Pages

Tuesday, December 28, 2010

మీ కాలం ఖాతాలో.... వీడ్కోలు వీక్షణం

కాలానికి ఏడాది కొండ గుర్తు అనుకుంటే ఏడాది కిందట లేదా ఈ ఏడాదిలో ఏమనుకున్నాము, ఏం చేశాము, అసలేమైనా అనుకున్నామా? ఏమీ అనుకోకపోతే ఇప్పుడైనా వచ్చే ఏడాదికైనా ఏమైనా అనుకుందామా అని చూసుకోవడం మొదటి మెట్టు. అలాటి ఆలోచనే లేకపోతే జీవితం చీకట్లో తడుములాటగానే మారిపోతుంది. ప్రతి వారికి ఏవో ఆకాంక్షలు ఆశలూ ఆశయాలు వుండనే


కాలం పదే పదే నన్ను పలకరించింది
ఎదురుగా నిలబడి వెక్కిరించింది
నన్ను హెచ్చరించింది


కవి శేషగిరి రాసిన ఈ వాక్యాలు కాలం స్వభావాన్ని చక్కగా చెబుతాయి. కరిగిపోయే స్వప్నం కాలం. ఆనకట్ట వేసుకోకపోతే సాగరం చేరే నదీ జలం వంటిది కాదు, వున్నప్పుడే వినియోగించుకోకపోతే తర్వాత దక్కని విద్యుచ్చక్తి వంటిది కాలం. అయితే ఎంతగా మనిషిని శాసించడానికి ప్రయత్నిస్తుందో తనను అదుపులో పెట్టగలిగిన వారికి అంతగా లోబడిపోయేది కాలం అన్నాడు మహాకవి శ్రీశ్రీ.
కాలం ఒక ఖాళి.కాలం ఒక పాళి. కాలం ఒక సవాలు. కాలం ఒక జవాబు. కాలం ఒక ప్రణాళిక. కాలం ఒక ప్రహేళిక. కాలం ఒక ప్రవాహం. కాలం ఒక ప్రభావం. కాలం ఒక అవకాశం.కాలం ఒక అవరోధస్త్ర. కాలం ఒక గమ్యం. కాలం ఒక గమనం. కాలం ఒక పతాక. కాలం ఒక ప్రతీక. కాలం ఒక వాహకం. కాలం ఒక వాహనం.కాలం ఒక జ్ఞాపకం., కాలం ఒక దీపకం.
ఇలా చెప్పుకుంటే కాలానికి ఎన్ని రకాలైన వైవిధ్య భరిత లక్షణాలున్నాయంటే దాన్ని గురించి రాయని కవి లేడు. మాట్లాడని తత్వవేత్త లేడు. కాలానికి అపాదించబడని విశేషాలు లేవు. కాని కాలాన్ని గురించి చెప్పుకునే ఆ విశేషాలన్ని ఆ కాలంలో జరిగిన లేదా జరగని కార్యాచరణల వివరాలే. ఎందుకంటే కార్యాచరణే లేకపోతే కాలానికి అర్థమే లేదు. కాలం కదలికకు పెట్టుకున్న ఒక కొండగుర్తు మాత్రమే. కాలాన్ని కొలవాల్సింది కేవలం నిముషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాల్లోనే కాదు. కార్యాచరణతోనే చేసిన చేయని పనులలోనే. అలాటి సమీక్షా వీక్షణానికి సరైన సందర్భం నూతన సంవత్సరాగమనం. అందులోనూ నూతన శతాబ్దిలో సహస్రాబ్దిలో తొలి దశాబ్ది వేగంగా ముగిసిపోవడం ప్రత్యేక విశేషం. ఆ రీత్యా ఇది సింహావలోకనానికి మరింత మంచి సందర్భం కూడా.
