Pages

Wednesday, October 10, 2012

మరింత 'స్పష్టత'నిచ్చిన షిండే


తెలంగాణా సమస్యపై ఇప్పట్లో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేదని కేంద్ర హౌంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యకు రాజకీయ ప్రాధాన్యత వుంది. దసరా లోగా అయిపోతుందని కెసిఆర్‌ అంటుంటే దీపావళి నాటికి కూడా నిర్ణయం రాకపోవచ్చని షిండే వువాచ. పైగా ఆయనతో తాము చర్చలు జరపలేదని పిలవలేదని కూడా వాయిలార్‌ రవిలాగే ఈయనా చెప్పాడు. కనక ఇప్పుడు వాస్తవాలు ఆలోచించవలసింది, ప్రకటించవలసింది కెసిఆరే. తాము కాంగ్రెస్‌లో కలసి పోవడం గురించి కూడా సంసిద్ధత ప్రకటించడం తమ త్యాగ నిరతికి నిదర్శనమని కెసిఆర్‌ కుటుంబ సభ్యులే చెబుతున్నారు.కనక మనం చాలా మార్పులు చూడవలసే వుంటుంది. ఈ లోగా జెఎసిపై తన పట్టు పెంచుకోవడానికి కెసిఆర్‌ ఏవైనా మార్పులు చేర్పులు చేయొచ్చు. కోదండరాం పట్ల ఆయన అసంతృప్తిగా వున్నారనేది నిజమైనా దాన్నిబట్టి వారిద్దరూ విడిపోతారని జోస్యం చెప్పడం నిరాధారం. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ లేని జెఎసికి విలువుండదు. ఇతరులను కలుపుకోవడానికి జెఎసి వుండకుండా టిఆర్‌ఎస్‌కు మద్దతుండదు.కనకనే ఈ కోపతాపాలు దిగమింగి సర్దుకోవడం అనివార్యం. పైగా కేంద్రం కుండబద్దలు కొట్టి ప్రతికూల సంకేతాలు ఇస్తుంటే ఇప్పుడు వున్న వేదికలు భంగ పర్చుకోవాలని ఎవరూ అనుకోరు. కనక ఈ విభేదాల కథలకు పెద్ద విలువుండదు. మరో వైపున లగడపాటి రాజగోపాల్‌, టిజి వెంకటేష్‌ వంటి వారు టిఆర్‌ఎస్‌కు సమాధానమిచ్చే పేరిట తెలంగాణా అకాంక్షించే వారిని గాయపర్చేట్టుగా మాట్లాడటం అనర్థదాయకం.ఈ సమయంలోనే డికె అరుణ తమ జిల్లా వారిని తీసుకుని విడిగా వెళ్లడం బట్టి చూస్తే తెలంగాణా రాజకీయాలలో పార్టీలు మాత్రమే గాక వ్యక్తులు కూడా స్వంత వేదికలు ఏర్పర్చుకుంటున్నట్టు అర్థమవుతుంది.సందట్లో సడేమియాలా అజిత్‌ సింగ్‌ ఆర్‌ఎల్‌డి తెలంగాణా శాఖను స్థాపించి వెళ్లాడు. ఇవి గాక సిపిఐ బిజెపి వంటి పార్టీలు వాటి దారిని అవి పోతున్నాయి.కనక తెలంగాణా రాజకీయ రంగ స్థలంపై అందరూ కలసి పనిచేయడం గాని ఎవరికి వారు విడిపోయే సాహసం గాని రెండూ సాధ్యం కావు.

No comments:

Post a Comment