Pages

Saturday, October 8, 2011

అనిశ్చితి యథాతథం- ఆచరణ అగమ్యం



రాష్ట్ర రాజకీయాలలో ఏదో తీవ్ర నిర్ణయం జరగబోతుందన్న వాతావరణాన్ని ఈ వారాంతంలో కేంద్రం కల్పించింది. దసరా పండుగ రోజున గవర్నర్‌కు ప్రధాని పిలుపు అందినట్టు వచ్చిన వార్తలతో మొదలైన హడావుడి రాష్ట్ర కాంగ్రెస్‌ పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌ పునరుద్ఘాటన వరకూ కొనసాగింది. గతంలో చెప్పిన ప్రకారం సంప్రదింపులు జరపడం తప్ప త్వరితంగా చేస్తున్నదేమీ లేదని ఆయన తేల్చి చెప్పాక అనవసరంగా హైరాన పడిన వారికి ఆశ్యర్యమే మిగిలింది. షరా మామూలుగా ఇదంతా మీడియా హడావుడి అని చప్పరించేసి నేరం దానిపైకి నెట్టేస్తారు . రరరకాల మార్గాలలో ఏవేవో కథనాలు మీడియాకు అందించి కృత్రిమమైన వూహాగానాలకు ఆస్కారం కల్పించడం స్పందనలు గమనించిన తర్వాత కొట్టిపారేయడం కేంద్రానికి పరిపాటి అయింది. ఒక వైపున తమలో తామే
భిన్న వ్యాఖ్యలతో విభిన్న సంకేతాలిస్తూ ప్రజలను ప్రాంతాల వారిగా ప్రజలను గందరగోళ పరుస్తుంటారు. దానిపై వివిధ పార్టీలు ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థులు ఏం జరగుతుందో తెలియక తబ్బిబ్బవ్వాలి. అమాయకులైన ప్రజలు ఆవేశాలకూ ఆశలకూ లోనవ్వాలి. వాటితోనే రాజకీయాలు నడిపే వారికి మేత నివ్వాలి. వీటన్నిటి మధ్యనా తామేదో బృహత్తర బాధ్యతా యుత రాజకీయం నడుపుతున్న భంగిమలో కనిపించాలి.రెండేళ్ల నుంచి రాష్ట్ర పరిణామాలను కేంద్రం కదలికలను పరిశీలించేవారెవరికైనా కళ్లకు కట్టినట్టు కనిపించే పరమ సత్యమిది!

