Pages

Thursday, March 22, 2012

కాషాయ దళంలో కలవరం
బిజెపిలో కల్లోలాలు ఇప్పట్లో సద్దు మణిగే సూచనలు కనిపించడం లేదు. కర్ణాటకలో ఎడ్యూరప్ప పునరాగమన సంకేతాలు అవినీతిపై ఆ పార్టీ పోరాటం అసలు స్వరూపాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. గాలి జనార్థనరెడ్డిని వెనకేసుకొచ్చి ఎడ్యూరప్పపై దాడికి వూతమిచ్చిన వారిలో బిజెపి అగ్రనేతలే వున్నారు. తర్వాత గాలిపై ఆయన తీసుకున్న చర్యలను సమర్థించి చిక్కు లేకుండా చేసుకున్నారు. ఈ లోగా ఎడ్యూరప్ప తనే అవినీతి ఆరోపణల్లో చిక్కి అవమాన కరంగా నిష్క్రమించడం అనివార్యమైంది. ఆ పైన కృష్ణ జన్మస్తానమూ ప్రాప్తించింది. అప్పట్లో దీనంతటికీ కారకుడైన లోకాయుక్త సంతోష్‌ హెగ్డే రాజీనామా చేస్తానంటూ బిజెపి నేతలే రాజీ కుదిర్చి కొనసాగించారు. ఎడ్యూరప్పను తొలగించి సదాశిగౌడను గద్దెక్కించారు.ఇప్పుడేమో లోకాయుక్త ఉత్తర్వులు కోర్టు కొట్టి వేసిందంటూ ఎడ్యూరప్ప తిరుగుబాటు చేసే సరికి మళ్లీ ఆయన ఒత్తిడికి లొంగి పోయి పున:ప్రతిష్టించేందుకు సిద్దమవుతున్నారు. అవినీతిపై పోరాటంలో తామే ఆదర్శమన్నట్టు చెప్పుకున్న బిజెపికి నిస్సందేహంగా ఇది పెద్ద కళంకమే అవుతుంది. ఇప్పటికే యుపి ఎన్నికల్లో ఘోరంగా విఫలమై నిరుత్సాహంలో మునిగి వున్న ఆ పార్టీని కర్ణాటక,, గుజరాత్‌ ఉప ఎన్నికల ఫలితాలు కుదిపేశాయి.మోడీ గురించిన గొప్పలకు ఉప ఎన్నికల ఓటమికి పొంతన కనిపించడం లేదు.కాంగ్రెస్‌ త్వరితంగా దెబ్బ తింటున్నా బిజెపి అంతకన్నా దారుణ స్తితిలో వున్నందున ఆ స్థానాన్ని అందుకోలేదని పదే పదే స్పష్టమవుతున్నది.యుపి ఎన్నికల తర్వాత కాంగ్రేసేతర లౌకిక కూటమికి అవకాశాలు మెరుగవుతాయని భావించినా అనుకున్నట్టే ఎస్‌పి యుపిఎను బలపర్చటంతో కథ మొదటికొచ్చింది. బిజెపిని కాంగ్రెస్‌ కన్నా మెరుగైన ప్రత్యామ్నాయంగా ప్రజలు పరిగణించకపోగా దాని మత రాజకీయాలను అంతర్గత కలహాలను ఆమోదించడం లేదని అనిపిస్తుంది. వామపక్షాలు కూడా బెంగాల్‌లో దెబ్బ తిన్న నేపథ్యంలో ప్రజాస్వామిక ప్రత్యామ్నాయ నిర్మాణం ప్రయాసతో కూడిందే. గతంలో ఈ విషయంలో చొరవ చూపిన సిపిఎం ఇప్పుడు ఎదురు దెబ్బలతో అననుకూలతను ఎదుర్కొంటున్నది. ఇక తెలుగు దేశం కోలుకోలేకపోతున్నది.
దేశమంతటా బిజెపి పరిస్తితి ఇలా వున్నప్పుడు మహబూబ్‌నగర్‌లో కొన్ని ప్రత్యేక పరిస్తితులలో విజయం సాధించినా అదేదో అన్ని చోట్లా గెలుపు వచ్చేస్తుందనుకోవడం అవాస్తవమే గాక అతిశయోక్తి కూడా. ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించినంత వరకూ బిజెపి వంటరిగా అలాటి అద్భుతాలు సాధించడం దుస్సాధ్యమే. దీనికి ఇక్కడి చారిత్రిక రాజకీయ సామాజిక నేపథ్యమే కారణం. టిఆర్‌ఎస్‌ కూడా అవసరార్థం ఎన్ని విన్యాసాలు చేసినా బిజెపిని బలపడటాన్ని ఆహ్వానించే అవకాశం లేదు. కెసిఆర్‌ ప్రతి సందర్భంలోనూ మైనార్టి కోణానికి ప్రత్యేక ప్రాధాన్యత నివ్వడం చూస్తూనే వున్నాం.కనక మహబూబ్‌నగర్‌ ఫలితాన్ని గమనిస్తూనే దానిపై అతి అంచనాలు అనవసరమని చెప్పవలసి వస్తుంది.

No comments:

Post a Comment