కాల గమనంలో అనుభవాలన్ని ఆనందదాయకమే కాకపోవచ్చు. అద్భుతాలు జరిగినా జరక్కపోయినా కాలంలో కొలుచుకోక తప్పదు. అన్నీ అపజయాలేనని అనవసరంగా నిట్టూర్చినా అంతా అప్రతిహత ప్రతిభా విశేషమేనని హుంకరించినా ప్రయోజనం శూన్యం. వాస్తవాలను గమనిస్తూ వాటి ప్రాతిపదికన వస్తుగత అంచనాలతో వాస్తవిక వ్యూహాలతో ముందుకు మున్ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నించాలి. కాలాన్ని కొలవడానిక క్యాలండర్లు, పంచాంగాలు ఎందుకు దండగ కద, ప్రజా జీవితానుభవాలే చాలును పద అని కుందుర్తి తన తెలంగాణా కావ్యాన్ని ముగిస్తాడు. వ్యక్తులైనా వ్యవస్థలైనా కాలాన్ని తేరిపార చూసుకోవడానికి కాలమూ ఒక ముఖ్యమైన కొలబద్ద.
ఎక్కడ మొదలు,ఎక్కడ ముగింపు..
కాలానికి ఏడాది కొండ గుర్తు అనుకుంటే ఏడాది కిందట లేదా ఈ ఏడాదిలో ఏమనుకున్నాము, ఏం చేశాము, అసలేమైనా అనుకున్నామా? ఏమీ అనుకోకపోతే ఇప్పుడైనా వచ్చే ఏడాదికైనా ఏమైనా అనుకుందామా అని చూసుకోవడం మొదటి మెట్టు. అలాటి ఆలోచనే లేకపోతే జీవితం చీకట్లో తడుములాటగానే మారిపోతుంది. ప్రతి వారికి ఏవో ఆకాంక్షలు ఆశలూ ఆశయాలు వుండనే వుంటాయి. ఎక్కువమంది తమ వృత్తి వుద్యోగ వ్యాపారాలు కుటుంబాల పరిధిలోనే ఆలోచించినా కొద్ది శాతమైనా సమాజ పరంగా సంస్తాగతంగా ఫ్రణాళికలు అనుకుని వుంటారు. పాత ప్రాధాన్యతలు సరిగ్గా లేకపోతే కొత్త పుంతలు తొక్కాలని భావించి వుంటారు. ఇదో నిరంతర ప్రక్రియ. ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా చెప్పుకున్నా చెప్పుకోకున్నా ఫలానా ఫలానా అని అనుకుంటుంటారు. డైరీలు రాసే అలవాటున్న వారు లేదా నోట్‌ప్యాడ్‌లు వుపయోగించేవారు కొంతమందైతే అనేక మంది ఆలోచనలు వారి మస్తిష్కాల్లోనే బంధితమై వుంటాయి. ఈ ఏడాది ముగింపనకు వస్తున్న తరుణంలో వాటిని ఒక్కసారి తేరిపార చూసుకోవాలి.

.వ్యక్తిగత వికాసానికి సంబంధించిన ప్రధానాంశాలేమిటి?
.మన శక్తి సామర్థ్యాలు పెంచుకున్నామా లేక ఏ కారణంగానైనా తగ్గు ముఖం పట్టాయా?
.వున్న శక్తికి తగిన ఫలితాలు సాధించగలిగామా?
.మనకు ఇష్టమైన రంగాల్లో లేదా అంశాల్లో కాస్తయినా ముందుకు కదిలామా?
.ఆర్థిక స్తితిగతులు అదుపులోనే వున్నాయి కదా, శక్తికి మించిన భారంలో కూరుకుపోవడం లేదు కదా?
.కుటుంబం పట్ల, సమాజం పట్ల మన బాధ్యతను సవ్యంగా నెరవేర్చినట్టేనా? చేయగలిగీ చేయలేకపోయినవేమైనా వున్నాయా?
.మంచిని ప్రోత్సహించనడానికి, చెడును నిరోధించడానికి ఈ ఏడాది మొత్తంలో ఏమైనా మనంగా చేశామా?
.పిల్లల పట్ల, జీవిత భాగస్వాముల పట్ల, పెద్దల పట్ల మన వంతు శ్రద్ద తీసుకున్నామా? తీసుకోకపోతే ఏ కారణం వల్ల?
.ఏ విషయంలోనైనా మన కృషి పదిమంది అభినందనలు పొందగలిగిందా లేక ఆశాభంగమే మిగిలిందా? అలా అయితే కారణాలేమిటి?