గత వారం కేంద్ర ప్రముఖులు పలు వ్యాఖ్యానాలు చేశారు. సకల జనుల సమ్మె గురించి కేంద్రం దృష్టికి తెస్తామని వెళ్లిన జెఎసి ప్రతినిధి వర్గం సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌నే కలసి వచ్చింది. ఆ చర్చల తర్వాత టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు తమకు అసంతృప్తి కలిగిందని, ప్రధాని ఎలాటి హామీ ఇవ్వలేదని ప్రకటించారు. ఆ తర్వాతనే చిదంబరం, ఆజాద్‌, అందరినీ మించి ప్రణబ్‌ ముఖర్జీ ఇంచుమించు ఒకే విధమైన వ్యాఖ్యలు చేశారు. వాటి సారాంశం చెప్పాలంటే 1. తెలంగాణా సమస్యపై కాల వ్యవధితో కూడిన ప్రకటన సాధ్యం కాదు. 2. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే పరిష్కారం చూడాలి.3. దీనిపై మరిన్ని సంప్రదింపులు వివిధ స్థాయిల్లో జరగాలి. ఈ మాటలు చెబుతూనే వారు సకల జనుల సమ్మెను విరమించాలని కూడా విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. ఇంకా సంప్రదింపులు అవసరం లేదని, ఆలస్యం వల్ల పరిస్థితి క్షీణించడం తప్ప ప్రయోజనం వుండదని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ లేఖ రాశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక నిచ్చి తొమ్మిది మాసాలు గడిచిపోయిన సంగతి కూడా గుర్తు చేశారు. ఆ కమిటీకి అన్నిపార్టీలూ అభిప్రాయాలు చెప్పాయి గనక దాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు. సమైక్య రాష్ట్రాన్ని రాజ్యాంగ ఏర్పాట్లతో కొనసాగించడమే ఉత్తమ పరిష్కారమని ఆ కమిటీ చెప్పింది. ఆ పైన పలు ప్రత్యామ్నాయాలనూ సూచించింది.
శ్రీకృష్ణ కమిటీ కూడా పరిష్కారం చెప్పలేకపోయిందని పదే పదే అంటున్న ఆజాద్‌ ఈ వాస్తవాన్ని దాటేస్తుంటారు. ఒక వేళ అది సరైంది కాదని తాము భావిస్తే తోసిపుచ్చి మరో ప్రకటన చేయొచ్చు.ఈ రెండూ చేయకుండా సంప్రదింపుల పేరుతో ఎడతెగని జాప్యం చేస్తూ రాష్ట్రాన్ని రాజకీయ అనిశ్చితికీ ప్రజా జీవిత స్తంభనకు గురి చేయడం కేంద్రం కుటిత నీతి తప్ప మరొకటి కాదు. దీనికి బాధ్యత అని ముసుగు బొత్తిగా నప్పేది కాదు. ఇప్పుడు నాలుగు పార్టీలు అభిప్రాయం చెప్పాలని చిదంబరం ఉవాచ. వాటిలో ముందుంది తమ పార్టీనే! అయినా ఆయన గంభీరంగానే మాట్లా డుతుంటారు. ఇక తెలుగు దేశం విషయానికి వస్తే చెప్పాల్సింది చెప్పాము అంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు గత వారం తమది తటస్థ వైఖరి అని కొత్తగా మరో మాట చెప్పేశారు. అంటే అనుకూలమూ వ్యతిరేకమూ కాదన్న మాట. మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన వొవైసీ తాము సమైక్య రాష్ట్రాన్ని లేదా రాయల తెలంగాణాను కోరుకుంటామని చెప్పేశారు. మిగిలింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌. శాసనసభలో ఒక్క సభ్యురాలు మాత్రమే వున్నారు.(సాంకేతికంగానూ, వాస్తవికంగానూ. ఎందుకంటే తక్కిన వారంతా రాజీనామాలు చేశారు) జగన్‌ కూడా ఇంచుమించు చంద్రబాబు లాటి ప్రకటనే ఇది వరకు చేసి వున్నారు. ఏతావాతా ఇక్కడ పితలాటకమంతా కాంగ్రెస్‌దేనని స్పష్టమవుతుంది. ఉన్న అధికారాన్ని కాపాడుకోవడం, తెలంగాణాలో పార్టీ ప్రజా ప్రతినిధులు జారిపోకుండా చూసుకోవడం, కోస్తా రాయలసీమలలో రేపు ఎదురు దెబ్బలు తగలకుండా చూసుకోవడం ఇది తప్ప కాంగ్రెస్‌కు మరో ధ్యాస వున్నట్టు కనిపించదు.ఈ క్రమంలోనే చర్చల సంప్రదింపుల పరంపరలు సాగిపోతుంటాయి. శనివారం పరిణామాలు అందుకు పరాకాష్ట. కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రిని పిసిసి అద్యక్షుడిని విడివిడిగా పిలిపించి అభిప్రాయ సేకరణ బహిరంగ తతంగంగా జరిపడం ప్రచారానికి మాత్రమే. వారి అభిప్రాయాలు అందరికీ తెలిసినవే. జైపాల్‌ రెడ్డి వంటివారు మరోసారి తమ ప్రాంతీయ విధేయతను చెప్పుకోవడానికి ఇది అవకాశమై వుండొచ్చు తప్ప వేరే ప్రభావమేమీ వుండబోదు.

