Pages

Saturday, March 19, 2011

పాక్షిక వ్యూహాల మధ్య ప్రజా ప్రతిధ్వని



సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, ఎస్‌.వీరయ్య,జి.నాగయ్య, ఎం.బాబూరావులు దళిత గిరిజన తదితర ప్రజా సమస్యలపై చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఇటీవలి రాజకీయాలలో కొత్త మలుపు. పాక్షిక వ్యూహాల వల్ల అనిశ్చితిలో కూరుకుపోయిన ఆంధ్ర ప్రదేశ్‌లో అణగారిన ప్రజల సమస్యల పట్ల సమగ్ర దృక్కోణాన్ని ఆవిష్కరించే సమరశీల ప్రయత్నంగా దీన్ని అభివర్ణించవచ్చు. జగన్‌ తిరుగుబాటు, విభజన ఉద్యమం ఈ రెండు సమస్యల చుట్టూనే పరిభ్రమింపచేస్తూ అసలు అంశాలను మరుగు పర్చే కుటిలయత్నం పాలకపక్షం చేస్తున్నది. రాష్ట్ర భవిష్యత్తుపై రాజకీయ నిర్ణయం ఇప్పట్లో వెలువడటం కష్టమని స్పష్టమైన తర్వాతనైనా
ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలపై పోరాటాలకు నడుం కట్టవలసిన బాధ్యత రాజకీయ పార్టీలది. ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష తెలుగు దేశం కూడా ఆ దిశలో నడిచే బదులు ప్రాంతీయ సమస్యలపై పరి పరివిధాల మల్లగుల్లాలు పడుతున్నాయి. నిజానికి ప్రాంతాల తేడాలతో నిమిత్తం లేకుండా దళిత గిరిజన ప్రజానీకం చిరకాలంగా సమస్యలలో మగ్గిపోతున్నారు. ఉద్యోగాల కోత, ఉపాధి రాహిత్యం, అధిక ధరలు, కౌలు దారుల వెతలు, రైతాంగం బాధలు, చేనేత కోతలు, సూక్ష్య రుణ వేధింపులు, ప్రైవేటీకరణ దాడులు, పన్ను పోట్లు, అధిక ధరలు, భూ సంతర్పణలు వంటివి రాష్ట్రాన్ని పరిహసిస్తున్నాయి. ఇలాటి సమయంలో అత్యంత కీలకమైన సుమారు యాభై సమస్యలపై ఈ నిరాహార దీక్షలు ప్రారంభించడం అందరి మన్నన పొందుతున్నది.
కొన్ని ఛానళ్లు దీనికి ప్రాంతీయ కోణం నుంచి వ్యాఖ్యానం ఇస్తున్నాయి.మరోవైపు కాంగ్రెస్‌ నేతలు తులసిరెడ్డి లాటి వారు సిపిఎం రాజకీయాల కోసం చేస్తున్నట్టు ఆరోపించడం ఇంకా హాస్యాస్పదం ఉనికి లేకుండా చేయబడుతున్న అభాగ్య ప్రజానీకం ఆర్తరావాలు వినిపించని అధికార ప్రతినిధులకు నిరాహారదీక్షలే ఉనికి ప్రయత్నాల్లా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రణాళికే సంఘమే చెప్పినట్టు ఎస్‌సి ఎస్‌టి సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని నిరాహర దీక్ష తలపెట్టడంలో సిపిఎం రాజకీయ ప్రణాళికలేముంటాయి? అహౌరాత్రులు ఎస్‌సి ఎస్‌టి బలహీన వర్గాల జపం చేసే అధికార పార్టీకి నిర్దిష్టంగా ఆ తరగతుల సమస్యలు తీసుకోవడం అపరాధంగా కనిపిస్తోంది. వారికి ఉద్దేశించిన వ్యయంలో 9 శాతమైనా నిజంగా ఖర్చు చేయలేదని అన్ని అధ్యయనాలు చెప్పడమే గాక అమాత్యులు కూడా అంగీకరిస్తున్నారు. అయినా తులసిరెడ్డి 12 శాతం ఖర్చు చేసినట్టు అవాస్తవాలు వల్లిస్తున్నారు.జలయజ్ఞం, ఐటి పార్కు వగైరాలన్ని సబ్‌ ప్లానులో చూపించేసి వాటిని కూడా సరిగ్గా పూర్తి చేయకుండా వదిలేయడం ఎలాటి విధానం? 57 వేల దళిత వాడలు, 22 వేల గిరిజన ఆవాసాలతో జనాభాలో 67 శాతం వున్న ఈ వర్గాలను పట్టించుకోకుండా అభివృద్ధి అర్థమేమైనా వుందా? ఆఖరుకు సంబంధిత కమీషన్లకు చైర్మన్లను కూడా నియమించలేని దుస్థితి ఎందుకేర్పడింది? భూ పందేరాల వల్ల నష్టపోయేది ప్రధానంగా ఈ వర్గాలే. ప్రపంచీకరణ విధానాల పెనుతాకిడికి బలవుతున్నదీ వీరే. అందుకే వారికి సంబందించి కేటాయించవలసిన 26 వేల కోట్ల రూపాయలు వెచ్చించాలన్నది ప్రధానమైన న్యాయమైన కోర్కె. దానిపై స్పందించే బదులు దీక్షలే తప్పనట్టు ఆక్రోశించడం ఏలిన వారికి తగని పని. దీక్షలు అవసరం లేదని చెబుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి గతంలో వైఎస్‌, తానూ కూడా నిరాహారదీక్షలు చేసిన సంగతి మర్చిపోతున్నారు. సమస్యలపై వినతి పత్రాలను పరిశీలించి పరిష్కరించేబదులు అధికారులకు పంపించానని అనడం ఆయన స్థానానికి నప్పేది కాదు.ఈ దీక్షలు హఠాత్తుగా జరుగుతున్నవీ కాదు. వీటికి ముందు జిలాలలోనూ వివిధ రూపాల్లో ఆందోళనలు, యాత్రలు జరిపి వివరాలను తెలియజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా ఎత్తి చూపిన వారిపై ఎదురు దాడి చేయడం చెల్లుబాటయ్యేది కాదు. సిపిఎం సమస్యలపై పోరాటాలు తగ్గించిందని ఆరోపణలు చేసిన వారు,అనవసరంగా ఆనందించిన వారు ఈ నిరాహారదీక్షలపై రకరకాల వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. 22వ తేదీ బహిరంగ సభతో తారాస్థాయికి చేరే నిరాహార దీక్షలు అనివార్యంగా సమరశీల సంప్రదాయాలను మరోసారి చాటి చెబుతాయి.. ఈ లోగానే ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయాలు తీసుకోవాలసని ఆశించుదాం.

1 comment: