Pages

Saturday, August 27, 2011

బషీర్‌ బాగ్‌ బాటలో సమరశీల పోరాటాలు



ఆగష్టు 28. బషీర్‌ బాగ్‌ కాల్పుల అమరులకు జోహారులర్పించే రోజు. ఆ పోరాట స్పూర్తిని స్మరించుకునే రోజు. సరళీకరణ యుగంలో సమరాలకు అది పెట్టిన వరవడిని గుర్తు చేసుకుని నేటి ఉద్యమాలను ఉధృతం చేసేందుకు దీక్ష వహించాల్సిన రోజు. బషీర్‌బాగ్‌ ఘటనలను తమ తమ పాక్షిక కోణాలలో చూసి చూపించి ఉద్యమాల పాత్రను వక్రీకరించే వారికి సమాధానం ఇవ్వాల్సిన రోజు కూడా. 2000 సంవత్సరం వచ్చినపుడు నూతన సహస్రాబ్ది అంటూ ప్రపంచ వ్యాపితంగా మీడియా, పాలక వర్గాలు కూడా ఎక్కడలేని హడావుడి చేశాయి. అయితే ఆ నూతన సహస్రాబ్దిని సమరశీలంగా మార్చి రాబోయేది పోరాటాల యుగమని చేసిన తొలి హెచ్చరిక బషీర్‌బాగ్‌. వామపక్షాలు
ఎన్నికల పార్టీలుగా మారిపోయి ఉద్యమాలు పోరాటాలను పక్కనపెట్టాయని నిందలేసే వారికి కళ్లు తెరుచుకునేలా సమరశీల ఉద్యమాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రచించిన సన్నివేశమది.

అప్పుడు అధికారంలో వున్నది తెలుగుదేశం ప్రభుత్వం గనక అది కేవలం ఆ ప్రభుత్వానికి ఇంకా చెప్పాలంటే ఆ పార్టీకి వ్యతిరేకంగానే జరిగినట్టు కొంతమంది మాట్లాడుతుంటారు. ఆ ఉద్యమాన్ని కీర్తిస్తున్నట్టు నటిస్తూ నడిపించిన వామపక్షాలపై నిందలేస్తుంటారు. అలాటి ఉద్యమాలు ఇప్పుడు జరగడం లేదని తేలిగ్గా మాట్లాడుతుంటారు. ఇవన్నీ వాస్తవ విరుద్ధమైన వాదనలు. నిజానికి సరళీకరణ యుగంలో పాలక పార్టీలన్ని,వామపక్షేతర శక్తులన్ని అనుసరిస్తున్న విచ్చలవిడి ప్రైవేటీకరణ పోకడలకూ ప్రజలపై భారాలు మోపి కుబేరులను మరింత బలిపింపచేసే నిలువు దోపిళ్లకు వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన ప్రజాందోళనకు పరాకాష్ట బషీర్‌బాగ్‌ ఘటన. ఈ ఉద్యమానికి ఎంతటి ప్రాధాన్యత వుందంటే తర్వాత ఆసియా సామాజిక వేదిక సభలకు హైదరాబాద్‌ రంగస్థలం కాగలిగింది.అంటే ప్రపంచీకరణ వ్యతిరేక పోరాటాలకు ఒక నమూనాగా బషీర్‌బాగ్‌ విశ్వవిఖ్యాతి గాంచిందన్నమాట.

