Pages

Thursday, October 11, 2012

అవే కుటుంబాలు, అదే మనుషులు, అవే యాత్రలు, అనంత వివాదాలుచంద్రబాబు మీ కోసం వస్తున్నా పాదయాత్ర సందర్భంగా నేను విమర్శనాత్మకంగా చాలా వ్యాఖ్యలే చేశాను. తన గత పాలనా నమూనా మార్చుకునేది లేనిదీ స్పష్టం చేయకుండా ఆయన నిర్ణయాత్మక పునరుద్దరణ సాధించలేరని కూడా పేర్కొన్నాను. అలాటి లోతుల్లోకి పోకుండా ఆయన 'తన గత పాలనలో తప్పులు జరిగివుంటే క్షమాపణలు చెబుతున్నా' నని పదే పదే అంటున్నారు.దీన్ని ఆధారం చేసుకుని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి క్షమాపణలు చెప్పే పాలనను మళ్లీ ఎందుకు తీసుకురావాలని ఎదురు దాడి చేస్తున్నారు. కాళ్లతో గాక చేతులతో నడిచినా చంద్రబాబును నమ్మరని ధ్వజమెత్తుతున్నారు. అంతటితో ఆగక సిబిఐ తరపునా కోర్టుల తరపున తానే ప్రతినిధి అయినట్టు సిబిఐ విచారణ జరుగుతుందని ముందస్తుగా ప్రకటించి సర్దుకున్నారు. చంద్రబాబు పాలనలో లోపాలు ఒక ఎత్తయితే ఇప్పుడు ప్రతిష్టంభనలో పడిన పరిపాలన సంగతేమిటన్నది ఆయన జవాబు చెప్పాల్సిన ప్రశ్న. ధర్మాన రాజీనామా విషయమే తేల్చడానికి లేని నిస్సహాయతలో తానుండి అంతా అద్బుతంగా జరిగిపోతున్నట్టు మాట్లాడితే కుదిరేపని కాదు.ఇంతకూ నాయకులు పార్టీలు పరస్పరం సహనం కోల్పోతున్నందువల్లనే ఇలాటి పరిస్థితి వస్తుంటుంది. విధానాలపై చర్చ కన్నా వివాదాలతో సరిపెట్టడం జరుగుతుంటుంది.
మరో వైపు చంద్రబాబు యాత్రపై వైఎస్‌ఆర్‌ పార్టీ కూడా తీక్షణంగానే దాడి చేసింది. చివరకు ఆ ప్రచారాన్ని తటస్థీకరించి తమ పార్టీ స్థయిర్యం పెంచేందుకు షర్మిల పాదయాత్ర( చంద్రబాబు కంటే ఎక్కువ దూరం) తలపెట్టింది. నేను టివీ9 కు మంగళవారం వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి ఇందిర బాట చంద్రబాబు మీకోసంకు పోటీ కాగలదా అని ఎస్‌ఎంఎస్‌ పోటీ పెడితే కాలేదని చాలా తేడాతో ఓటింగు వచ్చింది. గురువారం నాటికి షర్మిల యాత్ర ఖరారైనందున ఆ యాత్రకూ బాబు యాత్రకూ పోటీ పెడితే అత్యధికంగా షర్మిల వైపే
మొగ్గు వచ్చింది. వీరిద్దరి మధ్య పోటీ ఎలా వుంటుందని కొమ్మినేని శ్రీనివాసరావుగారు అదిగినపుడు అసలు పోలికే అసహజమని జవాబు చెప్పాను.చంద్రబాబు అనుభవం, స్థానం రీత్యా కొత్తగా వస్తున్న షర్మిలతో పోల్చడానికి లేదు. అయితే వైఎస్‌ కుమార్తెగా,మహిళగా ఆమెకు వుండే ఆదరణ ఆమెకువుంటుంది. గత సారి ప్రధానమైన ఉప ఎన్నికలసమరంలో ఆమె ప్రచారమే ప్రధాన పాత్ర వహించింది. ప్రజాస్వామ్యం అనుకుంటున్నా ప్రముఖుల కుటుంబాల వారికి ప్రత్యేక స్థానం వుంటుందనేది కనిపిస్తూనే వుంది. నేపథ్యాలు వేరైనా ఇందిరాగాంధీ, బెనజీర్‌, హసీనా, చంద్రికా కుమార తుంగ, ఆక్వినో, ఆంగ్‌సాంగ్‌ సూకి ఇలా మన చుట్టూ వున్న దేశాలన్నిటిలోనూ కూతుళ్ల ప్రాధాన్యం చూస్తాము. భూస్వామ్య సంప్రదాయాలు బలంగా వున్న మన దేశం వంటి చోట్లనే కాదు.అమెరికాలో కూడా ఒబామా ఎన్నికల ప్రచారాస్త్రం ఈసారి తన కుమార్తెలతో ఆప్యాయంగా వున్న దృశ్యాల ప్రచారంతో మొదలెట్టారట. కనక షర్మిల యాత్ర విజయవంతం కావడం పెద్ద సమస్య కాదు.
నిజానికి జగన్‌ జైలులో వున్న నేపథ్యంలో బారత దేశ అనుభవాల ప్రకారం చూస్తే కుటుంబ వారసత్వ సమరం ఇక్కడే మొదలయ్యేఅవకాశం వుండొచ్చనీ, ఈ విధంగా కుటుంబాల మధ్య వ్యక్తుల మధ్య ప్రచారం కేంద్రీకరించి వాదనలు చేసుకోవడం వల్ల ప్రజా సమస్యలు విశాలమైన విధాన పర అంశాలు మరుగున పడిపోతాయని కూడా అన్నాను.నాతో పాటు అంబటి రాంబాబు, రేవంత్‌ రెడ్డి, శివరామిరెడ్డి వంటి వారు వున్నందున కుటుంబాలు వ్యక్తుల పాత్రల గురించి చాలా దీర్ఘంగానే చర్చ జరిగింది.
ప్రజల్లోకి ఎవరు వెళ్లినా మంచిదే గాని కేవలం ప్రచార ప్రధానంగా జరిగే యాత్రలు రాజకీయ మాత్రలే తప్ప నిజమైన ఔషధాలు కావు. వేగంగా మారే పరిణామాల మధ్య అనిశ్చిత పరిస్థితుల మధ్య ఎప్పుడో వచ్చే ఎన్నికలనాటికి వాతావరణం ఎలా వుంటుందో కోర్టులు ఏం చెబతాయో అధిష్టానాలు ఏం చేస్తాయో కలయికలు కలహాలు ఏమవుతాయో తెలియదు. అయినా ఇంత హడావుడి కనిపిస్తున్నదంటే కారణం?ఎవరి ఆందోళన వారిది. అవతలి వారి గురించి ఎవరి అభద్రత వారిది... రాజకీయాలు ఈవెంట్‌ మేనేజిమెంటుగా మారిపోయాక ఇలాటి స్థితి తప్పదు మరి! కాని ఎన్నెన్నో వేషాలు చూసిన ఓటరు మహాశయులు అంత తొందరగా తమ తీర్పును రిజర్వు చేసుకుంటారా అంటే ఆఖరులో గాని నిర్ణయం తీసుకోరని చెప్పొచ్చు. ఈ పరస్పర దూషణలు పటాటోప యాత్రలు శ్రుతి మించితే ప్రధాన పార్టీలన్నిటికీ పాఠం చెప్పొచ్చు కూడా.

No comments:

Post a Comment