Pages

Tuesday, August 7, 2012

జైపాల్‌; కోపాల్‌!



కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రి జైపాల్‌ రెడ్డి సీనియర్‌ నాయకులే గాక ఆయన భాషా పాండిత్యమూ రాజకీయ పరిజ్ఞానమూ బహుధా గౌరవం పొందాయి.అయితే ఆంధ్ర ప్రదేశ్‌కు గ్యాస్‌ సరఫరా విషయంలో ప్రతిపక్షాలూ విశ్లేషకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన పదే పదే ఆగ్రహించడం ఆయన పెద్దరికానికి తగినట్టు లేదు. గతంలోనే ఒక ఎంట్రీలో రాసినట్టు ఇది కిరణ్‌ కుమార్‌ జైపాల్‌ రెడ్డి పంచాయితీ కాదు. ఆంధ్రప్రదేశ్‌ మహారాష్ట్రల తగాదా కాదు. కొంతమంది పనిగట్టుకుని జైపాల్‌ రెడ్డిని సమర్థిస్తున్నట్టుగా ఆంధ్ర తెలంగాణా సమస్య కూడా కాదు. సహజవాయువు, చమురు గనులు వగైరా ప్రకృతి వనరులను కార్పోరేట్లకు ధారాదత్తం చేసిన సరళీకరణ విధానాల పుణ్యం ఇది. గాలి జనార్థనరెడ్డి చుప్తాగా తవ్వుకుపోయినా రిలయన్స్‌ అంబానీ అవకాశమున్న గ్యాస్‌ను తీయకపోయినా ఏమీ అనగల స్తితిలో ప్రభుత్వాలు లేవు. అలాగే గ్యాస్‌ పొందే విద్యుత్‌ ప్లాంట్లు ఆ ఉత్పత్తిని అధిక లాభం కోసం మరెక్కడో అమ్ముకున్నా మనం చేయగలిగింది శూన్యం.ప్రైవేటీకరణ ఒప్పందాలు చేసుకోవచ్చు గాని ఎమర్జన్సీ క్లాజు కూడా పెట్టుకోకుండా జుట్టు చేతిలో పెట్టడం ఎంత అవివేకం మరెంత అనర్థం! గతంలో రిలయన్స్‌ గురించి విమర్శలు చేసిన జైపాల్‌ రెడ్డి ఇప్పుడు రత్నగిరికి సరఫరా చేయక గత్యంతరం లేదనట్టు మాట్లాడారు. కాని 24 గంటలు తిరక్క ముందే ప్రధాని కార్యాలయం దాన్ని మార్చేసింది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదనుకున్నా బాధ్యత గల సీనియర్‌ నేతగా ఆయన ఇదే పని గతంలో చేసి వుండొచ్చు. దానికి బదులుగా 11 నెలల గ్యాస్‌ సరఫరాకు తనను అభినందించలేదన్న ఆవేదనకు ఇప్పుడు అనవసరంగా అంటున్నారన్న ఆగ్రహానికి ఎక్కువగా లోనవుతున్నారు. అయితే ఇప్పుడు ఎలాగో గట్టెక్కామనుకున్నా ముఖ్యమంత్రి ప్రభుత్వం సకాలంలో స్పందించని లోపం కూడా మాసిపోదు. దీంతోనే సమస్య తీరిపోదు. ఈ ఘనత తమ విజయమని తెలుగు దేశం నేత నామా నాగేశ్వరరావు చెప్పుకోవడం మరో విశేషం. విజయానికి స్వంత దారులు చాల మంది వుంటారెప్పుడూ!

4 comments:

  1. జైపాల్ రెడ్డి సారు ఏదో 'సమిష్టి' కృషి చేసిండంటగదా! మంత్రి అయ్యుండి ఇన్నాళ్ళదాకా గ్యాస్ రిలయన్స్ వాడు తన్నుకు పోతోంటే ఏమి కృషి చేసాడని? ఇలాంటి అక్కరకు రాని మేధావులకి మంత్రి పదవులేలనో, పార్టీ థింకుటాంకులని ముద్రేసి, టి.సుబ్బిరామిరెడ్డితో మువ్వన్నెల కండువా కప్పించేయాలి.

    ReplyDelete
  2. Ayana Mahabub nagar Jaipal Reddy kabatti, Mee spandana ila undhi kani Vijayawada Jaipal Rao aithe inkola undedhi.....

    ReplyDelete
  3. తెలకపల్లి ఎక్కడ వుందో మీకు తెలుసా? నాకు అలాటి తేడాలేమీ లేవు. నేను జైపాల్‌ను అన్నదీ లేదు. రిలయన్స్‌ వంటి కార్పొరేట్‌ కబ్జాదార్ల సంగతి ప్రస్తావించడమే నా ఉద్దేశమని మీకు మరోసారి చెప్పదలచాను.

    ReplyDelete
  4. రవి అన్న, మీరు బాగున్నారా? మీరు వ్రాసిన కోపాల్ తాపాల్ చాల బాగుంది. రాష్ట్రంలో కాంగ్రెస్స్ పార్టీలో విభేదాలు ప్రస్పుత మవుతున్నాయి ప్రస్తుత పరిస్థితులో తెలంగాణా ఉద్యమం వెనుకపట్టు పట్టినట్లేనా?.

    ReplyDelete