Pages

Sunday, August 21, 2011

పెనం మీంచి పొయ్యిలోకి రాష్ట్ర పరిణామాలు


ఇంచుమించు రెండేళ్లుగా రాష్ట్ర రాజకీయావరణాన్ని ఆక్రమించేసిన రెండు అంశాలు- జగన్‌, తెలంగాణా విభజన. అహౌరాత్రులు ఆ రెంటి చుట్టే పరిభ్రమణం సాగింది. వాటిపై అనేక ఆవేశ కావేశాలు అతిశయోక్తులు, అవాస్తవాలు జోరుగానే సాగాయి. అయితే గత వారం పది రోజుల్లో ఈ రెండు అంశాలకు సంబంధించిన నిజానిజాలు, నిజ రూపాలు ప్రజలు తెలుసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. కేవలం ఉద్రిక్త వాదోవపాదాలకు ప్రచార పటాటోపాలలో ముంచెత్తే స్తితి వెనక్కు పోయి ఎవరు ఏమిటో ఎలా వున్నారో వుంటారో కూడా ప్రజలు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. వారు సరైన నిర్ధారణలకు రావడానికి ఇంత కన్నా కావలసింది వుండదు. ఈ రెండు అంశాలు కూడా రాజీనామాలవైపే నడవడం కూడా ఒక విచిత్రమైన సారూప్యం.

ముందుగా జగన్‌ విషయం తీసుకుంటే 2008లోనే ప్రతిపక్షాలు ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారు
ప్రభుత్వం నుంచి అప్పణంగా ప్రయోజనాలు పొందిన కార్పొరేట్‌ కుబేరులేనని విమర్శిస్తూ వచ్చాయి. నిజానికి అంతకన్నా మేందు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు జలయజ్ఞంలో వేయికోట్లు చేతులు మారాయని విమర్శించారు.దానిపై ఆగ్రహించిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేసు పెట్టడానికి యత్నించి తర్వాత వెనక్కు తగ్గింది. హెలికాఫ్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత సంతకాల సేకరణ సన్నివేశంతో జగన్‌ పాత్ర చర్చలోకి వచ్చింది. అవి ఆయనకు తెలిసి చేశారా లేదా అనేది అటుంచితే ముఖ్యమంత్రి పదవి ఆయనకు అప్పగించాలనే వాదన మంత్రులతో సహా చాలామంది శాసనసభ్యులు వినిపిస్తూ వచ్చారు. ే అధిష్టానం ఎటూ తేల్చకుండా వాయిదా వేయడంతో అసహనం పెరిగిన జగన్‌ ధిక్కార స్వరాలు వినిపించడం మొదలు పెట్టారు.ఓదార్పు యాత్ర క్రమంలో అది పరాకాష్టకు చేరింది. రోశయ్య స్థానే కిరణ్‌ కుమార్‌ రెడ్డి పదవి స్వీకరించిన తర్వాత కొన్నాళ్లకే జగన్‌ పార్టీ నుంచి వైదొలగారు.
ఈ కాలమంతటా కూడా కాంగ్రెస్‌లో వైఎస్‌ వ్యతిరేకులు, తెలుగు దేశం నాయకులు జగన్‌పై అవినీతి ఆరోపణలను పదే పదే వినిపిస్తూనే వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై స్పందించడానికి నిరాకరించాయి. కిరణ్‌ కుమార్‌ వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్ణయాలు కొన్నిటిని సమీక్షిస్తామని చెప్పినా వైఎస్‌ కుటుంబంపై ఆరోపణలను గురించి ఏమీ మాట్లాడింది లేదు. ఈ దశలోనే కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ శంకర్‌ రావు జగన్‌కు వ్యతిరేకంగా పిటిషన్‌ వేయడం, దాన్ని హైకోర్టు స్వీకరించడం, ఈ లోగా ఆయన మంత్రి కావడం జరిగిపోయాయి. తెలుగు దేశం నాయకుడు ఎర్రం నాయుడు కూడా అందులో చేరారు.ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు వున్నట్టు భావించిే సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలిచ్చింది.