.ఈ ఏడాదిలో కొత్త విషయాలు నిపుణతలు ఏ మాత్రమైనా సాధించామా లేక వేసిన కాడున్న గొంగళిని తలపిస్తున్నామా?
.మనలో క్రమ శిక్షణ, కనీసం శ్రమ శిక్షణ ఏమైనా మెరుగుపడ్డాయా దిగజారాయా?..
.మనను అభిమానించే ఆదరించే వారి పట్ల సవ్యంగానే ప్రవర్తించామా? ఇతరులతో మన అనుభవాలు ఎలా వున్నాయి? ...
ఇవీ ఇలాటివీ ఇంకా అనేకానేక కోణాల నుంచి పరిశీలించుకోవడం ద్వారా ఏడాది గమనం ఎలా వున్నదీ బేరీజు వేసుకోవచ్చు. ఇవన్నీ వ్యక్తిగత సా ్థయిలో విషయాలే గనక ఎవరికి వారు నిష్కర్షగా సమీక్షించుకోవచ్చు. ఏ విషయంలోనైనా వున్న వాస్తవాలను సూటిగా అంగీకరించడం సానుకూల ఫలితాలుంటే మరింత మెరుగుచేసుకోవచ్చు. ప్రతికూల ఫలితాలుంటే సరిదిద్దుకోవచ్చు. అనుకున్నది సాధించామా లేదా అని చూసుకొన్నప్పుడు మనకు మనమే మార్కులు వేసుకునే మాష్టార్లలాగా నిర్ణయాలకు రావచ్చు. ఇతరుల పట్ల ఒకింత ఉదారంగా వుండొచ్చునేమో గాని ఎవరికి వారు మినహయింపులు ఇచ్చుకోకూడదు. ఆ పైన కుటుంబ సభ్యులతోనూ, బంధు మిత్రుల తోనూ కలసి చర్చించవచ్చు. సమాజం అంటే వ్యక్తుల సమూహమే గనక వ్యక్తిగత స్థాయిలో జరిగే ఈ పరిశీలనలు అందరికీ ఉపయోగపడతాయి.. నిర్దాక్షిణ్యంగా తమ ఏడాది నడకను అంచనా వేసుకోవాలి. అందులో సంతోషించవలసింది వుంటే తమ వరకూ తప్పక సంతోషించి ఆ పైన సమిష్టి అంచనా కోసం ఎదురు చూడాలి. ఆ రెంటికీ తేడా వస్తే మరోసారి పరిశీలించుకోవాలి. అంతేగాని విమర్శలు వస్తే భరించలేకపోవడం లేదా అవన్నీ నిజమేఅనుకుని అతిగా క్రుంగి పోవడం తగని పనులు.
జీవితంలో ప్రాధాన్యతా క్రమం చాలా కీలకమైంది. ఏది ప్రథమం, ఏది ద్వితీయం ఏది ఫ్రధానం ఏది అప్రధానం అన్న విచక్షణ వుండాలి. ప్రధానాంశాల్లో ప్రగతికి ప్రాముఖ్యత నిచ్చి పరిశీలించుకోవాలి. అందరూ అన్ని వేళలా ఒకే ప్రాధాన్యతలు పాటించడం అసంభవమే కాక అనవసరం. దాని వల్ల శక్తి యుక్తులు పూర్తిగా సద్వినియోగం కావు కూడా. అందుకే ఎవరైనా తమ జీవిత గమనాన్ని పని విధానాన్ని ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత ఆ అవగాహనకు అనుగుణంగా ప్రాధాన్యతలు రూపొందించుకోవాలి తప్ప అన్నిటికీ ఒకే మంత్రం పనికి రాదు.ఉదాహరణకు ఒక వుద్యోగి, ఒక వ్యాపారి, రాజకీయ నాయకుడు, కళాకారుడు, సామాజిక కార్యకర్త, ఒక వైద్యుడు, ఒక న్యాయవాది ఇలా అందరికీ వర్తించే సూత్రం వుండదు.వారి వారి పని ఫలితాలను కూడా ఒకే ప్రమాణంతో తేల్చలేము. కనకనే గడచిపోయిన కాలాన్ని వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు అతిగా పొంగిపోయినా అనవసరంగా కుంగిపోయినా తప్పే అవుతుంది. ఒక వేళ ఆశించిన ఫలితాలు కలక్కపోయినా అనేక అపశ్రుతులు ఎదురైనా కాలం అక్కడే ఆగిపోదని గుర్తుంచుకోవాలి. భవిష్యత్తు ప్రతివారికోసం పరుచుకునే వుంటుంది.
