Pages

Wednesday, August 10, 2011

జగన్నాటకంలో రసవద్ఘట్టం హైకోర్టు తీర్పు



వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ అద్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి ఆస్తులపై పూర్తి స్థాయి విచారణ జరపాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం వూహించిన పరిణామమే. నిజానికి జగన్‌ పార్టీ వారు ఇంతకంటే తీవ్రమైన పరిణామాలకే సిద్ధమై వున్నట్టు చెబుతూ వస్తున్నారు. మేకపాటి రాజమోహన రెడ్డి ఆ సంగతి బహిరంగంగానే వెల్లడించారు కూడా.అయితే వెనువెంటనే అంత తీవ్రమైన మలుపు వుండకపోవచ్చు గాని నిస్సందేహంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవలసి వుంటుంది. ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష ప్రయోజనం పొందిన కంపెనీలు జగన్‌ స్థాపించిన సంస్థల్లో పెట్టుబడి పెట్టాయనేది కాదనలేని సత్యం. జగన్‌ కూడా అలా అనడం లేదు. గతంలో వైఎస్‌ కూడా అనలేదు. కాకపోతే వారంతా తమ వ్యాపార దక్షతనూ లాభాల అవకాశాలను చూసి పెట్టుబడి పెట్టారని చెబుతూ వస్తున్నారు. అంతేగాక రామోజీ రావు,చంద్రబాబులపై ఎదురుదాడి సాగిస్తూ సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు హైకోర్టు ప్రాథమిక ఆధారాలు వున్నాయని నిర్ధారించింది గనక అనివార్యంగా ప్రజలకు వివరణ సంజాయిషీ ఇచ్చుకోవలసిన స్థితి వచ్చినట్టే. రాజకీయ కక్ష కేసు వేసిన వారికి ఆపాదించవచ్చు గాని తీర్పు నిచ్చిన న్యాయస్థానాన్ని ఏమీ అనడానికి లేదు. ఏమైనా ఇది కక్ష సాధింపు గనకనో, జగన్‌కు జనాదరణ వుంది గనకనో ఆరోపణలను ప్రశ్నించకూడదంటే ప్రజాస్వామ్యంలో కుదరదు.తాము కూడా ఎవరిపైనైనా కేసు వేయదల్చుకుంటే లక్షణంగా వేసుకోవచ్చు ఈ కేసులో మ్యాట్రిక్స్‌, నవభారత్‌, పివిపి వెంచర్స్‌, హెటిరో గ్రూపు,రాంకీ వగైరా చాలా సంస్థల బినామి పెట్టుబడులున్నాయనేది ఆరోపణ.ఇక జగన్‌కు చెందిన సండూర్‌ పవర్‌ కార్పొరేషన్‌, జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌, కార్నయిల్‌ ఆసియా వాటన్నిటికి మారిషన్‌ నుంచి పెట్టుబడులు సమకూర్చిన 2 ఐ క్యాపిటల్‌, ప్యూర్లీ ఎమర్జింగ్‌లకు కూడా బినామి పెట్టుబడులే వచ్చాయన్నది అభియోగం. ఈ సంస్థల్లో చాలా భాగం బహిరంగంగానే ప్రభుత్వం వల్ల ప్రయోజనం పొందాయి.కనక జగన్‌కు ఏ పదవి లేనందును అధికార దుర్వినియోం కాదనే వాదన చెల్లదు. ఈ వ్యవహారం ఏఏ మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక ఎమ్మార్‌ వ్యవహారం మరో విపరీతం. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ కార్పొరేషన్‌ ప్రైవేటు చేతుల్లో పెట్టి వారు తమ వాటా తగ్గించడాన్ని అనుమతించి ఆ పైన నామకార్థఫు ధరకు ఖరీదైన విల్లాలు బినామీ కంపెనీలకు కట్టబెడుతుంటే వత్తాసు నిచ్చిన ఎపిఐఐసి అధికారుల నిర్వాకం కూడా తీవ్రమైనదే. ఇంత జరుగుతున్నా ఎమ్మార్‌ నిర్మాణాలు, రిజిస్ట్రేషన్లు చట్టరీత్యా ఆగలేదంటే అంతకన్నా దారుణం ఏముంటుంది?
ఈ అంశం మరింత వివరంగా ఇంకో సారి మాట్లాడుకోవచ్చు.

No comments:

Post a Comment