ఈ దశలోనే రాష్ట్ర విభజనపై రకరకాల వూహాగానాలు స్వారీ చేశాయి. వాటిలో అర్థ రాయల తెలంగాణా ఆలోచనకు స్వయానా టిఆర్‌ఎస్‌ అధినేత గౌరవం కల్పిస్తే మంత్రి టిజెవెంకటేష్‌ ఆసక్తి కనపర్చారు. హైదరాబాదు ప్రతిపత్తిపైనా లెక్కలేనని కథనాలు కాలక్షేపం చేస్తున్నాయి.ఈ ప్రతిపాదనలపై స్పందనల కంటే ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించాల్సి వుంటుంది. విధాన నిర్ణయమే చేయకుండా వివరాలపై వివాదాలు రేపడం మరో వికృతం.వాటికి విలువనిచ్చి చర్చకు పెట్టడం ఇంకో విపరీతం. ఈ క్రమంలోనే టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ విలీనం అన్న మాటను కూడా కాంగ్రెస్‌ నేతలే చర్చకు పెట్టారు. అధికారిక స్పందన ఇంకా రాకున్నా విభజనకు అంగీకరిస్తే తర్వాత దాన్ని పరిశీలిస్తామన్న రీతిలో టిఆర్‌ఎస్‌ ముఖ్యులు కొందరు మాట్లాడారు. ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాలలో రకరకాల ఎత్తులు పై ఎత్తులు జిత్తులను వెల్లడిస్తున్నాయి. ఈ మధ్యలో బాన్స్‌వాడ ఉప ఎన్నిక ప్రాధాన్యత కోల్పోయిందనే చెప్పాలి.
ఇప్పుడు అందరి దృష్టి సకల జనుల సమ్మెపై వుంది. ఈ సమ్మె ఉధృతి వెనక కారణాలను లోగడ(సెప్టెంబర్‌ 25) సంచికలో చర్చించాము.ఆ పరిస్తితి పెద్దగా మారలేదు గాని తాము అలసి పోతే దాడి చేయొద్దని తెలంగాణా ఉద్యోగుల జెఎసి నేత స్వామిగౌడ్‌ చెప్పడం గమనించదగ్గది. ప్రజలను అమితంగా ప్రభావితంచేసే బస్సుల బంద్‌, కరెంటు కోతలపై రావలసిన చర్చలు రావడం ఆశ్చర్యం కాదు. మరో ప్రాంతం నుంచి వచ్చే బస్సులపై కొందరు రాళ్లు రువ్వడం అన్నిటికన్నా ఆందోళన కలిగించే పరిణామం. అలాగే రైతులను ప్రత్యేకంగానూ ఇతరులకు సాధారణంగానూ ఇబ్బంది కలిగిస్తున్న కరెంటు కోతకు బాధ్యత మీదంటే మీదని ప్రభుత్వం జెఎసి లు వాదించుకోవడం ఆసక్తికరం. సమ్మె నాయకులే దాని ప్రభావాన్ని తగ్గించి చెప్పడం, ప్రత్యామ్నాయాలు సూచించడం ఇంతవరకూ జరిగి వుండదు. ఇది పరిస్తితి సంక్లిష్టతను తెలియజేస్తుంది. ఏమైనా రాజకీయ ప్రధానమైన సమస్యలపై దీర్ఘకాలిక సమ్మెలకు దిగడం వల్ల ఉద్యోగ వర్గాలు గతంలో ఏమి నేర్చుకున్నాయో ఇప్పుడు కూడా అంతకన్నా భిన్నమైన ఫలితం వుండదు.
ఇన్నిటి మధ్యనా ఖచ్చితంగా వినిపించిన ఒకే ఒక స్వరం గవర్నర్‌ నరసింహన్‌ది కావడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. ఆయన కూడా రాష్ట్రపతి పాలన రాదని బల్లగుద్ది చెప్పేపని కేంద్రం ఆయనకు అప్పగించింది. అంటే కాంగ్రెస్‌ వాదులు తిరుగుబాటు చేసే అవకాశం లేదని కేంద్రం భావిస్తుందనేది స్పష్టం.
ఇవన్నీ ఇలా వుంటే ప్రకాశ్‌ కరత్‌ లేఖను తప్పు పడుతూ ఆంధ్రజ్యోతిలో ఆదిత్య చేసిన వ్యాఖ్య హాస్యాస్పదంగా వుంది. త్వరగా పరిష్కరించాలని ప్రదానికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. కాని ప్రధాని తన లేఖలో అలా స్పందించకపోగా అది సరైందేనని చెప్పారు. ఇక పోతే తెలంగాణా విషయంలో కమ్యూనిస్టులకు లాభంగాని నష్టం గాని వుండవంటున్న ఆదిత్య గత చరిత్రను గాని ఇప్పటి బలాబలాలను గాని కనీసంగా అర్తం చేసుకున్నారా అని సందేహం కలుగుతుంది. కమ్యూనిస్టులను ఎంతగా వ్యతిరేకించేవారైనా ఖమ్మం నల్గొండ వంటిచోట్ల వారికి గల ప్రజా పునాదిని విస్మరించలేరు. కాని నిశిత పరిశీలనలు రాసే ఆదిత్య మాత్రం వారిని అతి తేలిగ్గా తీసి పారేశారు. మళ్లీ ఆయనే ఈ సమస్యలో సిపిఎం సిపిఐ మధ్యవర్తులుగా వ్యవహరించాలని ప్రతిపాదించడం మరో విచిత్రం! పాలక వర్గాలు కావాలని చెలగాటమాడుతుంటే ఆ పాచికలాటకు మధ్యవర్తిత్వం వహించే పొరబాటు కమ్యూనిస్టులు ఒక్కనాటికి చేయరు. ప్రజల తరపున చొరవ తీసుకుని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తారు. ప్రజలకు వాస్తవాలు చెబుతారు. ఈ సంక్లిష్ట సన్నివేశంలోనూ వివిధ ప్రాంతాల ప్రజలు పాలకుల పన్నాగాలను స్వార్థ పరుల పథకాలను అర్థం చేసుకోవాలని అప్రమత్తంగా వ్యవహరించాలని ఆశించుదాం.

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. విశాఖన్‌ గారికి,

    మీరు చెప్పింది దృష్టిలో పెట్టుకుని ఎడిట్‌ చేశాను. ధన్యవాదాలు. మీరు రాసింది నాకోసమే గనక మీ కామెంట్‌ కూడా అవసరం లేదనుకుంటున్నాను. దీనిపై చెప్పేదేమైనా వుంటే తర్వాత చెబుతాను.

    ReplyDelete