Pages

Tuesday, March 29, 2011

శాసనసభలా? భీషణ దూషణ సభలా?



 

ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ గవర్నర్‌పైన,జయప్రకాశ్‌ నారాయణ్‌పైన దాడులతో మొదలై సాక్షాత్తూ మంత్రివర్యులు ప్రతిపక్షంపై లంఘించిన దృశ్యంతో ముగింపు ఘట్టానికి చేరడం నిజంగా దారుణం. శాసనసభలు అనుశాసన(క్రమశిక్షణ) సభలుగా వుండవలసింది పోయి భీషణ దూషణ సభలుగా మారడం ఆందోళన కరం. వైఎస్‌పై తెలుగు దేశం సభ్యులు పట్టుకున్న ప్లకార్డులు నచ్చకపోతే వ్యతిరేకించడం వేరు, విరుచుకుపడటం వేరు. భూమి దానమిచ్చిన వైఎస్‌ వినోభాభావే అని ఆయన భక్తులు పొగిడిన రోజున తమ్ముణ్ని అందరూ వివేకానందుడని అంటారని
సభలో ఆయన చెప్పారు. వినోభాను అన్నారని వివేకానందుడు వీరంగం తొక్కడం సభా ప్రమాణాలను మరింత అధోగతికీడ్చింది.అన్నను అన్నారని ఆవేశపడ్డానని సమర్థించుకోవడం మంత్రుల స్తాయిలో కుదిరేది కాదు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ ఇది చీకటి చరిత్రగానే మిగిలిపోతుంది.
కడప బరిలో జగన్‌ గ్రూపుతో అంతగా తలపడి దాదాపు వారిని కట్టడి చేసిన వివేకా ఇప్పుడు ఇంతగా వూగిపోవడంలో ఆవేశంతో పాటు వ్యూహాలు కూడా వుండొచ్చు.అయితే ఆవేశమంతా అభినయం కిందనే అవతలి పక్షం కొట్టేయడం కూడా ఆసక్తికరమైన విషయం. సమస్య ఏమంటే వైఎస్‌ పై ఎంత అభిమానం వున్నా ఆయన హయాంలో జరిగిన అవినీతిపైన గాని అవాంచనీయ వ్యవహారాలపైన గాని దర్యాప్తు జరపకూడదనే మాట చెల్లదు.తెలుగు దేశం హయాంలో వాటిపైన కూడా విచారణ జరిపితే మంచిదే. అనివార్యంగా వారు కూడా అందుకు అంగీకరిస్తున్నారు.ఈ సభలో చర్చ చివరకు ఎలా పరిణమించేది చూడాలి.
మొత్తంపైన ఈ సారి సభ రభసలకే సరిపోవడంతో సమస్యలపై చర్చ శూన్యమై పోవడం అన్నిటికన్నా బాధాకరం. కాంగ్రెస్‌, తెలుగు దేశం,తెరాస పార్టీల సభ్యుల మధ్య సమన్వయం కూడా బాగా దెబ్బ తినిపోయింది. మొత్తంపైన ఎవరూ ఎవరినీ కట్టు బాటు చేయలేని దురవస్థ దాపురించింది. ఇదే అదనుగా ప్రభుత్వం కూడా ప్రతిష్టంభనల మాటున ప్రజా సమస్యలపై చర్చను దాటేసింది.. సభ ముగుస్తుంది.. సమస్యలు మిగిలుస్తుంది.. అంతే.

4 comments:

  1. తెర గారూ,
    ఈ విషయంలో ముఖ్యమంత్రితో లాలూచీ పడి మంత్రిపై చర్యకు తెదెపా పెద్దగా పట్టుబట్టలేదని వినిపిస్తుంది, మీరేమంటారు? అలాగే మంత్రిని శిక్శించలేని వారు డ్రైవర్ మల్లేష్‌ను ఏవిధంగా జైల్లో పెట్తారని కూడా ప్రశ్న వస్తుంది, వీటిపై మీ స్పందన ఏమిటి?

