Pages

Saturday, March 26, 2011

పాలకవర్గ క్రీడల పరాకాష్ట






ఈ వారం ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలలో రకరకాల పాలక వర్గ పక్షాల పాచికలాట పరాకాష్టకు చేరింది. ప్రయోజనాల ఘర్షణలో వారి ప్రహసనాలు అనేకానేక రూపాల్లో ప్రదర్శితమైనాయి. కాంగ్రెస్‌,తెలుగు దేశం,వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌,టిఆర్‌ఎస్‌లతో సహా అన్ని పక్షాలూ పరి పరి విధాల సవాళ్లను ఎదుర్కొన్నాయి. శుక్రవారం నాడు దేశ రాజధానిలో కాంగ్రెస్‌ అధిష్టానం ప్రతినిదితో ఇరు ప్రాంతాల కాంగ్రెస్‌ ఎంపిలు విడివిడిగా సమావేశమై పాత విన్యాసాలనే పునరావృతం చేశారు. తెలుగు దేశంలోనూ ప్రాంతాల వారి విభేదాలతో పాటు ఒకే ప్రాంతానికి చెందిన వేర్వేరు నాయకులు భిన్న స్వరాలు వినిపించే విచిత్ర పరిస్థితి ఎదురైంది. టిఆర్‌స్‌ కాంగ్రెస్‌ విలీనం సమస్యపై ఎడతెగని మీమాంస సాగుతుండగానే శ్రీకృష్ణ కమిటీ రహస్య అద్యాయంపై హైకోర్టు తీర్పు ప్రకంపనాలు సృష్టించింది.

ప్రాంతీయ వ్యూహాలు- పార్టీలు

రాష్ట్ర రాజకీయ భవితవ్యంపై మే నెలలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ముగిసే వరకూ ఎలాటి ప్రకటన రాదని అంటూనే ఆ లోగా వీలైనంత వ రకూ వివాదాలు పెంచేందుకు ఎవరికి తోచింది వారు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ నేతలైతే తెలంగాణా, సీమాంధ్రల పేరిట విడివిడిగా మాట్లాడుతూ
వేడి కొనసాగిస్తున్నారు తప్ప ఒకే పాలక పార్టీకి చెందిన వారుగా బాధ్యత ప్రదర్శించడం లేదు. కొత్తగా మరోసారి రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యత తీసుకున్న గులాంనబీ ఆజాద్‌ను కలుసుకున్న తర్వాత కలసి పోటో తీయించుకోవడానికి కూడా సిద్ధం కాకపోవడం ద్వారానూ, తాము మాట్టాడుకోనేలేదని చెప్పడం ద్వారానూ ప్రజలను కూడా అలాగే వుండమని చెబుతున్నారా అని సందేహం కలుగుతుంది. అన్నదమ్ముల్లా విడిపోదామనే వారు ఆగర్భ శత్రువుల్లా అభినయించవలసిన అవసరం ఏమిటో వారికే తెలియాలి.అందుకు అవకాశం ఇస్తున్న అధిష్టానం సంగతి సరే సరి.కాని ఓటింగుల్లోనూ, పదవుల వేటలోనూ ఆఖరుకు వ్యాపారాల్లోనూ కూడా ఈ తేడాలేమీ లేకుండానే వీరంతా కలసి వ్యవహరించడం బహిరంగ రహస్యం. కలసి వచ్చిన తర్వాత చెప్పే మాటల్లోనూ ప్రాంతాల వారీగా చిత్రించడం తప్ప అధికారిక వివరణ అంటూ వుండటం లేదు. దీన్ని బట్టి చూస్తే పథకం ప్రకారమే ఇదంతా సాగిస్తున్నట్టు స్పష్టమవుతుంది.
టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ విలీనం గురించి వచ్చిన చర్చను కూడా ఈ నేపథ్యంలోనే చూడొచ్చు. ఎంఎస్‌వోల సమావేశంలో కె.సిఆర్‌ చేసినట్టు చెప్పబడుతున్న వ్యాఖ్యను గట్టిగా ఖండించినప్పటికీ అది చాలా పరిమితంగా ఆగిపోయింది. అదే రోజున చర్చలో ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని కూడా ఆ పార్టీ అగ్రనేతలు స్పష్టంగా చెప్పారు. అవన్నీ అలా వుంచి మరుసటి రోజున సాక్షాత్తూ కెసిఆర్‌ స్వయంగా ఆ మేరకు సూచన చేస్తూ విలీనం ప్రతిపాదన వస్తే తెలంగాణా ప్రజల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీన్ని సూటిగా చెప్పాలంటే ఈ విషయంలో తలుపులు తెరిచే వున్నాయని స్పష్టం చేశారన్న మాట. గతంలో పిఆర్‌పి విలీనం అయింది. అలాగే ఏ పార్టీ అయినా విలీనంతో సహా తమ భవిష్యత్తు గురించి తాను నిర్నయం తీసుకోవచ్చు. మరి అదే నిజమైతే దాని గురించి వివాదం లేదా ఖండన మండనల అవసరమేమిటి? ఆ ప్రసక్తి లేదు అంటే అదో విషయం. పరిశీలనకు సిద్దంగా వున్నప్పుడు విలీనం ప్రస్తావన రావడం సహజంగానే జరుగవచ్చు.
తెలుగుదేశం విషయానికి వస్తే నాగం జనార్థనరెడ్డిపై వారిలో వారే విమర్శలు చేసుకోవడం పరిస్థితిని జటిలం చేసింది.ప్రాంతీయ తేడాలు లేకుండా ఆయన పిఎసి పదవిపై ఆ పార్టీ వారే వ్యాఖ్యలు చేయడం, రాజినామాలు కోరడం ఇబ్బందికరమైన స్తితిని సృష్టించింది. ఢిల్లీ వెళ్లి హౌంమంత్రి చిదంబరానికి వినతి పత్రం సమర్పించినప్పుడు మీ పార్టీ తరపున ఇస్తున్నారా అంటూ ఆయన వెటకారంగా మాట్లాడ్డం పుండుమీద కారం చల్లినట్టయింది. ప్రాంతీయ వివాదం వల్ల ప్రయోజనం తమకే పరిమితం కావాలన్న ధోరణి హౌం మంత్రి మాటల్లో ధ్వనిస్తే ద్వంద్వ భాషణంలో వున్న చిక్కు తెలుగు దేశం పోకడలో బహిర్గతమైంది.

రహస్య అధ్యాయంపై రభస

ఈ సమయంలోనే శ్రీకృష్ణ కమిటీ రహస్యంగా వుంచిన ఎనిమిదో అధ్యాయం గురించి హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డి తీర్పు, అందులోని వ్కాఖ్యలు కొత్త వివాదానికి కారణమైనాయి. రహస్యంగా ఇచ్చినట్టు చెబుతున్న ఈ ఎనిమిదో అధ్యాయంలో భాగాలు కొన్నిటినీ న్యాయమూర్తి తన తీర్పులో విస్తారంగా వుటంకించి రెండు వారాల్లో మొత్తం విడుదల చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అటు శ్రీకృష్ణ కమిటీ , ఇటు నరసింహారెడ్డి ఉభయులు వైఖరులు చట్టం తెలియని వారికి తేలిగ్గా అర్థం కావు. ఎందుకంటే ఆ రహస్య భాగంలోంచి పొందు పర్చిన అంశాలు నిజానికి చాలా కాలంగా నానుతున్నవే. విభజన జరిగితే మత సంబంధాలలో పొందికల్లో వచ్చే మార్పులు, మావోయిస్టుల ప్రాబల్యంపై అంచనాలు కొత్తవేమీ కాదు. ఆధారం లేనివీ కావు. అలాగే విద్యా సంస్థలు,మీడియా సంస్థల యాజమాన్యాలను గురించి విభజన వాదులు చాలా కాలంగా చేస్తున్న విమర్శలు కూడా కొత్త కాదు. కాకపోతే ఇవన్నీ సాధికార నివేదికలో చోటు సంపాదించడమే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యాజమాన్యాలు ఏవైనా ప్రాంతాలను బట్టి నడుస్తాయన్న వాదననే శ్రీకృష్ణ కూడా వినిపించడం ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోణాన్ని విస్మరించింది. మీడియాలో అనేక లోపాలు వివాదాస్పద ధోరణులు వున్నాయి.కాని విలేకరులూ సంపాదకులు యజమానులూ వేరు వేరన్నట్టు వారి వల్లనే అంతా జరిగిపోతున్నట్టు చెప్పడం అశాస్త్రీయం కూడా. మీడియా సంస్థలను ప్రాంతాల వారీ విభజన చేసి చూపడం కూడా విచిత్రమే. ఆ పైన మీడియాను మేనేజ్‌ చేయాలని సూచనలు ఇవ్వడం మరీ దురూహ్యం. పోలీసుల వినియోగంపైన , అంతకు మించి టిఆర్‌ఎస్‌ను మంచి చేసుకోవడం వంటి రాజకీయాంశాలపైన నివేదికలో సలహాలుండటం పరిధికి సంబంధించని అంశం.
వీటిని వెల్లడించే సందర్భంలో ఇవి తెలంగాణాకు వ్యతిరేకమైనవిగా తీర్పులో వ్యాఖ్యానించడం కూడా విశ్లేషించబోవడం లేదన్న ప్రకటనకు భిన్నంగా వుంది. ఇవన్నీ ఆ కోవకు చెందినవని చెప్పలేము కూడా. మొడట్లోనే ఈ శీర్షికలో చెప్పినట్టు శ్రీకృష్న నివేదిక బహుకోణాల వేదిక. దానికి సంబంధించిన మరో అంశం తీర్పుతో వివాదంగా మారింది. అయితే దీన్ని బట్టి కమిటీకి గాని న్యాయమూర్తికి గాని ఉద్దేశాలు ఆపాదించడం కంటే దీనితో ముడిపడిన అంశాలను గమనించడం ముఖ్యం. ఇంతకూ కేంద్రం సకాలంలో నిర్ణయం లేదా తదుపరి చర్యలు చేపట్టివుంటే ఇలాటి వివాదాలకు అస్కారమే కలిగేది కాదు.

మండలి ఎన్నికల్లో ఎదురు దెబ్బ
మొన్న శాసనసభ నుంచి మండలికి జరిగిన ఎన్నికల్లో ఎలాగో బయిటపడిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వానిక స్తానిక సంస్థల నుంచి జరిగిన ఎన్నికల్లో మాత్రం తీవ్రమైన ఎదురు డెబ్బ తగిలింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పేరిట జగన్‌ ఏర్పాటు చేసిన పార్టీ తన రాజకీయ ఉనికిని నిరూపించుకుని సవాలు విసిరింది. ఎన్నికలు జరిగిన తొమ్మిది స్థానాల్లోనూ గతంలో వున్న ఆరింటిని మించి సాధిస్తామని ముఖ్యమంత్రి ముందుగా ప్రకటిస్తే మూడు మాత్రమే దక్కాయి. అందులోనూ ఆయన స్వంత జిల్లాలో ప్రత్యర్థులు పై చేయి సాధించారు. రాజకీయంగా ఇది ప్రతికూల పరిణామమే కాని కడపలో జగన్‌ వర్గం పరిమితమైన ఆధిక్యతే సంపాదించిందని పాలకపక్షం సంతోషిస్తున్నది. చిత్తూరులోనూ కేవలం ఒక్క ఓటుతోనే ఆ వర్గం నెగ్గింది.పశ్చిమ గోదావరిలో మూడో స్తానం దక్కింది. తెలుగుదేశం కూడా మూడు స్థానాలు గెల్చుకోవడం ద్వారా రెండు పెంచుకుంది. ఈ ఎన్నికల్లో ధన బలం విచ్చలవిడిగా పనిచేసింది గనక పూర్తిగా రాజకీయానికే పరిమితమైందని చెప్పలేకున్నా సారాంశం మాత్రం సర్కారుకు వ్యతిరేకంగానే వుందని చెప్పకతప్పదు. జగన్‌ శిబిరం కూడా అనేక పరిమితులను ఎదుర్కొంటున్నట్టు తేలిపోయింది. తెలుగుదేశం కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ గురించి జగన్‌ వర్గీయులు ఆరోపించగా అసలు వారి వర్గం వారినే కాంగ్రెస్‌ అభ్యర్థిగా కర్నూలులో గెలిపించుకున్న ఉదంతాన్ని ఇతరులు ఎత్తి చూపించారు. అనంతపురంలో జెసి వర్గం,చిత్తూరులో కిరణ్‌ వ్యతిరేకి మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి బాహాటరగనే సవాళ్లు చేశారు. జెసి రఘువీరాలు తీవ్రభాషలో మాట్లాడుకుంటే సందట్లో సడేమియాలా మంత్రివర్గంలోని బొత్స వంటి వారు కూడా అసమ్మతిరాగాలు ఆలపించారు. ఇవన్నీ అధికార పక్షంలో అంతర్గత వ్యవహారాల తీరుకు అద్దం పడతాయి. ఇదంతా అయిన తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన.. వర్చాక నష్ట నివారణ చర్యలు షరామామూలే. శాసనసభలో భూ పందేరంపై చర్చ కూడా ఈ సమయంలోనే రావడంతో జగన్‌ వర్గం ఇది రాజశేఖరరెడ్డిపై దాడి అంటూ రభస చేసింది. టిఆర్‌ఎస్‌ జగన్‌ వర్గం ఎప్పటికైనా కాంగ్రెస్‌లో కలిసి పోతాయని చండ్రబాబు విమర్శించారు. ఇది రాసే సమయానికి భూములపై సభా సంఘం వేస్తారా లేదా అనేది స్పష్టం కాలేదు గాని ఏదో ఒక చర్య తీసుకోవడం అనివార్యమే అవుతుంది

No comments:

Post a Comment