Pages

Wednesday, October 10, 2012

వాద్రాపై ఆరోపణలతో అధిష్టానం అయోమయంఇండియా ఎగనైస్ట్‌ కరప్షన్‌ తరపున కేజ్రీవాల్‌, ప్రశాంత భూషణ్‌లు సోనియా గాంధీ అల్లుడైన రాబర్ట్‌ వాద్రాపై లేవనెత్తిన ఆరోపణలు అధికార పార్టీని అయోమయంలోకి నెట్టాయి. అవి ఇంకా పూర్తిగా ప్రచారం కాకముందే సోనియా గాంధీతో సహా అగ్రనేతలందరూ ఒక్కుమ్మడిగా ఖండించేందుకు హడావుడి పడ్డారు. దేశంలోనే అత్యున్నతమైన ప్రపంచంలోని అతి శక్తివంతమైన ఒక కుటుంబ సభ్యుడు ఇంత తీవ్రమైన ఆరోపణలకు గురైతే సంజాయిషీ ఇచ్చి సమగ్ర దర్యాప్తు చేయించేబదులు సమర్థనలకు పాకులాడడం హాస్యాస్పదం. డిఎల్‌ఎఫ్‌ కూ వాద్రాకు మధ్య లావాదేవీలు జరిగినట్టు దీనివల్ల ఆ సంస్థ లాభం పొందినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. యాభై లక్షల రూపాయలతో వ్యాపారం మొదలెట్ల్టిన అల్లుడు గారు 2007 తర్వాత చకచకా పైకి పాకిపోయారంటే ఇలాటి కారణాలు వుండే వుండాలి. ఆయనకు రుణాలు స్థలాలు భవనాలు ఇచ్చి తానూ యథాశక్తి లాభ పడిన డిఎల్‌ఎప్‌ ఈ మొత్తాలు చేతులు మారిన సంగతి కాదనడం లేదు. వాద్రా కూడా జరిగిందాన్ని కాదనలేకపోతున్నారు. ఈ వ్యవహారంలో ఆస్పత్రి స్థలం చేతులు మారడం, వాద్రాకు అప్పు ఇచ్చి మళ్లీ తమ స్థలాన్నే చౌకగా అమ్మడం, ఒక దశలో యాభై శాతం వాటా ఇచ్చి తర్వాత తీసుకోవడం వంటి అనుమానాస్పద వ్యవహారాలున్నాయి. వాద్రాచెట్టుకింద కూచుని వ్యాపారం చేసుకుంటే అది వేరుగా వుండేది. కాకపోతే కాంగ్రెస్‌ వారే దీనిపై ఎలా స్పందించాలో తేల్చుకోలేకపోతున్నారు.మొదట రాగానే ఖండించారు. తర్వాత ఆయన వ్యక్తిగతంపార్టీకి సంబంధం లేదన్నారు. మళ్లీ ఆయనపై దాడి పార్టీపైనే దాడి అని స్పందించారు. ఇప్పుడు మళ్లీ
వెనక్కు తగ్గారు. కేజ్రీవాల్‌పై ఎదురు దాడి చేయడం దీనికి సమాధానం కాదు. ఒకసారి పత్రాలు బయిటపెట్టిన తర్వాత ఇది దేశమంతటికీ సంబంధించిన వ్యవహారమవుతుంది.కనక సమగ్ర విచారణ సరైన సంస్థ ద్వారా జరగాల్సిందే. దేశంలో అతి శక్తివంతమైన కుటుంబం గనక ఇది మరింత అవసరం.జగన్‌ మోహన రెడ్డి విషయంలో అనుసరించిన సూత్రమే సోనియా జామాతకూ వర్తించాలి కదా! పైగా ఇందిర కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు.గతంలో ఆమె, కుమారులు సంజరు ,రాజీవ్‌ స్వయంగా ఆరోపణలు ఎదుర్కొని అపజయాల పాలైన వారే. కనక వారేమీ అతీతులని అనుకోనవసరం లేదు. పైగా రాబర్ట్‌ వాద్రా ' భారత దేశాన్ని ప్రజలను గురించి ' తొక్కలో దేశం, తిక్క మనుషులు' అని వ్యాఖ్యానించడం అహంకారానికి ప్రతిబింబం. 2 జి నుంచి బొగ్గు కుంభకోణం వరకూ ప్రతిదాంట్లోనూ మొదట ఖండించి తర్వాత తగ్గించి ఆ పైన రాజీనామాలు లేదా రాజకీయ తతంగాలూ జరపడం కాంగ్రెస్‌కు అలవాటైన విద్యే. మరి వాద్రా విషయంలోనూ అదే జరుగుతుందా చూడాలి. కేజ్రీవాల్‌ కేసు వేసుకోవచ్చు కదా అని వీరంటుంటే తప్పయితే మీరే నాపై కేసు వేయొచ్చు గదా అని ఆయనంటున్నాడు. ప్రస్తుత ప్రైవేటీకరణ అక్రమ లావాదేవీల యుగంలో ఇలాటివి సర్వసాధారణమైపోతున్నాయనడానికి వాద్రా ఉదంతం తాజా ఉదాహరణ. ఇలాటివి దాచిన కొద్ది మరింత తీవ్రమౌతాయి.

No comments:

Post a Comment