Pages

Sunday, October 14, 2012

నంది అవార్డులు- ప్రతి స్పందనలు

నంది అవార్డు విజేతలందరికీ హృదయ పూర్వక అభినందనలు తెల్పుతూ కొన్ని వ్యాఖ్యలు. దుకంటే చాలా సంవత్సరాలుగా చలన చిత్ర అవార్డులపై నేను వ్యాఖ్యానం చేస్తున్నాను. ఈ సారి నంది అవార్డులు ప్రకటించిన ప్రజాభిప్రాయానికి దగ్గరగా వుందన్న భావన సాధారణంగా వ్యక్తమైంది. అదే సమయంలో అందరినీ సంతృప్తి పర్చడానికి చేసిన ప్రయత్నం కూడా వుంది. దాదాపు అన్ని సినిమాలకు అవార్డులు వచ్చాయి అని ఈనాడులో శ్రీధర్‌ వేసిన కార్టూన్‌లో కొంత నిజం వుంది. శ్రీరామ రాజ్యం, జై బోలోతెలంగాణా, దూకుడు ఈ చిత్రాలకు అవార్డులు ఎక్కువగా వచ్చాయి. విజయం జనాదరణ బట్టి చూస్తే వీటిలో దూకుడును ముందు చెప్పుకోవాలి. మహేష్‌బాబు ఎలాగూ ప్రథమ స్థానంలో వున్నాడు గనక ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం కూడా అర్థం చేసుకోవచ్చు. అయిత ఆ చిత్రం ప్రధానంగా హాస్యం వల్ల విజయవంతమైంది.కళ్లకింద క్యారీ బ్యాగులు పెట్టుకుని హీరో అయిపోయాననుకున్న ఎంఎస్‌ నారాయణకు ఉత్తమ హాస్య నటుడి అవార్డు అందుకే వచ్చింది. నా ఉద్దేశంలో మహేష్‌ బాబు నటించిన వాటిలో 'అతడు' నిజంగా కథలో(కమర్షియల్‌గానే) పట్టున్న సినిమా. సత్తా చూపించిన సినిమా. పోకిరీ ఆ ఇమేజ్‌ను కొనసాగించుకున్న ఫలితం మాత్రమే. దూకుడు వెనువెంటనే బిజినెస్‌ మాన్‌ రావడం కూడా అలాటిదే. (ఈ రెండూ పూరీ జగన్నాథ్‌వే కావడం మరో విశేషం) అయినా పేరుకు తగినట్టే ' చిత్ర' పరిశ్రమలో ఇలాటివి వుంటూనే వుంటాయి.
శ్రీరామరాజ్యం నంది అవార్డులు తెచ్చుకుంటుందని అందరూ అనుకుంటున్నదే. నిజానికి జాతీయ అవార్డు రానందుకు నిర్మాత సాయిబాబు వంటివారు కాస్త బాధ పడుతూ మాట్లాడారు.ఆ రోజుల్లో నేను టీవీ చర్చలో వారితో దీనిపై మాట్లాడాను కూడా. సాయిబాబా ప్రయత్నాన్ని బాపు ప్రతిభను పూర్తిగా గౌరవిస్తూనే శ్రీరామరాజ్యం సంభాషణలు, కథాగమనం, సెట్టింగులు అన్నిటిలోనూ మరింత జాగ్రత్త తీసుకుని వుండాల్సిందని చెప్పక తప్పదు. ఉదాహరణకు సింహాసనాల మధ్య మనుష/లు కనిపించడమే గగనమైన సన్నివేశాలున్నాయి. మొహాలపై కన్నీటి చుక్కలు మేకప్‌లో చిక్కుకుపోవడం కనిపిస్తుంది. హౌమ గుండంలో
మంటల బదులు మరేదో తళుక్కుమంటుంది. ప్రథమంగా వశిష్ట పాత్రధారి బాలయ్య మాటలు సాంఘిక స్వరంలో వున్నాయి తప్ప పౌరాణిక గాంభీర్యం లేదు. వాల్మీకిగా మహానటుడు అక్కినేనికీ ఆ సమస్య తప్పలేదు. బాలయ్య విగ్రహం ఎంత బాగుందో వాచకం అనేక చోట్ల అంతగా దెబ్బతిన్నది. ఏతావాతా సీతగా నయన తార మాత్రం అద్భుతం అనిపించింది. ఆమెకు అవార్డు రావడం పూర్తిగా న్యాయమే. మాట్లాడితే ఆ రోజుల్లో అంటూ అవి తిరిగి రావన్నట్టు మాట్లాడే వారు ఈ రోజుల్లోనూ వాటిని ధరించే వారున్నారని తెలుసుకోవాలి. శ్రీరామరాజ్యం రావలసినంత శక్తివంతంగా రాలేకపోవడానికి బాపు గారి రామభక్తి ఒక కారణం. సీతపట్ల రాముడు అనివార్య పరిస్తితుల్లోనే అలా వ్యవహరించడాని చెప్పడానికి బాపు అమితంగా ప్రయాస పడ్డారు. అది వాల్మీకి రాసిన దానికి కూడా పూర్తి అనుగుణం కాదు.