Pages

Tuesday, July 31, 2012

డేంజర్‌ పట్టాలపై రైళ్లు!


ప్రతిష్టాత్మకమైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఎస్‌-11 బోగీ కాలి బుగ్గయి పోవడం, 32 మంది సజీవ దహనం కావడం మనసులను కలచి వేసే దారుణం. సందర్శనలు, సంతాపాలు, దర్యాప్తు నివేదికలు షరా మామూలుగా జరిగిపోతాయి గాని దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామా? రైల్వేల అభివృద్ధి ఆధునీకరణ గురించి కోతలు కోసే పాలకులు ప్రయాణీకుల భద్రతా ప్రమాణాలను సదుపాయాల కల్పనను గాలికొదిలేస్తున్నారు. ఉదాహరణకు ఈ ఏడాది బద్జెట్‌లో 60 వేల కోట్ల ప్రణాళిక ప్రతిపాదిస్తే అందులో భద్రతకు కేటాయించింది కేవలం 2000 కోట్లు! అవైనా వినియోగం అందులోనూ సద్వినియోగం అవుతాయన్న హామీ లేదు. చాలా కాలంగా రైల్వేల్లో నియామకాలు స్తంభించిపోయాయి. 18 లక్షల నుంచి సిబ్బంది సంఖ్య 14 లక్షలకు తగ్గింది. మరీ ముఖ్యంగా రైళ్లు నడిపే లోకో రన్నింగ్‌ సిబ్బందిని బాగా కోత కోసి 36 గంటలు కూడా నడిపిస్తున్నారు.ట్రాక్‌ మెన్‌ ఎప్పటికప్పుడు తనిఖీ చేయవలసిన అవసరం వుండగా దాదాపు ఆ పద్ధతినే ఎత్తి వేస్తున్నారు. కొత్త లైన్లు వేయలేదు గాని రైళ్లు, బోగీలు, బెర్తులు అన్నీ పెరిగాయి.రోజుకు రెండు కోట్ల మందిని చేరవేసే రైల్వేలు భద్రతకు ప్రథమ ప్రాధాన్యత నివ్వాల్సి వుండగా వున్న ఏర్పాట్లకు కూడా తిలోదకాలిస్తున్న స్థితి. పెట్టెలలో తనిఖీ, పట్టాల తనిఖీ రెండూ
దిగజారాయి. పైగా ఔట్‌ సోర్సింగ్‌ పేరిట ఒకో విభాగాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేయడంతో ఎవరు వస్తున్నారో ఎవరు చూస్తున్నారో తెలియని స్థితి. లెవల్‌ క్రాసింగులు,సిగలింగు, కరెంటు, దొంగ తనాల నివారణ వంటివాటికి అవసరమైన సిబ్బంది లేరు. సాంకేతికంగా కూడా మంటలు పొగ వస్తే హెచ్చరించే అలారం వంటివి ఏర్పాటు చేయడం లేదు. కాలం చెల్లిన 600 వంతెనల పునర్మిర్మాణం లేదు. మంటలు వ్యాపించకుండా చేసే పెట్టెలు నిర్మించే అవకాశం వున్నా ఆ పని జరగడం లేదు. గూడ్సు రవాణాలోనూ ప్రైవేటు కంపెనీలకు బోలెడు రాయితీలతో పాటు వ్యాగన్లు లైన్లు కూడా అప్పగిస్తున్న స్థితి. ప్రయాణీకుల వైపు కాకుండా ప్రైవేటు వైపు చూస్తూ భద్రతను బలి చేస్తున్న కారణంగానే ఇలాటి ఘోరాలు జరుగుతున్నాయనేది అసలు కారణం. విద్రోహం అంటే తమ బాధ్యత కానట్టు మాట్లాడుతున్నారు గాని నిజానికి విద్రోహాలు విపత్తుల నుంచి కాపాడేందుకే కదా భద్రతా వ్యవస్థ! ప్రయాణీకులు కూడా తమ వంతు జాగ్రత్త పాటించడం, టీసీలు మరీ కక్కుర్తి పడకుండా వుండటం , ఆర్‌పిఎప్‌ మరింత అప్రమత్తంగా వుండటం కూడా అవసరమే..తాజా బడ్జెట్‌ సమయంలోనూ శ్యాం పిట్రోడా కమిటీ అనిల్‌ కాదొర్కర్‌ కమిటీ సిఫార్సుల గురించి చెప్పారు. అయితే అభివృద్ధికి 5,60,000 కోట్లు కావాలన్న రైల్వే శాఖ ఆ ప్రణాళికలోనూ భద్రతకు ప్రాధాన్యత నివ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.ప్రాంతీయ నేతల ప్రయోజనాలకు రైల్వే శాఖ పాచిక కావడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమే. అయితే మౌలిక మారవలసింది మాత్రం రైల్వే విధానమే


2 comments:

  1. May the victims souls rest in pease.
    Thank you for highliting the saftey issue in Indian railways.

    పెట్టె కు రెండు ఫైర్ extinguishers కుడా సమకూర్చలేని స్థితి లో ఉందా బారతీయ రైల్వే?

    ప్రమాదాలు జరిగినప్పుడే మాత్రమే నివారణ చర్యల గురించి ఆలోచిస్తున్నామా మనం అనిపిస్తోంది.
    ప్రమాద నివారణకు సరైన కార్యాచరణ లేకుండా వీటిని ఎలా నివారించగలం ? ప్రమాదాల నివారణకు దీర్ఘకాల కార్యాచరణను రూపొందించే రాజకీయ నాయకత్వం , ప్రజల బాగస్వామ్యం లేనంత వరకు , ప్రయాణీకుల భద్రత వ్యక్తుల (రైల్వే ఉద్యోగులు మరియు ప్రయాణీకులు) సమర్థత లేదా అలసత్వాల మీద ఆధారపడి ఉంటుంది.

    ReplyDelete
  2. రైల్వే శాఖ వారి ఆలోచన యెంతసేపూ యెలా ఆర్జన పెంచుకోవాలా అనే కాని ప్రజలకు నాణ్యమైన సేవలు యెలా అందించాలా అన్న ఆలోచన లేనే లేదు. ప్రతి రైల్వేమంత్రి తాపత్రయమూ తమ ప్రాంతానికి హెచ్చుగా కేటాయింపులు చేసుకోవాలా అనే కాని దేశమంతటికీ తాము ప్రాతినిథ్యం వహిస్తున్నామన్న స్పృహ లేనేలేదు. నిజానికి అన్ని ప్రభుత్వశాఖల తీరూ ఇలాగే అఘోరిస్తోంది. అమాత్యవర్యులకూ ప్రభుత్వాలకూ కూడా ప్రమాదాలు జరిగినప్పుడు 'సంతాపం' ప్రకటించి తూతూమంత్రం దర్యాప్తులతో సరిపెడితే చాలన్న జ్ఞానోదయం యెప్పుడో అయిపోయింది. ఇవి చాలవన్న జ్ఞానోదయం ప్రజలకు కలిగితే వాళ్ళు నిజాయితీ పరులకు తప్ప మరొకరికి ఓటేసి గెలిపించేది లేదని చెప్పే రోజు రాదు. కాని మన ప్రజలు కేవలం ఓటర్లు మాత్రం గానే మిగిలి పోవటానికి అలవాటు పడిపోయారు. People get the government they deserve అని ఒక సామెత ఉంది. అక్షరాలా నిజం.

    ReplyDelete