Pages

Friday, October 5, 2012

బెయిల్‌ రాకపోవడం వూహించిందే..


సుప్రీం కోర్టులో వైఎస్‌ఆర్‌పార్టీ అద్యక్షుడు జగన్మోహనరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురి కావడం వూహించని విషయమేమీ కాదు. గతంలో ఏ కారణాల వల్ల తిరస్కరించారో అవి ఇప్పటికీ వర్తిస్తుండడమే గాక ఇంకా తీవ్రమైనాయి కూడా. ఆయనకు సంబంధించిన కేసులో ఆస్తుల జప్తుకు ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్‌ ఉత్తర్వులివ్వడం నిజానికి చాలా పెద్ద పరిణామం. గతంలో సాక్షికి సంబంధించి జప్తు జరిగినప్పటికీ ఇప్పటికీ హడావుడిలో తేడా ఎవరికైనా అర్థమవుతుంది. తెలుగు దేశం, కాంగ్రెస్‌ల కుమ్మక్కు వల్లనే ఇలా జరిగిందని వైఎస్‌ఆర్‌ పార్టీ ఆరోపిస్తున్నా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అలాటి ఉద్దేశాలు ఆపాదించడానికి లేదు.ఒక వేళ బెయిల్‌ వచ్చివుంటే అప్పుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని తెలుగుదేశం వారు ఆరోపించి వుండేవారు. ఏమైనా జగన్‌ బయిటకు రాలేకపోవడం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావమే చూపిస్తుంది. అంటే ఆ పార్టీ స్థయిర్యం కాపాడుకోవడం కష్టమవుతుంది. నాయకుడిపై ఆధారపడిన పార్టీ కావడమే ఇందుకు కారణం. పైగా ఆయన తర్వాత ఎవరన్న దానిపైనా స్పష్టత ఇచ్చింది లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇతర పార్టీలలోంచి వలస వచ్చేవారు ఆగిచూద్దామనుకుంటారు. ఈ తీర్పు ముందే వచ్చివుంటే బహుశా చంద్రబాబు పాదయాత్ర తీరు మరోలా వుండేదేమో. అయితే ఛార్జిషీట్లు అదే పనిగా వేయొద్దని ఒక్కదానితో సరిపెట్టమని సిబిఐని ఆదేశించడం కూడా ముఖ్య పరిణామమే. బెయిలు రాకపోవడానికి సిబిఐ లక్ష్మీనారాయణ తాజాగా ప్రవేశపెట్టిన ఆధారాలే కారణమన్న ప్రచారం ఒకవైపున వుండగా గట్టి లాయర్‌ను నియోగించారన్నది మరో వాదనగా వుంది. వాస్తవానికి సుప్రీం కోర్టు ఇటీవలి కాలంలోఅవినీతి కేసుల విషయంలో తీసుకుంటున్న వైఖరికి అనుగుణంగానే జగన్‌ బెయిల్‌ తిరస్కరణ వుందని చెప్పొచ్చు.. వైఎస్‌ఆర్‌పార్టీ దీని తర్వాత వ్యూహం మార్చుకునే అవకాశాలు చాలా వుంటాయి. దీనివల్ల నిజంగా తెలుగు దేశం కోలుకుంటుందనుకుంటే అప్పుడు కాంగ్రెస్‌ తీరు మార్చుకోవచ్చు.కనక ఇంతటితోనే కథ ముగిసిపోయిందని మరే మలుపులూ వుండవని అనుకోవడం కూడా తొందరపాటే.

No comments:

Post a Comment