Pages

Monday, October 1, 2012

సాగర హారం- సందేశం, సారాంశం



సాగరహారం వూహించినట్టే ఉధృతంగానూ, ఉద్రిక్తంగానూ జరిగింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలనే ఆకాంక్ష బలంగా వినిపించాలన్న జెఎసి లక్ష్యం నెరవేరింది.
మొదటిది- ఈ మార్చ్‌తో మొదటి సారి రాజకీయ పార్టీల ప్రాధాన్యత తగ్గి జెఎసి,దాని నిర్వాహకులకు దగ్గరగా వుండే సంఘాల నాయకుల పిలుపు అమలు జరిగినట్టయింది. పాలక పక్షమైన కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం నేతలు మాత్రమే గాక ఇప్పటి వరకూ తెలంగాణా ఉద్యమానికి ప్రతీకగా పరిగణించబడిన టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ కూడా వేదికపై కనిపించని,వినిపించని స్థితి మొదటిసారిగా గోచరించింది. పార్టీల పతాకాలు తీసేయాలని పిలుపునివ్వడం ద్వారా ఈ వాస్తవాన్ని మరింత ప్రస్పుటంచేసే ప్రయత్నం జరిగింది. అయితే సమీకరణలో మాత్రం టిఆర్‌ఎస్‌, న్యూ డెమోక్రసీల తరపున వచ్చిన వారే అత్యధికంగా కనిపించారు.ఆ పైన సిపిఐ,బి.జెపి ఇతర సంఘాలు వుండొచ్చు.
రెండవది- మార్చ్‌ ఉద్రిక్తంగా జరిగిందనడంలో సందేహం లేదు. పోలీసుల పాత్ర, జోక్యం, బల ప్రయోగం చాలా ఎక్కువగానే వున్నాయి. ప్రజాస్వామిక హక్కుగా అనుమతినిచ్చిన తర్వాత ఇలాటి పరిస్తితి రావలసింది కాదు. ఇందుకు పోలీసుల వైఖరి ప్రధాన కారణంగా కనిపించినా ఇతర అంశాలు కూడా వున్నాయి.పార్టీలు విడివిడిగా ఎవరి యాత్ర వారు మొదలెట్టడం ఒక కారణం. చాలా మంది తెలంగాణా వాదులతో సహా అనేకులకు  మార్చ్‌ తేదీ
ఇష్టం లేదు. చాలా సున్నితమైన నిమజ్జనం నేపథ్యంలో అంతర్జాతీయ సదస్సు ప్రాంగణంలో తలపెట్టడం వల్ల పోలీసులను కూడా పూర్తిగా అనలేని స్థితి ఏర్పడింది. భాష్పవాయు ప్రయోగం చాలా ఎక్కువగానే జరిగింది. లాఠీచార్జిలు కూడా చాలానే జరిగాయి. జిల్లాల్లో తనిఖీల పేరిట చాలా మందిని అడ్డుకున్నారనే ఆరోపణ వున్నా లక్షల మందిని అడ్డుకోగల శక్తి పోలీసులకు వుండదు.పోలీసులు వైఖరి ఎక్కడైనా ఇలాగే వుంటుంది.అనేక సందర్బాల్లో వారు కాల్పుల వరకూ వెళ్లిన ఉదాహరణలున్నాయి. నిన్న ఆ విధంగా జరగకపోవడం ఒక ఉపశమనం.
మూడవదిఞ ఇంతకూ ఈ వ్యవహారంలో తప్పెవరిదన్న మీమాంస సాగుతూనే వుంది.నిస్సందేహంగా ప్రభుత్వం ప్రథమ బాధ్యత వహించాలి. దాని ఆదేశాల మేరకు వ్యవహరించిన పోలీసు శాక కూడా విమర్శకు గురికావలసిందే. అయితే మార్చ్‌ స్థలం సమయంపై కుదిరిన అవగాహనే అవిశ్వాసంపై ఆధారడపడి వుంది.రెండు పక్షాలు అవతలి వారి మాట ఖాతరు చేయనవసరం లేదన్న రీతిలోనే అంగీకారం కుదర్చుకున్నాయి. 3 నుంచి 7 గంటల వరకూ 3 మార్గాలలో రావాలని ప్రభుత్వం చెప్పినదాన్ని తాము ఆమోదించడం లేదని జెఎసి నేతలు స్పష్టంగా చెప్పాల్సింది. అనుమతినిచ్చినా అడ్డుకోవడం ఆగదని ప్రభుత్వం కూడా వెల్లడించలేదు. అనేక మంది విధ్వంసక శక్తులు వున్నాయి గనక తనిఖీ చేశామని పోలీసులు అంటుంటే వారి వల్లనే తాము వొప్పందాన్ని ఉల్లంఘించాల్సి వచ్చిందని నిర్వాహకులంటారు. ఇవి రెండూ అవిశ్వాస ఫలితాలే.
నాలుగు- మీడియా వాహనాల విధ్వంసం, రైల్వేస్టేషన్‌ వగైరాల దగ్ధం తీవ్ర విషయాలే. మీడియా సంస్థల పేరిట బ్యానర్లు పెట్టడం ప్రజాస్వామిక లక్షణం కాదు.నిజానికి నిన్న ఛానళ్లు ఈ రోజు పత్రికలు చాలా ఎక్కువ కవరేజి ఇచ్చాయి. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న పోలీసులు మంటలు వెంటనే ఆర్పలేకపోవడం, విధ్వంస కారులను పట్టుకోలేకపోవడం మరింత ఆశ్చర్చం కలిగిస్తుంది.మొత్తంమీద జెఎసి పతాకం కింద చేరిన వారిలో ఇలాటి వారు కూడా వున్నారనే తెలుస్తుంది. వారికి విజ్ఞప్తి చేయడం గాక ఖచ్చితంగా ఖండించడం నాయకుల బాధ్యత. క్షమాపణలు చెబుతున్నామంటూనే వీటిని ఎవరో చేసిన పనిగా తీసిపారేస్తే సరిపోదు. జెఎసి అక్కడేబైఠాయింపు చేయాలని పిలుపునిచ్చినా అమలు కాలేదంటే వచ్చిన వారు రాజకీయ పార్టీల అనుబంధాల రీత్యా వ్యవహరించడమే కారణం. అది అవాస్తవికమనే అభిప్రాయం కూడా బలంగా వుంది. అంత సభ జరిపి అమలు కాని పిలుపునివ్వడం ద్వారా జెఎసి ఆదిలోనే వ్యూహాత్మక తప్పిదం చేసిందని వారి భావన. ఇంకా పిలుపుమీద పిలుపునిస్తే అమలు చేయడం కూడా కష్టమన్న భావం కార్యకర్తల్లో వుంది. నిజానికి కెసిఆర్‌ మొదటి నుంచి ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టు వ్యవహరించడం అలాటి ఎ త్తుగడల ఫలితమే. హారం తర్వాత జెఎసి వైరుధ్యాలు పెరుగుతాయే గాని తగ్గవు. వారి వెనక వున్న వారిలో పార్టీయేతరులలో ఎన్జీవో సంఘాలు మాత్రమే నికరమైనవి.మిగిలినవాటి పునాది చాలా పరిమితం. కనక జెఎసి వొక్కటే రాజకీయ ఫలితాలు సాధించలేదు.

అయిదు- కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపిలు తదితరులు ఈ సందర్భంలో గొప్ప ప్రహసనమే నడిపించారు. ముందు రోజు తామే అనుమతినిప్చించినట్టు, ఆ పైన అగ్గి నిప్పులు కక్కినట్టు కనిపించారు. తీరా మార్చ్‌ మొదలవుతున్న సమయంలో క్యాంపు ఆఫీసు దగ్గర అరెస్టయి పోయారు. రాజీనామాల గురించి బెదిరించిన ఉప ముఖ్యమంత్రిగాని మంత్రి వర్యులు గాని రెండు రోజులు గడిచినా ఆ వూసే తలపెట్టలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిస్పందనా లేదు. ఢిల్లీలో మకాం వేసిన కెసిఆర్‌ ఈ సమయంలో కూడా వారిపై విశ్వాసం కొనసాగించడం విచిత్రం. ఎందుకంటే స్పష్టమైన ఖండన ఏదీ రాలేదు. టీవీ ప్రసారాలు ఆపడంపై స్పందన తప్ప. ఇక ఏలూరులో లగడపాటి చేసిన వ్యాఖ్యల వంటివి పరిస్తితిని మరింత దిగజార్చడానికే పనికి వస్తాయి.
ఆరు- ఇంత జరిగినా పరిస్థితి అదుపు తప్పిపోలేదంటే నేను చాలా సార్లు చెప్పినట్టు అన్ని ప్రాంతా ప్రజలూ ప్రశాంతతను కోరుకోవడం వల్లనే.రకరకాల రాజకీయ వేత్తల మాయాజాలాలు వారు పసిగట్టగలుగుతున్నారు. వారి విజ్ఞతే స్వార్థపరశక్తులన్నిటికీ పాఠం నేర్పిస్తుంది.

2 comments:

  1. చక్కని విశ్లిషణ !!!

    ReplyDelete
  2. నేను విన్నదానిప్రకారం సీపీఐ కార్యకర్తలు పెద్దసంఖ్యలో దాదాపు తెరాస తో సమంగా మార్చ్‌లో పాల్గొన్నారు, క్రమశిక్షణ కల్గిన సైనికుల్లా వ్యవహరించారు. ఎంతైనా తెలంగాణ సాయుధపోరాటానికి నిజమైన వారసులు!!

    ReplyDelete