కాలరథం అన్న గేయంలో నార్ల చిరంజీవి ఇలా అంటాడు-
మంచు వంటిది గతం/మళ్లీ కనిపించదు/వెనక్కు తిరిగి చూడకు/వెళ్లిపోయిందెపుడో/ నీలో ఆశల్ను చిదిమేస్తూ/కాలం వెళ్లిపోయింది/ కత్తి వంటిది /చిరిగిన జీవితాలు /చిగురిస్తాయి సుమా
...
కనక కాలం కఠోరానుభవాలను చూపించినపుడు కూడా కంపించి పోనవసరం లేదు. ఆశావిశ్వాసాలు నిలబెట్టుకోవాలి. వెనక చూసిన కార్యమేమోయి మంచి గతమున కొంచెమేనోరు అన్న గురజాడ మాటలను గుర్తు చేసుకుని మందగించక ముందుకడుగెరు అనుకోవాలి. దానికి దిక్సూచి జీవితం పట్ల సముచిత దృక్పథమే. ఎందుకంటే కాలం ముందుకే పోతుంది. దాన్ని వెనకే వుంచాలని వెనక్కు తీసుకుపోవాలని కొందరు తంటాలు పడుతుంటారు గాని ఫలితం వుండదు.
కాలం కదిలింది/మనకై కాలం కదిలింది
ముందుకె కాలం కదిలింది
ఎన్నో సత్యాలెన్నొ ధర్మాల్‌/ఎన్నో రీతులు ఎన్నో నీతులు
చరిత్ర గతిలో చదలు పట్టగా /చెరగని తరగని చైతన్యంతో కాలం
కదలిన కాలపు గమనం మార్చి /గడచిన దినాల గాయం రేపగ
తలలు నెరిసిన తాతలెందరో /తలకిందులుగా తపసు చేసినా కాలం
అని సుధీర్‌(డా.విఠల్‌) రాసిన పాట కాలం పట్ల వుండాల్సిన దృక్పథాన్ని చెబుతుంది. కాలం మనిషిని పరీక్షిస్తుంది. అదే సమయంలో ఆత్మ విశ్వాసం పెరిగేలా రాటు దేలడానికలి కారణమవుతుంది. శ్రీశ్రీ అంతటి వాడు జయభేరిలో
ఎండకాలం మండినప్పుడు
గబ్బిలం వలె కాలిపోలేదా
శీత కాలం కోత పెట్టగ
ఆకలేసీ కేకలేశానే? అని వివిధ రుతువులు ప్రభావాలను చెప్పిన తర్వాతనే
నేనొక్కణ్నే నిల్చిపోతే
చండ్రగాడ్పులు భూమిమీద భుగమౌతాయి అని ప్రకటిస్తాడు. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తానని ధీమాగా చాటిస్తాడు.ఈ విశ్వాసం ప్రతి ఒక్కరికీ అవసరం. అదే సమయంలో వ్యక్తిత్వ వికాసం పేరిట వ్యక్తిగత వికాసం మాత్రమే చెప్పే వారిలా కాకుండా పదిమందితో కలసి నడవడంలో వున్న సహజీవన సౌందర్యాన్ని అర్థం చేసుకోవాలి. వ్యక్తులుగానే గాక సమూహాలుగానూ సమీక్షించుకోవాలి. అందులో మొదటిది కుటుంబం.
కుటుంబం ఎప్పుడూ ప్రజాస్వామిక ప్రక్రియలో వుండేలా చూసుకోవాలి. అందుకు మొదటి మెట్టు ఉమ్మడిగా లక్ష్యాలను నిర్దేశించుకోవడం,ఆ దిశలో నడతను పరిశీలించుకోవడం. ఇక్కడ కూడా పైన చెప్పుకున్న కొలబద్దలన్ని వర్తిస్తాయి.