(దీనికి మూలం లవకుశ గనక గతంలో నేను లవకుశపై రాసిన వ్యాసం త్వరలో అందజేస్తాను.)
జై బోలో తెలంగాణా అవార్డును చాలా మంది రాజకీయ కోణంలో వ్యాఖ్యానించారు. నిజానికి రాజకీయంగా జాగ్రత్తలు తీసుకోవడం తప్పులేదు కూడా.కాకపోతే కళాత్మకంగా అది సగటు సినిమాగానే. అంత ఉద్వేగ ప్రధానమైన ఉద్యమ నేపథ్యంలో తీసినప్పుడు మొత్తం ఉద్యమమంతా బలపర్చినా ఆ నాయకులు పాల్గొన్నా కథాపరంగా పరిమితమైన ప్రభావమే చూపించింది.ఇతర ప్రాంతాల వారు కూడా ఈ ప్రజాస్వామక వాంఛను అర్థం చేసుకోవాలన్నది ప్రధాన సందేశం. అదే సమయంలో విడిపోవడం మంచిది కాదని కోరుకునే వారికీ ఒక దృక్పథం వుండొచ్చన్న భావం కనిపించలేదు. బెజవాడ నానీల వంటివారే విలన్లు అన్నట్టు చూపించడం తప్ప కేంద్రం మొదటి నుంచి చెలగాటమాడుతున్నదనీ, చెన్నారెడ్డి నుంచి నేటి వరకూ ఇక్కడ నాయకులు కూడా నాటకాలు నడిపిస్తున్నారని శక్తివంతంగా చూపించడంపై శ్రద్ధ లోపించింది. రాజకీయ అంశాల కన్నా నా ఉద్ధేశంలో కథా పరమైన కళా పరమైన పరిమితుల కారణంగానే అది అవకాశమున్న మేరకు విజయం సాధించలేకపోయింది. దీనికి ఎవరిని విమర్శించినా ఫలితం లేదు. నాగార్జున రాజన్న నేను చూడలేదు గనక ఏమీ చెప్పలేను. కాకపోతే ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని ఉపయోగించుకునే ఒక కమర్షియల్‌ ఆలోచన సానుకూల సందేశం పంపించే ఒక వ్యక్తిగత ఆలోచన దాంట్లో వున్నాయనుకుంటాను.
జై బోలో తెలంగాణాలో శక్తివంతమైన పాట రాసి పాడి గద్దర్‌ గొప్ప ప్రభావం చూపించాడు.ఆ చిత్రం టైటిల్‌ పాట కన్నా ఇదే ఎక్కువ దోహదం చేసిందనుకుంటాను. ఈ పాటతో గద్దర్‌ మరోసారి తన సత్తా చూపించాడు. ఆయనకు అవార్డు రావడం పెద్ద విశేషం కాదు గాని శ్రీశ్రీ తెలుగు వీర లేవరా పాటతో పోల్చి చూస్తే ప్రజా గాయకుడి ప్రత్యేకత కనిపిస్తుంది. గద్దర్‌ను నేను పదేళ్ల కిందట చేసిన ఇంటర్వ్యూ చాలా విలక్షణంగా వుందని ఆయనపై డాక్యుమెంటరీ తీసిన ప్రొఫెసర్‌ వెంకట్రావ్‌గారు అభినందించారు. గద్దర్‌ శక్తి చూపితే పాటలో పరివశించడం తప్ప మాటల్లో వర్ణించలేము. పెద్ద విమర్శకుడైన కె.వి.రమణారెడ్డి గద్దర్‌ పాటల పుస్తకానికి ముందు మాట రాయడం తన భాగ్యం అన్నాడు. నాకు ఆ మాటలు తరచూ గుర్తొస్తుంటాయి.
అయితే గద్దర్‌ కూడా ఈ అవార్డును తెలంగాణా సమస్యనూ ముడిపెట్టి మాట్లాడవలసిన అవసరం లేదనే నా భావన.
నంది అవార్డులు ఇంకా చాలా వున్నాయి.అందరికీ అభినందనలు.

