Pages

Friday, August 17, 2012

వేమన భాష, భావ సర్వస్వం


తెలుగు వారికి అత్యంత ప్రియమైన కవి ఎవరంటే వేమనే. అంత పొడుపుగా అంత పొదుపుగా చెప్పిన వారు అప్పుడూ ఇప్పుడూ కూడా అరుదే. అక్షరాక్షరంలో అర్థం పొదిగి ఇచ్చిన ప్రజాకవి గనకనే నాలుగు శతాబ్దాల తర్వాత కూడా ఆయన పద్యాల నాలుకలపై నాట్యమాడుతున్నాయి. అన్ని సందర్భాలకు అతికినట్టు సరిపోతున్నాయి. ఆలోచనలకు పదును పెడుతూనే వున్నాయి. అనేక సార్లు ఆయుధాలవుతున్నాయి. అలాటి వేమనను గుర్తించడంలోనూ గౌరవించడంలోనూ చాలా ఆలస్యమే జరిగింది. అన్యాయమూ జరిగింది.దీనికి చాందసత్వం స్వార్తపర వర్గాల కుటిలత్వం కారణాలు. మొదట బ్రౌన్‌ పండితుడు వేమనను వెలికి తీసి వెలుగులోకి తెస్తే తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఆయనకు సముచిత వ్యాఖ్యాత అయ్యారు. అయితే ఇంత గొప్ప వాడైన వేమనపై సమగ్ర సాధికారిక పరిశోధన చేసిన సాహిత్య వేత్త కవి డా.ఎన్‌.గోపి. 35 ఏళ్ల వయసులోపే వేమనపై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందారు. అంత కన్నా ముందే వేమన్న వేదం పుస్తకమూ ప్రచురించారు. ఒక విధంగా వేమన పట్ల పునరాసక్తి పెంచిన వారిలో గోపీ ప్రథములు. ఆయన పరిశోధన ప్రజాకవి వేమన పేరిట ప్రచురితమైంది.ఈ క్రమంలో గోపి ఆ పద్యాలను విశేషంగా అధ్యయనం చేసి నిగ్గు తేల్చారు. పారిస్‌లో వున్న అరుదైన ప్రతిని తెప్పించి ప్రచురింపచేశారు. అప్పటి వరకూ తెలియని ఏడు పద్యాలు కొత్తగా పరిచయం చేస్తూ ఆయన పేరిట చలామణిలో వున్న కొన్ని నిజానికి కాదని తేల్చారు.
ఆ తర్వాత కాలంలో ఆరుద్ర కూడా వేమనకు సంబంధించి అనేక అంశాలు తెలియజేసినా శ్రీశ్రీ నిరంతరం వేమన స్మరణ చేస్తూనే వున్నా ఈ అనంత పరిశోధన వల్ల గోపి వేమన వేదానికి భాష్యకారుడైనారు. రెండేళ్ల కిందట సాక్షి పత్రికలో తన అనుభవాన్ని రంగరించి 428 పద్యాలకు సమగ్రమైన తాత్పర్య సహిత వ్యాఖ్యానం రాశారు. కేవలం పద్యాలకు వ్యాఖ్యానానికే పరిమితం కాకుండా విలక్షణమైన వేమన పద ప్రయోగాన్ని విప్పిచెప్పేందుకు విశేషమైన శ్రమ చేశారు.అలాగే వేమన తత్వాల పూర్వాపరాలను వాటి వెనక చారిత్రిక నేపథ్యాన్ని సమకాలీన భావాలనూ కూడా పొందుపర్చారు. ఈ పద్య పాదాలకు వున్న పాఠాంతరాలను కూడా ఇస్తూ ఏది ఔచిత్యానికి దగ్గరగా వుందో వివరించారు.
అకారాది క్రమంలో ఎంపిక చేసిన ఈ పద్యాలు వేమన మూడు వేల పద్యాల సారాంశానికి ప్రాతినిధ్యం వహించేవిగా వున్నాయని
గోపి భరోసా ఇచ్చారు. నిజంగానే వీటన్నిటి చదువుతున్న కొద్ది వేమనలో లీనమై పోవడంతో పాటు వాటి వెనక సారాన్ని విప్పి చెప్పిన రచయితనూ తల్చుకుంటూనే వుంటాం.