.కుటుంబంలో తరచూ ప్రస్తావనకు వచ్చే సమస్యలు ఈ కాలంలో పరిష్కారమయ్యాయా?
.ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించామా?ఏమైనా పేరబెట్టామా?
.చదువు సంధ్యలపై తగు శ్రద్ద చూపిస్తున్నామా?
.జమ ఖర్చుల నిష్పత్తి ఎలా వుంది? చేయి దాటిపోతుందా?
.వస్తువుల వినిమయం పరిస్థితి ఏమిటి? అనవసరమైన వాటిని కొనడం, అత్యవసరమైన వాటిని దాటేయడం జరుగుతున్నదా?
.ఏడాదిలో ఒక్కసారైనా ఏదైనా చిన్నదో పెద్దదో పర్యాటక యాత్ర చేశామా?
.స్నేహ సంబంధాలు పెంచుకుంటున్నామా? మన కారణంగా ఏవైనా సంబంధాలు దెబ్బతిన్నాయా? అలా జరిగి వుంటే పునరుద్ధరించుకోవడం ఎలా?
. కుటుంబ నిర్వహణ భారం ఒకరిద్దరిపై అదనంగా పడుతుందా?లేక క్రమ బద్దంగా పంపిణీ జరుగుతున్నదా? శ్రుతిమించిన బద్దకం పెరిగిపోతున్నదా?
.గృహిణికి కనీస విశ్రాంతి విరామం ఇచ్చే పరిస్తితి వుందా?
.రేపటి తరం మనుషులైన పిల్లలల జీవితం పట్ల సరైన దృక్పథం పెంపొందిస్తున్నామా? వారి పురోగతికి సహకరిస్తున్నామా?
.దురలవాట్లు లేదా అరాచకత్వం ఛాయలు కనిపిస్తున్నాయా? బద్దకం మనను మింగేస్తున్నదా?
సమిష్టి బృందాలు, సంస్థలు
ఇక సంస్థలు ఏ విధమైనవైనా సరే వాటికి కొన్ని లక్ష్యాలుంటాయి. లక్షణాలుంటాయి. గమ్యాలుంటాయి.గమనమూ జరిగివుంటుంది. అందులో పైనున్న బాధ్యుల నిర్వాహకులు లేదా యజమాన్యాలు నిర్ణయించే విషయాలు అనేకం వుంటాయి. అయితే అమలుకు వచ్చేసరికి మళ్లీ సమిష్టిగానే అమలవుతాయి. ఆ పరిధిలో సంస్థల పురోగమన తిరోగమనాలు అందరికీ కనిపిస్తుంటాయి. అయితే పైకి కనిపించేవాటితోనే అంతిమ నిర్ధారణలకు రావడం సరికాదు. నిర్వాహకులు మోస్తున్న విషయాలు చాలా వుంటాయి.కనక వీటిలో ఉమ్మడి నియమావళి పరిధిలో పరిశీలన చేసుకోవలసి వుంటుంది. విద్యా సంవత్సరం ఒక మాసంలో ఆర్థిక సంవత్సరం మరో మాసంలో వ్యవసాయం మరో తరుణంలో ముగింపునకు వస్తాయి గాని కాలక్రమణిక మాత్రం ఒకే విధంగా వర్తిస్తుంది. కనక సమిష్టిగానూ వ్యక్తిగతంగానూ జరిగింది జరగాల్సింది చూసుకోవడానికి సంవత్సరాది సరైన తరుణం. పైగా విద్య ఆర్థిక సంవత్సరాలలో మిగిలిపోయిన లక్ష్యాలను గబగబా పూర్తి చేసుకోవలసిన అవసరం ఏమిటో కూడా ఇప్పుడే చూసుకుంటే చాలా మేలు కలుగుతుంది.
