Pages

Friday, August 24, 2012

బూటకపు సందేశాలు, తప్పుడు చిత్రాలు


        బెంగుళూరు నుంచి అస్సామీయులు ఆపినా ఆగకుండా పెద్ద ప్రవాహంగా ప్రయాణం కట్టారంటే అందుకు బలమైన కారణాలున్నాయి. వారికి అందిన సెల్‌ఫోన్‌ సందేశాలు అంత భయోత్పాతం కలిగించాయి. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముస్లిం వలసదారులను కోక్రాజార్‌ జిల్లాలో దారుణంగా హింసిస్తున్నారని చంపేస్తున్నారని ఆకాశరామన్న సందేశాలు నెట్‌ వర్క్‌లలో నిండిపోయాయి. దేన్నో దేనికో ఆపాదించడం ద్వారానూ సంబంధం లేని వాటిని చూపించడం ద్వారానూ ఈ అవాంఛనీయ శక్తులు బర్మాలో జరిగిన హింసాకాండ బొమ్మలనే అస్సాంలో జరిగిన వాటిగా ప్రచారంలో పెట్టారు. వాటి తాలూకూ వీడియోలు కూడా వుంచారు.
అస్సాంలో ముస్లింల వూచకోత పేరిట ఈశాన్య ప్రజల పోలికలున్న ఒక మనిషి తల నరికి రక్తమోడుతున్న బొమ్మను యూ ట్యూబులో విపరీతంగా చలామణి చేశారు. మైన్మార్‌(బర్మా)లో ముస్లిముల హత్యాకాండ ఆపండి అంటూ అంతకు ముందు పోస్టు చేసిన చిత్రాలే ఇవి! అలాగే ఒక ముస్లిం మహిళ తమపై జరిగిన అత్యాచారాలను గురించి ఆవేదనగా చెబుతున్న దృశ్యం కూడా వుంచారు. అయితే పూల బురఖా ధరించిన ఆ మహిళ మాటలు గుజరాతీ యాసలో వుండటమే గాక కొన్ని వూర్ల పేర్లు కూడా ప్రస్తావించిన తర్వాతే అసలు సంగతి అర్థమవుతుంది. గుజరాత్‌లో 2002 మత మారణహౌమం నాటి చిత్రాన్ని ఇక్కడ ఉపయోగించి ఉద్రేకాలు పెంచారని తెలుస్తుంది.ఈ మోసకారి కథనాలు చిత్రాలు వేలాది మంది వీక్షించారు గాని నిజమైన వార్తలను వాస్తవాలను పేర్నొంటున్న సైట్లను చాలా కొద్ది మంది మాత్రమే చూశారు.
వెంటనే బయిలు దేరి రండి అంటూ ఎస్‌ఎంఎస్‌లు. ఇద్దరు నేపాలీలు, ఇద్దరు మణిపురిలు హత్య చేయబడ్డారు అంటూ మరో సందేశం. వారం కన్నా ఎ క్కువ రోజులు మీరు అక్కడే వుంటే చాలా ప్రమాదం జరిగిపోతుందని హెచ్చరించేవి కొన్ని, బలాత్కారాలను గురించి
భయపెట్టినవి కొన్ని..' మీ పిల్లలను బంధు మిత్రులను వెంటనే వెనక్కు రమ్మనండి అని ఇంకోటి.. బెంగుళూరు పోలీసుల ప్రాథమిక పరిశీలనలో ఈ సందేశాలన్ని బయిటనుంచి వచ్చాయని తేలింది.ఇవన్నీ మైనారిటీ వ్యతిరేకమైనవి కాగా ముంబాయి లో పరిస్థితి మరోలా వుంది.అక్కడ ఇస్లామిక్‌ వాదులు సృష్టించిన కల్పిత వీడియోలే ప్రజలను కలవర పరిచాయని పోలీసుల వాదన. ఎటు చూసినా మతతత్వ వాదుల హస్తమే వుంటుంది.
ఇలాటి వాటిని అరికట్టడానికి కేవలం బల్స్‌ ఎస్‌ఎంఎస్‌లను నిషేదిస్తే సరిపోతుందా అన్నది సందేహమే.ఎందుకంటే బ్రిటిష్‌ ప్రభుత్వం 2011లో లండన్‌ అల్లర్ల తర్వాత సోషల్‌ నెట్‌వర్క్‌లను బ్లాక్‌ బెర్రీ సందేశాలపై కన్ను పెట్టింది. కాని పెద్ద ఫలితం కనిపించలేదు.చైనాకూడా తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పలు నెట్‌వర్క్‌లను నిషేదించినా ఏదో రూపంలో ఆ తతంగం సాగుతూనే వుంది. నిజానికి ఏ పద్దతిలోనైతే కుట్ర దారులు విష ప్రచారాలు సాగిస్తున్నారో అదే మార్గంలో ప్రభుత్వాలు కూడా ప్రచారం చేయొచ్చుకదా అని కొందరు నిపుణుల సలహా.విద్శేషాన్ని రెచ్చగొట్టే కరపత్రాన్ని ప్రచురిస్తే ఎలాటి నేరమో సోషల్‌ నెట్‌వర్క్‌ను దుర్వినియోగపర్చినా అదే నేరం. అయితే ఇక్కడ మూలాన్ని పట్టుకోవడం చాలా కష్టం.మొెత్తంపైన అలాటి విద్వేషపు కథనాలు గల 34 వెబ్‌ పేజీలను తొలగించడానికి ఫేస్‌బుక్‌ అంగీకరించిందని ఒక సమాచారం. ఇందుకు భారత ప్రభుత్వం గడువు కూడా విధించింది. ఇలాటి 300 వెబ్‌సైట్లపై ఫేస్‌బుక్‌, ట్విట్లర్‌, గూగుల్‌తో సహా నాలుగు సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది. అయితే ఇంతటితోనే సమస్య తొలగిపోదు.ఎందుకంటే ఇలాటి కుటిల ప్రచారాలు చేసేవారు వెంటనే మరో ఇంటర్నెట్‌ సెట్టింగ్‌ మార్చుకుని మరో మార్గంలో వాటిని కొనసాగించవచ్చు. చైనా అలాటి అవకాశం లేకుండా కేబుళ్లలోనే పరిశీలన జరిపి అభ్యంతరకరమైన యుఆర్‌ఎల్‌లను అడ్డుకోగలుగుతున్నది. మనమూ ఆ దిశలో ప్రయత్నం చేయాలని నిపుణులంటున్నారు. ఇందుకోసం అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి కపిల్‌ సిబాల్‌ చెప్పారు గాని అమెరికా ప్రతినిధి విక్టోరియా నులంద్‌ అలాటిదేమీ లేదని అన్నారు. పైగా శాంతిభద్రతల పేరిట ఇంటర్నెట్‌ స్వేచ్చను హరించవద్దని నీతులు చెప్పారు. అదే నిజమైతే వికీలీక్స్‌ను ఎందుకు నిషేదించారు,అసాంజేను ఎందుకు వేటాడుతున్నారు అంటే అది వేరు ఇది వేరు అని తప్పుకునేందుకు తంటాలు పడ్డారు. ఇండియా సరైన ఛానల్‌లో తమదగ్గర ఫిర్యాదు చేయడంలేదని పేచీ పెట్టిన ట్విట్టర్‌ ఎట్టకేలకు స్పందించిందంటున్నారు.వీటన్నిటి అంతిమ ఫలితం ఏమిటనేది ముందు ముందు తేలాలి.

