Pages

Saturday, December 8, 2012

విశ్వసనీయతకు విఘాతం



ప్రాంతీయ పార్టీలుగా జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర వహిస్తున్న ప్రధాన ప్రాంతీయ పార్టీల వూగిసలాటలు, అవకాశవాదాలు పార్లమెంటులో ఎఫ్‌డిఐ ఓటింగులో స్పష్టంగా బయిటపడ్డాయి. ఎఫ్‌డిఐల ప్రవేశంపై సభ బయిట నిప్పులు కక్కుతున్న నేతలే సభలో వ్యతిరేకతను నీరుగార్చేందుకు సాధనాలు కావడం ఘోరం. ్ట ఎస్‌పిది అవకాశవాదం కాగా బిఎస్‌పి ది బూటకపు వ్యతిరేకత. ఆఖరుకు కాంగ్రెస్‌ వ్యతిరేకతకు చిరునామా మేమేనని తరచూ చెప్పుకునే తెలుగు దేశం రాజ్యసభ ఎంపిల్లో అత్యధికులు ఓటింగుకు ఎగనామం పెట్టి మన్మోహన వ్యూహానికి దోహదకారులైనారు. ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచినా అధికారికంగా ఆ పార్టీ నుంచి ఎలాటి తీవ్రమైన ప్రతిస్పందన లేకపోవడం కూడా ఆరోపణలకు బలం చేకూర్చుతున్నది. తెలుగు దేశం విశ్వసనీయతకు విఘాతం కలిగింది. కొంతమంది నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతుంటే మరికొంత మంది సర్దుబాటు సూచనలు చేయడం యుగళ గీతంలా సాగుతున్నది. ఆర్థిక సంస్కరణల విషయంలో గతంలోని తెలుగు దేశం సర్కారు ి దాని అధినేత కనపరిచిన అత్యుత్సాహం నేపథ్యంలో దీని వెనక విధానపరమైన వూగిసలాటలు కూడా వున్నాయా అన్న సందేహాలు కొన్ని వ్యక్తమవుతున్నాయి.కాంగ్రెస్‌ కుట్రలను కుటిలతలనూ ఎంతగా ఖండించినా ఆ ప్రలోభాల ప్రభావం నుంచి తమ ముఖ్య నేతలనే కాపాడుకోలేకపోవడం తెలుగు దేశం ప్రతిష్టను పలచబారుస్తుంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలలో వరుస పరాజయాలు, వలసల నిరోధించడంలో వైఫల్యం, ప్రాంతీయ సమస్యపై అస్పష్టత వంటి పలు సమస్యలతో సతమవుతున్న ప్రధాన ప్రతిపక్షానికి ఇది తాజా శరాఘాతం. ఎస్‌పి, బిఎస్‌పిలు ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లోనూ ఢిల్లీలోనూ ఇలాటి విన్యాసాలు చాలా చేసి వున్నందున పెద్ద సమస్య కాకపోవచ్చు గాని తెలుగు దేశంకు మాత్రం ఇది తీవ్రమైన సవాలు. 1993లో పి.వి.నరసింహారావు ప్రభుత్వాన్ని, 2008లో అణుఒప్పందం ఓటింగు సమయంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని ఆదుకున్న చరిత్ర ఆ పార్టీ ఫిరాయింపుదార్లదే. ్ట తెలుగు దేశం అధినేత తీవ్రమైన అస్తిత్వ పోరాటం చేస్తున్న తరుణంలో చరిత్ర పునరావృతమైన రీతిలో తగిలిన ఈ ఎదురు దెబ్బను ఎలా తట్టుకుంటారనేది చూడాల్సిందే. పార్టీలేవైనా వ్యక్తులుగా నేతలెవరైనా విలువలకు విధానాలకు కట్టుబడకుండా పదవులు ప్రయోజనాలే సర్వస్వమనుకునే స్వార్థ రాజకీయాల పరాకాష్ట ఈ పరిణామాలు

1 comment:

  1. తెలుగు దేశం M.P.లు ఓటింగుకి గైర్ హాజరు కావడం నారా వారికి తెలియజేయకుండా జరిగి ఉంటుందని నమ్మే వెర్రికుట్టె లెవరూ లేరు.నిశ్చయంగా ఇది నారా వారి పథకం ప్రకారం జరిగినదే.ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా పాలించే హక్కులేదని రోజూ గోల పెట్టే చంద్ర బాబు అవిశ్వాస తీర్మానం పెట్టనంటే పెట్టనని భీష్మించు కోవడం వెనుకా ఇలాంటి కుట్రే దాగి ఉందని ప్రజల విశ్వాసం. తన విశ్వతనీయతను చాటుకోవాలంటే బాబు గారు వెంటనే విశ్వాస తీర్మానం పెట్టితీరాల్సిందే.

    ReplyDelete