అంకెలెరిగి మాటలాడ నేర్చినపుడె/ పిన్న పెద్ద తనములెన్ననేల/ పిన్న చేతి దివ్వె పెద్దగా వెలుగదా/ విశ్వ..అన్న పద్యంతో మొదలు పెట్టి హృదయమందునున్న యీశుని తెలియక/ శిలలకెల్ల మ్రొక్కు జీవులార/ శిలలనేమి యుండు జీవులందే గాక/ విశ్వ..అనే పద్యంతో ముగించారు. రెండు పద్యాల్లోనూ మూడో పాదంలో తను చెప్పదల్చుకున్న నీతిని లేదా జీవిత సత్యాన్ని చెప్పాడు. అయితే శ్రీశ్రీ చెప్పినట్టు మొదటి పాదం థీసిస్‌, రెండో పాదం యాంటీ థీసిస్‌ సిద్ధాంతం వేమన పద్యాలన్నిటికి నప్పేది కాదని ఇవన్నీ చూశాక అర్థమవుతుంది. వేమన పద్యాలలో భావ వైవిధ్యం కూడా ఇది చదివాక అర్థమవుతుంది.ఆయన అవగాహన పరిధి చాలా ఎక్కువనీ, అన్వయ శీలత అపారమనీ, తాత్విక చింతన ప్రగాఢమని తెలుసుకోగలుగుతాం.గోపీ సందర్భోచిత వ్యాఖ్యలు అందుకు దోహదం చేస్తాయి.
వేమన ప్రధానంగా దాన గుణం, నిజమైన భక్తిగుణం, సత్య నిరతి,జ్ఞాన చింతన,హృదయ నైర్మల్యం, శైవం, ప్రతిభ,పట్టుదల,శ్రమ, నిగ్రహం,కరుణ,ప్రేమ, అన్యోన్య దాంపత్యం, మానవీయ గుణాలు, కుటుంబ విలువలు వంటి మంచి లక్షణాలను పెంచుకోవాలని ప్రభోధించాడు. బుద్ధిచెప్పు వాడు గుద్దిన నేమయా అని ఆయనే అన్నట్టు ఇదే స్థాయిలో అవలక్షణాలను తూర్పార పట్టాడు. వాటిలో పటాటోపాలు, కపట భక్తి, కుహనా స్వాములు గురువులు,పిసినారి తనం, చాపల్యం, తప్పులెన్నడం,వంచన, గర్వం, మూఢత్వం, కుల భేదాలు తదితరాలను చీల్చి చెందాడాడు. తత్వవేత్తలందరి వలెనే అనేక తావుల వైరాగ్యం, వైముఖ్యం వంటివి కూడా ప్రదర్శించాడు. ఈ 400 పై చిలుకు పద్యాలలోనూ ఎందులో ఏ అంశాన్ని పేర్కొన్నది తెలిపే సూచిక చివరలో పొందుపర్చారు.. ఇంతకూ వేమన తత్వం భౌతిక వాదానికి దగ్గరగా వుంటుంది.'తలప తలప పుట్టు తనువున తత్వంబు,'అని ఒక చోట,తనువులోన పుట్టు తత్వమెల్ల అని మరోచోట అంటాడు. ఆయన రాసిన చరణాలు ఆలోచన నుంచి అస్తిత్వం గాక అస్తిత్వం నుంచి ఆలోచనలు వస్తాయని చెబుతున్నాయి.
వేమన పద్యాల్లో లోకోక్తులు కోకొల్లలు. బాగా ప్రసిద్ధమైనవే గాక వి అందరికీ తెలుసు.కాని ప్రతి రెండు మూడు పద్యాలకూ ఒక గొప్ప సూక్తి కనిపిస్తుంది. 'కుక్క వంటి ఆశ కూర్చుండ నివ్వదు','కూడి కీడు సేయ క్రూరుండు తలపోయు'.' అయ్యగాళ్లకైనా ఆశలు పుట్టవా' 'మురికి భాండమందు ముసురు నీగల భంగి' ' పంట చేను వీడి పరిగె ఏరినయట్లు' 'మనసు విరిగనేని మరి యంట నేర్చునా' ' విజయుడనుగు తప్పి విరటుని గొలవడా' ' పెద్దలుసురు మంటె పెనుమంట లెగయవా' ' ఎనుము గొప్పదైన ఏనుగు పోలునా' 'తడికె బిర్రు పెట్ట తలుపుతోసరియౌనె?',సంపద గల వాని సన్నిపాతకమిది', నూనెలేని దివ్వె నువ్వుల వెలుగునా' 'తెలిసినందుకు మరి ధీరుండు గావలె',' పెక్కు తిండిపోతు పెండ్లామెరుంగురా' 'గురువలైన వారి గుణములీలాగురా' 'తన్నుగానలేడు తత్వమేమెరుగును?','దోషకారికెట్లు దొరుకురా యా కాశి?'కూలబడిన నరుడు కుదురుట అరుదయా' 'కులము కన్న ధనము మిగుల ప్రధానము''కోపమడిచె నేని కోరికలీడేరు' 'పచ్చికుండ నీళ్లు పట్టిన నిలుచునా' 'మనసు లేని వాని మంత్రంబులేమయా' ఇలా మూడో పాదంలో ఆయన చెప్పే పాఠాలు గుణ పాఠాలై ప్రతివారికి కళ్లు తెరిపిస్తాయి.
