Pages

Friday, October 12, 2012

అనునిత్య ప్రహసనం! అయినా సమర్థనం


తెలంగాణాపై నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని గులాం నబీ ఆజాద్‌ పక్షం రోజుల్లో రెండవ సారి చెప్పారు. (ఈ మధ్యలో హౌం మంత్రి షిండే రెండు సార్లు) గత పర్యాయం దేశం ఆ చివరనుంచి చెబితే ఈ సారి మన నట్టింట్లోకొచ్చి చెప్పారు. యుపి, బీహార్‌, మధ్య ప్రదేశ్‌లను విభజించినంత తేలిగ్గా ఏపిని విభజింపలేమన్నారు. కాల పరిమితికి కూడా అంగీకరించడానికి నిరాకరించారు. ఆజాద్‌ వ్యాఖ్యలు అనునిత్య ప్రహసనంలో భాగం అనుకుంటే దానికి ఉపాఖ్యానాలుగా అటు టిఆర్‌ఎస్‌, ఇటు లగడపాటి వ్యాఖ్యలు కూడా ఠంచనుగా వచ్చేశాయి. టిఆర్‌ఎస్‌ వారికి ఈ మాటల్లో తప్పు పెద్దగా కనిపించలేదు. తమ దసరా గడువుకు ఈ ప్రవచనాలకు వైరుధ్యమేమీ లేనట్టే మాట్లాడారు. అయితే ఆయన మాటల్లోని ఒక నిజం- ఆ రాష్ట్రాలకూ ఆంధ్ర ప్రదేశ్‌కు తేడా వుందన్న మాట మాత్రం కొట్టిపారేశారు.( అంతకు ముందే అయిదారు వరకూ వున్న హిందీ రాష్ట్రాలను మరిన్ని ఏర్పాటు చేయడానికి- భాష ప్రాతిపదికన ఏర్పడిన తెలుగు తమిళ కన్నడ మళయాలీ, బెంగాలీ మరాఠీ కాశ్మీరీ, గుజరాతీ, అస్సామీ, పంజాబీ తదితర రాష్ట్రాల విషయానికి మధ్య ఖచ్చితంగా కొంత తేడా వుంది.) టిఆర్‌ఎస్‌తో సంధానకర్తగా వ్యవహరిస్తున్న పాల్వాయి గోవర్థనరెడ్డి కూడా ఆజాద్‌ మాటలకు తనదైన భాష్యం చెప్పి తాము పార్టీ తరపున దౌత్యం చేస్తున్నామన్నారు. ఇక లగడపాటి షరామామూలుగా పరిస్తితి సున్నితత్వాన్ని మర్చిపోయి ఉస్మానియా విద్యార్థులపైన తెలంగాణా ఉద్యమంపైన ఏవో వ్యాఖ్యలు సంధించారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ బాధ్యతా రహితమైన మాటలు. కేంద్రం నాటకాలు ఆడుతున్నదని సిపిఎం రాఘవులు విమర్శిస్తుంటే ఆజాద్‌ మాటల్లో తప్పు లేనట్టు టిఆర్‌ఎస్‌ స్పందించడం నిజంగానే ఒక విపరీతం. ఇది ఆ రెండ పార్టీల మధ్య సయోధ్యకు సంకేతమంటే తప్పు లేదు. సయోధ్య వున్నంత మాత్రాన సంధిగ్ద వాఖ్యానాలను సమర్థించాల్సిన అవసరం వుందా?కష్టం అని వారన్నా ఇష్టం అని వీరంటున్నారంటే 'ఈ బంధం దృఢమైనది' అనుకోవలసిందే కదా!

No comments:

Post a Comment