దేశ వ్యాపితంగా అస్సామీయుల వలసలు ప్రవాహమౌతుంటే ప్రశాంతతను కాపాడుకున్న ఘనత కేరళకే దక్కింది. కేరళలో గణనీయమైన మైనారిటీ జనాభా వుండటమే గాక ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన వలస కార్మికులు కూడా ఎక్కు వే. అయినా కేరళలో ఈ పుకార్ల ప్రభావం ఎంత మాత్రం లేదు. బలమైన ప్రజాస్వామిక సంప్రదాయాలు ్ట కార్మిక సంఘాల నేపథ్యం ఇందుకు కారణమైంది. ి మెరుగైన జీతాలు జీవన పరిస్తితులు సామాజిక భద్రతా వాతావరణం వున్నందున ఏమాత్రం కలవరపడలేదు. కేరళ నుంచి బయిలుదేరే ఈశాన్య ప్రాంత రైళ్లలో ఎలాటి అదనపు హడావుడి కనిపించలేదు. పైగా కేరళలో వుండే వారు ప్రధానంగా శ్రమ జీవులు కాగా బెంగుళూరు నుంచి వెనక్కు వెళ్లిన వారు ఐటి తదితర వృత్తి నిపుణులు, విద్యార్థులు వగైరా తరగతులకు చెందిన వారు. వారు ఫేస్‌బుక్‌ వగైరాలు బాగా వాడుతుంటారు గనక ఆ ప్రభావానికి మరింత ఆందోళన చెందారంటారు కేరళ ప్రముఖులు. నిజానికి ఇంగ్లీషులో ఎస్‌ఎంఎస్‌లు కూడా వారు తెలుసుకోలేరు. గతంలో కేరళ తమిళనాడు సరిహద్దులోని ముళ్లపెరియార్‌ డ్యామ్‌ కూలిపోతుందన్నప్పుడు పక్కరాష్ట్రం నుంచి వలస వచ్చిన కార్మికులు కొందరు వెనక్కు వెళ్లిపోయారు.అయితే అదేమీ జరక్కపోవడంతో మూడు మాసాలలోపునే మొత్తం తిరిగి వచ్చారు. ఇప్పుడు బెంగుళూరు పూనే ముంబాయి,చెన్నై హైదరాబాదు తదితర చోట్ల నుంచి తరలి పోయిన ఈశాన్య ప్రజలు నిజానికి సరికొత్త ప్రపంచీకరణ ప్రతిరూపాలన్నది ఒక విశ్లేషణ.ఏమంటే వీరంతా చైనా ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్లలో ఎటిఎంలలో టూరిస్టు కార్లలో పనిచేస్తుంటారు. వారికీ కేరళలో వున్న వారికి తేడానే ఒక విధంగా ఆందోళనకు అడ్డుకట్ట అయింది.






No comments:

Post a Comment