Pages

Wednesday, October 3, 2012

విధానాల సమీక్షలో కూడా వినమ్రత వుండాలి



చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఘనంగానే ప్రారంభమైంది. ప్రచారం ఎలాగూ అదిరిపోయింది. దీర్ఘకాల మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం ఆహ్వానించదగింది. దీనిపై అసహనంతో శవయాత్ర అని వైఎస్‌ఆర్‌సిపి వ్యాఖ్యానించడం, నడిస్తే కొవ్వు కరుగుతుందని రేణుకా చౌదరి తిట్టిపోయడం అనుచితంగా వున్నాయి. అయితే లదే సమయంలో తెలుగు దేశం ఈ యాత్రను గురించి చేసుకుంటున్న ప్రచారంలోనూ అతిశయోక్తులు ఎక్కువగానే వున్నాయి. అసలు ఈ యాత్ర తలపెట్టడమే త్యాగమని సాహసమనీ తనను తాను శిక్షించుకోవడమనీ ఎందుకు అం టున్నారో అర్తం కాదు. 80 ఏళ్ల వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ వంటి వారు దేశాన్ని పాలించగా లేనిది 60 ఏళ్ల చంద్రబాబు పూర్తి భద్రతతో జాగ్రత్తలతో పాద యాత్ర చేయడంలో త్యాగం ఏమీ లేదు.విజయ సంకేతం నుంచి వినమ్ర పూర్వక వందనం వైపు ఆయన మారడం మంచిదే గాని ఈ వినమ్రత విధాన పరమైన అంశాల పున:పరిశీలనలోనూ వుంటుందా అన్నది అసలు సమస్య.
బాబు మాటల్లోనూ ఆయన పార్టీ వారి వ్యాఖ్యల్లోనూ కూడా ఆయన గత పాలన స్వర్థయుగమైనట్టు అది తిరిగి రావాలనే ప్రజలు కోరుతున్నట్టు పదే పదే చెబుతున్నారు. అయితే ఆ పాలనా కాలంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలు పరాకాష్టకు చేరిన ఫలితంగానే చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను ఎదుర్కొన్న
విషయం కాదనలేనిది. ఇప్పటి విద్యుత్‌ సంక్షోభం ఎంత నిజమో అప్పటి విద్యుత్‌ ఉద్యమం, దానిపై నిర్బంధం అంత నిజం. ఈ సంక్షోభం పునాదులు నాటి విధానాలలో వున్నదీ నిజం. వ్యవసాయ సంక్షోభం, రైతాంగ ఆత్మహత్యలు కూడా ఆనాడే మొదలైన మాట నిజం.ఇలాటివి ఇంకా చాలా వున్నాయి.చంద్రబాబు ఇప్పుడు ఆ పాలనా నమూనాను మార్చుకోవడానికి సిద్దంగా వున్నారా?లేక ఆ స్వర్ణయగ పునరుద్ధరణకే మళ్లీ రావాలనుకుంటున్నారా ఈ ప్రశ్న తప్పక ఎదురవుతుంది.
ఇక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి చంద్రబాబు ఇస్తానన్న స్పష్టత ఇంకా రాలేదు. లేఖ తర్వాత కొత్త సమస్యలు కొన్ని వచ్చాయి. వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్‌ల వైపు వెళ్లిన పరిస్థితి పూర్తిగా పోలేదు. పార్టీలో నెలకొన్న స్తబ్దత కూడా కొనసాగుతూనే వుంది. ఇవన్నీ అంతర్గత సమస్యలు. వీటికీ సమాధానాలు దొరకాలి. స్వీయారాధన స్వాతిశయం ధోరణిలో చెప్పుకోవడం కంటే వాస్తవిక దృష్టితో ప్రజల నుంచి నేర్చుకోవడం నిజంగా మేలు చేస్తుంది.
కలసి వచ్చే పార్టీలు కూడా ఏమిటన్న ప్రశ్న వుంది.సిపిఎం స్వతంత్ర ఉద్యమాలకు ప్రాధాన్యత నిస్తానంటూ దూరమై పోగా దగ్గరగా వుందంటున్న సిపిఐ తెలంగాణాలో దూరంగానే వుంది. జాతీయ స్తాయిలో వామపక్ష నేతలతో కలసి మెదులుతున్నా రాష్ట్రంలో అంత సుహృద్భావ వాతావరణం లేదు. ఈ ఒంటరి పాటు కూడా ఒక సవాలే.
మరి నాలుగేళ్ల పాదయాత్ర వీటన్నిటినీ సరిచేస్తుందా అంటే జవాబు చంద్రబాబు విధాన పరమైన పునరాలోచన, వాస్తవాల పరిశీలన చేస్తారా అన్న దానిపై ఆధారపడి వుంటుంది.

1 comment:

  1. I cannot understand how the current power crisis has its roots in Naidu's term. How is it different from what the Center has asked the states to follow in recent past? Can someone please elaborate how they are related.

    ReplyDelete