Pages

Saturday, October 27, 2012

పోటీయాత్రల విశేషాలు




అధికార పక్షం సంగతి విభేదాల మయంగా వుంటే ఆ స్తానం మాదంటే మాదని పోటీ పడుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగు దేశం పాదయాత్రలు పోటాపోటీగా సాగుతూనే వున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుకు, షర్మిలకు వ్యక్తిగతంగా పోటీ ఏమిటన్న ప్రశ్న వస్తున్నా రాజకీయంగా మాత్రం పోటీ వున్నప్పుడు పోలికలు కూడా వుంటాయి. చంద్రబాబు యాత్రలో కాంగ్రెస్‌తో పాటు కొన్ని సార్లు అంతకంటే ఎక్కువగా కూడా జగన్‌పార్టీపై విమర్శ కేంద్రీకరిస్తున్నారు.తల్లి కాంగ్రెస్‌ పిల్ల కాంగ్రెస్‌ అంటూ ఒకటిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల యాత్రను ఆయన ప్రస్తావించకపోయినా ఇతర నాయకులు తరచూ విమర్శిస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో పాటు ఇటీవల బైబిల్‌ పట్టుకోవడంపైనా విమర్శలు కేంద్రీకరించారు. నిజానికి ఎవరు ఏ పుస్తకం పట్టుకున్నారు, ఏ దేవుడి బొమ్మకు వేదికపై పూజ చేశారు ఇలాటి అంశాలు ఎప్పుడూ చర్చనీయం కాలేదు.దేశంలోనూ రాష్ట్రంలోనూ పాలక పార్టీలన్నీ కుల మత భావాలను రాజకీయ లబ్దికి వాడుకోవడం జరుగుతూనే వుంది. కుల సంఘాల సభలకు హాజరవడం, ప్రార్థనా స్థలాల్లో మత పెద్దల మద్దతు పొందడం జరుగుతూనే వుంది. అయితే ఈ స్తాయిలో దానిపై విమర్శలు గతంలో లేవు. తెలుగు దేశం వ్యూహాత్మకంగానే దీన్ని ముందుకు తెచ్చిందనే అభిప్రాయం వుంది. బైబిల్‌ భగవద్గీత ఏదైనా ఆ ప్రస్తావన వారు
చేయనప్పుడు ఇతరులు ముందుకు తేవడం ద్వారా వ్యతిరేకులను ఆకట్టుకోవచ్చనే ఆలోచన అయినట్టయితే మాత్రం అవాంచనీయం. నిజంగా మతాన్ని రాజకీయాలను కలగాపులగం చేయరాదన్న భావన అయితే అప్పుడు అందరికీ అన్ని వేళలా వర్తించాలి. దీనిపై వీలుంటే న్యాయపరమైన చట్టపరమైన ఫిర్యాదులు కూడా చేయొచ్చు. అలాగాకుండా మతపరమైన వివాదంగా దీన్ని మార్చడం వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది.
తెలుగు దేశం విమర్శలు ఎలా వున్నా వైఎస్‌ఆర్‌ పార్టీలో కూడా షర్మిల యాత్రపై ఏకాభిప్రాయం వున్నట్టు కనిపించదు. రాజకీయాలలో సర్వసాధారణమై పోయిన కుటుంబ వైరుధ్యాలు ఇక్కడ కూడా వున్నాయంటున్నారు. షర్మిల యాత్రకు జగన్‌ మీడియాలో పరిమితంగానే ప్రచారం ఇవ్వడంలో ఆంతర్యం ఇదేనన్న భావం వుంది. జగన్‌ జైలులో వున్నప్పుడు పార్టీని బతికించిన ఘనత షర్మిల పొందితే రేపు ఆమె స్తానం మరింత బలపడుతుందని ఒక వర్గం భావన . దీన్ని పోగొట్టడానికే ఆమె ప్రతిచోటా జగన్‌ ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటిస్తున్నది. నిజానికి ఎన్నికలు ఇంకా చాలా దూరం వున్నాయి గనక అవన్నీ మాట్లాడినా పెద్ద ప్రయోజనం వుండదు. షర్మిల యాత్రలో అనుభవం లేకపోవడం వల్ల లోపం ఆమె ఉపన్యాసాలలో వెల్లడవుతూనే వుంది.బహిరంగ సభలకన్నా ప్రజలతో కలసి మాట్లాడ్డానికే ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలంటూ ఆమె కొన్ని సభలు రద్దు చేయించడం వెనక ఈ కారణం కూడా వుంటుంది. అయినా సామాజిక ఆర్థిక రాజకీయ శక్తుల అండదండలున్నంత వరకూ ఇలాటి లోపాలు పెద్దగా లెక్కలోకి రావు. పైగా తమ పార్టీ తరపున ఏదో హడావుడి వుండాలన్నది కూడా ఎక్కువ మందికి వున్న కోరిక. ఇన్ని కారణాల రీత్యా షర్మిల యాత్ర భారీగానే కొనసాగుతున్నది.
గతంలోనే రాష్ట్ర ప్రజలు దీర్ఘ కాలం చూసిన రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం తెస్తామంటూ సాగుతున్న ఈ యాత్రలు దీర్ఘకాలంలో ఎంత ప్రభావం చూపించేది ముందు ముందు తేలాలి. ప్రజల సమస్యలు అందరికీ తెలుసు గనక వాటికోసం ఇంత హంగామా హడావుడి అక్కర్లేదు. ఏ విధమైన పరిష్కారాలు చూపిస్తారన్న దానిపై కేంద్రీకరణ వుండాల్సింది గాని తమ రాజ్యాల గొప్ప తనం చెప్పుకోవడమే ప్రధానమై పోతున్నది.ఈ మధ్యలో చంద్రబాబు అస్వస్తత అవాంతరాలు కలిగినా విరామం తీసుకోవడానికి నిరాకరించడం అవాస్తవికత అవుతుంది. బహుశా ఆ విషయం అర్థం చేసుకోవడం వల్లనే ఆయన తాత్కాలికంగా విరామం తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్టున్నారు. విధానపరమైన అంశాలు పునరాలోచించుకుని విశ్వాసనీయత పెంచుకునే మార్గాలను గురించి ఈ విరామంలో ఆలోచించుకుంటే బావుంటుంది.

No comments:

Post a Comment