Pages

Friday, August 5, 2011

పార్లమెంటు చర్చ - పాఠాలు


తెలంగాణా ఏర్పాటుకు బిల్లు పెట్టాలంటూ బిజెపి నేత ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌ ప్రవేశపెట్టిన సావధాన తీర్మానం దేశంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీల ద్వంద్వ నీతులను బహిర్గత పరిచింది. కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు అన్ని రకాల ప్రాంతీయ తత్వాలను వాడుకుంటూనే అధికార పరిభ్రమణం చేస్తున్న తీరు వెల్లడైంది. మీరు అధికారంలో వున్నప్పుడు ఏం చేశారని కాంగ్రెస్‌ వారు ప్రశ్నిస్తున్నారు. మేము మద్దతు నిస్తామన్నా ఎందుకు బిల్లు పెట్టడం లేదని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. పాత్రలు అటూ ఇటూ అయినా ప్రయోజనాల పాకులాట మారలేదన్నదే రెంటికీ సమాధానం. ప్రతిపక్షంలో వున్నప్పటి సులోచనాలు వేరు, ప్రభుత్వంలో వున్నప్పుడు వేరు.

ఇంతకూ ఇప్పుడైనా సుష్మా స్వరాజ్‌ స్పష్టంగా చెప్పడం బాగానే వుంది గాని ఒక ఉపప్రాంతీయ నేతగా జాతీయ ప్రతిపక్ష నాయకురాలు మాట్లాడనవసరం లేదు. అన్నిటినీ మించి ఒక అసహాయ అయోమయావస్థలో ఆత్మహత్యకు పాల్పడిన అభాగ్య యువకుని ఆఖరు లేఖను చదివడంలో ఇది పరాకాష్టకు చేరింది.( దాని వాస్తవికతనే ప్రశ్నించిన కావూరి సాంబశివరావు మరో అనవసర వివాదానికి కారకులైనారు.) ఆత్మహత్యల ఆదర్శీకరణ గురించి కిందటి ఎంట్రీలో వివరంగా చర్చించాము. 500 మందికి పైగా రాజకీయ వేత్తలున్న అత్యున్నత సభలో ఇలాటి లేఖ చదవడం ఏ సంకేతాలిస్తుందో సుష్మాజీకి తెలియదా?అంతా అయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలుగులో చెబితే జరిగే నష్టం ఆగుతుందా? సుష్మా స్వరాజ్‌ తెలంగాణా నుంచి పోటీ చేస్తారన్న కథనాలు కూడా వస్తున్నందున బిజెపి ఈ అంశంపై గట్టిగానే ప్రచారం చేపడుతుందని భావించవచ్చు.
సిపిఐ నాయకుడు గురుదాస్‌ గుప్తా కూడా విభజన కోర్కెెను సమర్తించినప్పటికీ ఒక్క తెలంగాణా గురించే మాట్లాడుతూ ఇతర ప్రాంతాల మనోభావాలను విస్మరించడం తగదని చెప్పవలసి వచ్చింది. ఇది ఒక విధంగా ఆ పార్టీ వైఖరికి కూడా దిద్దుబాటు అనుకోవచ్చు.సర్వే సత్యనారాయణ, కావూరి సాంబశివరాలు తమ తమ నెలవులను బట్టి మాట్లాడారు. చిదంబరం సమాధానం షరా మామూలే, తెలుగు దేశం కాంగ్రెస్‌,ఎంఐఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లు స్పష్టంగా చెప్పాలని అయనన్నారు. ముందు తమ తరపున చెబితే ఆ తర్వాత మిగతా వారి సంగతీ చూసుకోవచ్చు. తమలాగే తెలుగు దేశం కూడాచర్చలు జరపాలని చెప్పడం బాగానే వుంది గాని ఆ చర్చలను డ్రామాలని కేశవరావు వర్ణించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏది ఏమైనా మూడు మాసాల గడువు కనీసంగా వుంటుందన్నాడు కాబట్టి ఆలోగా అసహనాలు ఆవేశ కావేశాలు పెరక్కుండా చూసుకోవడం అందరి బాధ్యత.

No comments:

Post a Comment