Pages

Saturday, August 25, 2012

అస్థిరత యథాతథం- అసమ్మతి అనివార్యం


       అవినీతి వూబిలో చిక్కిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఎంత మాత్రం మారలేదు. వూబిలో చిక్కిన మనిషి పైకి రావాలని ప్రయత్నించినకొద్ది మరింత లోతుల్లోకి కూరుకుపోతుంటాడు. కాంగ్రెస్‌ వ్యవహారం కూడా అలాగే వుంది. విద్యుత్‌ సమస్య పరిష్కారానికి కిటికీలు తెరుచుకోవాలని సలహా ఇచ్చి విమానమెక్కి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దాదాపు రిక్త హస్తాలతోనే తిరిగి వచ్చారు. ఇప్పటికి పది రోజులపైగా తన చేతుల్లో పెట్టుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించేందుకు అధిష్టానం అనుమతి సంపాదించడం ఆయన సాధించిన ఫలితమంటున్నారు.అయితే ఆ ఆ ఆమోదం కూడా అప్పుడే కాదు, అభియోగాలను కోర్టు నిర్ధారించిన తర్వాత అనివార్యంగా తీసుకోవచ్చన్నది అధిష్టానం ఆదేశం. ఈ క్రమంలోనే మిగిలిన ఆరోపిత మంత్రుల సంగతి కూడా. నిజానికి ఛార్జిషీటులో పేరున్న ఒక మంత్రి రాజీనామా చేస్తే దాన్ని వెంటనే ఆమోదించకుండా అట్టిపెట్టుకోవడం ఎలాటి రాజనీతి? మంత్రివర్గ ఏర్పాటు మంత్రుల కొనసాగింపుపై విచక్షణాధికారం కలిగి వుండాల్సిన ముఖ్యమంత్రి రాజీనామా అందిన తర్వాత కూడా అడుగు ముందుకేయలేకపోవడం ఎంత అసహాయత? ఇందులో నైతికత ఎక్కడీ చట్టబద్దత ఎంత? ఇన్నాళ్ల తర్వాత ఇందుకోసమే ఢిల్లీ వెళ్లి వచ్చిన కిరణ్‌ ఇరకాటం ఇప్పట్లో తీరేది కాదన్నది దీంతోనే స్పష్టమై పోయింది. ఇంగ్లీషు పత్రికల్లో అంతా ఆయనకు అనుకూలంగా జరిగినట్టు కథనాలు వెలువడినా వాస్తవం అదే. అంతకు మించిన ఫలితం.
24 మంది మంత్రులు రాజీనామాలు ఆమోదించవద్దంటూ కిరణ్‌పై ఒత్తిడి చేయడం తెలిసిన విషయమే. ఆమోదమే మొదలు పెడితే అందరికీ చుట్టుకుంటుందనే ఆందోళనే ఇందుకు కారణం.ఆ భయం అధిష్టానానికి కూడా వుంటుంది - కేంద్రానికి సంబందించినంత వరకూ. కనకనే హడావుడి అక్కర్లేదని తగు సమయంలో నిర్ణయం
తీసుకోవచ్చని చెప్పి పంపించారు. మరో వైపున ముఖ్యమంత్రి మార్పు గురించే కథనాలు వెలువడుతుంటే గట్టిగా ఖండించకుండా ఆయన వ్యతిరేకుల ఫిర్యాదులకు అవకాశం కల్పిస్తున్నారు. ఇదంతా మీడియా కల్పన అని వూహాగానమని ఎంతగా కొట్టి వేస్తున్నా ఏవో సమూలమైన మార్పులు జరుగుతాయన్న భావన పాలక పక్షంలో దట్టంగా నెలకొనివుంది. మూమూలుగానే కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రుల మార్పు నిరంతర ప్రక్రియగా సాగుతుంటుంది. గతంలో కాసు బ్రహ్మానందరెడ్డి, మొన్న మొన్న వైఎస్‌ రాజశేఖర రెడ్డి మినహాయిస్తే అయిదేళ్లు పాలించిన ముఖ్యమంత్రులెవరూ ఆ పార్టీకి లేరు. రెండేళ్ల కాలం చాలా ఎక్కువని భావించడం సర్వసాధారణం. మామూలుగానే కథ అలా వుంటే ఇప్పుడు ఈ అసాధారణ సంక్షోభాల ముంగిట్లో