2 comments:

 1. ఒక్క పాటతో ఆ సినిమాలోని మిగతా పాటలన్నిటినీ వెలవెలబోయేలా చేసేసిన గద్దర్ కి నంది అవార్డు రావడం సమంజసం. "నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా!!" పాటకు ఉత్తమ గీతరచయిత గా నంది వచ్చినప్పుడు గద్దర్ దాన్ని తిరస్కరించారు. ఈ రెండో నందిని తీసుకుంటారో లేదోననేది ఆసక్తికరం!!

  "పొడుస్తున్న పొద్దు మీద" పాటను గద్దర్ ఉద్యమంలో భాగంగా రాశారు, ఉద్యమంలో భాగంగానే పాడారు, ఉద్యమంలో భాగంగానే చూశారు. అది సినిమాలో భాగమనీ, అవార్డు రావాలనీ, ఉద్యమానికి సంబంధం లేనిదనీ గద్దర్ అసలే భావించి ఉండకపోవచ్చు. గద్దర్ తెలంగాణ ఉద్యమసభల్లో వేదికల మీద కూడా తరచూ ఈ పాటను పాడుతున్నారు. గద్దర్ వంటి ఉద్యమకారులకు సంబంధించినంత వరకూ ఈ పాట ఉద్యమగీతమే తప్ప కేవలం సినిమాపాట కానే కాదు. కాబట్టి గద్దర్ ఈ అవార్డును తెలంగాణ సమస్యకు ముడిపెట్టడం సమంజసమేనని అనిపిస్తున్నది.

  ReplyDelete
 2. గద్దర్ వేటూరి/సిరివెన్నెల etc. కోవలో సినిమాలకు పాటలు రాసే ఒక ఆర్టిస్టు కాదు. ఆయన ఎంచుకునే ప్రతి పాట తానూ పాల్గొనే పోరాటాలకు సంబందించినదే.

  పొడుస్తున్న పొద్దు, రాతి బొమ్మల్లోన కోలువయిన శివుడా, నాగేటి సాలల్ల నా తెలంగాణా లాంటి పాటలు కేవలం ఆయా సినిమాలకు మాత్రమె చెందినవి కావు. అవి ఉద్యమం నుంచే & కోసమే పుట్టాయి. ఉద్యమం లేకుండా వీటి మనుగడ లేదు. సినిమాలలో వాడినంత మాత్రాన ఇవి సినిమా పాటలు అయిపోవు.

  మన్యం ప్రజలు తెలుగు వారు కాదన్న విషయాన్ని కాసేపు పక్కన బెడితే, శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా అనే పాట కేవలం ఒక సినిమాకు సంబందించింది అనేది వాస్తవం. ఆయన మరో ప్రపంచం/జగన్నాధ రథ చక్రాలు ముందు ఈ పాట అణా పైసా కూడా చెల్లదు. అదే రకంగా పైని పేరుకున్న తెలంగాణా పాటల ముందు కూడా ఇది దిగదుడుపే.

  ReplyDelete