తప్పనిసరి పనులు, తక్షణ పనులు
పనిచేసే సందర్బంలో చాలా కీలకమైన విభజన ఇది. తప్పని సరిగా చేయవలసిన పనులు, తక్షణమే చేయవలసిన పనులు. తప్పక చేయవలసిన పనులను ప్రాధాన్యతా క్రమంలో చేసుకుంటూ పోకపోతే అవి గొంతుమీదకు వస్తాయి. అనుకోకుండా వచ్చిపడేవి ఆర్జెంటు పనులు తప్ప పేరబెట్టి పేరబెట్టి ఆఖరి ఘడియలో చేసేవి ఆ కోవకు రావు. ఒక వ్యాధిని ముందే చూపించుకోగలిగితే మామూలు మందులతోనే నయం కావచ్చు. ముదిరిపోయిన తర్వాత అత్యవసర చికిత్స చేసినా ఫలితం వుండకపోవచ్చు.పరీక్షలకు ముందుగా చదువుకోకపోతే దగ్గరకొచ్చాక పరుగులు తీసి ముక్కునపట్టుకుని రాయాలి. పనులైనా అంతే. ఉదాహరణకు ఒక బిల్లు కట్టడానికి వున్న వ్యవధినంతా పోగొట్టుకుంటే అది ప్రాణం మీదకు వస్తుంది. అంత ఆదరాబాదరాగా చేసేప్పుడు నాణ్యత కూడా దెబ్బతినిపోవడం సహజం.ఎలాగోలా పూర్తిచేయడం తప్ప చేయాలనుకున్నట్టు చేయడం వుండదు. అదే ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే ప్రామాణికంగానూ చేసుకోవచ్చు. ఇదో ప్రాథమిక సూత్రం. చాలామంది పాటించనిది. కాల యాపన చేసి చేసీ అనివార్యమైన స్థితిలోనే దాన్ని నిర్వహించబోవడం వల్ల పని పూర్తవడమే పదివేలు అన్నట్టు వ్యవహరిస్తాము. కుందేలు తాబేలు సామెత ఇలాటిదే. కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే లక్ష్యాన్ని తప్పక చేరుకోవచ్చు. అలాగాక అతి ధీమాతో అలక్ష్యంతో సమయం వృథా చేసుకుంటే తర్వాత సంతృప్తి వుండనే వుండదు. సమర్థనలు సంజాయిషీలే మిగులుతాయి.
కాలాన్ని వినియోగించుకోవడంలో విభజించుకోవడం కూడా కీలకమైంది. ప్రధానమైన వాటికి ఎక్కువ సమయం, చురుకైన సమయం తీసుకోవాలి. దానికి భంగం కలిగించే అంశాలను వ్యక్తులను అనుమతించకూడదు.తమ సమయం విలువే తెలియని వారికి ఇతరుల సమయం విలువ తెలుస్తుందనుకోవడం భ్రమ. కొందరు తమ సమయం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇతరుల సమయాన్ని హరించేందుకు మాత్రం వెనుకాడరు.ఉదాహరణకు ఇలాటి వారు మిమ్మల్ను కలుసుకోవాలంటే వాళ్లకు అనుకూలమైన సమయం అడుగుతారు తప్ప మీ కష్టనష్టాలు పట్టించుకోరు. కనక నిర్మొహమాటంగానూ మర్యాదగానూ ఇలాటి వారికి సరైన సమాధానమిచ్చి ఎవరికీ నష్టం లేకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత కూడా ఒక పట్టాన వదలకుండా దాడి చేస్తుంటే సూటిగానూ సున్నితంగానూ సాగనంపాలి. మీ ప్రమేయం లేకుండా సమయం సందర్భం చూడకుండా వూడిపడితే మొహమాటపడనవసరం లేదు. ఒకసారి అరసారి గాక అదే అలవాటుగా మార్చుకున్నవారిని అసలే మన్నించనవసరం లేదు. కుటంబాలలో గాని కార్యాలయాలలో గాని శిక్షణా రాహిత్యం అలవాటుగా హక్కుగా చేసుకుని దానివల్ల మీ సమయం హరించబోవడాన్ని అనుమతించబోమని స్పష్టంగా చెప్పాలి. కాకపోతే అందులో మన వంతు వరకూ క్రమబద్దంగా చేసి ఆ పైన ఎవరి మానన వారిని వదిలేయాల్సిందే. తమ సుఖ సంతోషాలను చూసుకుంటూ ఇతరులపై భారాలు మోపేవారికంటే అలా మోసేవారిదే ఎక్కువ తప్పు.