వైఎస్‌ హయాంలో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొంది జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి సహకరించారనేది నిస్సందేహంగా దర్యాప్తు జరపాల్సిన విషయమే.దీనిపై అనేక పత్రాలు ఆధారాలు వున్నప్పుడు, జగన్‌ కూడా పెట్టుబడులు పెట్టడం తప్పు కాదని వాదిస్తున్నప్పుడు నిజానిజాలు తేల్చడానికి దర్యాప్తు తప్ప మార్గం లేదు. ఇది రాజకీయ కక్షతో చేస్తున్నదని జగన్‌ అన్నప్పటికీ దర్యాప్తు చేయక తప్పదు. తాను ఎదురు తిరిగినందునే తనపై కత్తికట్టారని జగన్‌ అంటారు. మేము పదవి ఇవ్వనందునే ఆయన బయిటకు పోయాడని,ఈ నేపథ్యం వల్లనే తాము తటపటాయించామని కాంగ్రెస్‌ వారంటారు.ఏతావాతా ఉభయులూ ఇది తమలో తాము సర్దుకోలేక పోయిన ఫలితమేనన్నట్టు మాట్లాడుతున్నారు. వైఎస్‌ హయాంలో మంత్రివర్గ నిర్ణయాలకు సమిష్టి బాధ్యత సూత్రాన్ని కాంగ్రెస్‌ కావాలనే దాటేస్తున్నది. ఆ సమయంలో ఆయనకు పూర్తి అండదండలిచ్చి ఆశీర్వదించిన అధిష్టానం పాత్రనూ పట్టించుకోవడం లేదు. నిజానికి ఇది జగన్‌తో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పార్టీని కూడా కుదిపేసే సమస్య.ఓదార్పు యాత్రను అనుమతించకపోవడం వల్ల తాము బయిటకు వచ్చామనే తప్ప మరో తేడా జగన్‌ గాని ఇతరులు గాని చెప్పడం లేదు.. రాజకీయ వ్యతిరేకత, సమిష్టి బాధ్యత వంటి మాటలతో జగన్‌ వర్గం తమ ప్రధాన బాధ్యతను దాటవేయడమూ కుదరదు. గత వారం చెప్పుకున్నట్టు మొత్తం సరళీకరణ మాయాజాలంలో ఇలాటి పరిణామాలు సర్వసాధారణంగా తయారయ్యాయి గనకే అన్నా హజారే దీక్షకు అంత స్పందన లభిస్తున్నది. రేపు జగన్‌ వాదనను సుప్రీం కోర్టు అంగీకరిస్తే అప్పుడు ఏం జరుగుతుందనేది చూడొచ్చు. ప్రస్తుతానికి మాత్రం వ్యక్తులు ఎవరన్నదానితో నిమిత్తం లేకుండా దీని లోతుపాతులు విచారించవలసిందే. నిజాయితీ నిరూపించుకోదలచిన వారికి కూడా ఇంతకు మించిన అవకాశం మరొకటి వుండదు.
చాలాసార్లు ఆరోపణలు వస్తున్నట్టు తెలుగుదేశం ప్రభుత్వ పాత్ర వుంటే అది కూడా దర్యాప్తులోనే తేలుతుంది తప్ప చంద్రబాబును విమర్శించడం సిబిఐ దర్యాప్తునకు సమాధానం కాదు. ఈ దర్యాప్తు తీరు తెన్నులు వాటిలో నిందితులు చెప్పే విషయాలను బట్టి వచ్చే నిర్ధారణలు భావి పరిణామాలను నడిపిస్తాయి. కేవలం రాజకీయ ప్రధానమైన విమర్శలతో ఏదీ మాదదు. జగన్‌కు జనాదరణ, కడప మెజార్టి,భావి అవకాశాలు, వైఎస్‌ కుటుంబం పట్ల ఆదరణ వంటివి ఎంతగా చెప్పుకున్నా ఈ దర్యాప్తు తర్వాతనే ప్రజలు ఒక అభిప్రాయానికి రాగలుగుతారు. ఆ మేరకు జగన్‌ ప్రస్తుతానికి ప్రతికూల వాతావరణాన్నే ఎదుర్కొంటున్నారు. రేపు అరెస్టు వంటివి జరిగితే మరింత ఎదురు దెబ్బ తగలొచ్చు.
దీన్ని ముందే తటస్థీకరించడానికి, తన బలం తను నిలబెట్టుకోవడానికి వీలుగా జగన్‌ వర్గం రాజీనామాలకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 29 వరకూ రాజీనామా చేయాలని భావిస్తున్నారంటే రాజకీయంగా అది చెప్పుకోదగిన బలమే. అయితే వీరంతా రాజీనామా చేసినా ప్రభుత్వం పడిపోదనేది స్పష్టంగా కనిపిస్తుంది.ఎందుకంటే రాజీనామాలతో సభ్యుల సంఖ్య తగ్గి మెజారిటీ అవసరం కూడా తగ్గుతుంది.పిఆర్‌పి కలిసిన తర్వాత మజ్లిస్‌ మద్దతు కూడా కలిసిన కాంగ్రెస్‌కు సంఖ్యాపరమైన సమస్య వుండదు. కాకపోతే అసలే అస్తుబిస్తుగా నడుస్తున్న ప్రభుత్వం మరింత అస్థిరత్వం పాలు కావడం అనివార్యం.