ముఖ్యమంత్రిని మార్చే అవకాశం చాలా వుంటుందన్న భావన బలంగానే వుంది. తెలంగాణా వాదం నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన నేతను ముఖ్యమంత్రిని చేసి ఏదైనా రాజకీయ పకటన చేస్తారన్నది ఒక వూహాగానం. అది ఎప్పుడు చేస్తారన్నది తెలియకపోయినా ఆలస్యంగానైనా జరగుతుందనే అత్యధికులు అనుకుంటున్నారు. ముందుగా పిసిసి అద్యక్షుణ్ని మార్చాలన్న ఆలోచన కూడా దానికి ముందస్తు ఏర్పాటుగానే చెబుతున్నారు. ఇప్పటికీ రెంటినీ వాయిదా వేసుకున్నారే గాని మానుకోలేదని చెప్పాలి. ఎందుకంటే అటు ఢిల్లీ పెద్దలు గాని ఇటు ముఖ్యమంత్రి గాని ఏదీ ఖరాఖండిగా చెప్పిన దాఖలాలు లేవు.తన కొనసాగింపు గురించి తనే చెప్పుకునే మాటలకు పెద్ద ప్రాధాన్యతా వుండదు.
రెండవ విషయం ధర్మానతో మొదలైన మంత్రివర్గ కల్లోలం అంతటితో ఆగేదికాదని కూడా అధికార పక్షీయులు అంగీకరిస్తున్నారు. మంత్రులు చాలా మంది జగన్‌ పార్టీతో సంబంధాలు ఏదో రూపంలో కలిగి వున్నారని ఏ చర్య తీసుకున్నా వారు అటు దూకే అవకాశం అపాయం వున్నాయని వీరు భయపెడుతున్నారు. మొత్తంగా పునర్య్యవస్థీకరణకు అవకాశం వుండాలన్న కిరణ్‌ వర్గం అభ్యర్థనను అధిష్టానం ఆమోదించేందుకు వెనుకాడుతున్నదంటే అదే కారణం. అనివార్యంగా ధర్మానను ఇంటికి పంపించినా దానికి కారణం న్యాయస్థానాలన్నట్టు కనిపించాలే గాని రాజకీయ నిర్ణయంగా వుండరాదని అధిష్టానం తంటాలు పడుతున్నది.
అధికారం కాపాడుకోవడం తప్ప అధిష్టానం వారికి ముఖ్యమంత్రిపైన గాని మంత్రులపైన గాని ప్రత్యేకమైన అభిమానం ఆసక్తి ఏమీ వుండవని గతంలో చాలా సార్లు రుజువైంది. అందుకే పైకి ఎంత గంభీరంగా మాట్లాడుతున్నా కాంగ్రెస్‌లోని ఏ శిబిరమూ లోలోపల కలవరపడుకుండా వుండలేకపోతున్నాయి. తమను తాము కాపాడుకోవడానికి కులం కార్డును ప్రాంతీయ పాచికలను పైకి తీస్తున్నా ఒక సారి చట్టం ముందు నిందితులుగా నిల్చిన తర్వాత అవన్నీ అక్కరకు రావని వారికీ తెలుసు.కనకనే తప్పే జరగలేదన్న విడ్డూరపు వాదనను వినిపిస్తూనే వున్నారు. అయితే సిబిఐ ఎప్పటికప్పుడు దాఖలు చేస్తున్న చార్జిషీట్లలో కొత్త కొత్త అక్రమాలు వెలికి వస్తున్నాయి.ప్రభుత్వ ధనం ప్రజల ఆస్తులు దఖలు పర్చచడమే గాక ప్రైవేటే కార్పొరేట్‌లతో కుమ్మక్కు ఎంత నిరాఘాటంగా సాగిపోయందో అర్థమవుతుంది. భయం గాని పక్షపాతం గాని లేకుండా బాధ్యతలు నిర్వహిస్తామని ప్రమాణం చేసిన మంత్రి పుంగవులు వైఎస్‌కు భయపడి సంతకం పెట్టామని సమర్థించుకోవడం ఎంత దారుణం? జగన్‌పై చర్యను స్వాగతించిన మంత్రులే తమ దగ్గరకు వచ్చే సరికి బాధ్యత లేదని చేతులెత్తేయడం ఎలా కుదురుతుంది? (పైగా వారి వారి స్వంత భాగోతాలు కూడా వున్నాయి) అయితే మంత్రులకు న్యాయ సహాయం చేయాలని నిర్ణయించడం ద్వారా ముందే వారి తప్పులేదనే వైఖరి తీసుకున్న కిరణ్‌ ప్రభుత్వం ఇప్పుడు వారిని బయిటకు పంపించగలుగుతుందా? అందుకు బాధ్యత అధిష్టానంపై నెట్టేద్దామనుకుంటే వారు కూడా ఆఖరు వరకూ చూడాలని ఆంక్షలు పెడుతుంటే ఇక నైతిక విలువలతో రాజీనామా అన్న మాట ఎంత హాస్యాస్పదమై పోతున్నది? ఢిల్లీ పర్యటన తర్వాత కూడా ఈ పరిస్థితి పెద్దగా మారింది లేదు. పైగా అధిష్టానం వైఖరి అసమ్మతికి ఆజ్యం పోసేదిగా వుందని కూడా అర్థమవుతుంది. ఉద్దేశ పూర్వకంగానే కొత్త అస్థిరతను సృష్టించాలని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది.
ఇదే సమయంలో తెలంగాణా సమస్యపై ఏదో ప్రకటన రాబోతున్నదని పాలక పక్షీయులు టిఆర్‌ఎస్‌ నేతలు కూడా వూరిస్తున్నారు. ఇప్పటి వరకూ నడిచిన కథను బట్టి కేంద్రం వైఖరి చూచాయగా అర్థమవుతూనే వుంది. అందుకే అనుకూల ప్రకటన వస్తుందని చెప్పేవారు కూడా ఆచరణలో అంత విశ్వాసంగా వుండలేకపోతున్నారు. ఉద్యమంలో వున్నప్పుడు ఆశాభావం తప్పదని ముక్తాయిస్తున్నారు. మరోవైపున బిజెపి సిపిఐ టిఆర్‌ఎస్‌ ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ తమ స్వంత వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో జెఎసిల పాత్ర కూడా అస్పష్టమవుతున్నది .టి కాంగ్రెస్‌గా చెప్పుకునే నాయకులు చాలా మంది ముఖ్యమంత్రి పదవితో సహా అనేక ఆశలు పెట్టుకుని పరిపరి విధాల వ్యవహరిస్తున్నారు. తాజాగా సిపిఐ కూడా తన స్వంత యాత్ర తలపెట్టింది.తెలుగు దేశం స్పష్టత ఇస్తానంటూనే గతంలో ఇచ్చిన 'స్పష్టత'ను పునరుల్లేఖించే తతంగంలో పడింది. వైఎస్‌ఆర్‌పార్టీ ఆ మాత్రం కూడా చేయకుండానే సామాజిక ప్రాతిపదికన తమ పార్టీకి తెలంగాణాలో బలం పెరుగుతుందని అంచనాలు వేసుకుంటున్నది. ఈ వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య అవినీతి కేసుల దర్యాప్తులు పరాకాష్టకు చేరిన ప్రజా సమస్యలు అన్ని పార్టీలనూ సవాలు చేయడంతో పాక్షిక అజెండాలను పక్కన పెట్టి వాటిపై కార్యాచరణ చేపట్టక తప్పడం లేదు. విద్యుచ్చక్తి సమస్యపై ఈ వారంలో టిఆర్‌ఎస్‌, తెలుగు దేశం పార్టీల నాయకులు తమ తమ శైలిలో చేసిన చేబట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలు ఇందుకు ఒక నిదర్శనం. సరిగ్గా పుష్కర కాలం కిందట 2000 సంవత్సరంలో విద్యుత్తేజాన్ని రగిల్చి రాష్ట్ర రాజకీయాలలో నూతనాధ్యాయం సృష్టించిన వామపక్షాల సమిష్టి పిలుపు ఈ కార్యాచరణలన్నిటి కలయికగా ప్రజా గ్రహాన్ని ప్రతిబింబిస్తుందని ఆశించాలి. పదవులు రాజీనామాల రంధిలోంచి బయిటపడి ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించేలా పాలకపక్షాన్ని కట్టడి చేయడం ఆ విధంగానే సాధ్యం. రాష్ట్రంలో తిష్ట వేసిన అనిశ్చితిని అవాంఛనీయ అజెండాలనూ అడ్డుకుని రాజకీయాలను భూమార్గం పట్టించడం కూడా అప్పుడే జరుగుతుంది.

7 comments:

  1. అస్థిరత అంటారు గాని...
    రోశయ్య ముఖ్యమంత్రి అయినప్పటినుండి అది స్థిరంగానే కొనసాగుతోంది గదా! ఇంకో రెండేళ్ళు ఇలానే గడిచిపోతుంది. :)))

    ReplyDelete
  2. /సరిగ్గా పుష్కర కాలం కిందట 2000 సంవత్సరంలో విద్యుత్తేజాన్ని రగిల్చి రాష్ట్ర రాజకీయాలలో నూతనాధ్యాయం సృష్టించిన వామపక్షాల సమిష్టి పిలుపు ఈ కార్యాచరణలన్నిటి కలయికగా ప్రజా గ్రహాన్ని ప్రతిబింబిస్తుందని ఆశించాలి./

    ఏమిటో ఆ విద్యుత్తేజం, బెంగాల్లో 35స. ల పాలనకు షాక్ కొట్టి, తెర పడిందే... అదేనంటారా? పుష్కరమేమిటి ఏడాది కిందటే గా... ;) :))

    ReplyDelete


  3. మీరన్నది నిజమే మరి.. అయినా 35 ఏళ్ల తర్వాత ఓడిపోతే ఎందుకంత ఆనందం సార్‌?ముందు ఆ రికార్డు అందుకునేవారెవరన్నా వున్నారేమో చూడండి.. ఇక్కడ విద్చుచ్చక్తి ఉద్యమం ఒక గొప్ప ప్రభావం చూపింది. తదుపరి ఎన్నికల్లో ఇక్కడే వామపక్షాలు ఓడిపోయాయిగా .. బెంగాల్‌ దాకా ఎందుకు? అయినా అహౌరాత్రాలు కమ్యూనిస్టు వ్యతిరేకతే అయితే ఎలా?

    ReplyDelete
    Replies
    1. అహోరాత్రులూ కమ్యూనిస్టు అభిమానులు ఉండగా, వ్యతిరేకులు ఉంటె తప్పు లేదు సార్.

      Delete


    2. తప్పని నేననలేదు సార్‌! అభిమానులు లేకున్నా వ్యతిరేకులే వుండొచ్చు కూడా. పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రంలా ఎప్పుడూ అదే కోణం ఎందుకని స్నేహ పూర్వకంగా సలహా ఇచ్చానంతే. నేనైతే సమయాసమయాలను బట్టి చేయాల్సిన ప్రస్తావనలు చేస్తుంటాను. ఉదాహరణకు మత తత్వ కోణాలు లేని చోట సంఘ పరివార్‌ను ప్రస్తావించను. బొగ్గు కుంభకోణం అనుకోండి.. అక్కడ అనలేదు కదా.. కొంతమంది ఏది రాసినా అసందర్భంగా కమ్యూనిస్టుల ప్రస్తావన తేవడమెందుకని మాత్రమే అన్నాను. ఆ పైన ఎవరి ఇష్టం వారిది. ఓకేనా?

      Delete
  4. అస్థిరత అసమ్మతులు వల్లే అభివృద్ధి కుంటు పడుతుందని అనుకోవడం సబబు కాదు. ఎకచత్రాదిపతిగా ఆరేళ్ళు ఏలిన రాజశేఖర్ రెడ్డి పాలనకు చిహ్నాలుగా ఈరోజు అభివృద్ధి కనిపించదు.

    At the best, "stability" is a nice-to-have. By itself it does not guarantee anything. Nor is it mandatory for development.

    ReplyDelete
    Replies

    1. you are right. i am all for instability of a useful kind. here it only compounds the misery of the people... because they are also misled in many ways.

      Delete