విలువైన సమయం... విసుగెత్తే పనులు...
టీవీలలో ప్రైమ్‌ టైమ్‌ అంటూ వుంటారు.అంటే విలువైన సమయం అన్న మాట. టీవీలకే కాదు దైనందిన జీవితంలో కూడా ఈ తేడా వుంటుంది. కొంతమంది తెల్లవారుఝామున మరికొందరు కాస్త పొద్దెక్కాక ఇంకా కొందరు బాగా ఆలస్యంగా నిద్ర లేవడం దగ్గరే ఈ తేడా మొదలవుతుంది. ఎన్టీరామారావు త్వరగా పడుకుని తెల్లవారుఝామున రెండున్నరకే లేచి తెల్లవారే సరికి యోగాసనాలు పనులు పూర్తి చేసుకునేవారు. జీవితంలో తీరిక లేకుండా పని చేసేవారందరి పొదుపు లేవడం దగ్గరే మొదలవుతుంది. ఈ విషయంలో మీ పరిస్థితి ఏమిటో చూసుకోవడం మంచిది. మీరు ఆలస్యంగా లేచినా ప్రపంచం ముందే సిద్దమై పోతుంటుంది. అక్కడే సగం దెబ్బ తిన్నారన్న మాట....
నిద్ర లేవడం, నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకోవడం ఎంత సమయం తీసుకుంటుంది? లేదా మామూలు భాషలో చెప్పాలంటే రెడీ కావడం ఎంత త్వరగా చేసుకోగలుగుతారనే దానిపై చాలా సమయం కలసి వస్తుంది. ఆడవాళ్లు రెడీ కావడానికి చాలా సమయం తీసుకుంటారని జోకులేస్తుంటారు గాని వాస్తవంలో పురుష పుంగవులు చాలా మంది ఒక పట్టాన తెమలరు. అంత ఆలస్యం ఎందుకవుతుందో కూడా తెలియకుండానే సాగదీసి సమయం వృథా చేస్తుంటారు. వారి కోసం మొత్తం అందరూ నిరీక్షణలో మునిగి వుండాల్సి వస్తుంది.ఈ రెంటినీ సరిచేసుకోగలిగిత సగం సమయం కలిసి వచ్చినట్టే.
ఇక ప్రైమ్‌ టైమ్‌ సంగతి. రోజూ చూడండి- 9 గంటలకు అటూ ఇటూగా రోడ్లన్నీ కిక్కిరిసి వుంటాయి. అలాగే సాయింత్రం 5-7 మధ్యన కూడా. అంటే ఇవి చాలా కీలకమైన వేళలన్న మాట. మీ వృత్తిని బట్టి మీకూ ఏదో సమయం వుంటుంది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని నిరర్థకంగా పోగొట్టుకోకూడదు.ఆ సమయంలో ఎవరో ఆగంతుకులు వచ్చారని నిస్సహాయంగా బలైపోకూడదు.మీ సమయం మీ చేతుల్లో వుండాలి.మీకు బాగా ఇష్టమైన అవసరమైన పనులకోసం సరైన సమయాన్ని ఎంచుకుని వినియోగించుకోవాలి. మీరు బాగా పనిచేయగలిగే సమయంలో కొంతైనా కుటుంబం కోసం వెచ్చించాలి. లేకుంటే అలసి సొలసి కేవలం సపర్యలు చేయించుకోవడానికి మాత్రమే గృహ ప్రవేశం చేసేట్టయితే మీరు అతిధిలుగానే మిగులుతారు.అలాగే కుటుంబానికి సంబంధించిన చిన్న చితక పనులలోనే మునిగితేలుతూ సమాజానికి సంస్థలకు సంబంధించిన కీలకమైన పనులను నిర్లక్ష్యం చేస్తే మీరు స్వార్థపరులై పోతారు. రెంటినీ సమన్వయం చేసుకునే విధంగా సమయ పాలన జరగాలి. నాణ్యమైన సమయాన్ని నాణ్యమైన పనులకు కేటాయించుకోవాలి. అలాగే ఏ పనైనా ఎప్పుడైనా చేయగల నైపుణ్యం సంతరించుకోవాలి.
