Pages

Wednesday, March 7, 2012

వామపక్ష వాణి...



వివిద కార్మిక సంఘాల, కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న దేశ వ్యాపితంగా జరిగిన బ్రహ్మాండమైన సమ్మె - ఉద్యమాలకు సంబంధించినంతవరకూ - ప్రపంచ ప్రాధాన్యత గల పరిణామం. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, నయా ఉదార వాద నమూనాలపై దేశ దేశాల శ్రామిక ప్రజానీకం సాగిస్తున్న పోరాటాల పరంపరలో భారత కార్మిక వర్గ చైతన్య పతాకం ఈ సమ్మె. సామాన్యుల జీవితాలకు శ్రామిక ఉద్యోగ వర్గాల ఉపాధి భద్రతకూ సేద్యగాళ్ల బతుకులకూ దేశ సార్వభౌమత్వానికి కూడా హానికరమైన విధానాలపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం అది. మన కార్మికోద్యమానికి గల పట్టును, సంఘాల భావ సారూప్యతను సమ్మె ప్రతిబింబించింది. ప్రజా ఉద్యమాలకు కొత్త వూపునిచ్చింది. ప్రచార కోవిదులైన నేతలు ఇందులో ఏ కాస్త మోతాదులో కార్యక్రమం చేసినా బోలెడంత హంగామా వుండేది. అడుగడుగూ ప్రచారం పొందేది. ఇప్పుడు అస్సలు రాలేదని కాదు గాని అవన్నీ కమ్యూనిస్టులకే పరిమితమైన వ్యవహారాలై పోతాయి. ఎందుకంటే ధనాడ్య బలాఢ్య వర్గాలకు ఈ ఆర్థిక విధానాల చర్చ సుతరామూ ఇష్టముండదు. గాలిలో కత్తులు దూసినట్టుగా వ్యక్తిగత వివాదాలలో ఉత్తుత్తి ఉద్రిక్తతలలో మునిగితేలడమే వారికి కావాలి.
ఉదాహరణకు మన రాష్ట్రాన్నే తీసుకుంటే రెండేళ్లకు పైబడి ఎడతెగని అనిశ్చితి. దాని కారణమైన అవకాశవాదం. అధికార పక్షం అంతర్గత కలహాలు, అంతులేని అవినీతి పురాణాలు. ఈ భాగోతాల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువని అలసి పోయేలా దూషించుకుని దండగమారి దండకాలు చదివేసుకుని ఎజెండా అయిపోయిందనుకోవడం.. అంతే. కాంగ్రెస్‌ నిర్వాకాలను తెలుగు దేశం నేతలు విమర్శించగానే మీ సంగతేమిటని వారు ఎదురు దాడి
చేస్తారు. మా పాలన గొప్పలు ఫలానా అని వీరు ఏకరువు పెడతారు. పరస్పరం తిట్టిపోసుకుంటారు. శాసనసభ సమావేశాల మొదటి వారం పాయిదా లేని వాయిదాలతో సరిపోతే తర్వాత లిక్కర్‌ సిండికేట్ల చర్చ(రచ్చ!) మొదలైంది. కాని అంగుళం నడిస్తే ఒట్టు. నిజంగా చర్చ జరగాలని ఉభయులకూ లేదేమోనని సామాన్యుల సందేహం. ఎందుకంటే మంత్రుల పేర్లు రావడంపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించి వేగంగా విచారణ జరిపిస్తానని చెప్పాల్సిన అవసరం లేదా? ఇప్పటికి నిందితులు కాదని కితాబు నిచ్చేస్తే నిజంగా దర్యాప్తు చేసే వారు అడుగు వేయగలుగుతారా? పిసిసి అధిపతిగా వున్న మంత్రి వర్యులే ఎసిబి నివేదిక బయిటపెట్టాలని మొదట్లోనే సవాలు చేసినా ఇంత వరకూ వెలుగు చూడకపోవడానికి కారణమేమిటి? అలాగే ప్రతిపక్షమైనా సరే గతానికి సంబందించి తమపై వచ్చే ఆరోపణలను ఖండించడంలో మునిగితేలడం కంటే వర్తమాన వాస్తవాలపై కేంద్రీకరించొద్దా?
