంఛనీయం కాదు.ప్రాంతీయ సమస్యకు పార్టీలతో నిమిత్తం లేకుండా తామే పరిష్కారం సాధిస్తామన్న భ్రమ నుంచి ఉద్యోగులు విద్యార్థులు తదితరులు బయిటపడటం అవసరం. ఎందుకంటే వారిని బలిపెట్టి తమ పబ్బం గడుపుకోవడం 1969-72 మధ్య అనేక మంది స్వార్థ పర నాయకులలో చూశాం.అలాటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి.

No comments:

Post a Comment