Pages

Saturday, March 19, 2011

నిజాయితీకి నీరాజనం-క్రాసింగ్‌ ప్రహసనం






ఇటీవలి కాలంలో శాసనమండలికి వివిధ నియోజక వర్గాల నుంచి ఎన్నికలు జరిగాయి.మరికొన్ని జరగబోతున్నాయి. రకరకాల రాజకీయ శక్తుల మధ్య తేడాను ఈ ఎన్నికలు కూడా విదితం చేశాయి.యుటిఎప్‌, జన విజ్ఞాన వేదిక వంటి ప్రజాస్వామిక సంస్థలకు చెందిన వారి నిజాయితీకి నీరాజనం పట్టారు ఓటర్లు. రాజకీయ పునరావాస కేంద్రంగా ధనరాశల అధిపతులకోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పునరుద్ధరణ జరిగిన మండలిలో ఈ తరహా ప్రతినిధులు ప్రముఖ స్థానం సంపాదించడం గత సారి జరిగిన గొప్ప పరిణామం. చెప్పుకోవడానికైనా చుక్కా రామయ్య వంటి ఆరోగ్యకరమైన ఆదర్శ వ్యక్తులు సభలో ప్రవేశించగలిగారు. వారిలో భాగమైన ఎంవిఎస్‌ శర్మ, వి.బాలసుబ్రహ్మణ్యం ఘనమైన సంఖ్యాబలంతో తిరిగి ఎన్నిక కాగా కొత్తగా శ్రీనివవాస రెడ్డి,డాక్టర్‌ గేయానంద్‌ కూడా
ఎన్నికయ్యారు. ధనపు రాశులను ఓడించి సభలో ప్రవేశించారు. ఇందుకోసం కార్యకర్తలు బుద్ధిజీవులు విశేషంగా శ్రమించారు. తమ ఉద్యోగ ఉపాధి హక్కుల కోసం నిలబడే మంచి అభ్యర్తులను ఎన్నుకోవాలని కృతనిశ్చయులైన ఓటర్లు ధనపు సంచులకు తగిన గుణ పాఠమే నేర్పించారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లొ పర్యటించినపుడు ఈ రచయితకు అలాటి ఆశాభావమే కలిగింది. అదే నిజమైంది కూడా. సభలో పిడిఎఫ్‌ బలం ఎనిమిదికి పెరగడం నేటి వాతావరణంలో స్వాగతించదగిన పరిణామం.
ఇందుకు భిన్నంగా శాసనసభ నుంచి మండలికి పది మంది అభ్యర్థులను ఎన్నుకోవడానికి జరిగిన ఓటింగు వివిధ పార్టీల దుస్తితిని బయిటపెట్టింది.వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పేరిట జగన్‌ కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన అనుయాయులైన శాసనసభ్యులు ధిక్కారానికి పాల్పడతారన్న అంచనా పూర్తిగా నిజమైంది. రాజ్యాంగ రీత్యా కాంగ్రెస్‌ సభ్యులుగా వ్యవహరించకపోతే వారి సభ్యత్వం రద్దవుతుంది గనక ఆ పేరుతోనే చలామణి అవుతూ తమ విధేయతను బయిట చెప్పుకునే ఎత్తుగడ వారు అనుసరిస్తున్నారు. మండలి ఓటింగులో తమకు కేటాయించిన మహ్మద్‌ జానీకి గాక మజ్లిస్‌ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా తమ ధిక్కారాన్ని ప్రకటించడం వూహించిన విషయమే. అదే సమయంలో మైనారిటీ అనుకూల ముద్ర కోసం ఉభయ పక్షాలూ తాపత్రయ పడటం కూడా ఇందులో స్పష్టం. అయితే జానీ ఎలాగో గెలవడంతో జగన్‌ వర్గం ఆశాభంగం చెందితే కిరణ్‌ కుమార్‌కు తొలి ఉపశమనం లభించిందని చెప్పాలి. దీని తర్వాత ఆ వర్గం వారిపై ఏదో ఒక విధమైన చర్యలు తీసుకునే క్రమం మొదలవడమూ వూహించిందే.ఇప్పుడు స్తానిక సంస్థల నుంచి జరగబోయే మండలి ఎన్నికల్లో జగన్‌ అనుయాయుల ప్రభావం ఏ మేరకు వుంటుందనేది తర్వాతి సన్నివేశం.అనంతపురంలో జెసి దివాకర రెడ్డి వర్గం కూడా అసమ్మతి స్వరం వినిపిస్తున్నది. మొత్తంపైన పాలక పక్షం ఇరకాట స్థితి అప్పుడే తొలగిపోక పోవచ్చు.
మండలి ఎన్నికల్లో తెలుగు దేశం మూడు స్తానాలకు పోటీ చేయగా ద్వైపాక్షిక అవగాహన ప్రకారం సిపిఐ ఒక అభ్యర్తిని నిలిపింది. ఆయనకు సిపిఎం కూడా ఓటు చేసింది. ఈ నలుగురు అభ్యర్తులు గెలిచి జానీ ఓడిపోతున్నట్టుగా ఆఖరు వరకూ నడిచిన లెక్కింపు చివరి క్షణంలో మారి ఆయన వెంట్రుక వాసిలో నెగ్గడం, ప్రతిభా భారతి ఓడిపోవడం సంభవించాయి.దీనిపై తెలుగు దేశం కోర్టుకు వెళుతున్నట్టు సమాచారం.
ఈ ఎన్నికల్లో అందరికన్నా ఇబ్బంది కరమైన పరిస్తితి టిఆర్‌ఎస్‌ ది.తమ బలం సగానికి కూడా లేకపోయినా తమ వారి క్రాస్‌ ఓటింగు ఆపేందుకే ఆ పార్టీ అభ్యర్తిని నిలబెట్టింది.బిజెపి కూడా వారికేఓటు చేస్తానని చేశానని చెప్పింది.ఇవన్నీ కలిసినా టిఆర్‌ఎస్‌కు 11 ఓట్టే రావడాన్ని బట్టి వారి శాసనసభ్యులు క్రాస్‌ ఓటింగు చేసినట్టు స్పష్టమై పోతున్నది.పైగా ప్రాంతీయ కోణంలో సమీకరణలు వుండొచ్చని ఓట్లురావచ్చని వేసిన అంచనాలు ఏ మాత్రం ఫలించకపోగా కేవలం పార్టీల వారిగానే నడిచింది.
విద్యాధికుల స్థానాల్లో వామపక్ష భావాలు అభ్యర్థులు విశేషంగా ఎన్నికవగా సాక్షాత్తూ శాసనసభ్యుల బలం వుండి కూడా పార్టీలు నానా తంటాలు పడటం రెండు భిన్న వరవడులను సూచిస్తుంది.

No comments:

Post a Comment