వికసించిన విద్యుత్తేజం అని శ్రీశ్రీ అన్నట్టు విద్చుచ్చక్తి రేట్లను విపరీతంగా పెంచడానికి వ్యతిరేకంగా ఆ ఉద్యమం మొదలైంది. దేశానికి తలమానికంగా వున్న మన విద్యుత్‌ బోర్డును సంస్కరణల పేరుతో ముక్కలు చేసి ప్రైవేటు జోక్యం పెంచేందుకు ఉద్దేశించిన విధానంపై పోరాటం ప్రజ్వరిల్లింది. తొమ్మిది వామపక్షాల ఆధ్వర్వంలో దశలవారీగా ఉద్యమం వూపందుకుంది. అంతకు ముందు కాలంలో కమ్యూనిస్టులు గతంలో వలె ఉద్యమాలు చేయడం లేదని విమర్శించేవారికి అది గట్టి సమాధానమైంది. అలాగే వామపక్షాల ఐక్య కార్యాచరణకు కూడా బాట వేసింది. ఈ ఉద్యమానికి వూపు తీసుకురావడంలో సిపిఎం వామపక్షాలు గణనీయమైన పాత్ర నిర్వహించాయి. ప్రణాళికా బద్దంగా ప్రచారం ఆందోళన నిర్వహించాయి.అధికార వ్యూహాలు తప్ప ఆందోళనలు పోరాటాలు పట్టని కాంగ్రెస్‌ కూడా అందుకు మద్దతు తెల్పవలసి వచ్చింది.ఆగష్టు 28 చలో అసెంబ్లీకి ముందే నాటి ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసింది. ఆ రోజున భారీగా పోలీసులను నిర్బంధ యంత్రాంగాన్ని ముళ్లకంచెలను మొహరించింది. ముందుకు రాకుండా దిగ్బంధం చేయాలనే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపితే బాలస్వామి, విష్ణువర్ధన్‌, రామకృష్ణ(కొన్ని రోజుల తర్వాత) మరణించారు.ఈ కాల్పులు నిరసన వెల్లువకు దారితీశాయి. ఉద్యమం కూడా ఉధృతమైంది. ఎన్నో సరికొత్త పోరాట రూపాలకు అది జన్మనిచ్చింది. అప్పట్లో పోలీసులు లాఠీలకు తూటాలకు గురైన ఎందరో కార్యకర్తలు నిగ్గు తేలడానికి ప్రజాందోళనకు అంకితం కావడానికి ఆ ఉద్యమం దారి తీసింది. జాతీయోద్యమంలోనూ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ కార్యకర్తలకు ఎదురైన తరహాలోనే ఒక క్రమబద్దమైన ఉద్యమానుభవం కొత్త తరాలకు కలిగించింది.తర్వాతి కాలంలో వచ్చిన రాజకీయ మార్పులకు ఎన్నికల తీర్పులకూ ఈ ఉద్యమమే నాంది పలికిందనేది అందరి ఏకాభిప్రాయం. తర్వాత చాలా సంవత్సరాల పాటు ప్రభుత్వాలు విద్యుత్‌ రేట్లు పెంచేందుకు సాహసించలేకపోయాయి. ఇటీవల మళ్లీ రేట్లు పెంచగానే వామపక్షాలు ఉమ్మడిగా సదస్సులు నిర్వహించడం తెలిసిందే.
విద్యుచ్చక్తి ఉద్యమం రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాలను ఎండగట్టి ప్రజలను ప్రతిఘటనకు సిద్ధం చేసింది. అప్పటి వరకూ రాజకీయ నేతలకే పరిమితమైన ఆ విధానాలు సరళీకరణ సంస్కరణల పేరిట సాగే తతంగాలు జన సామాన్యం కూడా అర్థం చేసుకోవడానికి అవకాశమిచ్చింది. ప్రపంచ బ్యాంకు షరతులు మనకు వ్యతిరేకమైనవన్న అవగాహన అందరిలో పెంపొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం చాలా కాలం పాటు ఆ మాట ఎత్తేందుకు వెనుకాడక తప్పలేదు. చాపకింద నీరులా ఆ విధానాలను తీసుకురావడానికి ప్రయత్నించినా అంతకు ముందు వుద్యమ కాలంలో చేసిన వాగ్దానాలు ప్రకటనలే ప్రశ్నార్థకాలుగా నిలిచేవి.వ్యవసాయ సంక్షోభంపై జయతి ఘోష్‌ కమిషన్‌ నియామకం కడూఆ అలాటి ఒక చర్య. అయినా అవకాశవాదం అలవాటైన పాలకపక్షాలు అనతి కాలంలోనే ఆ మార్గానికి తిరిగి వెళ్లాయి. ఆ మేరకు ఉద్యమాలూ వచ్చాయి.