ఇక రెండో అంశం - తెలంగాణా విభజనకోరే వారికి కూడా ఈ కాలంలో నిరుత్సాహ వాతావరణమే ఎదురైంది. కాంగ్రెస్‌ వారి రాజీనామాలతో అద్బుతాలు జరిగిపోతాయన్న అంచనాలు నిజం కాదనిఈ శీర్షికలో చాలా సార్లు చెప్పుకున్న మాట అక్షర సత్యమైంది. రాజీనామాల విషయంలో టిఆర్‌ఎస్‌ ఆలోచనలకు అధికార పార్టీ వ్యూహాలకు పొంతనలేదని కూడా గతంలో చెప్పుకున్నదే. స్పీకర్‌ రాజీనామాలను తిరస్కరించడంతో ఒక తంతు పూర్తయిందని భావించే కాంగ్రెస్‌ నేతలు మరోసారి రాజీనామా వూసెత్తడం లేదు. అసలు మంత్రులు తమ మంత్రిపదవులకు సూటిగా రాజీనామాలిచ్చిందే లేదు. సోనియా అనారోగ్యం కూడా వారికి ఒక సమర్థన సమకూర్చింది. పైగా కేంద్రం ఈ సమస్యను తేల్చే ఉద్దేశంలో లేదని వారికి అధికారికంగానే తెలుస్తున్నప్పుడు రాజీనామాలపై పట్టుబట్టి రాజకీయ భవిష్యత్తు బలిచేసుకోవడానికి సిద్ధం కాలేరు. కనకనే రకరకాల పద విన్యాసాలు చేసి స్వాతంత్ర దినోత్సవ సాక్షిగా విధులలో చేరారు. క్యాబినెట్‌ సమావేశం కూడా జరిగిపోయింది. ఈ మంత్రులను ద్రోహులని టిఆర్‌ఎస్‌ వర్గాలు నిందించినప్పటికీ ఆ నిర్ణయాన్ని అతిశయోక్తిగా చెప్పిన తమ బాధ్యత కూడా మరుగుపర్చలేరు. ప్రయోజనాల కొసం పాకులాటలో పరిస్తితులను బట్టి ఎవరి ఎత్తుగడలు వారు అనుసరించడం తప్ప ఇందులో ద్రోహాలు స్వచ్చతల ప్రసక్తి ఏముంటుంది?
ఈ నేపథ్యంలోనే సకల జనుల సమ్మె విషయంలోనూ కొన్ని భిన్నాభిప్రాయాలున్నట్టు కనిపిస్తుంది. పాలక వర్గాలు కోరి కోరి రాజకీయ నాటకం నడిపిస్తుంటే, ప్రభుత్వం నిర్భంధ శాసనాలు చేస్తుంటే నిరవధిక ఆందోళన వంటి బలమైన నిర్ణయంతో తాము వుచ్చులో పడతామా అన్న సందేహం కూడా ఆ నాయకులను వేధిస్తున్నది. గతంలో ప్రత్యేక ఉద్యమాల అనుభవాలు వుద్యోగులు తేలిగ్గా మర్చిపోలేమని,లౌక్యంగా వ్యవమరిస్తామని వారంటున్నారు. 14(ఎఫ్‌) రద్దు నిర్ణయం తర్వాత ఎస్సై పరీక్షలు నిర్విఘ్నంగా పూర్తి కావడం కూడా జెఎసిటిఆర్‌ఎస్‌లకు అభిలషణీయం కాదు. జెఎసి అందరినీ కలుపుకొని పోవడం లేదని టి- తెలుగుదేశం నేతలు విమర్శించడమే గాక కొండా లక్ష్మణ్‌ బాపూజీ నేతృత్వంలో కొత్త జెఎసి కూడా ఏర్పడింది.గద్దర్‌ వేదిక ఇప్పటికే వుంది.ఇవన్నీ టిఆర్‌ఎస్‌ కోరుకునే దిశకు భిన్నమైన పరిణామాలు రెండు వారాల్లో విభజన జరిగిపోతుందని చెప్పిన కెసిఆర్‌ 2014 ఎన్నికల గురించి ప్రస్తావించడానికి ఇదే కారణం కావచ్చు. ఆ విధమైన తర్జనభర్జనలు అన్ని తెలంగాణా పక్షాల్లోనూ జరుగుతున్నట్టు తెలుస్తూనే వుంది. కేంద్రంలోని అతి కీలక నేతలు కూడా ఆ మేరకు సంకతాలిచ్చినట్టు చెబుతున్నారు. అలాటి అంచనాతోనే వుంటే అప్పుడు సంయమనం మరింత అవసరమవుతుంది. మరి ఆ విధమైన విజ్ఞత ఎవరు ఏ మేరకు ప్రదర్శిస్తారో ఆచరణలో చూడాలి.
జగన్‌కు టిఆర్‌ఎస్‌ పరోక్ష మద్దతు వుందనే కథనాల మధ్య ఈ దర్యాప్తు వివరాలను వారికి సంబంధించిన సంస్థలు వలస దోపిడిగా చిత్రించడం ఆసక్తికరమైన విషయం. ప్రపంచీకరణకు ప్రధాన ప్రాతిపదిక అయిన సరళీకరణ దేశాల సరిహద్దులనే పాటించనప్పుడు ప్రాంతీయ రేఖల పరిధిని పాటిస్తుందా? రాష్ట్ర విభజన అనే ఏకాంశ కార్యక్రమం తమ ప్రాతిపదిక గనక ప్రతిదీ ఆ మూసలోనే కుదించాలనుకోవడం పాక్షికత్వమే అవుతుంది. హైదరాబాదు చుట్టుపక్కలే గాక విశాఖ నగరంలోనూ,కడపతో సహా వివిధ జిల్లాల్లోనూ వేల ఎకరాలు పందేరం చేయడం కూడా జరిగిందని గుర్తు చేసుకుంటే ఇది వలస దోపిడీ కన్నా వరస దోపిడీ అన్న మాట మరింత సమంజసంగా వుంటుంది. మొత్తంపైన రాష్ట్ర రాజకీయ రంగాన్ని ఆక్రమించేసిన ఈ రెండు అంశాలలో సాగుతున్న తీవ్ర మధనం ఎలాటి మలుపులకు దారి తీస్తుందో చూడాలి.
( ఆగష్టు 21 ఆదివారం ప్రజాశక్తిలో ప్రస్తుతం శీర్షికన రాసిన వ్యాసం తాజా చేర్పులతో)

