కెమెరా మెన్ గంగతో రాంబాబు చిత్రం కట్స్ లేకుండా చూసే అవకాశం నాకు కలగలేదు.అయితే దానిపై విస్తారంగా వెలువడిన సమాచారాన్ని, పూరీ జగన్నాథ్, దిల్ రాజు వంటివారి స్పందనను చూసిన తర్వాత ఒక అభిప్రాయం చెప్పడంలో తప్పేమీ వుండదనుకుంటున్నాను.ఎందుకంటే ప్రపంచంలో మనం ప్రత్యక్షంగా వెళ్లలేని చూడలేని అనేక అంశాలపై వ్యాఖ్యానాలు చేస్తునే వున్నాము( కొందరు సినిమా వాళ్లు కూడా పూర్తి అవగాహన లేని విషయాలు నచ్చినట్టు చూపిస్తుంటారు) ఇదీ అలాటిదే.
మొదటిది- ఒక సినిమా లేదా టీవీ లేదా పత్రికలో విషయం నచ్చకపోయినంత మాత్రాన విధ్వంసం చేయడం సరికాదు. ముందు నిరసన తెల్పడానికి తొలగింపులు కోరడానికి చాలా మార్గాలు వున్నాయి. ఇలాటి పద్ధతులు ఎవరు ఎవరిపై చేసినా సరికాదు. పైగా పాల్గొన్న వారి సంఖ్య రీత్యా వారే కోట్లమందికి ప్రతినిధులని చెప్పడానికి లేదు. సవరించుకునే సమయం ఇవ్వక తప్పదు..రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న రాజకీయ డ్రామాలను
వదిలి సినిమాలపై పడటం వల్ల ఉపయోగం వుండదు. అసలు సమస్యలు దారి తప్పడం తప్ప.
రెండవది- సున్నితమైన ఇలాటి విషయాలను తీసుకున్నప్పుడు ఎంతో బాధ్యతగా వుండాలి తప్ప సంచలనాల పాకులాట వ్యాపారాల లెక్కలాట సరికాదు. వివాదాస్పద మైన ఉద్రేక కారణమైన సమస్యలు తీసుకుని సమగ్రత లేకుండా తీసి ప్రేక్షకులపై వదలడం బాధ్యత అనిపించుకోదు. ఈ చిత్రంలో తెలుగు తల్లి పార్టీ దాని నాయకుడి ప్రవర్తన సరైనవా కావా అనే దానిపై నిరసనలు వచ్చాయి. కాని నా ఉద్దేశంలో అంతకంటే అభ్యంతరం ఏమిటంటే వాస్తవికతను అది ప్రతిబింబించడం లేదు. తెలుగు వారు రాజకీయ నాయకులు కుటిల వ్యూహాల వల్ల తెలుగునాట ప్రాంతీయ వివాదాలు ప్రజ్వరిల్లినప్పటికీ ప్రజల మధ్య ప్రశాంతత దెబ్బతినలేదు. తెలుగు వారు ఎక్కడున్నా జాతీయ దృష్టిని ఎన్నడూ కోల్పోలేదు. మళయాళీలు, తమిళులు వెనక్కు పోవాలని ఏనాడూ ఉద్యమాలు చేసిందీ లేదు. అలాటివి చేసిన బాల్ ధాకరేపై చిత్రం తీసిన మణిరత్నం ఆయన ఆమోద ముద్ర వేయించుకున్నాకే విడుదల చేశాడని గుర్తుంచుకోవాలి. అదీ అగౌరవమే. జాతీయ దృష్టి ఏనాడూ కోల్పోని తెలుగు నాట ఇతర భాషల వారిని వెళ్లగొట్టినట్టు చిత్రం తీయడం లేనివాటిని ప్రకోపింపచేయడానికి పనికి వస్తుంది.దీనిపై అలజడిరేగాక క్షమాపణలు చెప్పి అనేక కట్స్‌తో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు వ్యాపార పరంగా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో గాని దానివల్ల సమాజంపై పడిన గాట్లు మాత్రం అలాగే వుంటాయి.సమకాలీన రాజకీయ ఇతివృత్తాలు తీసుకుంటూ సమగ్రత సంయమనం వుండాలి.
కొసమెరుపు: జై బోలో తెలంగాణా చిత్రానికి జాతీయ సమగ్రతా అవార్డు వస్తే వారు అంగీకరించారు. అందరూ అభినందించారు. బహుశా ఇలాటి సదవగాహనే ఇప్పుడు అవసరం.
No comments:
Post a Comment