Pages

Friday, October 12, 2012

వ్యాఖ్యలు- వివాదాలు





. దేశంలో దేవాలయాల కన్నా మరుగుదొడ్ల అవసరం చాలా వుందని కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై చాలా దుమారం రేగింది. ఆయన తరచూ ఇలాటి సంచలనాలు సృష్టిస్తుంటారు గాని ఈ మాటలో దేశంలోని పరిస్థితినే వెల్లడిస్తున్నారు. ఉదయం టీవీ చర్చలకు వెళ్లేప్పుడు బంజారా హిల్స్‌ వంటి అత్యాధునిక ప్రదేశంలో కూడా చెంబు తీసుకుని కొండలపైకి, పొదల మాటుకు వెళ్లే మనుషులు కనిపించినప్పుడల్లా నాగరికత వెక్కిరిస్తుంటుంది. ప్రపంచంలో బహిర్భూమి అన్న మాట వర్తించే వారిలో అత్యధికులు ఇండియాలోనే వున్నారట. అక్షరాలా 48.9 శాతం ఇళ్లకు మరుగుదొడ్ల సదుపాయం లేదని 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. మహిళల విషయంలో ఇదెంత నరకమో భారతీయులందరికీ తెలుసు. మర్యాద విషయం అలా వుంచి ఆర్థికంగానూ మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ఏటా24,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నట్టు ప్రపంచ బ్యాంకు అంచనాగా
హిందూ సంపాదకీయం పేర్కొంది. అనారోగ్య సమస్యల అటుంచి, శుచీ శుభ్రం లేకపోయాక భక్తిముక్తి అంతా మిథ్యకాదా?.ఈ దేశంలో దాన్ని తక్కువ చేసి కడగొట్టు కులం వారిని అందుకు కేటాయించి పాకీ ముద్ర వేశారు (నిజానికి పాకీ అంటే పరిశుద్ధమైన) గాని ఆహారం ఎంత సహజమో విసర్జనా అలాటి దైహిక క్రియ మాత్రమే. దేశం దేహం శుభ్రంగా వుండాలనడం దైవాపచారం గాని మత ధిక్కారం గాని ఎంత మాత్రం కానేకాదు. శిథిలాలయమ్ములో శివుడు లేడోయి అని కవులెప్పుడో ఎలుగెత్తారు. కనక వ్యర్థ వివాదాలు మాని అర్థవంతమైన చర్యలు చేపట్టడం శ్రేయస్కరం.ఇక పోతే జైరాం గారు కూడా మంచి మాట మంచిగా చెబితే లేనిపోని తగాదాలు తప్పుతాయి.
వివాదస్పద వ్యాఖ్యలు ఇంకా వున్నా బాల్య వివాహాలకు సంబంధించి హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా చేసింది దారుణమైంది. అత్యాచారాలకు విరుగుడు బాల్య వివాహాలని అన్న ఆయన మరుసటి రోజున మరింత విడ్డూరమైన సమర్థ్తనకు దిగారు. మొఘలాయిల కాలంలో రక్షణ కరువైన కారణంగా హిందూ బాలికలకు చిన్నప్పుడే వివాహం చేయడం మొదలైందట!అష్టా వర్షేత్‌ భవేత్‌ కన్యా అన్న మాట ఆయనకు తెలియదనుకోవాలా? సనాతనులు ఎప్పటినుంచో వినిపిస్తున్న ఈ మాటను ఒప్పుకొనేట్టయితే అప్పుడు సతీసహగమనంతో సహా చాలా వాటిని ఆమోదించాల్సి వస్తుంది.పైగా మైనర్‌ బాలికలపైనా జరుగుతున్న అత్యాచారాలకు ఏం చెబుతారు? 1929లోనే శారదా చట్టం పేరుతో మొదలైన బాల్య వివాహాల నిరోధాన్ని 80 ఏళ్ల తర్వాత కూడా భుజాన మోసేవారున్నారంటే భారత మాతాకు జై! అన్నట్టు మరో మాత- మన తెలుగు మాత రేణుకాచౌదరి కూడా మహిళలపై అత్యాచారాలు శాంతి భద్రతల సమస్య కాదని సెలవిచ్చారు మొన్న. రాజకీయ ప్రచారం కోసం అత్యాచారాల ఫిర్యాదులు చేస్తున్నారని నోరు పారేసుకున్నారు మమతా దీదీ ఆ మొన్న. ఇలాటి వారందరినీ ఏమనాలి?

No comments:

Post a Comment