4 comments:

  1. jagan jailukelthe aa party nayakulaku bavishyathu untunda?

    ReplyDelete
  2. రవి గారు,

    ప్రస్తుత మన రాష్ట్ర రాజకీయాన్ని, జరుగుతున్నా పరిణామాలను చాలా చక్కగా చెప్పారు.

    ఈ రాజకీయ నాయకులు తమ స్వార్ధం కొరకు ఎప్పుడు పడితే అప్పుడు రాజానామా చేయడం అలవాటయ్యింది, ప్రజలు వీరిని ఓటు వేసి నాయకులు గా ఎంచుకొంటే వీరు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఒకసారి రాజీనామా చేసిన వారు మల్లి ఎన్నికల్లో పోటికి అనర్హులుగా ఉండేటట్లు మన చట్టం లొ సవరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    ReplyDelete
  3. wait chesi chuddam inka enni twistlu vastayo...

    ReplyDelete
  4. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గతకలహాల పర్యవసానమే నేడు రాష్ట్రాన్ని పీడిస్తున్న రెండు సమమస్యలు(జగన్,తెలంగాణా).గత చరిత్ర తీసుకొన్నా మండల్,అయోధ్య సమస్యలకు రాజీవ్ గాంధీ,విపిసింగుల జగడం,ఇందిరా గాంధీ,నిజలింగప్ప,కామరాజ్ ల మధ్య ఆధిపత్యపోరు దేశాన్ని ఇందిర గుప్పిటలోకి తీసుకొని తదుపరి ఎమర్జన్సీ విధించడానికి దారితీయడం మనందరికీ తెలుసు.అయినా మన వోటర్ మహాశయుడు కాంగ్రెస్ నే గెలిపించి మనం ఏ పాలకులకు అర్హులమో వారినే గెలిపించుకొంటున్నాడు. .తప్పదు.అనుభవించాల్సిందే.

    ReplyDelete