గత ప్రస్తుత పాలక పక్షాలను అటుంచితే ప్రాంతీయ వాదమే ప్రధానమనే టిఆర్‌ఎస్‌ తెలంగాణాపై బిల్లు పెట్టాలని అన్ని రోజులు రభస చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకేమైనా నిజంగా వొరిగిందా? వారే చెబుతున్నట్టు రెండు పెద్ద పార్టీలూ ఈ విషయంలో సూటిగా వ్యవహరించడం లేదని పదే పదే తేలిపోయాక బిల్లు ఎలా వస్తుంది? ఆ విషయం ప్రజలకు తెలియజెప్పడం కోసం అనుకున్నా దాన్ని ఎన్ని సార్లు నిరూపిస్తుంటారు? ఈ క్రమంలో తమపైనే సందేహాలు కలగవా? పార్లమెంటులో కేంద్రం బిల్లు తీసుకురాకుండా ఇక్కడ ఏం చేసి ఏం లాభం? శాసనసభతో నిమిత్తం లేకుండానే కేంద్రం ఇచ్చేయొచ్చని వాదించిన రోజులు ఏమైనట్టు? దీనిపై భీష్మించి సభనుంచి సస్పెండ్‌ అయ్యాక ఉప ఎన్నికల వరకూ అడుగు పెట్టబోమని ప్రతిజ్ఞ బూనడంలో వాస్తవికత ఎంత? ప్రజల సమస్యలు విస్మరించబడవా?
శాసనసభలో కాంగ్రెస్‌- తెలుగు దేశం, సభ వెలుపల టిఆర్‌ఎస్‌- తెలుగు దేశం పరస్పర దూషణల్లో మునిగితేలడం ఏ పరమార్థానికి? కేంద్ర రాష్ట్ర మంత్రులుగా నేతలుగా పనిచేసిన వారు ఆధారాలుంటే రాజ్యాంగ రీత్యానో రాజకీయంగానో చేయగలిగింది చేయాలి తప్ప రోజు మీడియా ముందు రేవు పెట్టి ప్రచారార్బాటం చేయడం వల్ల ఒరిగేదేమిటి? ఉభయ చంద్రులు స్వయంగా రంగంలోకి దిగిన తదుపరి వారి దళాధిపతులు ఆ దండకాలను కొనసాగించడం దండగమారి తతంగమని గుర్తించలేకపోతున్నారా?చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరే పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసినంత మాత్రాన ఆయనకు క్లీన్‌ చిట్‌ లభించినట్టు తెలుగు దేశం నేతలు అదే పనిగా చెప్పుకోవడం అతిశయోక్తి కావచ్చు. కాని టిఆర్‌ఎస్‌ నేతలు విజయమ్మ పిటిషన్‌లో విషయాలను వరుసగా వల్లె వేసినా ప్రయోజనం శూన్యమే కాదా? మొదలు పెట్టింది వారంటే వీరంటూ వికృత వాగ్యుద్ధాలను మాత్రం విరామం లేకుండా సాగించడమెందుకు? ఈ రెండు పార్టీల పోరాటంలో ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీల వ్యూహాలు తప్ప విశాల ప్రయోజనాలేమి వున్నట్టు? వీరిరువురూ ఘర్షణ పడుతుంటే వినోదిస్తున్న పాలక పక్ష నేతలది ప్రేక్షక పాత్రా లేక నిర్దేశకత్వం కూడా వుందా? పార్లమెంటుకు ఎక్కడ నుంచి ఎవరు పోటీ చేయాలి, ముఖ్యమంత్రి పదవికి అర్హులైన వారెవరు వగైరా అంతర్గత వివాదాలు సాగించడంలోనూ ప్రజల ప్రయోజనాలే కోశానైనా వున్నాయా? ప్రజా హిత విధానాల ప్రసక్తి లేని ఈ సూత్ర రహిత రాజకీయాల నేపథ్యంలోనే సార్వత్రిక సమ్మెకు గొప్ప ప్రాధాన్యత ఏర్పడుతున్నది.

