సుప్రీం కోర్టు జగన్ పిటిషన్‌ను తోసిపుచ్చడం వూహించదగిన విషయమే.ఏ కారణాల వల్ల హైకోర్టు విచారణలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం నిరాకరించిందో అవే కారణాలు ఈ కొట్టివేతకు దారి తీస్తాయనేది పెద్ద న్యాయ పరిజ్ఞానం లేకుండానే చెప్పదగిన విషయం. అయినా ప్రయత్నం చేయాలి గనక వెళ్లి లేదనిపించుకున్నారు. అయితే దీనివల్ల ఆరోపణలు మరింత రూఢిగా అయినట్టవుతుందనే కోణం జగన్ వర్గం పట్టించుకోలేదు. పైగా వారికి వేరే మార్గాలు కూడా లేవు. ఎందుకంటే సామూహిక రాజీనామాలతో రాష్ట్ర రాజకీయాల అనిశ్చితిని పెంచడంలో కృతకృత్యమై వుండొచ్చు గాని నాటకీయ మార్పులను మాత్రం వెంటనే తీసుకురాగల పరిస్థితి,సంఖ్యాబలం లేవు.ఉన్నదైనా నిలబెట్టుకోవాలనే వ్యూహంతోనే హడావుడిగా రాజీనామాలిప్పించారన్నది వారే ఆంతరంగికంగా
అంగీకరిస్తున్న మాట. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు తర్వాత జగన్‌పై దాడి పెరగడం అనివార్యం.రామాయణంలో పిడకల వేటలాగా ఈ సమయంలో బిజెపి జగన్‌కు వంత పాడి మంచి చేసుకోవాలనుకోవడంలో అవకాశవాదమే కనిపిస్తుంది. ఏదో విధంగా మిత్రులను కూడగట్టుకుని నాలుగు సీట్లు తెచ్చుకోవాలన్న ధ్యాస బిజెపిని ఎప్పుడూ నడిపిస్తుంటుంది. జాతీయ స్థాయిలో బిజెపి మాత్రమే తన రాజకీయ శత్రువని జగన్ స్పష్టం చేశాక కూడా జైట్లీ ఇలా మాట్లాడ్డం వూహకందని విషయం. నిజంగా విశాల ప్రజాస్వామికసృహతో మాట్లాడారనుకునేంత అమాయకులెవరూ వుండరు.ఎడ్యూరప్ప విషయంలో భంగపాటుకు గురైన బిజెపి సుప్రీం తీర్పు వస్తున్నప్పుడే ఈ సమర్థన పలికి అవినీతి ఆరోపణల పట్ల పట్టింపు లేదని నిరూపించుకుంది.
ఇక వైఎస్‌ఆర్ పార్టీ నేతలు తమ రాజీనామాలకు చెప్పిన కారణం విశాల జన రాశుల జీవితాలతో ముడిపడింది కాకపోవడం మొదటి సమస్య. రాజకీయ కక్ష సాధింపు అనే ఒక్క వాదనే గట్టెక్కిస్తుందనుకుంటే పొరబాటు. ఈ సమస్యపై ప్రచారోద్యమం తీవ్రం చేస్తే ప్రశ్నలు కూడా పెరగడం అనివార్యం. పాలక పక్షం సరైన వ్యూహం లేకపోవడంతో పాటు వైఎస్‌ఆర్ తమ ముఖ్యమంత్రి అనే వాస్తవాన్ని కాదనలేదు.కనుకనే ఒక విధంగా ఇది ఇరు పార్టీలకూ ఇరకాటమైన సమస్యే.ఉభయులూ బేరసారాల గురించి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప వైఎస్‌ఆర్‌పై ఆరోపణలతో సంబంధం లేదని చెప్పి ఒప్పించలేరు. పిటిషన్‌లో ఫిర్యాదులు పొందుపర్చడం తప్ప ఎఫ్‌ఐఆర్‌లో ప్రత్యేకించి నిందితుడుగా వైఎస్‌ఆర్ పేరు చేర్చింది లేదు.మృతుడు గనక ఆ అవకాశం కూడా లేదు.కాకపోతే ఆ పేరుతో సాగే రాజకీయ ప్రహసనమే ఈ తతంగమంతా. జగన్ వర్గం కూడా ఆరోపణలపై సంజాయిషీ చెప్పుకుని సరైన వివరణ ఇస్తే తప్ప జనం పట్టించుకోరని అనుకుంటే కూచుంటే కుదరదు. దేశంలో అవినీతి వ్యతిరేక వాతావరణ ప్రభావాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే దెబ్బ తింటారు.చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన ఆరోపణలపై వివరణ కోసం తెలుగుదేశం నేతలు బోలెడు కసరత్తు చేసి సవాళ్లు విసురుతుంటే జగన్ ఆయన వర్గీయులు ఏకపక్ష వాదనతలతోనే నెట్టుకురాగలమనుకోవడం అది అవాస్తవమే అవుతుంది. అన్నా హజారే ఉద్యమ నేపథ్యంలో కేంద్రమే దిగివస్తుంటే కేవలం వైఎస్‌ఆర్ భజన వొక్కటే కాపాడుతుందని వారు ఎలా అనుకోవడం ప్రజల విచక్షణా శక్తిని పరిహసించడమే.ఇక తెలంగాణా జెఎసి చైర్మన్ కోదండరామ్ ఎంఎల్‌ఎ రాజీనామాలకు జగన్ వర్గాన్ని ఆదర్శంగా చూపించడం కూడా పొంతన లేని పోలిక. వ్యక్తిగత విధేయతతో ప్రయోజనాలతో వారు చేసిన దాన్ని ప్రాంతీయ పరమైన వాటిని కలిపి మాట్లాడినా ఫలితం వుండదు.ఇప్పటికే తెలంగాణా జపం చేసే వివిధ రాజకీయ శక్తుల మధ్య ప్రయోజనాల పాకులాట తీవ్ర స్థాయిలోనే సాగుతున్నందున ప్రాంతీయ వ్యూహాల పరమార్థం ఏమిటో ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు.మరో జెఎసి నాయకుడు రాజీనామాలు చేయకపోతే భౌతిక దాడులు చేస్తామని బెదిరించడం కూడా ఇప్పటి వరకూ కలిగిన అనుభవాలను విస్మరించడమే అవుతుంది. (ఈ రెండు సమస్యలను పూర్వాపరాలను మలుపులను గత ఎంట్రీలో వివరంగా చర్చించి వున్నాము)
This comment has been removed by a blog administrator.
ReplyDelete