    ReplyDelete
  2. ఏది సత్యం గారూ,
    నా ఎంట్రీ పూర్తయిన క్షణాల్లోనే ప్రశ్నిస్తున్న మీ అప్రమత్తతకు ఆసక్తికి అభినందనలు.
    డ్రైవర్‌ విషయమంటారా? రాజకీయ సారథులను వదలిపెట్టి వాహన చోదకులను పట్టుకోవలసిన అవసరం లేదని నేను లోగడనే అన్నాను. మంత్రి, ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆ ఘటనలో వారు క్షమాపణలు చెప్పలేదనే సంగతి కూడా మనం గమనించాలి. చెప్పాలని నేను సూచించడం లేదు కూడా. వారి వారి ఇష్టంపై ఆధారపడి వుంటుంది. అయితే దాడులు ఎవరు చేసినా తప్పే అని మాత్రం అంటాను. రాజకీయ సమస్యలను రాజకీయంగానే పరిష్కరించుకోవాలి తప్ప రాగద్వేషాలతో ప్రయోజనం శూన్యం.
    కింద ఎంట్రీలో శ్రీ అనే బ్లాగర్‌ అడిగిన ప్రశ్నకు జవాబులో చెప్పాను- రాష్ట్ర రాజకీయాలలో మల్టిపుల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు సాగుతున్నాయని. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు.. ఇక శాసనసభలో జరిగిన దానిపై రకరకాల వాదనలున్నాయి. తెలుగు దేశం వారు కూడా తర్వాత కలబడిన దాఖలాలున్నాయి. ఆయన కళ్లజోడు కూడా కిందపడటం వగైరాలు జరిగాయి. కనక ఈ ఘటనలన్ని దురదృష్టకరమైనవే గాని పోటీ ఏమీ లేదు. ఇంతకూ సభా ప్రమాణాలు సంప్రదాయాలు గౌరవించాల్సిన బాధ్యతను అందరూ గుర్తించాలి. అవతలి వారిని విమర్శించి తాము అదే చేయడం వల్ల ఒకరినొకరు చూపిస్తూ అందరూ అదే చేయడం వల్ల ప్రయోజనం లేదు.

    ReplyDelete
  3. రవి గారు ప్రజలకు ఏమి జరిగిందొ తెలుసుకొవలసిన అవసరం లెదా? TRS వాలు చెస్తె వెంటనె videos రెలీస్ చెస్థారు. మరి మంత్రి చెస్థె మెడియాకి ఎలాంటి క్లిప్స్ ఇవ్వరు. ఎందుకంటె ఇది కెవాలం సీమంధ్ర ప్రబుథ్వం కబట్టి .
    మరి ఈప్పుడు మెధవులు అంధరు ఏమి చెస్థున్నరు ?
    Even you did not write in your artical

    ReplyDelete
  4. మల్టిపుల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌.. ఒకో అంశంలో ఒకో విధమైన మ్యాచ్‌ ఫిక్సింగ్‌.. నేను పదే పదే రాస్తున్నాను. చెబుతున్నాను. కేవలం ప్రాంతీయ పరమైన కోణం మాత్రమే చూడమంటారు కొందరు... ప్రాంతాల పేరు చెప్పే వాళ్లు కూడా ఫిక్సింగులకు అతీతం కాదు.. రకరకాల వేదికలపై కలసి వ్యవహరించడం అంతలో తిట్టుకోవడం మళ్లీ కలవడం దీంట్లో ఫిక్సింగులు లేవా? పైగా ప్రాంతీయ ఆధిపత్యాల వెనక వున్నది కూడా రాజకీయ ఆర్థికాధిపత్యపు కోణమే తప్ప వాళ్లకు ఎక్కువ అభిమానం వీళ్లకు తక్కువ అభిమానం అని లేదు. గతసారి సెలెక్టివ్‌గా క్లిప్పింగులు రావడం తప్పని అందరూ అన్నారు. అప్పుడు మీరన్నట్టు కేవలం టిఆర్‌ఎస్‌ మాత్రమే కాదు, తెలుగు దేశం వారూ వున్నారు.
    ఈ సారి రాజకీయంగా క్షమాపణలు చెప్పుకునేప్పుడు క్లిప్పింగుల ప్రాధాన్యత మాత్రం ఏముంటుంది? మొదట ఘటనలు ఆఖరి ఘటనలు కూడా అందరికీ సంబంధించినవి గానే చూస్తున్నాను తప్ప మరో విధంగా కాదు. ఇందులో ఎవరి ప్రయోజనాలు ఏమిటనేది బహిరంగ రహస్యమే. ఇది నా అభిప్రాయం.

    ReplyDelete