నిజానికి తాము చేస్తున్నది ఏమిటో, వామపక్ష రాజకీయాల ప్రత్యేకత ఏమిటో ఇతరులకూ తెలుసు. కనుకనే ఇజాలకు తావు లేని టూరిజమే మోక్షదాయకమని అన్న రోజులు పోయి, కమ్యూనిస్టులకు కాలం చెల్లిందన్న శాపనార్థాలు పోయి అందరూ వారికేసి చూడటం. కాగా కమ్యూనిస్టులేమో తమ మధ్య ఐక్యతకూ ప్రజాఉద్యమాట స్వతంత్రతకు ప్రాధాన్యత నివ్వాలని నిర్ణయానికి వచ్చారు. ఇటీవల ఖమ్మంలో సిపిఎం మహాసభలు, కరీం నగర్‌లో సిపిఐ మహాసభలు జరిగిన సందర్బంలో వామపక్ష ఐక్యత ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణా విభజనకు అనుకూలంగా సిపిఐ వైఖరి వంటివాటిపై తేడాలున్నా ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడిగా పోరాడాలన్న మాట రెండు చోట్లా ప్రతిధ్వనించింది. పదకొండు వామపక్షాలు 2000 నాటి విద్యుదుద్యమ తరహాలో మరోసారి ఐక్య వేదిక ఏర్పాటు చేసుకోవడం దానికి అర్థవంతమైన కొనసాగింపునిస్తే సార్వత్రిక సమ్మె విజయం గొప్ప ఆచరణ రూపమైంది.
ఉప ఎన్నికల పోరాటం దీని తర్వాతి ఘట్టం అనుకుంటే ఆ ప్రచారంలోనూ ప్రజల సమస్యలకే పెద్ద పీట వేయడం ప్రధాన కర్తవ్యం. రావణ కాష్టం రగిలించి రాష్ట్రంతో చెలగాటమాడుతున్న కేంద్రం వైఖరిని నిలదీయకుండా దొంగలు ద్రోహుల భాషలో పరస్పరం తిట్టిపోసుకోవడం వల్ల ప్రయోజనం శూన్యం. ఈ ఇద్దరే గాక జెండాలు పక్కనపెట్టి ప్రత్యేక తెలంగాణా సాధన ఏకైక ఎజెండాగా నడుస్తామన్న ఘనాపాటీలెందరో ఇప్పుడు స్వంత ప్రయోజనాల కోసం పరస్పరం కీచులాడుకోవడం కళ్లముందు సత్యం. టిఆర్‌ఎస్‌ టిడిపిల నిందారోపణల ప్రహసనంతో సంబంధం లేని సిపిఎం స్టేషన్‌ ఘన్‌పూర్‌, అదిలాబాద్‌, కొల్లాపూర్‌లలో పోటీ చేయడం ఒక కొత్త పరిణామం. ఓట్లు ఎన్ని వస్తాయి ఫలితాలెలా వుంటాయన్నది ఒకటైతే అసలు ఎన్నికల ప్రచారంలో మౌలిక సమస్యలు విధాన పరమైన అంశాలు ప్రస్తావనకు రావడానికి ఇది దోహదం చేయొచ్చు. ోవూరు విషయానికి వస్తే తెలుగుదేశం నుంచి వైఎస్‌ శిబిరం వైపు నడిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి స్థానం వారు నిలబెట్టుకోగలరా అన్నది పెద్ద సవాలే. ఇక్కడ గతంలో బలం చూపిన సిపిఎం ే మరో సారి పోటీ చేయడం కూడా ప్రభావం చూపిస్తుంది. టిఆర్‌ఎస్‌ అధినేత అక్కడ పోటీ చేస్తామని ప్రకటించి తర్వాత వైఖరి మార్చుకోవడం ఆ పార్టీ వారికే మింగుడు పడటం లేదు. పైన చెప్పుకున్న సంచలన వ్యూహ విన్యాసాల ఫలితమే ఈ మార్పు కావచ్చు. ఉప ఎన్నికల్లో తమను బలపర్చాలని కమ్యూనిస్టులను తెలుగుదేశం నేతలు అడిగినా సిపిఎం తిరస్కరించడం వూహించదగిందే. రాజకీయ వాస్తవాలను బట్టి చూస్తే ఈ సందర్భంలో తెలంగాణా ప్రాంతంలో తెలుగుదేశంను సిపిఎం బలపర్చే అవకాశం వుండదు. ఇక సిపిఐ వామపక్ష ఐక్యత కోసం కోవూరులో సిపిఎంను బలపరుస్తూనే తెలంగాణాలో రాజీనామా చేసిన అభ్యర్థులను టిఆర్‌ఎస్‌ను(మహబూబ్‌ నగర్‌లో) బలపర్చాలని నిర్ణయించింది.. అవన్నీ ఎలా జరిగినా భవిష్యత్తులోనూ వామపక్ష వాణి వినిపిస్తూనే వుంటుందని చెప్పొచ్చు. కమ్యూనిస్టులను అపహాస్యం చేసేవారు కూడా అంగీకరించకతప్పని వాస్తవమిది. చాగంటి సోమయాజలు మార్క్సిస్టు కాదని వేల్చేరు నారాయణరావు సూత్రీకరించడంపై సోమవారం ఆంధ్య్రజ్యోతి వివిధలో రామతీర్థ రాసిన విమర్శ చదివితే ఈ అపహాస్యం రాజకీయాలకే పరిమితం కాని సుదీర్ఘ భావ ఘర్షణ అని తెలుస్తుంది. 1921లో భోగరాజు పట్టాభిసీతారామయ్య సోవియట్టులు వ్యాసం రాయగా 1922లో ఉన్నవ లక్ష్మీనారాయన మాలపల్లె నవలలో బొల్షివిక్‌ విప్లవం గురించి చిత్రించాడు. అలా తొంభై ఏళ్లనాడు తెలుగు నాట అంకురించిన వామపక్ష వాణి చెవులు మూసుకున్నా వినిపించే సమర సంగీతం. సామాజిక చైతన్య నాదం.
(ఆంధ్రజ్యోతి గమనం, మార్చి 1,2012)

1 comment:

  1. / అలా తొంభై ఏళ్లనాడు తెలుగు నాట అంకురించిన వామపక్ష వాణి చెవులు మూసుకున్నా వినిపించే సమర సంగీతం./

    అవును ఇది మాత్రం నిజం! 90ఏళ్ళుగా, చెవులు మూసుకున్నా సమరసంగీతాలు వినిపిస్తూనేవున్నాయి, ఆగడంలేదు.

    ReplyDelete