Pages

Sunday, March 13, 2011

ప్రజల చైతన్యంపైన అపారమైన నమ్మకం




1. విధ్వంసంపైన దాడులపైన చేసే విమర్శలు సంబంధిత శక్తులకు వర్తిస్తాయి తప్ప సాధారణ ప్రజలకు కాదు. టాంకు బండుపై విధ్వంసం చేసిన వారిని, ఆ చర్య తీరును ఖండించడం తెలంగాణా ప్రజలను లేదా ప్రాంతాన్ని ఖండించడం అనుకోవడమే అర్థ రహితం.
తెలంగాణా ప్రజల లౌకిక ప్రజాస్వామ్య పోరాట సంప్రదాయాలకూ ఈ అరాచక పోకడలను సంబంధం లేదన్నది నా ప్రధాన వాదన.(లౌకిక ప్రజాస్వామిక అన్నది ఒక ప్రయోగం) ప్రాంతాల వారిగా రాజకీయాలు నడపడం స్వార్థ రాజకీయ వేత్తల పని. మొత్తం పరిణామాలను ఒకే కొలబద్దతో చూడటం ప్రజాస్వామిక పద్దతి.వూరికే వుద్రేకపడి దూషణలకు దిగే మిత్రులు కాస్తయినా వాస్తవికంగా ఆలోచిస్తే తెలంగాణా ప్రజల పేరిట కుటిల రాజకీయాలు సాగుతున్న వైనాన్ని తెలుసుకోగలుగుతారు.
తాలిబాన్లన్న మాట నేను వాడలేదు. మొదట స్పందించిన మిత్రుడు వాడితే అసహనానికి పాల్పడిన వారిని ఏ పేరుతో పిలిస్తే అది వర్తిస్తుందన్నాను తప్ప ప్రజలను అనలేదు. అనను కూడా. ప్రజల చైతన్యంపైన నాకు అపారమైన నమ్మకం వుంది.వారే ప్రజాస్వామిక విలువలను పరిరక్షించుకోగలరు.

2.విగ్రహ విధ్వంస సందర్భాన్ని కుటిల రాజకీయాల వుచ్చులో తమ ప్రాణాలు తామే తీసుకున్న అమాయక సోదరుల యువకుల ఆత్మాహుతిని ఒకే గాట కట్టడం మరింత అర్థ రహితం. మనుషుల ప్రాణాల విలువ ఎప్పుడూ ఎక్కువే. వాటిపై అధికార రాజకీయాలు నడిపే వారు అందుకు సమాధానం చెప్పాలి.
రాష్ట్ర విభజనపై నిర్ణయం రాజకీయ సమస్య తప్ప ప్రాణాలు తీసుకోవలసిన అంశం కాదు. దేశంలో ఎక్కడైనా సరే విధానాలు మారని విభజనలు యువత భవిత మార్చేదేమీ వుండదు. ప్రాణ చైతన్యంతో పోరాడటం నేర్చుకుంటే ప్రజల జీవితాలు మారతాయి తప్ప ప్రాణాలు తీసుకోవడం వల్ల కాదు.
చరిత్రలో వీర తెలంగాణా సాయుధ పోరాటంతో సహా మహత్తర ప్రజా పోరాటాలు ఉద్యమాలు చాలా జరిగాయి. ఏనాడూ ఇలాటి విషాదం చూడలేదు. ఈ పరిస్తితిని ఎలా నివారించాలన్నది అసలు ప్రశ్న.

3. చర్చలో విస్త్రతంగా పాల్గొన్న మిత్రులకు కృతజ్ఞతలు తెల్పుతూనే రెండు మాటలు. నేను రాసిన దానిపైన వ్యాఖ్యలు చేయడం మెరుగు తప్ప మీలో మీ వాదోపవాదాలకు దీన్ని వేదికగా చేసుకోవద్దని మనవి.
ఎవరి భావాలు ఏవైనా ఒకరినొకరు దూషించుకోవడానికే అయితే బ్లాగులూ చర్చలూ ఎందుకు? అందుకోసమే ఉద్దేశించే వారికి ఇకపై జవాబులుండవు.

1 comment:

  1. రవి గారూ,
    ఆకతాయిల సెగ మీదాకా వస్తే కానీ తెలిసినట్టు లేదు. కానీ అదేదో ఆటోమేటిగ్గా పబ్లిష్ అయ్యేబదులు మీ మోడరేషన్ పూర్తయ్యాకే పబ్లిష్ అయ్యేలా చూసుకుంటే మంచిదేమో. ప్రతిదాన్నీ పబ్లిష్ చేసేసి తర్వాత "బూతు పంచాగం విప్పకండి"లాంటి మంచి మాటలతో చెప్పినా వీళ్ళకు ఆనదు. అందుకే మోడరేషన్ అంటే అభ్యంతరకర కామెంట్లుంటే అసలు పబ్లిష్ చెయ్యకుందా ఉంటేతప్ప వీళ్ళకు ఆనదు.

    ReplyDelete