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజా ఉద్యమాలను మల్చుకోవడానికి సరికొత్త వేదికలను ఏర్పాటు చేసుకోవడానికి విద్యుదుద్యమం మార్గం చూపింది. దజన్ల సంఖ్యలో కొత్త ప్రజా వేదికలు ముందుకొచ్చి తమ తమ రంగాలకు సంఘాలకు చెందిన వారిపై ప్రభుత్వాల ప్రైవేటీకరణ ప్రపంచీకరణ దాడిని నిలవరించేందుకు నడుం కట్టాయి. సంఘటిత కార్మిక సంఘాలతో పాటు అంగన్‌వాడీలు, గ్రామ సేవకులు, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అసంఘటిత రంగంలో వారు, వివిధ రకాల వృత్తి దారులు, సామాజిక తరగతులు, మైనారిటీలు మహిళలు ఒకరేమిటి అన్ని తరగతుల వారూ సమరశీల సమైక్య పోరాటాలతో తప్ప సమస్యల పరిష్కారం సాధ్యం కాదనే గ్రహింపు పెంచుకోగలిగారు. పట్టణ ప్రాంతాల సమస్యల పైన గాని గ్రామీణ సంక్షోభానికి గురవుతున్న రైతు వ్యవసాయ కార్మికుల సమస్యలపైన గాని కదలిక పెరిగింది.ప్రతిదాన్ని అధ్యయన పూర్వకంగా ముందుకు తెచ్చే ధోరణి పెరిగింది. ఈ కాలంలోనే మీడియా విస్తరణ కూడా జరగడంతో ఉద్యమాల ప్రభావం త్వరితంగా విస్తరించడానికి వీలు కలిగింది. నిరాహార దీక్షలు నిరసనలు, ధర్నాలు భైఠాయింపులు నిత్య కృత్యంగా మారాయి. ఇందిరా పార్కు పక్కన ధర్నా చౌక్‌, సుందరయ్య పార్కు ఉద్యమాలు ప్రదర్శనల తీర్థయాత్రా స్థలాలుగా మారాయంటే దాని వెనక విద్యుదుద్యమ ప్రేరణ చాలా వుంది. ఈ తరగతుల ఉద్యోగ భద్రత, జీత భత్యాల పెంపు, పని పరిస్తితుల మెరుగుదలకు సంబంధించిన అనేక కోర్కెలు సాధించుకోవడం కూడా ఈ కాలంలో చూశాం.
విద్యుదుద్యమ తరుణంలోనే అప్పటి డిప్యూటీ స్పీకర్‌ కె.చంద్ర శేఖర రావు పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం నుంచి బయిటకు వచ్చారు. ప్రజల్లో ప్రజ్వరిల్లుతున్న అసంతృప్తిని ఆగ్రహాలను గమనించాకే స్వంత రాజకీయ పార్టీని ప్రాంతీయ వాద ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి సిద్ధమైనారు. ఆ తర్వాత కాలంలో ఆయన ప్రధాన వాదనలు ప్రాంతీయ ప్రాతిపదికకే పరిమితమై పోవడంతో సరళీకరణకు వ్యతిరేకంగా సమైక్యంగా ముందుకు వచ్చే వాతావరణం దెబ్బతిన్నది. ఈ సమస్యపై కాంగ్రెస్‌ మాయాజాలంలో టిఆర్‌ఎస్‌ నాయకులు రాజీనామాలు చేసి బయిటకు రావాల్సి వచ్చింది.ఆ సమయంలోనే సిపిఎం ప్రారంభించిన భూ పోరాటం ఉభయ కమ్యూనిస్టుపార్టీల ఆద్వర్యంలో ఉధృత రూపం తీసుకుని ప్రభుత్వాన్ని ప్రకంపలను గురి చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం దానిపై దాడి చేస్తున్నా తెలుగు దేశం టిఆర్‌ఎస్‌లతో సహా అందరూ బలపర్చారు. ముదిగొండ కాల్పులలో ఏడుగురు మరణించడంతో మరోసారి బషీర్‌ బాగ్‌ అందరికీ మదిలోకి వచ్చింది.ముదిగొండ కాల్పులు కూడా జులై 28 అంటే దానికి నెలరోజుల ముందే జరగడం, అక్కడ అమరజీవి రామకృష్న పేరిట ఏర్పర్చిన టెలిఫోన్‌ బూత్‌ గుండా పోలీసు తూటా దూసుకుపోవడం యాదృచ్చికం కాదు. ఆ పోరాటం తర్వాత వైఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారం కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. పార్లమెంటుతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటిగానే గట్టెక్కింది.అయితే వైఎస్‌ సంక్షేమ పధకాలు తీసుకొచ్చినప్పటికీ అ కాలంలో జరిగిన అవినీతి ఆరోపణలపై విమర్శలు కూడా కొనసాగుతూనే వచ్చాయి.