కాలాన్ని గొప్ప సామ్యవాది అందరికీ ఒకే విధంగా అందుబాటులో వుంటుంది అంటారు గాని అది పూర్తిగా నిజం కాదు. పని చేసే వారంతా ప్రైమ్‌టైమ్‌ యాజమాన్యాలకు ధారాదత్తం చేసినట్టే లెక్క. అది గాక మిగిలిన సమయంలోనే విచక్షణగా ఉపయోగించుకోవడం సాధ్యపడుతుంది. కనక ఇలాటి వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక వేళ కార్యాలయాల్లో వత్తిడి లేదని సుత్తి వేసుకుంటూ గడిపేస్తే మరింత నష్టం.
మహిళలు కబుర్లలో మునిగితేలతారు అని ఆడిపోసుకోవడం తప్ప కార్యాలయాల్లో కాపీ హౌటళ్లలో దమ్మిడికీ పనికి రాని దండగ మాటలతో వృథా చేసే వారు అందరిలోనూ వుంటారు. ఇప్పుడు సెల్లుఫోన్‌ వచ్చాకనైతే అరగంట అనవసరమైన మాటలతో గడిపేయం సర్వసాధారణమై పోయింది. ఇవన్నీ కాలాన్ని మిగుల్చుకోవడానికి మార్గాలు.
కొంతమంది పొద్దు పోవడం లేదు అంటే మరికొంత మంది సమయం చాలడం లేదు అంటుంటారు. ఈ రోజుల్లోనైతే బిజీ బిజీ అంటూనే లేజీగా గడిపేవారికి కొదువ లేదు. మీరు కబుర్లలో మునిగి తేలి సమయం పోగొట్టుకోవచ్చు. టీవీ ముందే గంటల తరబడి కరగించేయవచ్చు. కనక సమయం చాలడం లేదనడానికి కారణమేమిటన్నది ఆలోచించుకోవాలి. ఇది జరగాలంటే ఖాతా పుస్తకాల తనిఖీ(ఆడిటింగ్‌) లాగా టైమ్‌ ఆడిటింగ్‌ చేసుకోవాలి. ఎంత సమయం ఎంత ప్రయోజన కరంగా గడిపాము అనేది విమర్శనాత్మకంగా చూసుకుంటే తెలుస్తుంది.తద్వారా దేనికి ఎంత సమయం అవసరం అన్నది కూడా స్పష్టమవుతుంది. భవిష్యత్తులో ప్రణాళికలు వేసుకోవడం కూడా సులభమవుతుంది.
రైతు రుతువును బట్టి పంట వేసుకున్నట్టే ప్రతివారూ కాల క్రమణికను బట్టి కర్లవ్యాలు రూపొందించుకోవాలి. ఎందుకంటే మనకోసం ఏదీ ఆగదు. మనం కోరుకున్నంత మాత్రాన ఏదీ జరగదు. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయవచ్చన్న మాట నిజమే గాని అది నిర్దిష్టమైన కాలమాన పరిస్థితుల్లోనే సాధ్యమవుతుంది.కనక మొదట చేయవలసింది కాలాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, కాల గమనాన్ని సవ్యంగా అర్థం చేసుకోవడం.
వారానికేడు రోజులు మనకి .. రోజుకు ఇరవై నాలుగు గంటలు
వాడుకో మానుకో అంతే జీవితం.. అంటూ రష్యన్‌ కవి వ్లదీమర్‌ మయకోవస్కీ గొప్ప సత్యాన్ని కవితాత్మకంగా చెప్పాడు.
కొత్త ఏడాది ప్రవేశిస్తున్న ఈ తరుణంలో అంతకుముందు కాలాన్ని కూడా దృష్టితో పెట్టుకుని గడిచి పోతున్న ఏడాదిని పరిశీలించుకుంటే మరింత మెరుగైన నూతన సంవత్సరాన్ని రూపొందించుకోగలుగుతాము. అందుకు ఆట్టే వ్యవధి లేదు గనక వెంటనే రంగంలో దిగండి మరి. సకాలంలో చేస్తే సకలం సాధ్యమే.

1 comment: