Pages

Wednesday, August 15, 2012

అ ధర్మో రక్షతి రక్షిత:?



. ధర్మో రక్షతి రక్షిత: అనే వాల్మీకి సూక్తిని మన గోడలన్నిటి మీదా విపరీతంగా రాస్తుంటారు. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది అని దాని అర్థం చెబుతుంటారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ ధర్మానను రక్షించితే తనను తాను రక్షించుకోవచ్చునుకుంటున్నారా? అధిష్టానం కూడా ఆ విధంగానే ఆలోచిస్తూ వుందా?
అధర్మం జరిగిందనే అధికార పక్షం వారంతా ఆవేశంగా విమర్శించారు. ఎన్నేళ్లు శిక్షలు పడేది ముఖ్యమంత్రి ముందుగానే ప్రకటించేశారు. అంతా అయిపోయిన తర్వాత.. అసలు వాళ్లు ఖైదులోకి వెళ్లిన తర్వాత ఇప్పుడు ఆయన సహచరులు ఆ 26 జీవోలలో తప్పేలేదు పొమ్మని దబాయిస్తున్నారు. అదే నోటితో అమాయకుల్లా అర్భకుల్లా మాట్లాడుతున్నారు. ఆనాటి అధినేత ఆదేశాల మేరకు( ఆయనకు శక్తివంతమైన కుడి భుజాలుగా వుండి కూడా) అనివార్యంగా సంతకాలు చేసినందున తమ వ్యక్తిగతపాత్ర ఎలా తప్పవుతుందని ధర్మాన వంటి వారి ప్రశ్న. అసలు మిటన్నది వారి వాదనకు మూలం. అంటే నిజంగా ఆనాడు అధర్మాన్ని కాపాడామని పరోక్షంగా ఒప్పేసుకున్నట్టే గనక అందుకు శిక్ష వుండక్కర్లేదా? ఒక వేళ ఆ జీవోలే గనక తప్పు కాకపోయినట్టయితే అప్పుడు జగన్‌పైన అన్ని విమర్శలు కేసులు ఎలా నిలుస్తాయి? ఈ వాదనలతో నెమ్మదిగా ఆయన వైపు తిరుగుతున్నారా?
వాన్‌పిక్‌ వ్యవహారంలో రెవెన్యూమంత్రిగా ఆయన జారీ చేసిన జీవోలలో ముచ్చటగా మూడు అంశాలు అనుమానాస్పదమే. వాన్‌పిక్‌ పోర్టు పేరిట వుండాల్సిన భూములను వాన్‌పిక్‌ ప్రాజెక్టు పేరిట నిమ్మగడ్డ ప్రసాద్‌కు ధారాదత్తం చేయడం ఒకటి. నాలుగు వేల ఎకరాలతో మొదలైన దాన్ని 28 వేల ఎకరాల వరకూ
తీసుకెళ్లడం మరొకటి. ఇందులో ప్రభుత్వ వాటా ఇంచుమించు గుండు సున్నాగా మారి మొత్తం ప్రైవేటు పరమై పోతున్నా ఆదరాబాదరా జీవోలతో వీలు కల్పించడం మరొకటి. రైతులకు 150 కోట్లు మాత్రమే చెల్లించిన కంపెనీ గుడ్‌ విల్‌ కింద 300 కోట్లు ఖర్చు చూపిస్తుంటే దాని వెనక బ్యాడ్‌ డీల్‌ ఎమిటని అడగని వైనం ఇంకోటి. నిర్దోషిత్వం గురించి వూరికే చెప్పుకున్నంత మాత్రాన నిజాలు దాగేవి కావు. క్యాంప్‌ ఆఫీసులో క్యాంప్‌ చేసి మరీ హడావుడిగా అన్ని జీవోలు విడుదల చేస్తున్నప్పుడు వాటి పర్యవసానాలేమిటో తెలియనంత అమాయక స్థితిలో వున్నారని ఎవరైనా నమ్మగలరా?ఒక వేళ అదే నిజమైతే మంత్రిగా అర్హత వుంటుందా?
ధర్మానతో సహా ఈ మంత్రులు తమ ఆరాధ్య నేత వైఎస్‌ వత్తిడి మేరకు చేశామని చెప్పి అప్రూవర్లుగా మారుతున్నారా అంటే లేదు గాని అసలు జీవోలలో తప్పే లేదని మొండిగా సమర్థన. ఎన్నికల్లో జగన్‌ పార్టీపై విమర్శలు గుప్పించిన వారు ఆ తర్వాత గప్‌చిప్‌.మరోవైపున అప్పుడు కుట్ర అని ధ్వజమెత్తిన ఆ పార్టీ కూడా కేసే లేదని ఒక వైపున అంటూనే మంత్రులను మాత్రం ఇరకాటాన పెట్టే ద్వంద్వ భాషణం చేస్తున్నది. ఈ పరిణామాల తర్వాత అవినీతి కేసులకు సంబంధించి రెండు కాంగ్రెస్‌ల వాదనల మధ్య ఇంచుమించు తేడా లేకుండా పోతున్నది.గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టు తప్పులే జరగలేదన్నట్టుగా మాట్లాడ్డమే జరుగుతున్నది.ఇది ఒక యాంటీ క్లైమాక్స్‌. అయితే ఈ విషయంలో అధిష్టానం నోరు మెదపకుండా సిబిఐని పురమాయిస్తూ పోతున్నదంటే కర్ణాటకలో బిజెపి చేసినట్టుగా ఇక్కడ అవినీతి వ్యవహారాల పట్ల తాము కఠినంగానే వున్నామని రేపు చెప్పుకోవడం కోసమే.
ఇంతకూ ముఖ్యమంత్రి నిజంగా తాను ఎవరినీ కాపాడగలిగింది లేదని తెలిసినా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం పడే ప్రయాసగానే దీన్ని చూడక తప్పదు.అసలే అస్తుబిస్తుగా నడుస్తున్న స్తితిలో అరడజను మందికి పైగా మంత్రులను వదులుకుంటే అస్తిత్వమే వుండదన్న ఆందోళన ఆయనకూ అధిష్టానానికి కూడా. సుప్రీం కోర్టు నోటీసులందుకున్న ఇతర మంత్రులు బారులు తీరి సంఘీభావం చెప్పడంబట్టి చూస్తే ఆయన ఆందోళనకు ఆధారాలు కనిపిస్తాయి. కనకనే వివిధ దిశల్లో వివిధ రకాలుగా విన్యాసాలు సాగుతున్నాయి. న్యాయ సహాయం పేరిట అన్యాయ సహాయానికి సిద్దమవడం ద్వారా ప్రభుత్వం ముందుగానే సిబిఐ వాదనలకు వ్యతిరేకంగా నిలబడింది.ఈ ఆరుగురే గాక పార్థసారథి, బొత్స, ఏరాసు ప్రతాపరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులపై వున్న ఆరోపణల తీగలూ లాగినట్టవుతుంది.ఇంకా ఇతరత్రానూ కేసులున్నవారున్నారు. ఇలాటి సందర్బాల్లో రాజకీయ వేత్తలెవరూ ధర్మానికి కట్టుబడి వుండరు గనక అధర్మ పద్ధతుల్లోనైనా అధికారానికి ఎసరు పెట్టే ప్రమాదం ముంచుకొస్తుంది. అలాగాక అరెస్టు అయ్యేవరకూ లాగగలిగితే ఈ లోపల ఎన్నికలు దగ్గరకు వస్తే ఎలాగో ఆపద్దర్మంగానైనా అధికారంలో కొనసాగవచ్చు. ఇలాటి అతి తెలివి వ్యూహాలు మినహాయిస్తే ఎలాటి సూత్రాలు గాని కొలబద్దలు గాని లేవు. అప్పుడు అధర్మానికి వంత పాడినట్టే ఇప్పుడు అక్కున చేర్చుకుంటే అధికారం మరి నాలుగు రోజులు వుంటుంది.అంతే.
నిందితులైన నిందారోపణలు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు బిసిలనే వాదన మరీ హాస్యాస్పదమైంది. పిసిలు( పొలిటికలీ కరప్ట్‌)గా తప్ప అశేషంగా వున్న వెనకబడిన తరగతులకు ఇలాటి వారు ఎలా ప్రతినిధులవుతారు?దేశంలోనే పెద్దదైన 2 జి కుంభకోణంలో చిక్కిన రాజా ఎస్‌సి గనక వదిలేయాలని ఎవరైనా అన్నారా?నీతి మాలిన వ్యవహారాల్లో చిక్కిన తర్వాత జాతుల ముచ్చట బొత్తిగా అసందర్భం. అంతేగాక శ్రమ జీవులైన ఆ తరగతుల ప్రజలను ఈ రొంపిలోకి తీసుకురావడం అభ్యంతర కరం కూడా. నీతికీ అవినీతికి కూడా కులం మతం ప్రాంతం వుండవు. అయితే కొందరి విషయంలో ఉత్సాహం మరికొందరి విషయంలో ఉదాసీనత చూపించడం ద్వారా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలాటి వ్యర్థ వాదనలకు వూతమిస్తున్నది.
కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ అవసరాలే ఇలాటి వికృత విపరీత స్తితికి కారణమైనాయి. వైఎస్‌ మరణానంతరం జగన్‌కు అనుకూలమైన తతంగం, తర్వాత కాదనుకున్నా ఆయన వర్గీయులందరినీ కొనసాగిస్తూ కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ చేతులు కట్టేయడం ఇవన్నీ అందువల్లనే. చర్చలో వున్న మంత్రులతో సహా పలువురు జగన్‌ పార్టీ సంకేతాలకు అందుబాటులో వున్నప్పుడు- ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ కూడా మెతక వైఖరి అనుసరిస్తున్నారనే అనుమానాలు స్వపక్షంలో ప్రబలుతున్నప్పుడు - ఇంతకన్నా సూటిగా వ్యవహరిస్తారని ఆశించలేము. జైపాల్‌ రెడ్డితో గ్యాస్‌ వివాదంలో అంత దూకుడుగా వ్యవహరించిన నేపథ్యంలో ధర్మాన, పార్థసారథి వంటి వారి విషయంలో ఎందుకు ఇంత విలంబన అనేది అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. మాకు మద్దతు నివ్వకపోతే మేము అటు దూకేస్తామనే బెదిరింపులు స్పష్టంగా వేళ్లాడుతున్నాయి. అధిష్టానం మాయాజాలంలో సిబిఐ ఏం చేస్తుంది, జగన్‌తో సంబంధాలెలా వుంటాయి. ఇన్నిటి మధ్యనా అసలు పార్టీ భవిష్యత్తు ఏమవుతుంది ఇవన్నీ చిక్కు ముడులుగానే వుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కనకనే ధర్మాన రాజీనామా చేసినట్టూ వుంటుంది, కొనసాగడమూ వీలవుతుంది. ఎంత కాలం అంటే సాగినంత వరకూ!

6 comments:

  1. అ ధర్మో రక్షతి రక్షిత:? వ్యాసం చాల బాగుంది
    అధర్మ మంత్రిని జైల్లో పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది దీనికి కాంగ్రెస్స్ ప్రభుత్వం అవినీతి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తోంది ప్రజలు దీనిని గమనిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్స్ మూల్యం చెల్లించుకోక తప్పదు.

    ReplyDelete
  2. మీరన్నది అక్షరాలా నిజం.ఆ 26 జీవోల ద్వారా అవినీతి జరిగిందని నిరూపించనంతవరకూ జగన్ ని దోషి అనడానికి ఏ ఆస్కారం ఉండదు.ఇదే విషయాన్ని ఇంతకుముందు మీ పాత పోస్టులో నేను కామెంటుగా వ్రాసి ఉన్నాను.ఇప్పుడు కాంగ్రెసు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా ఉంది.తమకు మట్టి అంటకుండా జగన్ని దోషిని చేద్దామని CBI ద్వారా వారు చేసిన ప్రయత్నం బెడిసికొడుతోంది.CBI విచారణ మొదటినుండీ నిజమైన దోషులందరినీ పట్టుకోవాలన్న దృష్టితో కాక జగన్ని ఇరికించి తమ నాయకుల మెప్పు పొందాలన్న దృష్టితోనే సాగింది.జగన్ పై కేసు నీరు కారి పోతే ఎవరూ ఆశ్చర్య పోనక్కరలేదు.

    ReplyDelete
  3. "BJP, Shiv-Sena, JD(u), BJD, TDP, SAD, CPI, CPM, AIADMK, SP, BSP, etc all parties except Congress and it's partner are supporting Ramdev " -news.

    Ravi gaaru,
    Please give your views on:
    1) who is political? Hazare or Ramdev?
    2) Why CPI, CPM & BJP joined hands in backing Ramdev's agitation against black money?

    ReplyDelete
    Replies
    1. @snkr
      1.Nobody is apolitical.you take it from me. But as long as they act generally against corruption one have to take it like that.Brinda karat in fact was there with Anna on his second fast..' i as a Commentator make some observations .certainly Ramdev more brazen... but Anna openly talked of political formation as you know.
      2.i have not seen the 'news' you referred. left parties were not seen with Ramdev. Media noted only pro NDA atmosphere there as is reported.His open call against congress confirms that.what is in store let's see.

      Delete
    2. నే మళ్ళీ వెతగ్గా తెలిసింది, నాది పొరపాటు, అది ఎవరో ట్వీట్ చేసిన మాట.
      హజారేను రాజకీయాల్లోకి దిగి మాట్లాడు, గట్టున వుండి నీతులు చెప్పడం కాదు అన్నట్టు UPA గ్యాంగ్ ఎద్దేవా చేశారు. వాళ్ళ నాంపుడు ధోరణికి విసిగి రాజకీయాల్లోకి దిగుతున్నా అని ఓపన్‌గా చెప్పగానే రాందేవ్ వేరు కుంపటి పెట్టాడు, BJP అతని వెనక చేరిపోయింది, తమాషేమంటే SP & BSP ముఠాలు కూడా రాందేవ్ జై అనేశారు!! :)) రాజకీయ సమీకరణాల్లో హజారే ఏకాకి అయిపోయాడు, అదృశ్య పొలిటికల్ సపోర్ట్ ఎవరికి వుందో ఇప్పుడు మీకు తెలిసిందనుకుంటా. హజారే టీం నిజాయతీని ఇప్పుడే శంకించలేము/కూడదు అని నా అభిప్రాయం.

      Thanks for your reply.

      Delete
  4. పార్టీలు బతుకుతాయా చస్తాయా అన్నది కాదు...ప్రజలకు చెందాల్సిన సొమ్ములు ఈ నాయకులు పంచుకు తిని దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు...ఏ పార్టీ అయినా సరే తప్పు చేసినందుకు మూల్యం చెల్లించాల్సిందే.....దేశాన్ని దోచుకుతినమని కాంగ్రెస్ కు ఓటేయలేదు జనం....బోడి నాయకులు జైల్ కు పోయినా నష్టమ్ లేదు...వైయెస్ అవినీతికి సహకరించిన వాళ్ళంతా దోషులే అవుతారు...తప్పు లేదని ఎలా నీతి కబుర్లు చెపుతారు...సాంకేతికి కారణాలతో తప్పించుకోగలరేమోగానీ ఖజానాకు వీళ్ళు పెద్ద ... పెట్టారన్నది నిజం కాదా??

    ReplyDelete