ప్రజాభిమానం ఎంతగానో వుందని చెప్పుకునే ఆయన ఎప్పటికప్పుడు తనను తాను సమర్తించుకోవడానికి ప్రచారంపై విపరీతంగా ఖర్చు చేయడమే గాక కమ్యూనిస్టులపైన ప్రజా ఉద్యమాలపైన దుష్ప్రచారానికి పాల్పడవలసి వచ్చింది.ఆ ప్రచారంలో పదే పదే బషీర్‌బాగ్‌ ప్రసక్తితీసుకొచ్చేవారు. అయితే ఆ వూపులో గెలిచిన తామే ఆ స్పూర్తికి భంగం కలిగించామన్న వాస్తవాన్ని చెప్పుకునేవారు కాదు.కేంద్రంలోనూ యుపిఎ-1 ప్రభుత్వం రావడానికి కీలక పాత్ర వహించిన వామపక్షాలను బేఖాతర్‌ చేసి హానికరమైన అణు ఒప్పందాన్ని కుదుర్చుకుని అమెరికాకు లొంగుబాటు ప్రదర్శించారు.అంతకు ముందు అనివార్యంగా ఉపాధి హామీ వంటి పథకాలు ప్రవేశపెట్టిన సరళీకరణ పితామహుడు మన్మోహన్‌సింగ్‌ యుపిఎ 2 వచ్చే సరికి తన అసలు రంగుతో బయిటపడ్డారు.
వైఎస్‌ హఠాన్మరణం అనంతరం కాంగ్రెస్‌ అంతర్గత కలహాలు, ప్రాంతీయ వివాదాలు రాష్ట్రాన్ని తీవ్ర అనిశ్చితికి గురి చేశాయి. సరళీకరణ దాడుల తీవ్రతకు తగినట్టు ఉద్యమాలు కేంద్రీకరించడం గాక పాక్షిక విషయాలపై ఉద్రిక్తతలు ప్రతిష్టంభనకు దారి తీశాయి. ప్రజలనూ గజిబిజికి గురి చేసి తన పబ్బం గడుపుకోవడానికి పాలక పక్షం పాచికలు వేసింది. అయితే ఇంత అననుకూల వాతావరణంలోనూ సమస్యలపై ఉద్యమాలు ఆగకపోవడం గమనించదగ్గ విషయం. ఉదాహరణకు బివిరాఘవులు ఎస్‌సిఎస్‌టి సబ్‌ప్లాన్‌పై చేసిన నిరాహర దీక్షకు విస్తారమైన సంఘీభావం వ్యక్తమైంది. ప్రభుత్వం సూత్రరీత్యా ఒప్పుకోవలసి వచ్చింది.అలాగే సిపిఎం, వామపక్షాలు ప్రజా సంఘాలు, ప్రజల సమసమస్యలపై కలసి పోరాడవలసిన అవసరాన్ని నొక్కిచెబుతూ వచ్చాయి.ఇన్నేళ్లుగా పెంచని విద్యుత్‌ ఛార్జీలను మళ్లీ పెంచడాన్ని అవి తీవ్రంగా విమర్శించాయి. ఆరోపణల కళంకం సోకని ఆ పార్టీలు అవినీతిపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అగ్రహానికి తగినట్టే చొరవ తీసుకుని కార్యక్రమాలు చేస్తున్నాయి.కేంద్రం ఉద్దేశపూర్వకంగా సాగిస్తున్న రాజకీయ మంత్రాంగానికి విరుగుడు సమస్యలపై ఐక్య పోరాటాలేనని అందరూ ఆమోదిస్తున్నారు.ఇదే సమయంలో వరుసగా వెల్లడైన కుంభకోణాలు,వైఎస్‌ హయాంలో వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు, అన్నా హజారే నిరాహారదీక్ష వంటివి సరళీకరణ దుష్ఫలితాలు ప్రజలు తెలుసుకోవడానికి కారణమైనాయి. జాతీయ స్థాయిలోనూ యుపిఎ ఎన్‌డిఎ యేతర పార్టీల ఉమ్మడి కృషి పెరగడానికి ఇది దారి తీస్తున్నది. ఈ పార్టీలు వామపక్షాల వలె సరళీకరణ విధానాలపై సూటిగా ముందుకు రాకపోయినా గతంలో వలె గొప్పగా భుజాన మోయడం ఇక కుదిరేపని కాదు. మన్మోహన్‌ సింగ్‌ స్వయంగా ఇరకాటంలో చిక్కుకు పోవడం సరళీకరణ సమర్థకులకు చెంపపెట్టు. ఆ విధానాలు అమలు చేసేందుకు ఆరాటపడే పాలకులను అదుపు చేయాలంటే అందుకు విద్యుదుద్యమం, బషీర్‌ బాగ్‌ పోరాటాలను మించిన ఉదాహరణ వుండదు. ఇన్ని అక్రమాలు ఆరోపణలు చూసిన ప్రజా బాహుళ్యం ఆ వాస్తవం గుర్తిస్తున్నారు. అందువల్లనే వారిని సమైక్య సమరశీల పోరాట మార్గంలోకి రాకుండా రకరకాల శక్తులు తమ తమ పాత్ర పోషిస్తున్నాయి గాని అవి నిలిచేవి కావు. వికసించిన విద్యుత్తేజం, మార్మోగే భూ పోరాట స్వరాలు పాలకుల గుండెల్లో ప్రకంపనలు పుట్టిస్తూనే వుంటాయి. ఎప్పటికైనా సమరశీల పోరాట మార్గమే ప్రజలకు నిజమైన రక్షణ కల్పించగలుగుతుంది.

No comments:

Post a Comment