అయితే కొంతమంది భావిస్తున్నట్టు వేమన స్త్రీ ద్వేషి అనడానికి ఆధారాలు లేవని గోపి సహేతుకంగా వాదించారు. స్త్రీ వ్యామోహం గురించి రాసినట్టే పురుషాహంకారాన్ని కూడా ఆయన చాలా చోట్ల విమర్శిస్తాడు. నిజానికి కొన్ని పద్యాలను పదాలను తప్పుగా అన్వయించడం వల్ల వేమన పురుషులపై చేసిన విమర్శను స్త్రీలకు అంటగట్టడం జరిగిందని గోపి నిరూపించారు.శ్రీశ్రీ కవిత్వంలో కవిత్వాన్ని జననీ అని అభివర్ణించి అనేక చోట్ల అమ్మతనానికి పట్టం కట్టినట్టే వేమన కూడా చేయడం చూస్తాం. 'గుణవతి యగు యువతి గృహము చక్కగ నుండు' ' ఇంతికి పతి భక్తి ఎంతన వచ్చును'' ఇంటి యాలి విడిచి ఇలజారకాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు' ఇలా అనేక విధాల ఆయన భార్యగా స్త్రీకి ఉన్నత స్థానం ఇచ్చే పద్యాలు రాశాడు. ఆలిరంకు తెలుప నఖిల యజ్ఞంబులు' తల్లి రంకు తెలుప తద్దినములు/కాని తెరువు కర్మకాండ కల్పితమాయె/ విశ్వ. అన్న పద్యం ఆయన స్త్రీ పక్షపాతానికి నిదర్శనంగా చెప్పొచ్చు. యజ్ఞాలు తద్దినాల్లో ఒక వేళ భార్య లేదా తల్లి పతివ్రతలు కాకపోతే పుణ్యఫలం వారికి చెందకూడదని మంత్రం చెబుతున్నదట! స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపర్చే ఇలాటి కుసంస్కారాలను ఆనాడే ఖండించడం ఆయన ఔన్నత్యం.వైరాగ్యం గురించి చెప్పేప్పుడు స్త్రీ సౌందర్యమే సర్వస్వం కాదని చెప్పడం వేశ్యా వ్యామోహాన్ని తీవ్రంగా ఖండించడం వల్ల వేమన సానుభూతి గుర్తింపబడలేదని చెప్పాలి. అయితే స్త్రీ అన్న మాటకు రకరకాల పదాలు వాడడంలో వేశ్యలను గురించి రాసింది కూడా సాధారణంగా అన్వయింపచేయడం వల్ల కూడా కొంత అపార్థం కలిగింది.
లోకజ్ఞానం జీవిత పరిశీలన పొంగిపొర్లే వేమన పద్యాలను వాటిలోని పదాలను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత లోతుగా తరిచినా కొరతే.ఎలిమి, దేబె, యాకటి మనిషి, పొడగట్టె,కొద్దికాడు,ఓగు,అణిమ, రిత్త, బిత్తల,మేపరి,మొనసి,పిన్నటి,గణకుడు,పదడు వంటి అచ్చ తెలుగు పదాలను వేమన ప్రయోగించాడు.గోపి వాటికి సవివరంగా అర్థం చెప్పడమే గాక కన్నడం, తమిళం వంటి భాషలతోనూ పోల్చి చూపించాడు.వేమన పదాల ఎంపికలో బిగువెంతో చూపించారు.
వేమన్న వెలుగులు పేరుకు తగ్గట్టే నిజంగానే ఆ ప్రజాకవికి సంబంధించిన కొత్త వెలుగులు ప్రసరించే విజ్ఞాన సర్వస్వం.ఆ రీత్యా సాహిత్య ప్రియులందరూ వుంచుకోవలసిన సారస్వత నిధి ఈ పుస్తకం.దీని ప్రచురణకు సహాయపడిన వరప్రసాద రెడ్డి కూడా బహుదా అభినందనీయులు. ఈ బృహద్గ్రంధానికి అనుబంధంగా ఉపశ్రుతిగానూ ఇంకా కొన్ని చిరు పొత్తాలు తీసుకువస్తే జనానికి వేమన మరింత చేరువవుతాడు.
-తెలకపల్లి రవి

5 comments:

  1. Where can we get this book ?
    -Ramu

    ReplyDelete
    Replies
    1. in major book centres like Prajasakti,vishalandhra...soon

      Delete
  2. i have seen one marx in vemana by reading vemannavadam of dr n gopi

    ReplyDelete
  3. vemana is excellent ప్రజాకవికి
    http://ramamohanchinta.blogspot.in/

    ReplyDelete
  4. వాస్తవికత, తార్కికత మేలు కలయికే మన వేమన్న. తెలుగు వెలుగులు ప్రసరించినంత కాలం అన్నకు వార్థక్యం లేదు, మరణమూ లేదు. మీ సమీక్ష మన వేమన్నను మరింతగా పట్టి చూపింది. దివిటీ పట్టింది. ధన్యవాదాలు.
    వెంకట సుబ్బారావు కావూరి

    ReplyDelete